కాంగ్రెస్‌ గ్రాఫ్‌ డౌన్‌: కేసీఆర్‌ | BRS Leader KCR Fires On Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ డౌన్‌: కేసీఆర్‌

Published Thu, Feb 20 2025 12:55 AM | Last Updated on Thu, Feb 20 2025 8:47 AM

BRS Leader KCR Fires On Congress Party

తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఇతర ముఖ్య నేతలు

ఎప్పుడైనా ఉప ఎన్నికలు..సిద్ధంగా ఉండండి బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి భేటీలో కేసీఆర్‌

కేసీఆర్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు 

చంద్రబాబు ఎన్డీయే పేరిట తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటున్నారు 

తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలి కావొద్దు.. అదే జరిగితే రాష్ట్రం కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదం

తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పార్టీనే అన్న మాజీ సీఎం

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ విషయాన్ని నేను గమనిస్తున్నా. 

చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ పేరిట మళ్లీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెడుతానంటున్నడు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావొద్దు..’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్‌ఎస్‌ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, పార్టీ రజతోత్సవాల నిర్వహణ, కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై మాట్లాడారు. 

సీఎంకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది 
‘తెలంగాణ ప్రజలకు నచ్చి కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలో వచ్చినా కాంగ్రెస్‌కు అచ్చి రాలేదు. మంత్రివర్గానికి, సీఎంకు నడుమ సమన్వయం లేదు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చెప్పడం ద్వారా ఆయనకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది. మనం ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం పెంచుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సినవి సమకూర్చాం. కానీ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఖజానాను ఎలా నింపాలో వారికి తెలియడం లేదు..’ అని కేసీఆర్‌ అన్నారు.  

తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్‌ఎస్‌ 
‘తెలంగాణ సమాజం సామాజిక, చారిత్రక అవసరాల కోసం తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్‌ఎస్‌ పార్టీ. అలా పురుడు పోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయి. గతం గాయాల నుంచి కోలుకుంటున్న మనం తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పార్టీనే. తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే ప్రజలను తిరిగి చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత చెప్పారు. 

తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఇతర ముఖ్య నేతలు   
7 నెలల పాటు సంస్థాగత నిర్మాణం 
‘ఏప్రిల్‌ 10 నుంచి అక్టోబర్‌ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పనిచేయాలి. ఏప్రిల్‌ 10న పార్టీ ప్రతినిధుల సభ, అదే నెల 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి సంబంధించి సబ్‌ కమిటీ బాధ్యతలు హరీశ్‌రావుకు అప్పగిస్తున్నాం. ఏప్రిల్‌ 10 నుంచి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. 

అక్టోబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ప్రకటిస్తాం. త్వరలో 30 మందికి పైగా కీలక నేతలతో భేటీ జరిపి అన్ని అంశాలపైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం. సోషల్‌ మీడియా సహా పార్టీ అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తాం..’ అని కేసీఆర్‌ తెలిపారు. 



కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందుకే ఓటమి 
‘రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. కానీ బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాం. కొత్త తరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యం, బీఆర్‌ఎస్‌ పోషించిన పాత్రను వివరించాలి. తెలంగాణ చరిత్రను అర్ధం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. 

భారతదేశంలో విలీనం తర్వాత కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోలేక పోయింది. రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి కాంగ్రెస్‌ అడుగడుగునా కుట్రపూరిత రాజకీయాలు చేసింది. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అన్ని విధాల నాశనం చేశారు. తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. 

తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలనే ఆకాంక్షతో పుట్టిందే బీఆర్‌ఎస్‌ పార్టీ. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పార్టీ యంత్రాంగంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, వివిధ వర్గాలను కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, బీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగాలి..’ అని మాజీ సీఎం ఆదేశించారు. 

అభిప్రాయాలు వెల్లడించిన నేతలు 
సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులతో పాటు సీనియర్, జూనియర్‌ నాయకులు 29 మంది మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, యువతతో పాటు వివిధ వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం, పార్టీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయాలనే ఆభిప్రాయం వ్యక్తం చేశారు. 

మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, రాజా వరప్రసాద్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, సత్య తదితరులు ప్రసంగించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు సహా మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, తదితర నేతలు హాజరయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement