
ముంచుకొస్తున్న గడువు
తొలగని ఇబ్బందులు..
హెచ్‌ఎండీఏలో 10 శాతం ఫైళ్లే పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) జనానికి చుక్కలు చూపిస్తోంది. గడువులోగా స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు దరఖాస్తు చేసుంటున్నవారిని సాంకేతిక చిక్కుముడులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫీజుల లెక్కలు సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఒక్కో ప్లాట్‌కు ఒక్కో విధంగా ఫీజు విధించడంతో దరఖాస్తుదారులు అమీర్‌పేట్‌లోని హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎస్ (LRS) ఫీజు కంటే ఓపెన్ స్పేస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి భూమి మార్పునకు సంబంధించిన ఫీజులు తేలడం లేదు. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సైతం ఎలాంటి పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్నారు.
మార్చి 31వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం తగ్గింపు లభిస్తుందనే ఉద్దేశంతో జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించిన వారికి మార్చి అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్రొసీడింగ్స్‌ను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు కనీసం 10 వేల దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించిన తర్వాత ఒక్కో జోన్ పరిధిలో కనీసం వెయ్యి దరఖాస్తులను కూడా పరిష్కరించలేకపోయినట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వెంటాడుతున్న సాంకేతిక చిక్కులు..
ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీనిపై హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పట్టణ ప్రణాళికా విభాగాలకు అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం వెబ్‌సైట్‌తో పాటు అధికారుల పనిని సులభతరం చేసేలా ఓ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించారు. కానీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలులో రకరకాల చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
‘ఒక్కోసారి సేకరించిన డాటా మొత్తం డిలీట్ అవుతోంది. దాంతో మరోసారి డాటా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఒక పనిని ఒకటికి రెండుసార్లు చేయడంతో జాప్యం జరుగుతోంది’ అని ప్లానింగ్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో మొబైల్ యాప్ (Mobile App) పని చేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నమోదైన తర్వాత స్థల మార్పిడికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు కూడా నమోదు కావాలి. కానీ ఇందులో ఏదో ఒకటి మాత్రమే నమోదు కావడంతో అలాంటి ఫైళ్లను పెండింగ్ జాబితాలో పెట్టేస్తున్నారు.
దరఖాస్తుదారుల్లో గందరగోళం..
ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఆ ఏడాది ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్నవాళ్లకు మాత్రమే ఇప్పుడు క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించిన భూముల మార్కెట్ ధర ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఫీజుల లెక్కల్లోనూ రకరకాల తప్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు.
చదవండి: మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండి
ఇలా తప్పుడు ఫీజులు నమోదైన దరఖాస్తులను పరిశీలించి సవరించేందుకు సాంకేతికంగా మార్పులు చేయాల్సివస్తోంది. ఈ సవరణలు అధికారులు స్వయంగా చేసేందుకు అవకాశం లేదు. సీజీజీలోనే సవరణ జరగాలి. ఆ విధంగా మరికొంత జాప్యం జరుగుతోంది. హెచ్‌ఎండీఏలోని శంకర్‌పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్ (Ghatkesar) జోన్‌ల పరిధిలో ఇలాంటి తప్పులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కేవలం రూ.4000 చొప్పున ఓపెన్ స్పేస్ ఫీజు నమోదు కావాల్సి ఉండగా.. కందుకూరు మండలం పులిమామిడిలో ఒక స్థలంలో ఓపెన్ స్పేస్ ఫీజు ఏకంగా రూ.లక్షకు పైగా రావడంతో అధికారులే విస్మయానికి గురయ్యారు.
ఒత్తిడి పెంచడంతోనే..
సీజీజీ రూపొందించిన టెక్నాలజీలో తరచూ మార్పులు, చేర్పులు చేయడంతోనే ఈ ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతున్నట్లు టెక్నికల్ సిబ్బంది చెబుతున్నారు. మొదట్లో హెచ్‌ఎండీకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని తర్వాత నీటిపారుదల, రెవిన్యూ శాఖలకు కూడా విస్తరించాల్సి వచ్చింది. ఆ తర్వాత చెరువులు, కుంటలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను మరోసారి మార్పు చేయాల్సి వచ్చింది. ఇలా తరచూ టెక్నాలజీలో మార్పుల వల్ల కూడా తప్పులు చోటుచేసుకుంటున్నాయని సీజీజీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment