సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో ప్రత్యేక సమావేశం
జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కేవలం వీరికే వర్తిస్తుంది..
2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది.
250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే..
ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి.
ఈసారైనా ముందుకొచ్చేనా?
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ)
అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో
జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్‌గనర్‌లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుకు కావాల్సినవి..
► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు.
► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి.
► ఆధార్‌కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి.
► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి.
► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి.
► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment