LRS
-
ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబధ్దీకరణ పథకానికి (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సచివాలయంలో ఎల్ఆర్ఎస్ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. 2021లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిలో.. 2020 ఆగస్టు 28కు ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబధ్దీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోపు పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారికి 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబధ్దీకరణకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్‌డీడ్ రిజి్రస్టేషన్ కలిగిన వారికి కూడా క్రమబధ్దీకరణ చాన్స్ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రోజు వారీగా సమీక్షించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత భూముల జాబితా పట్ల అప్రమత్తం ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిషోర్, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్ల రాబడి అంచనా రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టింది. అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తగిన ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబధ్దీకరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆలస్యమైంది. తాజాగా బుధవారం మంత్రులు సమావేశమై ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వేగంగా దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 25.67 లక్షలు. ఇందులో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్లు చెల్లింపు కూడా పూర్తయింది. మరో 9.21 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఎల్ఆర్ఎస్కు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు. ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకా ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన మిగతా సుమారు 16 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి/ సాక్షిప్రతినిధి, ఖమ్మం: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని.. మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారం మాత్రమే క్రమబద్దీకరణ జరగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అక్కడి కలెక్టరేట్ నుంచి మున్సిపల్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధనశాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రత్యేక బృందాలతో ప్రక్రియ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో దళారుల ప్రమేయం లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ‘‘పెండింగ్‌లో ఉన్న 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలి. సిబ్బంది కొరత ఉన్నచోట ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలి. ప్రతిపాదనలు పంపితే రెవెన్యూ శాఖ నుంచి కూడా సర్దుబాటు చేస్తాం. రెవెన్యూ, సాగునీరు, మున్సిపల్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్‌డెసు్కలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బందికి తక్షణమే శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా అవసరమైన కా ర్యాచరణ చేపట్టాలి..’’అని మంత్రి ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో క్రమబద్దీకరణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పొంగులేటి సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దు: డిప్యూటీ సీఎం భట్టి ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దరఖాస్తుల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని.. నీటి వనరులు, కాలువలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. -
ఆదాయ మార్గాల అన్వేషణలో తెలంగాణ సర్కార్
-
ఎల్ఆర్ఎస్కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు రంగం సిద్ధమవుతోంది. గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించగా.. 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దర ఖాస్తులకు రూ.1,000 చొప్పున ఫీజు తీసుకుంది. క్రమబదీ్ధకరణ కోసం చార్జీలను నిర్ణయించి, ప్రక్రియ ప్రారంభించింది. కానీ కోర్టు కేసుల వల్ల అది నిలిచిపోయింది. అప్పటి నుంచి లక్ష లాది మంది ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ విష యంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని పలుమార్లు ప్రకటించింది. తాజాగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ఉన్న లేఅవుట్ల క్రమబదీ్ధకరణకు అనుమతిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల సమస్యను పరిష్కరించే దిశగా నిబంధనలను సరళీకరిస్తూ.. పెండింగ్ దరఖాస్తుల ఆమోదానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తామని పేర్కొంది. దరఖాస్తుల వడబోత 3దశల్లో.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మూడు దశల్లో వడపోయనున్నారు. తొలిదశలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్లికేషన్ ఆధారంగా పరిశీలన జరుపుతారు. వివాదాస్పద, ప్రభుత్వ భూముల్లో ఉండే లేఅవుట్లకు సంబంధించి ఈ దశలోనే అనుమతులు నిలిచిపోతాయి. ఇందుకోసం ధరణిలో పేర్కొన్న వివరాలను, సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలిస్తారు. లేఅవుట్ వేసిన భూమి పూర్తి వివరాలను గుర్తిస్తారు. అలాగే ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు.ఈ బృందంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, ప్రణాళిక సూపర్వైజర్, పంచాయతీ ఈవో, యూఎల్బీ సిబ్బంది ఉంటారు. ఈ బృందాలు లేఅవుట్ ఉన్న భూమి ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, చెరువులు, కుంటలకు సంబంధించినదా, సీలింగ్, కోర్టు వివాదాలు ఉన్నదా అన్న వివరాలను పరిశీలిస్తాయి. ఈ డేటా నమోదు చేయడానికి మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండోదశలో సీపీవో, టీపీవో, డీపీవో పరిశీలన.. మొదటి దశ వడపోత దాటి వచ్చే దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ అధికారులు పరిశీలిస్తారు. రెండో దశలో లేఅవుట్, రోడ్లు, జోన్ నిబంధనల ఉల్లంఘన, ఖాళీ స్థలాలను వదిలేయడం వంటి సాంకేతిక విషయాలను పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే.. ఆయా దరఖాస్తులకు సంబంధించి క్రమబద్ధీకరణ ఫీజును నిర్ణయిస్తారు. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తులు మూడోదశకు వెళతాయి. మూడోదశలో ఉన్నత స్థాయి సమీక్ష మూడో దశలో దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పరిశీలిస్తారు. ఏవైనా లోపాలను గుర్తిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుంటే చివరగా అనుమతి కోసం పంపుతారు. ఆమోదానికి చొరవ చూపాలంటూ.. ఆగస్టు మొదటి వారం నుంచే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని.. మూడు నెలల్లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్ఆర్ఎస్ సమస్యను అధిగమించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, రిజి్రస్టేషన్ శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. -
ఎన్నికలవేళ ఎల్ఆర్ఎస్ అమలుపై ఉత్కంఠ!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020 నుంచి పెండింగులో ఉన్న భూక్రమబద్ధీకరణను మార్చి 31లోగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ఆదేశించారు. ఓ పక్క ప్రభుత్వ గడువు ముంచుకొస్తుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అమలవుతుందా? లేదా? అని ప్రజల్లో చర్చలు మొదలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ త్వరలో విడుదల చేయనుందని తెలుస్తుంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక పథకాన్ని అమలు చేయడంపై పలు సందేహాలు వస్తున్నాయి. సుమారు 25.44 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. వీటిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టి.. ప్రభుత్వామోదం కోసం పత్రాలను సైతం పంపినట్లు తెలిసింది. రెండు దశల్లోనే తనిఖీ ప్రక్రియ.. ఎల్ఆర్ఎస్ కోసం పెట్టిన దరఖాస్తులను తనిఖీ చేసేందుకు ముందుగా మూడు దశలను ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించటం ఒకటి. అర్హమైనదా.. కాదా.. నిర్ధారించి నోటీసులు జారీ చేయటం రెండో దశ, అర్హమైన వాటికి మూడో దశలో దరఖాస్తులను ఆమోదించడం. అయితే మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు తక్కువగా ఉండటంతో దరఖాస్తుల తనిఖీ ప్రక్రియను రెండు దశల్లోనే పూర్తి చేయాలని నిశ్చయించారు. ఇదీ చదవండి: మొత్తం కేంద్రానికే.. రాష్ట్రాలు గగ్గోలు! క్షేత్రస్థాయి తనిఖీ పూర్తి చేసి అర్హమైనదా? కాదా? అన్న నోటీసులతో పాటు చెల్లించాల్సిన మొత్తం వివరాలతో నోటీసు జారీ ప్రక్రియ అంతటినీ ఒకే దశలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. అర్హత పొందిన దరఖాస్తుదారులు నిర్ధారిత మొత్తాన్ని చెల్లించిన మీదట ఆమోదించే ప్రక్రియను రెండో దశలో పూర్తి చేయాలని నిర్ణయించారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గతంలో మీతో సహా, మీ సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలనీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను మా నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో మీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రజల ఆకాంక్షల మేరకు డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలి’’ అని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’ -
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
-
Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నేతలు గుర్తుచ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి 20వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. అమీర్‌పేటలోని మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తలసాని కిరణ్ వినూత్న నిరసన.. అమీర్‌పేటలోని HMDA కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ వినూత్న నిరసన చేపట్టారు. వాటర్ బాబిల్స్‌తో హెచ్ఎండీఏ ముందు నిరసన. ఈ క్రమంలో హెచ్ఎండీఏ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కిరణ్. తాను ఇచ్చిన నీళ్లు తాగి ప్రశాంతంగా ఎల్ఆర్ఎస్ రద్దు అంశం ఆలోచించాలని కోరిన కిరణ్. ఈ సందర్బంగా తలసాని కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం మోపాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు ఇప్పుడెందుకు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. -
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దికరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే ... ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్, భట్టి విక్రమార్క సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూ లు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ భట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. నాడు భట్టి విక్రమార్క చేసిన డిమాండ్‌నే నేను పునరుద్ఘాటిస్తున్నా. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తుంటే భట్టి ఎందుకు మాట్లాడడం లేదు? ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా? ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దు. ఆ మాటలేవీ గుర్తులేవా? తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ‘నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్’అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటున్నారనే విషయం తెలియడం లేదా? అప్పుడు ఉచితంగా క్రమబద్దికరిస్తామ న్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కారు డబ్బులు లాక్కోవడంపై స్పందించాలి. ఎల్ఆర్ఎస్ అంటే డబ్బులు దోచుకోవడానికేనని ప్రస్తుత మంత్రి సీతక్క అప్పట్లో మాట్లాడారు. మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్ఆర్ఎస్పైన మంత్రి కోమటిరెడ్డి అప్పట్లో కోర్టులో కేసువేశారు. ఆ కేసును వెనక్కి తీసుకున్నారా? లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేసు వేస్తారా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు. మార్చి 31 కల్లా డబ్బులు కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రభుత్వ ఖజానా నింపడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6, 7 తేదీలలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని అడుగుతున్న అధికారులను నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ మనదే.. రెండు ఎంపీ సీట్లూ మనవే ‘స్థానిక’ఎమ్మెల్సీతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలపైన పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీతోపాటు రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్లు దోచుకునే పన్నాగం ఎల్ఆర్ఎస్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.లక్ష చొప్పున భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31వ తేదీలోగా రాష్ట్ర ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20 వేల కోట్లు దోచుకునేలా పన్నాగం పన్నారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా అమలు చేయాలి. ఈ డిమాండ్‌తో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపడతాం. 7న ప్రతి జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తాం. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ప్రజలపై ఆర్ధిక భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
-
‘LRS’ అంశం: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎందుకు మాట నిలబెట్టుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలు వట్టి మాటలు అయ్యాయని ఎద్దేవా చేశారు. కాగా, కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్ధిక భారం మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై విషం చిమ్మింది. ఇప్పుడు అదే పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా లేఅవుట్లు క్రమబద్దీకరణ చేయాలని చూస్తోంది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్ఆర్ఎస్ వద్దని కోర్టుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి గతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ హోదాలో NO TRS NO LRS అని ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టోద్దు అంటూ ప్రకటన చేశారు. అప్పుడు ఎందుకు విమర్శించారు.. ఇప్పుడెందుకు అదే పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై రభుత్వం సమాధానం చెప్పాలి. అప్పుడు ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా ప్రజల రక్త మాంసాలు పీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా గతంలో మీరన్న మాటలే కదా?. భట్టి మాటలు వట్టి మాటలు అయ్యాయి. మధ్య తరగతి పేదల మీద 20వేల కోట్లు మోపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వసూలు చేసి భారం మోపుతోంది కాంగ్రెస్. ఈనెల 6న ఎల్ఆర్ఎస్ రద్దు కోసం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నిరసనలు చేస్తాం. ఏడో తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేపడుతున్నాం’ అని స్పష్టం చేశారు. -
2020నాటి ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధికరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరంలో ప్లాట్ ఓనర్లు, లేఅవుట్లు చేసిన రియల్టర్ల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధికరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని రెవెన్యూ విభాగాల నుంచి ఆదాయ సమీకరణపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31లోగా మొత్తం రుసుము చెల్లించిన పక్షంలో సదరు ప్లాట్ల క్రమబద్ధికరణకు అవకాశం కల్పించనున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలున్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. సుమారు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు దీనితో ప్రయోజనం చేకూరుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఆదాయ సమీకరణ దిశగా.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అనుమతుల్లేని లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో కేసీఆర్ సర్కారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ప్లాట్లకు సంబంధించి రూ.1000 చొప్పున, లేఅవుట్లకు రూ.10,000 చొప్పున దరఖాస్తు ఫీజు తీసుకుంది. ఈ పథకం కింద 100 గజాల్లోపు ప్లాటు రెగ్యులరైజేషన్ కోసం గజానికి రూ.200 చొప్పున చార్జీ చెల్లించాలి. 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు గజానికి రూ.400.. 300 గజాలకుపైన ఉంటే గజానికి రూ.600 చొప్పున చార్జీ చెల్లించాలని పేర్కొంది. అయితే.. లేఅవుట్ల క్రమబద్ధికరణ అంశంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్ దరఖాస్తుల సంగతి ఏమిటన్నది అయోమయంగా మారింది. తాజాగా ఆదాయ సమీకరణపై సీఎం సమీక్ష సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ చార్జీల చెల్లింపు కోసం తక్కువ గడువు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారుకు రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే చాన్స్ 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం. వేలాది మంది రియల్టర్లు, లక్షల మంది కొనుగోలుదారులకు గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లకు అనుమతి లభిస్తుంది. అయితే మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధికరణ చార్జీల మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనను సడలించాలి. కేవలం నెల రోజుల్లో లక్షల రూపాయలు చెల్లించి ఎల్ఆర్ఎస్ చేయించుకునే స్తోమత ప్లాట్ల యజమానులు, రియల్టర్లకు ఉండదు. ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రస్తుతం సుమారు 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవ్వన్నీ క్లియర్ అయితే ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – నారగోని ప్రవీణ్‌కుమార్, ప్రెసిడెంట్,తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ -
2020 LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన
రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2024 మార్చి 31లోపు దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 20 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది ఇప్పటివరకు సందిగ్ధంగా ఉంది. తాజా ప్రకటనతో దరఖాస్తుదారులకు ఊరట లభించినట్లయింది. బడ్జెట్ సమయంలోనే వివరాల సేకరణ రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తులను క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. మూడు దశల్లో పరిశీలన దరఖాస్తుల పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతి లభించడంతో గతంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేశారు. ఆ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. తొలిదశలో దరఖాస్తుల పరిశీలన రెండో దశలో ఆయా స్థలాలు క్రమబద్ధీకరణకు అర్హమైనవా? కాదా? అని గుర్తించడం.. అర్హతలు ఉన్నట్లు భావిస్తే సిఫార్సు చేయడం.. మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలంటూ నోటీసుల జారీకి అనుమతించడం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశారు. 2020లో కేవలం రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ నోటీసులు అందుకున్నవారు అయోమయంలో ఉన్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలిగినట్లయింది. క్రమబద్ధీకరణ ఛార్జీలు ఇలా.. చదరపు గజం రూ. 3,000 కంటే తక్కువ ఉన్న సబ్-రిజిస్ట్రార్ విలువ 20 శాతం ఉంటుంది. రూ. 3,001 -రూ. 5,000 మధ్య 30 శాతం రూ. 5,001 -రూ. 10,000 మధ్య 40 శాతం రూ. 10,001 -రూ. 20,000 50 శాతం రూ. 20,001 -రూ. 30,000 మధ్య 60 శాతం రూ. 30,001 -రూ. 50,000 మధ్య 80 శాతం చదరపు గజం సబ్-రిజిస్ట్రార్ విలువ రూ. 50,000 పైన 100 శాతం ఉంటుంది. పై ఛార్జీలకు అదనంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో నాలా(వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చడానికి) రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆమోదం పొందని లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం అందుబాటులో లేనట్లైతే ఆగస్టు 26 నాటికి ఉన్న ధరకు బదులుగా, ప్లాట్ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ విలువలో 14 శాతం చొప్పున ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు పాటించాల్సిన నిబంధనలు రోడ్డు వెడల్పు కనీసం తొమ్మిది మీటర్లు ఉండాలి. బలహీన వర్గాలకు చెందిన వారి లేఅవుట్లు లేదా 100 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్లాట్ల్లో రహదారి వెడల్పు ఆరు మీటర్లు ఉండవచ్చు. అవసరమైన రహదారి వెడల్పు అందుబాటులో లేకపోతే రెండు వైపులా సమానంగా వెడల్పు చేయడానికి అవసరమైన భూమి ఉండాలి. ల్యాండ్ సీలింగ్ చట్టాలు, భూ వివాదాలు లేదా టైటిల్, సరిహద్దు వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఉంటే లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేయబడవు. అసైన్డ్ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆమోదంలేని లేఅవుట్లో క్రమబద్ధీకరణకు కొంతమంది ప్లాట్ హోల్డర్లు ఆసక్తి చూపినా కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన లేఅవుట్ నమూనానే పరిగణిస్తారు. దరఖాస్తుదారులు సేల్ డీడ్/ టైటిల్ డీడ్ కాపీలను మాత్రమే అందించాలి. విక్రయ ఒప్పందం లేదా లీగల్ నోటరీ పరిగణించరు. నీటి వనరులకు సంబంధించిన చెరువు, కుంట, షికం భూముల్లోని లేఅవుట్లను క్రమబద్ధీకరించరు. నీటి వనరులు ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ బఫర్ జోన్‌గా నిర్ణయిస్తారు. 10 హెక్టార్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని లేఅవుట్లు నదీ ప్రవాహం/ సరస్సుల సరిహద్దు నుంచి 30 మీటర్లు ఉండాలి. కాలువ సరిహద్దుల నుంచి 9 మీటర్లు ఉండాలి. 'నాలా' లేదా మురికినీటి కాలువ నుంచి రెండు మీటర్లు ఉండాలి. -
2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై గుడ్‌న్యూస్
హైదరాబాద్, సాక్షి: లేఅవుట్ క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన పథకం 2020-ఎల్ఆర్ఎస్(LAYOUT REGULARIZATION SCHEME) దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలగనుంది. ఏమిటీ ఎల్ఆర్ఎస్.. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎల్ఆర్ఎస్ ఉద్దేశమేంటంటే.. అధికారిక లేఅవుట్లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ.. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్ ల్యాండ్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్యోద్దేశం. కానీ.. జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్ఆర్ఎస్ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసూలు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు. ఎదురుచూపులే.. అయితే.. రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. నగర, పురపాలికలు; పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కదలిక.. అయితే 20లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31లోపు దరఖాస్తుదారులకు ఈ అవకాశం కల్పించనుంది. సోమవారం ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. -
20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..
అంతర్జాతీయ వ్యయాలపై కేంద్రం పెంచిన 20 శాతం టీసీఎస్ (TCS) పన్ను అక్టోబర్ 1 నుంచే అమలు కానుంది. సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) కింద ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మించి చేసిన విదేశీ ఖర్చులపై మూలం వద్ద ఈ పన్నును వసూలు చేస్తారు. విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులు మినహా ఇతర విదేశీ ఖర్చులపై ఈ పన్నును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా అక్టోబర్ 1 నుంచి 20 శాతం ఉంటుంది. LRS కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. LRS చెల్లింపులు, వారి వెల్లడించిన ఆదాయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన ఆర్థిక శాఖ LRS కింద కొత్త టీసీఎస్ రేట్లను 2023 బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది. కొత్త రేట్లు వైద్య లేదా విద్యా ఖర్చులపై ఎటువంటి మార్పును తీసుకురానప్పటికీ, రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు లేదా ప్రవాసులకు పంపే బహుమతులు వంటి వాటికి చేసే ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 206C, సబ్-సెక్షన్ 1G ప్రకారం.. LRS లావాదేవీలపై, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం టీసీఎస్‌ను వసూలు చేస్తుంది. -
అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రయాణ సమయాల్లో వ్యయాలకు సంబంధించి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల (ఐసీసీ) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెమిటెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) పరిధిలోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన దీని ప్రకారం అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా విదేశీ మారకంలో చేసే వ్యయాలు ఇకపై ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వస్తాయి. ఒక రెసిడెంట్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా సంవత్సరానికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసే అవకాశం ఏర్పడింది. 2.5 లక్షల డాలర్లు, లేదా మరేదైన విదేశీ కరెన్సీలో దానికి సమానమైన మొత్తానికి మించిన చెల్లింపులకు (రెమిటెన్స్) ఆర్బీఐ నుంచి అనుమతి అవసరం అవుతుంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఎల్ఆర్ఎస్లో చేర్చడానికి సంబంధించి విదేశీ మారక నిర్వహణ (కరెంట్ అకౌంట్ లావాదేవీలు) (సవరణ) రూల్స్, 2023ని మంత్రిత్వ శాఖ మే 16న నోటిఫై చేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్బీఐతో సంప్రదింపులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
Telangana High Court: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ సరికాదు..
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయడం అనే ప్రక్రియే తప్పని.. అలాంటిది గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వాటినీ అనుమతించాలని కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. అలా ఎక్కడైనా చేసినట్లు తెలిస్తే ప్రభుత్వ న్యాయవాది (జీపీ) దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) పేరిట చేసే క్రమబద్దీకరణే సరికాదని స్పష్టంచేసింది. గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం తమ ఇంటి నిర్మాణానికి అప్లికేషన్లను అనుమతించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిర్మల్‌కు చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమ దరఖాస్తులను పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పు సమంజసమే.. ఈ పిటిషన్లపై తొలుత హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లందరూ తమ ప్లాట్లకు యజమానులని, విక్రయ డాక్యుమెంట్లు కూడా వారి వద్ద ఉన్నాయన్నారు. టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తును సమర్పించడానికి యత్నించారని వెల్లడించారు. జీవో ప్రకారం 2022, ఆగస్టు 26 లోపు దరఖాస్తు చేయలేదని తిరస్కరించడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు తమ పిటిషన్లో ప్రభుత్వ జీవోను ప్రశ్నించలేదని చెప్పారు. అసలు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేయకుండా, ఇంటి నిర్మాణానికి ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు. జీవోలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదని, ఈ క్రమంలో ప్రతివాదులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ రిట్ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో పిటిషనర్లు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ద్విసభ్య ధర్మాసనం కూడా సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ తీవ్ర వ్యాఖ్యలు ప్రభుత్వం 2020లో అనధికారిక ప్లాట్లు, లే–అవుట్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 131ని తెచ్చింది. దీన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు వెలువడ్డాక విచారణ చేపడతామని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అప్పటివరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం గతంలో వెల్లడించింది. అప్పటివరకు అర్జీదారులను ఇబ్బందులకు గురి చేయకూడదని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉంది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటి?’అని ఘాటుగా వ్యాఖ్యానించింది. -
ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చడీచప్పుడు లేకుండా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అనుమతుల్లేని లేఅవుట్లు, వెంచర్ల క్రమబద్ధీకరణను ఇప్పటికే ప్రారంభించిన మున్సిపల్ శాఖ..గప్‌చుప్‌గా తన పని తాను చేసుకుపోతోంది. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాలంటూ డెవలపర్లకు నోటీసులు పంపుతోంది. ఈ నోటీసులు అందుకున్న డెవలపర్లు భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌కు వీలుగా సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో జరుగుతుండగా, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరింపజేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2020లో ఎల్ఆర్ఎస్ కింద రూ.10 వేల దరఖాస్తు ఫీజు చెల్లించినవారికే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కోర్టు కేసుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ సమయంలో డెవలప్మెంట్ చార్జీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో 1,337 లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లేఅవుట్లలో మొత్తం 1.32 లక్షల ప్లాట్లు ఉండగా, 40,389 ప్లాట్లు అమ్ముడుపోలేదు. ఈ ప్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని డెవలపర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకున్న వాటిలో 688 లేఅవుట్లు ఎల్ఆర్ఎస్కు అర్హమైనవిగా మున్సిపల్ యంత్రాంగం గుర్తించింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోనూ 304 లేఅవుట్లకు గాను 140 లేఅవుట్లను అర్హమైనవిగా గుర్తించింది. ఫీజు చెల్లించి అమ్ముడుపోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి పొందాల్సిందిగా ఆయా లేఅవుట్ల డెవలపర్లకు నోటీసులిచ్చింది. ఈ నోటీసులు అందుకున్నవారు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్లో ఫలానా సర్వే నంబర్లో చేసిన ఫలానా వెంచర్లో ఫలానా నంబర్ నుంచి ఫలానా నంబర్ వరకు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చెల్లించారని, ప్రస్తుతానికి ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవచ్చని, ఆయా ప్లాట్లలో నిర్మాణాలకు వెళ్లినప్పుడు మిగిలిన డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలని పేర్కొంటోంది. ఈ సర్టిఫికెట్లు ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. వారం, పదిరోజుల్లో మోక్షం! ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏం చేస్తే ఏమవుతుందోనన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండాలని, తీర్పు ఎలా వస్తుందో చూసి అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు చెపుతుండగా, వారం నుంచి పదిరోజుల్లోపు వ్యక్తిగత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు కూడా మోక్షం కలుగుతుందని, ఏదోరకంగా ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తుందని మరికొందరు అధికారులు చెపుతుండడం గమనార్హం. లక్షల దరఖాస్తులను ఏం చేద్దాం? వెంచర్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణతో హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లోని చాలా వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి. అయితే వ్యక్తిగతంగా ఎల్ఆర్ఎస్ కోసం లక్షల్లో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితేంటన్నది అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ వర్గాలకు అంతు పట్టడం లేదు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తుండటంతో వ్యక్తిగత దరఖాస్తుల జోలికి వెళితే ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదే విషయమై అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ గత రెండు నెలలుగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణను ఎలా చేయాలన్న దానిపై కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించినట్టు సమాచారం. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్?
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అలాంటి లేఅవుట్లలోని ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీనితో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలోని గ్రామ పంచాయతీల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో చాలా వరకు మున్సిపాలిటీలుగా మారడమో, విలీనం కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సదరు లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు అర్హమైనవి అయితే.. ఆ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను అనుమతించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఆ ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలని.. అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి ఉందన్న అంశాన్ని చేర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీచేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదనపు ఆదాయ వనరుల సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్‌నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్‌నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్‌గనర్‌లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్‌కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
ఎల్ఆర్ఎస్ రసీదు పోయింది.. ఇప్పుడెలా? అ‘ధనం’ కట్టాల్సిందేనా?
‘మామునూరులో 200 గజాల ఓపెన్ ప్లాట్ ఉన్న వినయ్ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా భవన నిర్మాణ ఫీజు చెల్లించాలి. కానీ అతడు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదును పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి వస్తోంది’ ‘నర్సంపేటలో ఉండే సిద్ధు్ద తనకున్న 160 గజాల ఓపెన్ ప్లాట్‌లో ఇళ్లు కట్టుకుందామనుకున్నాడు. ఓ లైసెన్స్డ్ సర్వేయర్‌ను సంప్రదించాడు. సేల్‌డీడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్ కాపీతో పాటు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదు కావాలని సర్వేయర్ అడిగాడు. అది ఉంటే తప్ప అప్పటి మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజు దాదాపు రూ.20వేల వరకు తగ్గే అవకాశముందని చెప్పాడు. అయితే సిద్ధు ఆ రిసిప్ట్‌ను ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు తెరుచుకోలేదు. దీంతో అతడికీ అదనంగా డబ్బు చెల్లించడం తప్పలేదు’ సాక్షి, వరంగల్: కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో సొంతిటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ముందుకొస్తున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భవన నిర్మాణానికి ఆన్లైన్లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్ఆర్ఎస్లో నమోదు చేసుకొని ఆ రసీదు పొంది ఉంటే.. ఇంటి పర్మిషన్‌కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఎల్ఆర్ఎస్లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేశారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లోనూ రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు. తెరుచుకోని సైట్! అక్రమ లే అవుట్లలో ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్లక్రితం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్ విలువను పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుం మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదు కలిగి ఉండి టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే ఫీజు చెల్లించవచ్చు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రిసిప్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడూ వెబ్సైట్ https://lrs.telangana.gov.in కు వెళ్లి ఫోన్ నంబర్ ఎంట్రీ చేస్తే ఓటీపీతో దరఖాస్తు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఓపెన్ అవడం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలామంది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కడుతున్నారు. (చదవండి: పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని తన్ని తరిమేశారు..) ఇంటి నిర్మాణానికి సన్నద్ధం.. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూసిన వేలాది మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎల్ఆర్ఎస్ చెల్లించి అప్పటి రిసిప్ట్ ఉంటే.. గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలామంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించక 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ సైట్‌ను పునరుద్ధరించాలని, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు విన్నవిస్తున్నారు. (చదవండి: బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!) -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన కృష్ణమూర్తి తన 200 చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల మేరకు అప్పటి మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ.. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న రసీదు తన దగ్గర లేకపోవడంతో అధికారులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని సూచించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరుకు చెందిన ఓ మహిళ తన 150 గజాల స్థలం కోసం 2020లోనే ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన రసీదు లేకపోవడంతో ‘ఎల్ఆర్ఎస్ తెలంగాణ’ వెబ్సైట్ నుంచి పొందేందుకు ప్రయత్నించింది. ఆమెకు సదరు వెబ్సైట్ నుంచి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చేసేదేమీలేక ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.1.12 లక్షలు చెల్లించారు. సాక్షి, హైదరాబాద్: టీఎస్ బీ పాస్‌లో దరఖాస్తు చేసుకొనే వారికి సైతం ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో పెద్ద మొత్తంలో భారం పడుతోంది. గతంలో రూ.1000 చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే 14 శాతం ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు అప్పటి మార్కెట్ ధర ప్రకారం భవన నిర్మాణ రుసుమును చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ చాలా మంది తమ వద్ద అప్పటి రసీదు లేకపోవడం, వాటిని వెబ్సైట్ నుంచే పొందే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అదనంగా చెల్లించాల్సివస్తోంది. స్తంభించిన సేవలు.. ► ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా ఎదురు చూసిన ఎంతో మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నప్పటికీ ఫీజులు మాత్రం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 2020 నాటి మార్కెట్ ధర ప్రకారం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు కూడా తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలా మంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ► నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించకపోవడంతో 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుముతో పాటు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. రసీదు లేని వాళ్లు ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఉంది. కానీ కొంతకాలంగా ఆ వెబ్సైట్ సేవలు స్తంభించాయి. ► దరఖాస్తుదారులు ఆన్లైన్లో మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్వర్డ్) రావడం లేదు. ఒక్క తుర్కయంజాల్లోనే 45 వేల మందికిపైగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి ఇలా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ► ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవడం, ఎల్ఆర్ఎస్పై సందిగ్ధం నెలకొనడంతో చాలా మంది రసీదులు కోల్పోయారు. ప్రస్తుతం ఇళ్లు కట్టుకొనేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ రసీదు మాత్రం లభించడం లేదు. స్తంభించిన ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సేవలను తిరిగి ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. (క్లిక్: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. మెయింటెనెన్స్ లేకుంటే ముప్పే!?) వెల్లువలా దరఖాస్తులు.. కోవిడ్ ఉద్ధృతి తీవ్రత సమయంలో ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా వెల్లువలా వచ్చాయి. మొదటి రోజే 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా చివరి రోజుకు 1,81,847 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో మున్సిపాలిటీల నుంచే సుమారు 74 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీల నుంచి మరో 63 వేలకు పై గా అందాయి. మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మరో 43,511 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వా నికి రూ.18.50 కోట్ల ఆదాయం లభించింది. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్ అభివృద్ధి) -
ఇక ‘అసైన్డ్’ వంతు!
రాష్ట్రంలో నెలకొన్న భూముల సమస్యలు, వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములు, నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలకు కూడా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూములతో పాటు నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కీలకమైన అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమిని 14 లక్షల మందికి అసైన్ చేశారు. అయితే ఈ భూములపై అసైనీలకు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించలేదు. భూబదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ) కారణంగా ఈ భూములపై అసైనీలకు హక్కులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కేవలం వారసత్వ బదిలీకి మాత్రమే ఈ భూములు పరిమితం అయ్యాయి. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో చాలా అసైన్డ్ భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండడంతో ఈ లావాదేవీలు కూడా జరగడం లేదు. అయితే ఓ కటాఫ్ తేదీని నిర్ధారించి ఈ కటాఫ్ తేదీ కంటే ముందు పేదలకు అసైన్ చేసిన భూములపై పీవోటీ చట్టాన్ని సవరించడం ద్వారా అసైనీలకు సర్వహక్కులు కల్పించాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాల వారీగా ఎన్ని ఎకరాల అసైన్డ్ భూములున్నాయి? అందులో ఎన్ని అసైనీల చేతిలో ఉన్నాయి? ఎన్ని థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాల్లో వెంచర్లు వేసి అక్రమంగా అమ్మకాలు జరిగాయి? థర్డ్ పార్టీల సామాజిక, ఆర్థిక స్థితిగతులేంటి ? అనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ వివరాల ఆధారంగా అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా కొంత కసరత్తు జరిపింది. అయితే ఈ హక్కుల కల్పనకు గాను పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉండడంతో త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు తెస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఒకవేళ ఈసారి వాయిదా పడితే వర్షాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా సభ ముందుకు బిల్లు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంచర్లకు మార్గదర్శకాలు సిద్ధం మరోవైపు అనువుగా ఉన్న చోట్ల అసైన్డ్ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల్లో అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసేందుకు మార్గదర్శకాలు కూడా సిద్ధమయ్యాయి. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా పట్టాదారు రైతులు ఎకరం భూమి ఇస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాల కోసం మినహాయించగా మిగిలే 2,800 గజాల్లో సగం భూమిపై రైతుకు యాజమాన్య హక్కు ఇవ్వాలని, లావుణి భూములయితే 600 గజాలపై హక్కు ఇవ్వాలని, అదే అసైన్డ్ భూమి అయితే సదరు అసైనీకి 25 శాతం (700 గజాలు) హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే పద్ధతిని హైదరాబాద్ శివార్లలోని కొన్ని గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో అవలంబించాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. అయితే ఈ భూముల విషయంలో హక్కు ఇవ్వడం కన్నా పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని అమ్మాలనే ప్రతిపాదనల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసైన్డ్ భూములకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కొలిక్కి! పనిలో పనిగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను కూడా ఓ కొలిక్కి తేవాలనే దిశలో ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కీం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే చాలా వరకు భూ సమస్యలు తీరిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు. నోటరీ స్థలాలకు ఒకసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు వ్యక్తం చేశాయి. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు గడువు
సాక్షి, అమరావతి: లేఅవుట్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (టీసీపీ) విభాగం వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువునిచ్చింది. పరిశీలన పూర్తయిన దరఖాస్తుదారులు ఆలోగా అడిగిన పత్రాలు, ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. గడువులోగా క్రమబద్ధీకరించని ప్లాట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశంలేకపోవడంతో పాటు ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కావు. ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు తీసుకుని, రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో పాటు అక్కడ చేపట్టే నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బంది పడుతున్న వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. ఇలాంటి వారికి ఊరటనిస్తూ 2019 ఆగస్టు చివరి నాటికి ప్లాట్లు కొన్నవారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ వచ్చే ఏడాది మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ టీసీపీ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా.. అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్లాట్ల యజమానులకు అవసరమైన పత్రాలు సమర్పించాలని కొందరికి, అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారికి ఫీజు చెల్లించాలని అధికారులు సమాచారం పంపుతున్నారు. అందిన దరఖాస్తులు 43 వేలు.. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పలు సంస్థలు వేల సంఖ్యలో ప్రైవేటు వెంచర్లు వేశారు. ఇలాంటి వాటిలో 10,883 వెంచర్లు ఎల్ఆర్ఎస్కు అనుకూలమైనవని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం గుర్తించింది. వాటిలో ప్లాట్లు కొన్నవారికి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీంతో వివిధ జిల్లాల నుంచి 43,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించిన 9,187 దరఖాస్తులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. బఫర్ జోన్లో ఉన్నవి, సరైన పత్రాలు లేని 1,442 అప్లికేషన్లను తిరస్కరించారు. సోమవారం నాటికి మరో 1,363 మందికి ఫైనల్ ప్రొసీడింగ్స్‌కు ఫీజు చెల్లించాలని.. అవసరమైన పత్రాలు సమర్పించాలని మరో 3 వేల మందికి అధికారులు సమాచారం పంపించారు. 2,747 దరఖాస్తులను షార్ట్‌ఫాల్‌లో ఉంచారు. కాగా, ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు 28 వేలు ఉన్నాయని, జనవరి చివరి నాటికి వాటి స్క్రూటినీ ప్రక్రియ కూడా పూర్తిచేసి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతామని ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వేపనగండ్ల రాముడు తెలిపారు. అనుమతిలేకుంటే రిజిస్ట్రేషన్లు బంద్ ఇక ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు గడువులోగా స్పందించకుంటే ఇబ్బందులు తప్పేట్టులేవు. దరఖాస్తు చేసుకున్నవారు గడువులోగా అడిగిన పత్రాలు సమర్చించాలని, ఫీజు చెల్లించాలని మెసేజ్‌లు అందుకున్నవారు ఆ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని రాముడు సూచించారు. లేకుంటే అలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు గడువులోగా స్పందించాలని ఆయన కోరారు. -
అనధికార లే అవుట్లు..16 వేలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న అనధికార లే అవుట్లలో ప్లాట్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. రాష్ట్రంలో 20 వేలకు పైగా లేఅవుట్లుండగా, అందులో కేవలం 3,568కి మాత్రమే పూర్తిస్థాయిలో అనుమతులు ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన దాదాపు 16 వేలకు పైగా లే అవుట్లలో కొన్నిటికి అరకొరగా అనుమతులుండగా, మరికొన్నిటికి అసలు అనుమతులే లేవు. అయినప్పటికీ ఆయా లే అవుట్లలోని ప్లాట్లను ప్రజలకు రియల్ వ్యాపారులు అమ్మేస్తున్నారు. ఈ లే అవుట్లు 1.22 లక్షలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉంటే, అందులో 40 వేల ఎకరాల వరకే అనుమతులున్నాయని, మిగిలిన 80 వేలకు పైగా ఎకరాల్లో అమ్మకాలు జరుపుతున్న ప్లాట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేవని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థలు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)ల నుంచి అనుమతులు లేకుండా తయారు చేస్తున్న ఈ అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొంటున్న సామాన్యులు ఆ తర్వాత ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోంది. ఇలాంటివెన్నోఉదంతాలు వెలుగులోనికి వచ్చినా రియల్ వ్యాపారులను నియంత్రించలేని కారణంగా ఫలితం లేకుండా పోతోందనే విమర్శలున్నాయి. తాజాగా ఇప్పుడు రాష్ట్రంలోని ఇండ్ల స్థలాల విషయంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉపసంఘం ఎజెండాలో ప్లాట్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అనధికారిక లే అవుట్ల అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ ఏమవుతుందో? ఉపసంఘం ఎజెండాలో భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) అంశాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రస్తావించకపోయినా దీనిపైన కూడా నిర్ణయం వెలువడే అవకాశముందని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఇప్పటికే శాఖాపరమైన కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నివేదికలను కూడా ఉపసంఘం పరిశీలించే అవకాశం ఉంది. కోర్టు తుది తీర్పునకు లోబడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గ్రామకంఠం భూములపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామపంచాయతీలకు చెందిన భూముల్లో ఏవైనా ఆక్రమణలు ఉంటే వాటిని కూడా ఉపసంఘం పరిశీలిస్తుందనే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఈ అనధికారిక లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, గ్రామకంఠం భూములను క్రమబద్ధీకరిస్తే.. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారికి ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందనే అంచనా ఉంది. కేటీఆర్ నేతృత్వంలో ఉప సంఘం రాష్ట్రంలోని ఇండ్ల స్థలాల సంబంధిత సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ మంత్రి కె. తారకరామారావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, మంత్రులు టి. హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు సభ్యులుగా వ్యవహరించనున్నా రు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అనధికారిక లే అవుట్లు.. ప్లాట్లు, ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠాలతో పాటు ఇతర అంశాలపై కమిటీ పరిశీలన జరుపుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
15 రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఆమోదంపై ప్రభుత్వ స్పందన
-
15 రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఆమోదంపై ప్రభుత్వ స్పందన
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉందని, ఎల్ఆర్ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోర్టు ఆదేశాల మేరకే చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 15 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని మాత్రమే ఆదేశించామని, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ పరిశీలన ఆమోదించడానికి కాదని తెలిపింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఆమోదంపై తప్పుడు కథనాలు వస్తున్నాయని తెలిపింది. 15 రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఆమోదం అనేది తప్పుడు ప్రచారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని రకాలుగా పరిశీలించాకే అనుమతి ఇస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన ఎలాంటి ప్లాట్స్నైనా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించామని పేర్కొంది. -
ఎల్ఆర్ఎస్ ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్!
సాక్షి, హైదరాబాద్: అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లతోపాటు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (ఖాళీ స్థలాల పన్ను) పడబోతోంది. ఈ రెండు కేటగిరీల ప్లాట్లు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర పురపాలక శాఖ స్పష్టం చేసింది. నిర్మాణాలకు అనువైన/ నిర్మాణాలు అనుమతించదగిన ఖాళీ స్థలాలపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 సెక్షన్ 94(ఏ) పేర్కొంటోందని, ఆయా ప్లాట్లపై ఈ మేరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ మినహా), మున్సిపాలిటీల కమిషనర్లను తాజాగా పురపాలక శాఖ డైరెక్టరేట్ ఆదేశించింది. లేఅవుట్ల అప్రూవల్స్ జారీ/ ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించే సమయంలో సంబంధిత ఖాళీ స్థలాల మదింపు (అసెస్మెంట్) చేసే సమయంలో ఈ పన్ను విధించాలని కోరింది. మార్కెట్ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ విలువలో 0.05 శాతానికి తగ్గకుండా, 0.20 శాతానికి మించకుండా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల నిబంధనలు–2020 చెబుతు న్నాయి. ఈ మేరకు పన్ను విధించే అంశాన్ని సం బంధిత మున్సిపాలిటీల పాలక మండలి ముందు ఉంచి ఆమోదం పొందాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఈ పన్ను రేట్లను సైతం శాఖ పోర్టల్‌లో నవీకరించాలని కోరింది. మదింపు చేపట్టి అడ్వాన్స్‌గా... రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గతేడాది ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)–2020 ప్రవేశపెట్టగా, గడువులోగా మొత్తం 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామ పంచాయతీల పరిధి నుంచి 10.83 లక్షలు, మున్సిపాలిటీల పరిధి నుంచి 10.60 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 4.16 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న 14.75 లక్షలకు పైగా ప్లాట్లు/లేఅవుట్ల యజమానులపై సమీప భవిష్యత్తులో ఈ మేరకు పన్నులు విధించే అవకాశాలున్నాయి. ఆయా ప్లాట్ క్రమబద్ధీకరణ ప్రక్రియ సమయంలోనే పన్నుల మదింపు సైతం చేపట్టి అడ్వాన్స్‌గా పన్నులు కట్టించుకోనున్నట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పిటిషన్లపై ముగిసిన విచారణ..!
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణ (బీఆర్ఎస్), అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో... ఇదే అంశంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు సంబంధించి జీవో 131, 152లను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త జువ్వాడి సాగర్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గత ఏడాది విచారణకు స్వీకరించి అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఇక్కడ విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన 10 పిటిషన్లపై విచారణను ముగించింది. అయితే బీఆర్ఎస్ పథకంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టరాదంటూ గత జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా గత సెప్టెంబరులో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణను ముగించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేసిందని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అభ్యంతరం ఉంటే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై బుధవారం హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో.. అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటివరకూ అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసుకుంది. -
జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ
సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్‌కు ఒక మంచి గిఫ్ట్‌గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌తోపాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం
ప్లాట్ల యజమానులకు ఉపశమనం ఎల్ఆర్ఎస్ ఊరట సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రిజిస్టర్ అయిన ప్లాట్లు, నిర్మాణాలు పూర్తయిన వాటికి రిజిస్ట్రేషన్లను గతంలో మాదిరిగా ప్రారంభించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ వి.శేషాద్రి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, డెవలపర్లు మొదటిసారి అమ్మే క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్లాట్లకు మాత్రం సంబంధిత అనుమతులు ఉండాలని లేదా ఆ ప్లాటు అనుమతి పొందిన లే–అవుట్లో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే గతంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బీపీఎస్‌ల ద్వారా అనుమతులు పొందిన లే–అవుట్లు, ప్లాట్లు, భవనాలు, నిర్మాణాల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఉత్తర్వుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తున్నామని, రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లు ఈ ఆదేశాలను అమలు చేయాలని ఉత్తర్వుల్లో శేషాద్రి పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్పై సర్కారు నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు తొలగిన అడ్డంకి సాక్షి, హైదరాబాద్: ఇళ్లో, పొలమో, ప్లాటో, ఇతర ఆస్తులో అమ్ముకోనిదే ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, భారీ వైద్య ఖర్చులు సామాన్యులకు సాధ్యంకాదు. అలాంటిది మూడున్నర నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)తో ముడిపెట్టడం దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. గత సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నెల 21 నుంచి పాత విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించినా ఎల్ఆర్ఎస్ నిబంధన ఇబ్బందిగా మారింది. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం కనీసం ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిన అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోవడం సామాన్యులకు భారీ ఉపశమనం కల్పించినట్లు అయింది. మరోవైపు అనధికార ప్లాట్ల కొనుగోళ్లకు అడ్వాన్సులు చెల్లించిన కొనుగోలుదారులకు సైతం ఊరట లభించింది. అనధికార ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోకుంటే.. రిజిస్ట్రేషన్లు జరపమని గత ఆగస్టు 31న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల గురించి ఆలోచించాలి... ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో సైతం పునరాలోచన చేయాలని ప్రభుత్వంపై పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఫీజులు అసాధారణంగా ఉన్నాయని, సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్ఆర్ఎస్ ఫీజులను తగ్గించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.లక్షలు చెల్లించడం ఇబ్బందికరమేనని స్థిరాస్తి వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131ను తీసుకురాగా, గత అక్టోబర్ 31తో గడువు ముగిసింది. మొత్తం 25.59 లక్షల దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను ఇంకా రూపకల్పన చేయలేదు. దీంతో వీటిని పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించడం సాధ్యం కావడం లేదు. జీవోలోని నిబంధనల ప్రకారం.. జనవరి 31లోగా దరఖాస్తుదారులు మొత్తం క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించాలి. దీనికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా ఇప్పటివరకు వారికి ఫీజుల వివరాల లేఖలు అందలేదు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు ఇటీవల కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారేనని, దీంతో వారు 10 శాతం ఖాళీ స్థలం లేని కారణంగా 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుందని, ఇది పెనుభారంగా మారనుందని దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ►ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి. ఇది ప్రజలకు వ్యతిరేకం. ఎల్ఆర్ఎస్ జీవోలోని నిబంధనల ప్రకారం ఇళ్లను కట్టుకున్న ప్లాట్లను సైతం క్రమబద్ధీకరించుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 10 శాతం ఖాళీ స్థలం లేదన్న కారణంతో 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాలన్న నిబంధన సరైనది కాదు. – ప్రవీణ్, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ►సదుద్దేశంతోనే ప్రభుత్వం ధరణి, ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అమలులో లోపాల వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రిజిస్ట్రేషన్లను మూడున్నర నెలల పాటు నిలుపుదల చేయడంతో నగదు చేతులు మారక(క్యాష్ ఫ్లో) తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జీతాలు చెల్లించడం, నిర్మాణ పనులు కొనసాగించడం, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడం కష్టమైంది. – ట్రెడా, క్రెడా సంస్థల ముఖ్యులు -
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయడంతో ఈ నేపథ్యంలో రేపటి దీక్షను కూడా రద్దు చేశామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. (చదవండి: ఎల్ఆర్ఎస్ ఎత్తివేత: కేసీఆర్ కీలక నిర్ణయం) కరోనా కారణంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం తాము తీవ్రంగా వ్యతిరేకించామని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు (బుధవారం) గాంధీభవన్‌లో దీక్ష చేస్తామని ప్రకటించామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ డిమాండ్‌కు దిగొచ్చిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. (చదవండి: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సీన్ మారింది!) -
ఎల్ఆర్ఎస్ ఎత్తివేత: కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరగనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించిన సర్కార్.. మూడు నెలల క్రితం ఇందుకోసం ధరణి వెబ్‌సైట్‌తో పాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి ఫ్లాట్‌కు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని నెలల ప్రతిష్టంభన తరువాత తిరిగి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కొద్దిరోజుల క్రితం నిర్ణయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానాన్ని సైతం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. -
కాలె యాదయ్య వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు
మెయినాబాద్(చేవెళ్ల): 111 జీవో, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, నిరసనకారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలె యాదయ్య కారులో రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ చౌరస్తా మీదుగా వెళుతుండ గా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవోతోపాటు, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి వారిని పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు కొందరు నిరసనకారులను అడ్డుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి మండల పరిష త్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. -
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా..
సాక్షి, హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత పది నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆస్తులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. అయితే గతంలో బ్రిటిష్, నిజాం కాలం నుంచి ఆస్తులకు భద్రత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. . ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను జనం నిలదీశారని, సీఎం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దని, ఎల్ఆర్ఎస్పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. (‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలేదు’) కరోనా కాలంలో ట్రీట్మెంట్కు ఆస్తులను కుదవ పెట్టుకుందామన్నా, ఆఖరికి పెళ్లిలకు కూడా డబ్బు అవసరమైతే.. ఆస్తులు అక్కరకు రాకుండా పోతున్నాయని ధ్వజమెత్తారు. ధరణి లోని ఆస్తులను చూపించి.. అప్పులు తెస్తారేమోనని అనుమానం కలుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. పాత పద్ధతి లో రిజిస్ట్రేషన్ ఉంటదని చెప్పి జీవోలో వంద కండీషన్లు పెట్టారు..ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందని ఆరోపించారు. తక్షణమే రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని, లేదంటే ప్రజల ఉసురు తగిలి ప్రభుత్వం కుప్పకూలుతుందని మండిపడ్డారు. (సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట) -
అనధికార ప్లాట్లలో ఇళ్లకు నో
సాక్షి, హైదరాబాద్ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో పేర్కొన్నట్టే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ, అనధికార ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతుల జారీకి చెక్ పెట్టింది. అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లు లేదా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లలో మాత్రమే ఇళ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసేలా టీఎస్–బీపాస్ పోర్టల్‌ను రూపకల్పన చేసింది. లేఅవుట్ అనుమతి పత్రం/ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే ఇంటికి అనుమతులు జారీ కానున్నాయి. లేకుంటే దరఖాస్తు తిరస్కరణకు గురికానుంది. అయితే, 150 చదరపు మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు షరతులతో కూడిన మినహాయింపు కల్పించింది. పాత పురపాలికల్లో 2015 అక్టోబర్ 28 కంటే ముందు, కొత్త మున్సిపాలిటీల్లో 2018 మార్చి 28 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 150 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం గల ప్లాట్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది. మరోవైపు అనుమతి తీసుకోకుండా చేపట్టే భవన, లేఅవుట్లను నోటీసులు లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు కూల్చివేస్తాయని టీఎస్–బీపాస్ చట్టంలో ప్రభుత్వం పొందుపర్చింది. దీంతో అనుమతి లేని, క్రమబద్ధీకరించుకోని ప్లాట్లలో ఇళ్లను నిర్మించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ నిర్మించినా, ఎవరైనా టీఎస్–బీపాస్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వారం రోజుల్లో కూల్చివేయనున్నారు. మరి పేదల పరిస్థితేంటి? ఎల్ఆర్ఎస్ గడువు అక్టోబర్ 31తో ముగిసిపోగా, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 4,16,155 దరఖాస్తులు, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013, గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,394.. మొత్తం 25,59,562 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ చార్జీలు, ఖాళీ స్థలాలు లేనందుకు చెల్లించాల్సిన జరిమానాలు కలిపి రూ.వేల నుంచి రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడంతో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఎల్ఆర్ఎస్ కింద అనధికార లేవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోని పక్షంలో వాటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేయమని, ఆయా ప్లాట్ల క్రయావిక్రయాలకు రిజిస్ట్రేషన్లు జరపబోమని, సాధారణ నల్లా, డ్రైనేజీ కనెక్షన్లు జారీ చేయమని ప్రభుత్వం ఆగస్టు 31న జారీ చేసిన ఎల్ఆర్ఎస్ జీవోలో పేర్కొంది. తాజాగా టీఎస్–బీపాస్ పోర్టల్ ద్వారా అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణ అనుమతల జారీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముంది. ఉచిత క్రమబద్ధీకరణే పరిష్కారం.. ఎల్ఆర్ఎస్ కింద అనూహ్యంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం అక్టోబర్ 31 తర్వాత గడువు పొడిగించొద్దని నిర్ణయం తీసుకుంది. కొద్దో గొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోగా, ఏ మాత్రం ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ఆయా వర్గాల ప్రజలకు సంబంధించిన ప్లాట్లను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరిస్తేనే వారు భవిష్యత్తులో ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కలగనుంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరిశీలన జరుపుతున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పేదలకు ఊరట కలిగే విధంగా నిర్దిష్ట విస్తీర్ణంలోని అనధికార ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో అంతకుముందే దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. లేకుంటే క్రమబద్ధీకరించుకోలేకపోయిన పేదలు తమ సొంత ఖాళీ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే హక్కును, అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.. ‘ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోని స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా ఖజానాను నింపుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తెచ్చింది. క్రమబద్ధీకరించుకోకుంటే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వబోమని, రిజిస్ట్రేషన్లు జరపమని ఎల్ఆర్ఎస్ జీవోలో పెట్టిన కఠిన నిబంధనలు పూర్తిగా పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం తమకు తోచినప్పుడు ఎల్ఆర్ఎస్ను తెచ్చి తాము చెప్పిన గడువులోగా క్రమబద్ధీకరించుకోవాలంటే అందరికీ సాధ్యమవుతుందా..? ఆ సమయంలో అందరి వద్ద డబ్బులుంటాయా..? ఇప్పటికే లాక్డౌన్, కరోనాతో ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎల్ఆర్ఎస్, టీఎస్–బీపాస్ పేరుతో ఇలాంటి ఆంక్షలు విధిస్తే ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చూడక తప్పదు. తక్షణమే పేద, మధ్య తరగతి ప్రజల స్థలాలను ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరించి ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలి..' – సంజీవ్, పేదల గృహ నిర్మాణ రంగ కార్యకర్త, మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) -
తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలే
సాక్షి,హైదరాబాద్: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తక్షణ రిజిస్ట్రేషన్/అనుమతి చేసుకునే దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై టీఎస్–బీపాస్ చట్టంలోని సెక్షన్ 10 కింద మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా, కూల్చివేతలు లేదా ఆస్తి జప్తు చేసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అరవింద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇటీవలే ప్రత్యేక మెమో జారీ చేశారు. టీఎస్–బీపాస్ కింద జారీ చేసే తక్షణ రిజిస్ట్రేషన్లు, తక్షణ అనుమతులను ‘తదుపరి తనిఖీ’ బృందాలతో పరిశీలించాలని ఆయన కోరారు. అనుమతించిన లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించిన లేఅవుట్లలో తక్షణ రిజిస్ట్రేషన్లు, అనుమతుల ద్వారా జరిపే ఇళ్ల నిర్మాణాలకు తదుపరి తనిఖీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. తక్షణ రిజిస్ట్రేషన్/అనుమతి దరఖాస్తులు వచ్చిన వెంటనే ఈ బృందాలు 3 రోజుల్లోగా అన్ని అంశాలను పరిశీలించి ఆ తర్వాతి 24 గంటల్లోగా సిఫారసులు తెలపాలన్నారు. మరోవైపు 2015లో పాత ఎల్ఆర్ఎస్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను కొత్త ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం ఈ నెల 30లోగా పరిష్కరించాలని అన్ని పురపాలికలు, హెచ్ఎండీఏ, అర్బన్ డెలప్మెంట్ అథారిటీలకు అరవింద్‌కుమార్ మంగళవారం ఆదేశాలిచ్చారు. (అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?) -
అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో–131.. అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉందంటూ హైకోర్టు మండిపడింది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటని ప్రశ్నించింది. అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గత ఆగస్టులో ప్రభుత్వం తెచ్చిన జీవో–131ని సవాల్ చేస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జీవో 131 చట్టవిరుద్ధమని, జీవో జారీ చేసి మరీ క్రమబద్ధీకరించడం నిబంధనలకు విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ప్రతి ఐదేళ్లకోకసారి అక్రమ నిర్మాణాలను, లేఔట్లను క్రమబద్ధీకరించడం సంప్రదాయంగా మారుతోందని పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను, లేఔట్ల క్రమబద్ధీకరణతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టడం వల్లే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎప్పటిలోగా కౌంటర్ దాఖలు చేస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించగా, వారం రోజుల్లో వేస్తామని నివేదించారు. దీంతో 11లోగా కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. -
ఎల్ఆర్ఎస్ గడువు 31 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్కు అంతరాయం కలగడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని, ఈ నేపథ్యంలో గడువు పొడిగిం చాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్.. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లితో సమీక్షించి దరఖాస్తుల గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి గురువారం రాత్రి 9 గంటల వరకు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో చివరి రోజే గురువారం 2.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ చేయించుకోకుంటే, సదరు అక్రమ ప్లాట్ల తదుపరి క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ జరపబోమని, ఇళ్ల నిర్మాణ అనుమతులు సైతం జారీ చేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో 45 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 19.33 లక్షల దరఖాస్తులు రాగా, గురువారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గడువు పొడిగింపు ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. (చదవండి: కానిస్టేబుళ్లకు కమిషనర్ సెల్యూట్!) -
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. అయితే మరో నెల రోజులపాటు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మీ–సేవా కేంద్రాలు మూతపడి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, బుధవారం రాత్రి నాటికి మొత్తం 16,28,844 దరఖాస్తులు వచ్చాయి. పురపాలికల్లో 6,67,693, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్లలో 2,91,066 దరఖాస్తులొచ్చాయి. -
ఎల్ఆర్ఎస్ పేరుతో నయా దోపిడీ
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయడానికి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది. జీవో 131, జీవో 135. వీటి ప్రకారం 2020 ఆగస్టు 26 వరకూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కల్గి ఉన్న యజమానులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ప్రస్తుతమున్న అనుమతుల్లేని లేఅవుట్ వెంచర్లన్నీ తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. గ్రామకంఠం భూములకు ఇది వర్తించదు. వ్యక్తిగత ప్లాట్ యజమాని వెయ్యి ఫీజుతో, లేఅవుట్ వెంచర్ యజమాని రూ.10 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించి అక్టోబర్ 15లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల అనధికార ప్లాట్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 16 లక్షల మంది అప్లై చేసుకుంటే వచ్చే ఫీజుతోనే సుమారు రూ.160 కోట్ల ఆదాయం వస్తుంది. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు 2021 జనవరి 31 వరకూ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 16 లక్షల ప్లాట్లకు గాను ఒక్కో దానికి సుమారు రూ.50 వేల చొప్పున వేసుకున్నా, రూ. 8 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. (చదవండి: ఎల్ఆర్ఎస్: ‘3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తోంది’) ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. చిన్న చిన్న ప్లాట్లు కల్గిన వారిలో 80 శాతం మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన దయనీయమైన స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. లాక్డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కొంత నగదు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడంతో పాటు, ఇంటి అద్దెలను సైతం కట్టొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నేడు వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రస్తుతమున్న ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ చేయిం చుకోకపోతే వాటిని అమ్మాలన్నా, వాటిలో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతి ఉండదని; మంచినీటి కనెక్షన్, డ్రైనేజీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఏ విధమైన రిజిస్ట్రేషన్ జరగవని చెప్పడం– పరోక్షంగా ప్రజలను ప్రభుత్వం బెదిరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగానే కన్పిస్తోంది. లేఅవుట్లలో ఎక్కువ వరకూ 200–250 గజాల ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు రోడ్లు విస్తరించే క్రమంలో ఆ ప్లాట్ల విస్తీర్ణం తగ్గిపోతోంది. రెండు వైపులా రోడ్ల ప్లాటు అయితే హక్కుదారులకు ఏమీ మిగలడం లేదు. అయినా వారి నుంచి కూడా మొత్తం ప్లాట్ల విస్తీర్ణానికి చార్జీలు వసూలు చేస్తున్నారు. పోయిన విస్తీర్ణానికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2015లో ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఆ సమయంలో దరఖాస్తు రూపంలో రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించకుండానే మూలన పడేశారు. తిరిగి నేడు మళ్లీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటూ కొత్త జీవో తేవడంతో గతంలో కట్టిన డీడీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: సారూ.. మాకేది మోక్షం!) కేంద్రం నుంచి జీఎస్టీ రాష్ట్ర పన్నుల వాటాగా రూ.8 వేల కోట్లు రావాలని చెబుతున్నారు. పదే పదే అడిగినా ఇవ్వడం లేదని, కరోనా వైరస్ కట్టడి చేయడానికి కూడా ఆర్థిక సాయమందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేవుడితో పోరాడుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో ఎందుకు పోరాడి నిధులు రాబట్టలేకపోతున్నారో ప్రజలకు తెలియజేయాలి. కేంద్రంతో పోరాడే దమ్ము లేకనే పేద, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నిషేధాస్తులు తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం ఏమాత్రం ఆపకూడదు. కానీ ఆగస్టు నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయడం చట్టవిరుద్ధం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? కొన్ని ప్లాట్లు, వెంచర్లలో భవన నిర్మాణాలు సైతం జరిగాయి. ఇన్ని ఏళ్ల కాలంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గుర్తు రాలేదా? ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఏకపక్షంగా ఆర్థికభారం మోపడం తగదు. తక్షణమే జీవో 131, 135లను రద్దుచేయాలి. వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
‘రూ. 3 లక్షల కోట్లు దండుకోవాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : కరోనా కష్టకాలంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల రక్తం పిండుకుంటుందని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ద్వారా కేవలం రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తాయని సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పేరు మీద మూడు లక్షల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ చీకటి జీవోను తీసుకువచ్చిన ప్రభుత్వం.. 30 నుంచి 40 ఏళ్ల సంవత్సరాల లేఔట్లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటుందని దుయ్యబట్టారు. చదవండి: ఎల్ఆర్ఎస్: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ‘ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని కేసీఆర్, కేటీఆర్ పేపర్లో కూడా ప్రచారంచేసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్పై హైకోర్టులో పిల్ దాఖలు చేశాం. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. తప్పుడు లే ఔట్ కు బాధ్యత ప్రభుత్వానిదే. ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవద్దు. రెగ్యులరైజ్ కోసం ఎవరు డబ్బులు కట్టవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం.’ అని పేర్కొన్నారు. -
జీవో 111: సారూ.. మాకేది మోక్షం!
మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన బొల్లించెరువు వీరారెడ్డి రైతు. ఏడాది క్రితం మొయినాబాద్ సమీపంలోని విజయనగర్ కాలనీలో 300 గజాల స్థలాన్ని ఖరీదు చేశాడు. ఇల్లు నిర్మించుకుందామని యత్నిస్తే 111 జీవో పరిధిలో కొత్త నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనతో అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ప్లాటు కొనుగోలు చేసిన లేఅవుట్‌కు సైతం అనుమతులు లేవు. ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమ లేఅవుట్లు, పాట్లను క్రమబద్ధీక రించుకోవడానికి 131 జీవో తీసుకొచ్చింది. కానీ 111 జీవో పరిధిలో రెగ్యులరైజేషన్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. ఇది వీరారెడ్డి ఒక్కడి పరిస్థితీ కాదు. దాదాపు లక్ష మంది సమస్య. సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం లేక.. మరోపక్క జీవో 111 ఎత్తివేతకు అడుగులు పడకపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో చిక్కుకున్నారు. అనధికారికంగా వెలిసిన దాదాపు 3 వేల లేఅవుట్లలో లక్ష మందికిపైగా సామాన్యులు ఇళ్ల స్థలాలు ఖరీదు చేశారు. (చదవండి: ఎల్ఆర్‘ఎస్’.. అనూహ్య స్పందన) ఈ గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేస్తామని.. గత సాధారణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టి 21 నెలలు దాటిపోయినా... 111 జీవో ఎత్తివేతపై ఎటువంటి కదలికా లేదు. ఈ జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించడం లేదు. దాంతో ప్లాట్ల యజమానులు లబోదిబో మంటున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారంతా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారే కావడం గమనార్హం. వీడని పీటముడి.. జీవో 111 పరిధిలో ఏర్పాటైన వెంచర్లు, లేఅవుట్లపై ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది తెలియడం లేదు. సీఎం ఇచ్చిన హామీకి కట్టుబడి సర్కారు జీవో 111ను ఎత్తివేస్తేనే... లేఅవుట్లకు, ప్లాట్లకు మోక్షం లభిస్తుంది. ఎల్ఆర్ఎస్కు వీలు చిక్కుతుంది. మరోపక్క జీఓ 111ను ఎత్తివేయాలని ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మరోపక్క ఈ జీవోను సడలిస్తే జంట జలాశయాల మనుగుడ ప్రశ్నార్థకంగా మారనుందని పర్యావరణ వేత్తలు సైతం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దీనికితోడు ఈ జీవో ప్రభావిత గ్రామాల నుంచి ప్రభుత్వం తీర్మానాలను తీసుకుంటోంది. మహా నగరానికి ఆనుకుని ఉన్నా.. తమ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, కాబట్టి ఈ జీవోని ఎత్తివేయాలని సర్పంచ్‌లు తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. మొత్తంమీద ఈ అంశం సంక్లిష్టంగా మారడంతో ఎప్పటికి మోక్షం కలుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏమిటీ 111 జీవో? హైదరాబాద్ మహానగరానికి తాగునీరందించే ఉస్మాన్‌సాగర్ (గండి పేట), హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణతోపాటు నీటి కాలుష్యాన్ని నివారించేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఈ జంట జలాశయాల ఎగువన ఉన్న, క్యాచ్మెంట్ ఏరియాలోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, రాజేంద్రనగర్, శంషా బాద్, షాబాద్ మండలాల పరిధిలోని 84 గ్రామాలను జీవో పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. సహజ నీటి ప్రవా హాలకు ఆటంకాలు ఏర్పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రియల్ వ్యాపారులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 3 వేల వెంచర్లు చేసి సామాన్యులకు ప్లాట్లు కట్టబెట్టారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్లాట్లన్నింటినీ వ్యాపారులు విక్రయించాక.. ఇటీవల అధికారులు అనధికార వెంచర్లంటూ కూల్చివేతలు మొదలుపెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, వ్యతిరేకత రావడంతో చివరకు వెనకడుగు వేశారు. ఈక్రమంలో ఎల్ఆర్ఎస్.. ఆశాదీపంలా కనిపించినా అందుకు అవకాశం లేకపోవడంతో ప్లాట్ల యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎప్పటి నుంచో కోరుతున్నాం జీవో 111తో మా గ్రామాల్లో అభివృద్ధి చాలా వెనకబడింది. దీనిని తొలగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. భూములు అమ్ముకునేందుకు చూస్తున్న రైతులకు ధరలు తక్కువ వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవోను తొలగిస్తామని హామీ ఇచ్చారు. మాకు ఊరట కలిగిస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే ఈ జీవోపై సడలింపులు కాని, ఎత్తివేతగాని వస్తుందని విశ్వసిస్తున్నాం. అప్పుడే మా గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తాయి. – శేరి శివారెడ్డి, మల్కాపురం సర్పంచ్, చేవెళ్ల మండలం -
జోరందుకున్న ఎల్ఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది. -
ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు!
శంషాబాద్‌కు చెందిన దయానంద్‌రెడ్డికి మండల పరిధిలో నాలుగు ప్లాట్లు ఉన్నాయి. వాటికి ఎల్ఆర్ఎస్ చేయించేందుకు సమీపంలోని ఓ కంప్యూటర్ సెంటర్లో సంప్రదించగా ఒక్కో దరఖాస్తుకు రూ. 2 వేలు అవుతుందని చెప్పడంతో ఆ మేరకు రూ. 8 వేలు చెల్లించాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి గంట తర్వాత నాలుగు రిసిప్ట్‌లను దయానంద్‌రెడ్డి చేతిలో పెట్టాడు. తీరా రిసిప్ట్‌లను పరిశీలిస్తే నాలుగింటికి కలిపి రూ. 4,180 మాత్రమే దరఖాస్తు ఫీజు అయినట్లుంది. మిగతా మొత్తంపై ఆరా తీయగా దరఖాస్తు చేసినందుకు సర్వీసు చార్జీ తీసుకున్నట్లు కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో నోట మాటరాలేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే రూ. వెయ్యి వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడాన్ని కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ దరఖాస్తుదారుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీల ప్రకారం ఒక ప్లాట్ కోసం చేసుకొనే దరఖాస్తుపై రూ.వెయ్యితోపాటు అదనంగా రూ. 45 జీఎస్టీ రూపంలో చెల్లించాలి. అదేవిధంగా లేఅవుట్ దరఖాస్తుకు రూ. 10 వేలతోపాటు జీఎస్టీ చెల్లించాలి. కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తుల్లో లేఅవుట్ దరఖాస్తుల కంటే వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులే అధిక సంఖ్యలో ఉంటున్నాయి. సర్కారు ఆదాయాన్ని తలదన్నేలా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఈ విధానం, దరఖాస్తు తీరుపై సరైన ఆవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది కంప్యూటర్ సెంటర్లు, మీ–సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కువ మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులనే ప్రొత్సహిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాల్లో కూడా ఈ దరఖాస్తు ప్రక్రియకు తెరలేచింది. ఎక్కడికక్కడ దరఖాస్తు కేంద్రాలు తెరవడంతో అర్జీలు పెట్టుకొనే వారంతా ఇలాంటి కేంద్రాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ కేంద్రాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు మాత్రం చేతిచమురు వదిలిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై డబుల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ. 1,545 నుంచి రూ. 2,045 వరకు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కింద వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి జమ అయ్యే ఫీజుల కంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసే మధ్యవర్తులే అధికంగా సంపాదిస్తుండడం గమనార్హం. అందరికీ అందుబాటులో... ఎల్ఆర్ఎస్ పథకం దరఖాస్తు విధానం అత్యంత సులభంగా ఉంది. కానీ ఈ దరఖాస్తు చేసుకొనే తీరుపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, ట్యాబ్‌లలో దేని ద్వారానైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దరఖాస్తు ఫారం నింపాక దరఖాస్తుదారు తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మొదటి పేజీని, లేఅవుట్ నమూనాను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుదారు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లను ఎంట్రీ చేసి నిర్దేశించిన ఫీజును ఆన్లైన్ ఖాతా లేదా ఏటీఎం కార్డు, టీవ్యాలెట్ యాప్‌ల ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రసీదు వస్తుంది. -
ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే: బీజేపీ
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. ఎల్ఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనోదైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్ఎస్ను విధించిందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ నిరసన మరోవైపు మహబూబ్‌నగర్ పట్టణంలో నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా పార్టీ నేతలు ర్యాలీగా వెళ్లి పనులను పరిశీలించారు. రహదారి పక్కన పెద్దపెద్ద గోతులు తీసి నెలల తరబడి పనులు పెండింగ్‌లో పెట్టారని, దీంతో తాము అవస్ధలు పడుతున్నామని, తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని షాపుల యజమానులు నేతల దృష్టికి తీకుకొచ్చారు. అయితే వినియోగదారులు తమ షాపుల్లో కొనుగోళ్లు చేసేందుకు వీలులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని, ప్రభత్వం నిర్లక్క్ష్యం వహిస్తే తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎన్పీ వెంకటేష్ పాల్గొన్నారు. (చదవండి: కొత్త పురపాలికల్లో నవంబర్ వరకు ఎల్ఆర్ఎస్) -
‘ఎల్ఆర్ఎస్’ ఊరట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నాయి. లే–అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల(ఎల్ఆర్ఎస్)–2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది. తగ్గనున్న భారం.. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులకు మాత్రం ఈ సవరణతో ఎలాంటి లబ్ధి ఉండదు. వారు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గానే.. 14 శాతాన్ని చెల్లించాల్సి రానుంది. అయితే, పాత జీవోలో పేర్కొన్న ప్రకారం 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలు వర్తించనున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించా ల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొనడం మరో ఊరట కలిగించే అంశం. శ్లాబులు 4 నుంచి 7కి పెంపు.. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలను ప్రకటిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131 జారీ చేసింది. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న ప్లాటు మార్కెట్ విలువ ఆధారంగా ‘కనీస క్రమబద్ధీకరణ చార్జీ’ల్లో నిర్ణీత శాతాన్ని కనీస క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాలని తొలి జీవోలో పేర్కొంది. అలాగే క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు శ్లాబులుగా విభజించింది. సవరణ ఉత్తర్వుల ప్రకారం.. శ్లాబుల సంఖ్యను 4 నుంచి 7కు పెంచింది. ఆ మేరకు క్రమబద్ధీకరణ చార్జీల శాతాన్ని సైతం తగ్గించింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్–2015 పథకంలో పేర్కొన్న శ్లాబులనే తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో క్రమబద్ధీకరణ చార్జీల భారం దరఖాస్తుదారులపై తగ్గనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఎల్ఆర్ఎస్పై హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ అంశంపై ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ కోర్టుకు తన వాదన వినిపించాడు. తుది తీర్పునకు లోబడి ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఎల్ఆర్ఎస్పై జీవో 131ని సవరిస్తూ ఉత్తర్వులు పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగానే భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) చేసే విధంగా జీవో 131ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ జరిగిన సమయం నాటి మార్కెట్ విలువను వర్తింపజేయనున్నారు. క్రమబద్ధీకరణ చార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాత ఎల్ఆర్ఎస్ స్కీం 2015 కి సమానంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన) దీని ప్రకారం.. గజం మూడు వేల గజాల లోపు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 20 శాతం చెల్లించాలి. ఇక గజం 3 వేల నుంచి 5 వేల వరకు ఉన్న వాళ్లు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 30 శాతం చెల్లించాల్సి ఉండగా.. 5వేల నుంచి 10 వేల గజాలు వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 40 శాతం చెల్లించాలని తెలిపింది. 10 వేల నుంచి 20 వేల గజాలు వరకు ఉంటే రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 50 శాతం.. 20 వేల నుంచి 30 వేల గజాల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 60 శాతం.. 30 వేల నుంచి 50 వేల గజాల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 80 శాతం.. 50 వేల గజాలపైన ఉన్న వారు రిజిస్ట్రేషన్‌లో 100 శాతం చెల్లించాలని తెలిపింది. -
క్రమబద్ధీకరణలో ఊరట
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయానికి ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగానే క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 ఆగస్టు 28 తేదీన అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో (131)లో పేర్కొంది. చాలా ఏళ్ల కింద, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగాభారీగా క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. గడిచిన దశాబ్దకాలంలో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. తాజా మార్కెట్ విలువ ప్రకారం చాలా చోట్ల 200 గజాల స్థలానికి సైతం రూ.లక్షల్లో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమబద్ధీకరణ రుసుములు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండటాన్ని శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్ఆర్ఎస్ (జీవో 131) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉప్రకమించింది. బుధవారం శాసనసభలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ఫీజులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈమేరకు సవరించిన ఉత్తర్వును గురువారమే వెలువరించనున్నట్టు ప్రకటించారు. తాము తీసుకున్న చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వెనకాడబోమని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం కింద భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎంత పాతది అయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఆరేళ్లుగా అదే మార్కెట్ విలువ.. మరోవైపు గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. అంటే గత ఆరేళ్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు యధావిధిగా భారీ మొత్తంలో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరించుకోకపోతే అనధికార, అక్రమ ప్లాట్ల క్రయావిక్రయాల రిజిస్ట్రేషన్లను జరపమని, వీటిల్లో భవన నిర్మాణాలకు సైతం అనుమతులు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు నిర్బంధంగా క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ ప్లాట్లను బేరానికి పెడుతున్నారు. కొనుగోలుదారులు బయానాగా క్రమబద్ధీకరణ చార్జీలు భరించాలని, ఆ తర్వాత మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్‌లో సమయంలో తీసుకుంటామని ప్లాట్ల యజమానులు ఆఫర్ చేస్తున్నారు. మురికివాడల్లో మినహాయింపు ఇవ్వాలి... భవన నిర్మాణ నిబంధనల ప్రకారం నోటిఫైడ్ స్లమ్స్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీకి భారీ రాయితీలు, సడలింపులున్నాయి. ఇతర చోట్లలో వసూలు చేసే భవన నిర్మాణ చార్జీలతో పోల్చితే మురికివాడల్లో నాలుగో వంతు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా లేఅవుట్ అనుమతులు లేకపోయినా /ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా మురికివాడల్లోని ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎలాంటి జరిమానాలు, చార్జీలు వసూలు చేయడం లేదు. తాజాగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం కింద మురికివాడల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు చదరపు మీటర్‌కు రూ.5 చొప్పున కనీస క్రమబద్ధీకరణ చార్జీలకు తోడుగా, స్థలం మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి రానుంది. మురికివాడల్లోని పేదలకు ఇది భారం కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. -
‘ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. టీఆర్ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బందులు పడతారని పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోమటిరెడ్డి, కోర్టును అభ్యర్థించారు.(చదవండి: రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు: సీఎం కేసీఆర్) కాగా ఎల్ఆర్ఎస్ అంశంపై ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి కోర్టు ఒకేసారి విచారించనుంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు టీ సర్కారు ఎల్ఆర్ఎస్ను ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన) -
ఎల్ఆర్ఎస్కు భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)కు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల 2 నుంచి ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, శనివారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 70,193 దరఖాస్తులు వచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంత అనూహ్యమైన స్పందన రావడం గమనార్హం. మున్సిపాలిటీల పరిధిలో 30,353, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 16,912, గ్రామపంచాయతీల పరిధిలో 22,928 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.7.12 కోట్ల ఆదాయం వచ్చింది. అనధికార, అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను చేయమని, ఇలాంటి లేఅవుట్లలో భవన నిర్మాణాలకు సైతం అనుమ తులు జారీ చేయబోమని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవ డం తప్పనిసరిగా మారింది. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్లు జరపడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అనుమతి లేని వ్యక్తిగత ప్లాట్ల యజమానులు, లేఅవుట్ల డెవలపర్లలో గుబులు పట్టుకుంది. దీంతో ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోవడానికి సామాన్యులతోపాటు డెవలపర్లు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. -
ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలి
సాక్షి, మేడ్చల్ : నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం పునారాలోచించాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రియల్టర్లు హయత్ నగర్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు దర్నా నిర్వహించారు. అనంతరం ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. (వీఆర్వో వ్యవస్థ రద్దు) ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలని నిరసనలు చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ చార్జీలు పెంచడం అంటే సామాన్యప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. కరోనా కాలంలో మరింత ఇబ్బందులకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి విఙ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. (రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు ) -
రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, భూరికార్డులు చక్కదిద్దడం అవసరమేనని చెప్పారు. అయితే, నూతనంగా తీసుకొస్తున్న రెవెన్యూ బిల్లును ముందుగా సెలెక్ట్ కమిటీకి అప్పగించి విస్తృత చర్చ జరిగిన అనంతరం తుది రూపు ఇచ్చి చట్టం చేయాలని సూచించారు. ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. రెవెన్యూ శాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి ఒక్క వీఆర్ఓలను బాధ్యులను చేయడం సమంజసం కాదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు దున్నుకుంటున్న రైతులు, పేద, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులకు హక్కులు కల్పించాలన్నారు. కాగా, ఎల్ఆర్ఎస్తో ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్న కోదండరాం.. రెగ్యులరైజేషన్‌కు రుసుం విధించడం సమంజసం కాదని తెలిపారు. -
క్రమబద్దీకరణ: ఎల్ఆర్ఎస్కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకా నికి (ఎల్ఆర్ఎస్) ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకోసం లేఅవుట్ల క్రమబ ద్ధీకరణ నిబంధనలు–2020ను ప్రకటిం చింది. రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల తరఫున సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా మంగళవారం జీవో 131ను బహిర్గతం చేశారు. నో అప్రూవల్... నో రిజిస్ట్రేషన్ రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలు ప్రణాళికా బద్ధమైన సుస్థిరాభివృద్ధిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన లేఅవుట్లను ప్రోత్సహిస్తోంది. అయితే అక్రమ, అనధికార లేఅవుట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం స్థానిక సంస్థలకు భారంగా మారడంతోపాటు ప్లాట్ల యజమానులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి అక్రమ, అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయబోమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా అనధికార, అక్రమ లేఅవుట్లను ప్రణాళికాబద్ధమైన సుస్థిర అభివృద్ధి పరిధిలోకి తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్లాట్ల యజమానుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు– 2020ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 2020 ఆగస్టు 31 నుంచి ఈ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను నిషేధించడంతోపాటు భవన నిర్మాణాలకు సైతం అను మతులు జారీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా స్థలాలను మిగతా క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్/విక్రయాలు/భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాలనే మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వర్తింపు... హైదరాబాద్ మహానగరాభివృద్ఢి సంస్థ (హెచ్ఎండీఏ), పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ), నగర/పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోని స్థలాలకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) వర్తించనుంది. ఎల్ఆర్ఎస్ అమలు ప్రక్రియను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు గ్రామ పంచాయతీల్లో కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక అభివృద్ధికి ఉపయోగించనున్నారు. క్రమబద్ధీకరణ వర్తింపు వీటికే... భూ యజమానులు/ప్రైవేటు డెవలపర్లు/సంస్థలు/కంపెనీలు/ప్రాపర్టీ డెవలపర్లు/సొసైటీలు అనుమతి తీసుకోకుండా చేసిన ప్లాట్ల విభజనలన్నింటికీ, ఏర్పాటు చేసిన అన్ని లేఅవుట్లు/వెంచర్లకు ఈ రెండు సందర్భాల్లో ఆధారంగా ఈ రూల్స్ వర్తిస్తాయి. 1) రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ప్లాట్లు విక్రయిస్తే 2) అనధికారికంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లలో కనీసం 10 శాతం ప్లాట్లు 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించిన వాటికి. – పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం, తెలంగాణ భూ సంస్కరణల చట్టం (వ్యవసాయ భూములపై పరిమితి) కింద సంబంధిత ప్రభుత్వ విభాగం నుంచి క్లియరెన్స్ కలిగి ఉండటంతోపాటు నిషేధిత భూముల రిజిస్టర్లో నమోదు కాని స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. అసైన్డ్ భూముల విషయంలో జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. – 10 హెక్టార్లకంటే ఎక్కువ విస్తీర్ణంలోని జలాశయాలు, కుంటలు, చెరువుల సరిహద్దు నుంచి 30 మీటర్ల తర్వాత ఉన్న స్థలాలకే క్రమబద్ధీకరించుకొనే వెసులుబాటు ఉంటుంది. – 10 హెక్టార్ల విస్తీర్ణం కంటే తక్కువ ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, శిఖానికి 9 మీటర్ల తర్వాత ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తారు. – కాలువలు, వాగుల సరిహద్దుల నుంచి 9 మీటర్ల దూరం, నాలా సరిహద్దుకు 2 మీటర్ల దూరం ఉన్న ప్లాట్లకే క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది. – విమానాశ్రయాలు, రక్షణ ప్రాంతాల పరిసరాల్లోని స్థలాల క్రమబద్ధీకరణపై ఆంక్షలు వర్తింపజేస్తారు. ఆ భూముల సరిహద్దు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలంటే ఆయా సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరి. – జంట జలాశయాల పరిధిలో 111 జీవో ఉత్తర్వులపై ఎలాంటి సడలింపుల్లేవు. ఆ జీవోకు అనుగుణంగా ఉన్న ప్లాట్లనే క్రమబద్ధీకరిస్తారు. క్రమబద్ధీకరణ పరిధిలోకి రానివి... – మాస్టర్‌ప్లాన్‌లో పరిశ్రమలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్, రిక్రియేషనల్ జోన్, నీటివనరులు, ఓపెన్ స్పేస్‌గా నిర్దేశించిన ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదు. – వివాదాస్పద, దేవాదాయ, వక్ఫ్, శిఖం, ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో ఉన్న స్థలాలు కూడా క్రమబద్ధీకరణకు అనర్హమైనవి. కటాఫ్ తేదీ ఎప్పుడు? ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తించనుంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్/టైటిల్ డీడ్, సైట్ ప్లాన్, రెవెన్యూ స్కెచ్, మార్కెట్ విలువ, లేఅవుట్ నకలు, లొకేషన్ స్కెచ్, ఇండెమ్నిటీ బాండ్, నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) జతపరచాలి. దరఖాస్తులకు గడువు: అక్టోబర్ 15 వరకు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. మీసేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ), కామన్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ (త్వరలోనే అందుబాటులోకి) – లేఅవుట్లో అమ్ముడుపోని ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్లను లేఅవుట్ యజమాని సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్లాట్ ఓనర్ అయితే రూ. 1,000, లేఅవుట్ యజమాని రూ. 10,000 ప్రాసెసింగ్ ఫీజు కింద దరఖాస్తుతోపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పటివరకు చెల్లించాలి? ఎల్ఆర్ఎస్కు ఆమోదం పొందిన స్థలాలకు నిర్దేశిత మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి 31 నాటికి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తేదీని పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్, నాలా ఫీజును వసూలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఆగస్ట్ 26 వరకు ఉన్న సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోనున్నారు. కనీస క్రమబద్ధీకరణ చార్జీలు ప్లాట్ల వైశాల్యం (చ.మీ.లలో) రుసుం (చ.మీ./రూ.లలో) 100లోపు 200 101–300 400 301–500 600 500పైనా 750 మురికివాడల్లో రూ. 5 (వైశాల్యంతో సంబంధం లేకుండా) కనీస క్రమబద్ధీకరణ రుసుం అంటే బెటర్మెంట్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు, లేఅవుట్ స్క్రూటిని చార్జీలు, జరిమానా, ఇతర చార్జీలు కలుపుకొని ఉంటాయి. భూముల మార్కెట్ విలువ ఆధారంగా నిర్దేశించిన క్రమబద్ధీకరణ రుసుం స్థల వైశాల్యం (చ.గజాల్లో) రుసుం (శాతం) 3,000లోపు 25 3,001–5,000 50 5,001–10,000 70 10,001పైనా 100 – అనధికార లేఅవుట్లో 10 శాతం ఓపెన్ స్పేస్ అందుబాటులో లేకపోతే ప్లాటు విలువలో అదనంగా 14% ఓపెన్ స్పేస్ చార్జీలను వసూలు చేస్తారు. ఆగస్టు 26 నాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ స్థలం వైశాల్యాన్ని బట్టి శాతాలుగా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు. నోట్: అసలైన క్రమబద్ధీకరణ చార్జీలు అంటే కనీస క్రమబద్ధీకరణ రుసుములతోపాటు ఆగస్టు 26 నాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆ స్థలం వైశాల్యాన్ని బట్టి శాతాలుగా పరిగణనలోకి తీసుకొని రుసుములు విధిస్తారు. పంచాయతీల్లో తొలిసారిగా.. స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అధికారం తొలుత పురపాలకశాఖకే ఉండేది. రెండేళ్ల క్రితం సర్కారు చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని వర్తింపజేసేలా పంచాయతీరాజ్ శాఖకు అధికారం లభించింది. సెక్షన్ 113 ప్రకారం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించే వెసులుబాటు లభించడంతో పంచాయతీల్లో తొలిసారిగా స్థలాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. రూ. 10 వేల కోట్ల ఆదాయం! రాష్ట్ర ఖజానాకు ఎల్ఆర్ఎస్ కాసుల పంట పండించనుంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ పథకం భారీగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడం, గ్రామ పంచాయతీల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో సర్కారుకు రూ. 10 వేల కోట్ల రాబడి రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరణ రుసుం పెంపు, ప్రస్తుత మార్కెట్ విలువనే పరిగణనలోకి తీసుకుంటుండటం, ప్రతి అనధికార ప్లాటు దాదాపుగా ఎల్ఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఎల్ఆర్ఎస్ వర్తింపజేసిన ప్రభుత్వం.. ఈసారి గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయడంతో ఈ పథకం ప్రభుత్వానికి కాసులు కురిపించనుంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో పట్టణీకరణ శరవేగంగా సాగింది. ఈ క్రమంలో పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. దీంతో వాటిల్లో స్థలాలు కొన్న వారు తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
కొత్త పురపాలికల్లో నవంబర్ వరకు ఎల్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం గడువును పెంచామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేలా త్వరలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదారేళ్లలో సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశముందని, దీనికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని వివరించారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తెచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశానాల వంటి ప్రాథమిక అంశాలపై శ్రద్ధ వహించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనల మేరకు తమ జిల్లాల పరిధిలోని పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మెన్లు పాల్గొన్నారు. -
విదేశాల్లోని వారికి నగదు పంపాలా?
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి రెండు నెలలకుపైనే అవుతోంది. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన వారు, ఉపాధి ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులు తిరిగి రావాలనుకుంటున్నా.. రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడి వారికి ఆర్థిక సాయం అవసరం కావచ్చు. ‘స్వేచ్ఛాయుత చెల్లింపుల పథకం’ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు (మైనర్లు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల కోసం పంపుకోవచ్చు. విదేశీ విద్య, నిర్వహణ ఖర్చులు, బహుమతులు, విరాళాలు, పర్యటన ఖర్చులు తదితర అవసరాల కోసం నగదు పంపుకునేందుకు (ఫారిన్ అవుట్వార్డ్ రెమిటెన్స్) నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇంటి నుంచే ఈ లావాదేవీలను సులువుగా చేసుకునే అవకావం కూడా ఉంది. చాలా బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో విదేశాల్లోని వారికి నగదు పంపుకునేందుకు (ఫారిన్ రెమిటెన్స్) అనుమతిస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకుని ఉండాలి. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఆన్లైన్ రెమిటెన్స్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత దేశీయ లావాదేవీల మాదిరే విదేశాల్లోని తమ వారి ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎవరికి అయితే నగదు పంపించాలని అనుకుంటున్నారో వారి పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్‌తో బెనిఫీషియరీని నమోదు చేసుకోవాలి. ఇందుకు కొంత సమయం తీసుకుంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే బెనిఫీషియరీ నమోదుకు 30 నిమిషాలు చాలు. మధ్యాహ్నం 2.30 గంటల్లోపు నమోదైన అన్ని రెమిటెన్స్ అభ్యర్థనలను అదే రోజు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పూర్తి చేసేస్తుంది. అదే ఎస్బీఐ అయితే నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత యాక్టివేషన్‌కు ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఎస్బీఐ కస్టమర్లు ఒకే రోజు గరిష్టంగా మూడు బెనిఫీషియరీలను నమోదు చేసుకోవచ్చు. పరిమితులు.. ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) పరిమితి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లుగా ఉంది. ఆన్లైన్ కొనుగోళ్లకూ ఇదే పరిమితి అమలవుతుంది. అయితే, బ్యాంకులు ఫారిన్ రెమిటెన్స్ లావాదేవీలకు సంబంధించి పలు రకాల పరిమితులను నిర్దేశిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనిష్టంగా ఒక లావాదేవీలో 100 డాలర్లు, గరిష్టంగా 12,500 డాలర్ల వరకే పంపుకునేందుకు అనుమతిస్తోంది. రెమిట్నౌ అనే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఒక కస్టమర్ ఈ మేరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు మించిన మొత్తాల్లో విదేశాల్లోని తమ వారికి పంపించాలని అనుకుంటే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంకు అయితే ఒక కస్టమర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గరిష్టంగా 25,000 డాలర్ల వరకు విదేశాలకు పంపించుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ కస్టమర్‌కు ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ పరిమితి ఒక లావాదేవీలో రూ.10 లక్షలుగా అమల్లో ఉంది. అలాగే, ఎస్బీఐ కస్టమర్లు నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత మొదటి ఐదు రోజుల్లో మాత్రం కేవలం 50,000 వరకే పంపుకోగలరు. ఇక ఎల్ఆర్ఎస్ కింద కొన్ని దేశాలకు నగదు పంపుకునే అవకాశం లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిషేధించిన దేశాలు లేదా యూఎస్ ట్రెజరీ ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ కస్టమర్లకు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని వారికి నగదు పంపుకునే అవకాశం ఉండదు. ఇక కొన్ని బ్యాంకులు కొన్ని రకాల ఫారిన్ కరెన్నీ రెమిటెన్స్లకే పరిమితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు 20 కరెన్సీల్లో ఫారిన్ రెమిటెన్స్‌లను ఆఫర్ చేస్తోంది. అదే ఎస్బీఐ కస్టమర్లు అయితే యూఎస్ డాలర్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్, సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ మారకంలో రెమిటెన్స్‌లు చేసుకోవచ్చు. కమీషన్, చార్జీలు.. బ్యాంకులు ఫారిన్ కరెన్సీ రెమిటెన్స్‌లకు సంబంధించి మారకం రేట్లను రోజువారీగా ప్రకటిస్తుంటాయి. ఈ వివరాలను బ్యాంకు వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఫారీన్ అవుట్వార్డ్ రెమిటెన్స్‌ల లావాదేవీలకు బ్యాంకులు చార్జీలు, కమీషన్లను వసూలు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 500 డాలర్ల వరకు లావాదేవీపై రూ.500 చార్జీని వసూలు చేస్తోంది. అదే 500 డాలర్లకు మించిన లావాదేవీలపై ఈ చార్జీ రూ.1,000గా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు అయితే వివిధ కరెన్సీల్లో వివిధ రకాల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్ డాలర్ రూపంలో అయితే చార్జీ 11.25 డాలర్లు, బ్రిటన్ పౌండ్ రూపంలో చార్జీ 10 పౌండ్లు ఇలా చార్జీలు మారిపోతుంటాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారీన్ రెమిటెన్స్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వారికి.. విదేశీ రెమిటెన్స్ లావాదేవీల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో నమోదు చేసుకోని వారి పరిస్థితి ఏంటి..? అటువంటప్పుడు ‘డీసీబీ బ్యాంకు రెమిట్ ఫెసిలిటీ’ని పరిశీలించొచ్చు. డీసీబీ బ్యాంకు ఖాతా దారులతోపాటు ఇతరులు అందరికీ ఇది అందుబాటులో ఉన్న సదుపాయం. పైగా విదేశీ రెమిటెన్స్ లావాదేవీలకు డీసీబీ బ్యాంకు ఎటువంటి చార్జీలను లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. పాన్ కార్డు ఉన్న వారు డీసీబీ బ్యాంకులో డీసీబీ రెమిట్ సదుపాయం కోసం బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కాకపోతే వీరికి డీసీబీ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులో ఖాతా ఉండాలి. డీసీబీ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 డాలర్ల వరకు ఒక కస్టమర్ విదేశాలకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఇంతకు మించి పంపించుకోవాలంటే డీసీబీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ కూడా ఇటువంటి సదుపాయమే. ఇతర బ్యాంకు కస్టమర్లు విదేశాలకు నగదు పంపుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ ఉపయోగపడుతుంది. కాకపోతే ఐసీఐసీఐ బ్యాంకు శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. కేవైసీ వివరాలు కూడా సమర్పించాలి. మనీ2వరల్డ్ ద్వారా రెమిటెన్స్‌లపై రూ.750 కమీషన్‌గా చెల్లించాలి. ఏజెంట్లు... నెట్ బ్యాంకింగ్ సదుపాయాల్లేని వారు నాన్ బ్యాంకింగ్ ఏజెంట్ల సేవలను ఫారిన్ రెమిటెన్స్ కోసం వినియోగించుకోవచ్చు. థామస్‌కుక్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ తదితర సంస్థలను ఫారీన్ రెమిటెన్స్ సేవలకు ఆర్బీఐ అనుమతించింది. అయితే, రెమిటెన్స్ లావాదేవీల పరంగా పరిమితులు సంస్థలను బట్టి మారిపోవచ్చు. చార్జీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. థామస్‌కుక్ ద్వారా ఆన్లైన్లో 5,000 వరకు డాలర్లను పంపుకోవాలంటే అందుకు గాను 8 డాలర్ల ఫీజును చెల్లించుకోవాలి. అంతకుమించిన లావాదేవీలపై ఫీజు రూ.11 డాలర్లుగా ఉంది. పన్నులు ఉన్నాయా..? విదేశీ రెమిటెన్స్‌పై కమీషన్లు/చార్జీలు, కరెన్సీ మారకం చార్జీలను పక్కన పెడితే.. పన్నుల భారం కూడా ఉంటుంది. పన్ను వర్తించే విలువపై 18% జీఎస్టీ చెల్లించాలి. పన్ను వర్తించే విలువ కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.60,000 వరకు ఉంటుంది. కనుక ఈ మొత్తంపై జీఎస్టీ రూ.45–10,800 మధ్య చెల్లించాల్సి రావచ్చు. 2020 అక్టోబర్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7లక్షలకు మించి విదేశాలకు పంపితే 5% మూలం వద్ద పన్నును వసూలు (టీసీఎస్) చేస్తారు. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెమిటెన్స్ చేస్తుంటే మాత్రం టీసీఎస్ 0.5 శాతమే. -
పంచాయతీల్లోనూ ఎల్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్‌శాఖ పథకం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చని భావిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ అనుమతి ఇచ్చిన లేఅవుట్లలోని ధరలతో పోలిస్తే వాటిలో తక్కువ రేట్లకే ప్లాట్లు లభించడం, అవి అక్రమ లేఅవుట్లని తెలియకపోవడంతో చాలా మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆ స్థలాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం తీసుకొనే తాజా నిర్ణయంతో వారికి ఊరట లభించనుంది. ప్రయోగాత్మకంగా రెండేసి లేఅవుట్లు... పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జిల్లాకు రెండేసి అనధికార లేఅవుట్లను పరిశీలించి వాటి క్రమబద్ధీకరణలో సాధకబాధకాలు, ప్రభుత్వానికి లభించే ఆదాయం ఇతరత్రా అంశాలను మదింపు చేయనుంది. ఈ మేరకు శనివారం పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రఘునందన్‌రావు.. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పైలట్ ప్రాతిపదికన... ఎంపిక చేసిన లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస సౌకర్యాలు కల్పించారా? పది శాతం స్థానిక పంచాయతీలకు గిఫ్ట్ డీడ్ చేశారా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎంత మేరకు ఎల్ఆర్ఎస్ కింద పెనాల్టీని నిర్ధారించవచ్చనే దానిపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగే పల్లె ప్రగతి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. ఆ మేరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్పై మార్గదర్శకాలను జారీ చేసే వీలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 68 మున్సి పాలిటీల్లో 173 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. అలాగే ఇప్పటికే మనుగడలో ఉన్న 42 పురపాలికల్లో 131 గ్రామ పంచాయతీలను విలీ నం చేశారు. వాటిలో హెచ్ఎండీఏ మినహా 43 మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ పథకం కింద స్థలాల/లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీల్లోనూ ఈ పథకం అమలుకు కHదలిక మొదలు కావడంతో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో లేని అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వారికి ఉపశమనం కలగనుంది. అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో 300 చద రపు మీటర్ల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల వరకే భవనాలకు అనుమతి జారీ చేస్తుండగా ఈ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకునే వీలు కలగనుంది. పీఆర్ చట్టంతో వెసులుబాటు... వాస్తవానికి స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అధికారం పురపాలకశాఖకే ఉండేది. అయితే గతేడాది సర్కారు చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని వర్తింపజేసేలా పంచాయతీరాజ్ శాఖకు అధికారం లభించింది. సెక్షన్ 113 ప్రకారం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించే వెసులుబాటు ఉండటంతో దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించగా తాజాగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఈ పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. -
‘మహా’గోడు వినేదెవరు?
సాక్షి, సిటీబ్యూరో: అరుణ్ సాధారణ ఉద్యోగి. ఆదిభట్లలో తాను కొన్న ప్లాట్‌ను ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే.. అది మాస్టర్ ప్లాన్ రోడ్డు కింద ఉందంటూ దరఖాస్తు తిరస్కరించారు. అలాగే నెక్నాంపూర్లో వాటర్ బాడీస్ కింద మీ ప్లాట్ ఉందంటూ రాజేశ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తును, హయత్‌నగర్‌లో ఇండస్ట్రియల్ జోన్ కింద ప్లాట్ ఉందంటూ కిషన్ పెట్టిన దరఖాస్తును కూడా హెచ్ఎండీఏ అధికారులు తిరస్కరించారు. వీరివే కాదు.. అనేక కారణాలలో హెచ్ఎండీఏకు వచ్చిన దాదాపు లక్షా 75వేల దరఖాస్తుల్లో 77 వేల దరఖాస్తులను తిరస్కరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రారంభ చెల్లింపులు (ఇనీషియల్ పేమెంట్) కింద ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేసిన రూ.10 వేలను తిరిగి ఇచ్చే విషయంలో అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో అవసరాలకు ఉపయోగపడతాయని ఎంతో కష్టపడి ప్లాట్ కొనుగోలు చేశామని, ఇప్పుడు ఆ ప్లాట్ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డులో పోతుందంటూ తిరస్కరించారని వాపోతున్నారు. పైగా అప్పుగా తెచ్చి కట్టిన ప్రారంభ ఫీజును తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ క్లియరైన దరఖాస్తుదారుడు కట్టిన మొత్తం ఫీజులో ఈ ప్రారంభ ఫీజు రూ.10 వేలు మినహాయించారని అంటున్నారు. ఇప్పటికైనా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందిచకపోవడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశలు ఆవిరి... వివిధ ప్రాంతాల నుంచి నగరానికి ఉపాధి కోసం వచ్చి వివిధ అవసరాల కోసం చాలామంది శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. అవన్నీ గ్రామ పంచాయతీ లే అవుట్లలోనివే. వీటిని లే అవుట్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) కింద క్రమబద్ధీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజు «రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ ప్లాట్లు మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఉన్నాయని, శిఖం, నాలా, చెరువులో వస్తున్నాయని, ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయనే కారణాలతో దాదాపు 77 వేలకు పైగా దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ‘ఎన్నో ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మాస్టర్ ప్లాన్‌లోని పలు నిషేధిత జోన్లలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్‌ను తప్పుల తడకగా తయారు చేయడం వల్ల ప్లాట్ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. అవి అమ్మినా తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు. పోనీ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన సమయంలో చెల్లించిన రూ.10 వేలు కూడా హెచ్ఎండీఏ ఇవ్వనంటోంది. తిరిగిచ్చే అంశం జీఓలో లేదని తిరిగిపంపుతున్నార’ని హెచ్ఎండీఏకు వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడు లక్ష్మణ్ వాపోయాడు. తాము చెల్లించిన నగదు మొత్తం తిరిగివ్వకుండా ఆందోళనకు దిగుతామని దరఖాస్తులు తిరస్కరణదారులు హెచ్చరిస్తున్నారు. జీఓ–151లో ఏముందంటే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించవచ్చు. అదీకాకుంటే దీంతో పాటు మరో పది శాతం డబ్బులు కూడా చెల్లించవచ్చని జీఓ–151లో ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ 10 వేలు తిరిగి చెల్లించాలని ఎక్కడా ప్రస్తావించడలేదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. -
మహా నిరీక్షణ
ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన అరుణ్ తన 200 గజాల ప్లాట్‌క్రమబద్ధీకరణ కోసం హెచ్‌ఎండీఏలోఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.అన్ని పత్రాలను సరిచూసుకున్న హెచ్ఎండీఏ సిబ్బంది ఎల్ఆర్ఎస్, నాలా ఫీజుచెల్లించాలని అతడి ఫోన్‌కు అక్టోబర్‌లో సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) పంపడంతో వెంటనే పూర్తి మొత్తం చెల్లించాడు. అయినా ఇప్పటివరకు అరుణ్ చేతికి ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీ అందలేదు. సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో ‘ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్’ హాట్‌టాపిక్‌గా మారింది. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటే అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయంటూ ఎల్ఆర్ఎస్, నాలా ఫీజులు కట్టించుకున్న ‘మహా’ ప్లానింగ్ అధికారులు.. ఇప్పుడూ ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్ కాపీలు జారీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి డబ్బులు చెల్లించిన వారంరోజుల్లోగా ‘ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్’ జారీ చేయాలి. కానీ అక్టోబర్ నెలాఖరుతో గడువు ముగియడంతో ఆన్లైన్ ఫైల్స్ ఓపెన్ కాకపోవడంతో జారీ చేసే అవకాశం లేకపోయింది. దీంతో దాదాపు 8 వేల మంది దరఖాస్తుదారుల ఫైనల్ ప్రొసీడింగ్ కాపీలు పెండింగ్‌లో ఉండిపోయాయి. గత నాలుగు నెలల నుంచి తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న దరఖాస్తుదారులు ఇంకెన్ని రోజులు నిరీక్షించాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరుతో ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ ఫైళ్లు తెరుచుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీ జారీ చేయవచ్చని వచ్చిన ప్రతి దరఖాస్తుదారుడికీ వివరించడం సిబ్బందికి కత్తిమీద సామే అవుతోంది. అయితే, ఇప్పటికే ఈ ఫైళ్లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగానికి లేఖ రాశామని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పొడిగిస్తే ఎంతో మేలు హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్లో 20 శాతం అధిక రుసుంతో మరోసారి క్రమబద్ధీకరించుకునేందుకు అనుమతించారు. ఇలా పాతవి, కొత్తవి కలిపి మొత్తం దరఖాస్తులు 1,75,612కు చేరుకున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్ స్క్రూటినీ, టెక్నికల్ స్క్రూటినీ పూర్తయిన తర్వాత ‘సక్రమం’ అని తేలాక క్లియరెన్స్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్లు పంపారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు లక్షా 75 వేలకు పైగా దరఖాస్తులు వస్తే లక్షా 2,500 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. దాదాపు 9 వేల దరఖాస్తులు ఎన్ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌బాడీ, మ్యానుఫ్యాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఆఫ్ లే అవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అనుమతిస్తే రూ.150 కోట్ల ఆదాయం ఎల్ఆర్ఎస్ క్లియరైనట్టు సమాచారం అందుకున్న లక్షా 2,500 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగిస్తే హెచ్ఎండీకు దాదాపు రూ.120 నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు రూపంలో రూ.1000 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించిన 8 వేల మంది దరఖాస్తుదారులకు ఫైనల్ ప్రొసీడింగ్స్ కాపీ అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అనుమతి రావాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సొంతిల్లు కట్టుకునేందుకు చేతికి అందివచ్చిన అవకాశం కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్తే దరఖాస్తుదారులకు కష్టాలు తప్పనున్నాయి. -
అ‘పరిష్కృతే’ !
పాల్వంచ: ప్రభుత్వం అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రవేశపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా మున్సిపాలిటీల ఆదాయం గణనీయంగా పెంచుకునేందుకు ఈ స్కీం ఉపయోగ పడుతుంది. జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఇది వర్తించకపోగా, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. వెల్లువలా దరఖాస్తులు.. ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 2015లో ప్రవేశపెట్టిన ఈ స్కీం గడువు తేదీని ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. చివరిసారిగా గత అక్టోబర్ 30 వరకు కొనసాగించారు. పాల్వంచ మున్సిపాలిటీలో 2700 దరఖాస్తులు రాగా, 1700 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. మరో 1000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే నంబర్ 817లో గత రెండున్నర సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో 500 దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. మరికొన్ని సకాలంలో డబ్బు చెల్లించక పరిష్కారం కాలేదని తెలుస్తోంది. కొత్తగూడెం సింగరేణి పరిధిలో ఉన్నప్పటికీ కొంత వరకు ప్రైవేట్ భూములు ఉండడంతో 120 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఇందులో 89 పరిష్కారం అయ్యాయి. 13 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించగా, మిగతా 18 పెండింగ్‌లో ఉన్నాయి. ఇల్లెందు. మణుగూరులో నిల్.. మణుగూరు మున్సిపాలిటీ 1 /70 యాక్ట్‌లో ఉండటంతో అక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. ఇల్లెందు మున్సిపాలిటీ సింగరేణి కాలరీస్ సంస్థకు చెందిన భూముల పరిధిలో ఉండడంతో అక్కడ కూడా దరఖాస్తుల స్వీకరణకు అనర్హం. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల్లో దరఖాస్తులు లేకపోవడంతో ఆదాయం లభించలేదు. పాల్వంచ మున్సిపాలిటీలో ఎల్ఆర్ స్కీం ద్వారా సుమారు రూ.12 కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉండగా, కొత్తగూడెంలో రూ.70 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించాలని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా «సకాలంలో చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. త్వరలోనే పరిష్కరిస్తాం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో కొంత ఆలస్యం అవుతున్నాయి. పాల్వంచకు సుమారు రూ.12కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉంది. ఇల్లెందు సింగరేణి, మణుగూరు 1 /70 యాక్ట్‌ల వల్ల అక్కడ దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదు.--శ్రీనివాస్, టీపీఓ -
ఫీజు‘ముడి’
సాక్షి, సిటీబ్యూరో: అరుణ్.. ఓ మధ్య తరగతి సాధారణ ప్రైవేట్ ఉద్యోగి. వచ్చిన జీతంలో కొంత మిగిల్చుకుని శంకర్‌పల్లిలో ఓ ప్లాట్ కొన్నాడు. మణికొండకు చెందిన ప్రకాశ్ కూడా అలాంటి వారే. సమీపంలో ఓ ప్లాట్ తక్కువకు వస్తుందని లోన్ పెట్టి మరీ తీసుకున్నాడు. హయత్‌నగర్‌లో ఉంటున్న ధీరజ్ సొంతూరిలో పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇక్కడ స్థలం కొన్నాడు. ఇటీవల హెచ్ఎండీఏ ‘ల్యాండ్ ఎగ్యులేషన్ పథకం’(ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తులు కోరడంతో అందరిలాగే వీరూ తలో రూ.10 వేలు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మాస్టర్ ప్లాన్ రోడ్డు కింద ప్లాట్ ఉందంటూ ఒకరిది.. వాటర్ బాడీస్ కింద ప్లాట్ ఉందని, ఇండస్ట్రీయల్ జోన్లో ఉందంటూ మిగతావారి రెగ్యులేషన్‌ను అధికారులు తిరస్కరించారు. హెచ్ఎండీకు అందిన 1.75 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 1.02 లక్షల దరఖాస్తులకు ఫైనల్ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. మరో 10 వేల దరఖాస్తులు రెవెన్యూ, ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీలు రాక పెండింగ్‌లో ఉంచారు. మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు, శిఖం, చెరువులు, సరైన పత్రాలు ఆప్‌లోడ్ చేయలేదనే కారణాలతో సుమారు 63 వేల దరఖాస్తులను తిరస్కరించారు. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ప్రక్రియ గడువు ముగియడంతో తిరస్కరించిన దరఖాస్తుల ఇనీషియల్ పేమెంట్ ఫీజు రూ.10 వేలు వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అలా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో అవసరాలకు ఉపయోగపడతాయని ఎంతో కష్టపడి ప్లాట్ కొనుగోలు చేశామని, ఇప్పుడు ఆ ప్లాట్ మాస్టర్‌ప్లాన్‌లో పోతుందంటూ తిరస్కరించారని, అయితే, అప్పుగా తీసుకొచ్చి కట్టిన ప్రారంభ ఫీజును కూడా వెనక్కి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆలోచించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మా గోడు వినిపించుకోరా..! తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. దినసరి కూలీల దగ్గరి నుంచి వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు వీరిలో ఉన్నారు. వీరంతా అహర్నిశలు శ్రమించి కూడబెట్టిన డబ్బుతో శివారుల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని, మరికొందరు భవిష్యత్‌లో ఇల్లు కట్టుకోవాలని భావించారు. శివార్లలోని గ్రామ పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లు తీసుకున్నారు. ఎంతో వ్యయాప్రయాసలతో కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్దీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. అయితే, ఇప్పుడా ప్లాట్లు మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఉన్నాయని, శిఖం, నాలా, చెరువులో వస్తున్నాయని, ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయనే కారణాలతో దాదాపు 63 వేలకు పైగా దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ‘ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్లు అంతా బాగానే ఉన్నాయి. అయితే మాస్టర్ ప్లాన్‌లో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నవంటూ ఇప్పుడు చెబుతున్నారు. మేం కొన్నప్పుడు అవేమీ లేవు కదా. కొత్తగా తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడక వల్ల ప్లాట్ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. అవి అమ్మినా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోనీ మేం దరఖాస్తు చేసిన సమయంలో చెల్లించిన రూ.10 వేలు కూడా హెచ్ఎండీఏ ఇవ్వనంటోంది’ అని హెచ్ఎండీఏకు వచ్చిన దరఖాస్తుదారుడు వెంకటేశ్ వాపోయాడు. అందరికీ సమన్యాయం ఉండాలి లక్షా 75 వేల మందికిపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించారు. వీరిలో లక్షా రెండు వేల మందికి ఎల్ఆర్ఎస్ క్లియరై ప్రారంభ ఫీజు రూ.10వేలను మినహాయించి మిగతా ఫీజు చెల్లించారు. అయితే, తిరస్కరణకు గురైన 63 వేల మందికి మాత్రం ఆ ప్రారంభ ఫీజును తిరిగి ఇచ్చేదే లేదని, జీఓలో ఆ ప్రస్తావన ఎక్కడా లేదని హెచ్ఎండీఏ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ క్లియర్ అయినవారికి ప్రారంభ ఫీజును మినహాయించినట్టుగానే తమకూ ఆ పీజులు తిరిగిచ్చేయాలని తిరస్కరణకు గురైన వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని చెబుతున్నారు. అసలు జీఓ నం. 151లో ఏముంది.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించవచ్చు. దీంతో పాటు మరో పది శాతం డబ్బులు కూడా చెల్లించవచ్చని జీఓ నం.151లో ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ మొత్తం చెల్లిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదని హెచ్ఎండీఏ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మరి ఇప్పటికే తమ ప్లాట్ల సంగతేంటో తేలయ ఆందోళన చెందుతున్న 63 వేలమంది బాధితులకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పిస్తుందా.. లేదంటే కనీసం కంటితుడుపుగానైనా కట్టిన రూ.10 వేలను తరిగి ఇస్తుందా అన్నది ప్రభుత్వం తేల్చాలి. -
ఫీజు చెల్లించండి!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు సమయంలో రూ.10వేల ఇన్షియల్ పేమెంట్ ఫీజు చెల్లించని 9,833 మంది దరఖాస్తుదారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఆ ఫీజు చెల్లించాలంటూ హెచ్ఎండీఏ దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్‌లతో పాటు ఈ–మెయిల్స్ పంపిస్తోంది. ఈ నెల ఒకటి నుంచే ఈ మేరకు సమాచారం పంపిస్తున్నా... ఆశించిన స్థాయిలో దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయానికి రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ప్రక్రియ ముగుస్తుందనగా అందరూ ఒకేసారి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఒకానొక దశలో దరఖాస్తులు కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వస్తే ఇటు అధికారులు, అటు దరఖాస్తుదారులకు సౌలభ్యంగా ఉంటుందంటున్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న సమయంలో సమర్పించిన పత్రాలన్నీ వెంట తీసుకురావాలని, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సేల్‌డీడ్‌ను సమర్పించాలని సూచిస్తున్నారు. ఈ పత్రాలు అవసరం... ♦ దరఖాస్తుదారుడి ఐడెంటింటీ ప్రూఫ్ ఒరిజినల్, జిరాక్స్ కాపీ (ఓటర్ ఐడీ, పాన్‌కార్డు, ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్) ♦ ఒరిజినల్ సేల్‌డీడ్‌తో పాటు జిరాక్స్ ప్రతులు. ♦ యజమాని, సాక్షి సంతకాలతో ఇండిమినిటీ బాండ్ తెచ్చుకోవాలి. అవసరమైతే ఇండిమినిటీ బాండ్ ఫార్మాట్ హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచిడౌన్లోడ్ చేసుకోవచ్చు. ♦ యజమాని, ఆర్కిటెక్చర్ సంతకాలతో సైట్ లోకేషన్ ప్లాన్ ఉండేలా చూసుకోవాలి. ♦ లేఅవుట్ కాపీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, ఈసీ (ఇన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్) కూడా ఉండాలి. ♦ ఏజీపీఏలో యాజమాన్య డాక్యుమెంట్ విత్ పొజిషన్లో ఉంటే ఎల్ఆర్ఎస్ ప్రాసెస్‌కు అంగీకరిస్తారు. ♦ 2015 అక్టోబర్ 28 కటాఫ్ డేట్ తర్వాత రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ఉంటే లింక్ డాక్యుమెంట్లు అందజేయాలి. ♦ 2016 డిసెంబర్ 31 కటాఫ్ డేట్‌కు ముందున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తారు. ♦ పై డాక్యుమెంట్లతో హెచ్ఎండీఏ ఐటీసెల్‌కు వెళ్తే అన్నీ సరిచూసి, స్కాన్ చేసి రిజిస్టర్డ్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబర్లో నిక్షిప్తం చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇదీ ఎల్ఆర్ఎస్ పురోగతి... రూ.10వేల ఇన్షియల్ పేమెంట్ ఫీజు చెల్లించిన వెంటనే ఆ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొదలవుతుంది. టైటిల్ స్క్రూటిని, టెక్నికల్ స్క్రూటిని పూర్తి చేసి, సక్రమమని తేలితే అధికారులు క్లియ రెన్స్ ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసిడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన 1,76,036 దరఖాస్తుల్లో 1,00,322 క్లియర్ చేశారు. 54మంది దరఖాస్తుదారులకు పంపిన షార్ట్‌ఫాల్స్ పత్రాలను ఇంకా అప్లోడ్ చేయలేదు. 1,694 దరఖాస్తులు క్లియరెన్స్ ప్రక్రియలో ఉన్నాయి. 2,237 ఎన్వోసీలు లేని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 676 దరఖాస్తులను జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. రెండువేల ఆఫ్‌లైన్ ఫైళ్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 61,122 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మ్యాన్‌ఫాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఆఫ్ లేఅవుట్, నది, వాగు, నాలా బఫర్ జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన సమాచారం అందుకున్న 1,00,322 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించినా.. వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటోందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్ ప్రొసిడింగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలేసుకుంటున్నారు. అలాగే ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు కూడా అవకాశం ఇవ్వడంతో మరో రూ.100 కోట్ల మేర హెచ్ఎండీఏ ఖజానాలోకి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు క్లియర్ అయిన దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో రూ.700 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.250 కోట్లు చెల్లించారు. -
బంపర్ ఆఫర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి రూ.10వేల ఇన్షియల్ పేమెంట్ ఫీజు చెల్లించని దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి వ్యధను వివరిస్తూ ‘సాక్షి’ ఈ నెల 27న ‘మాటలేనా’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశమిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారని... ఈ మేరకు హెచ్ఎండీఏ లేఖ రాయగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పెండింగ్‌లో ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి కేటీఆర్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించడంతో పాటు ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇన్షియల్ పేమెంట్ చెల్లించని 9,833 మందికి లబ్ధి చేకూరనుంది. అక్టోబర్ 31 వరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించిన ప్రభుత్వం రెవెన్యూ, నీటి పారుదల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎన్వోసీల దరఖాస్తుదారులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లించాలని సందేశం... హెచ్‌ంఎడీఏ ఐటీ సెల్ అధికారులు ‘మీ ఎల్ఆర్ఎస్ రూ.10వేల ఇన్షియల్ పేమెంట్ చెల్లించాలం’ టూ 9,833 మంది దరఖాస్తుదారుల సెల్ నెంబర్లకు మెసేజ్‌లతో పాటు ఈమెయిల్స్ పంపించనున్నారు. దరఖాస్తుదారుడు ఫీజు కట్టిన వెంటనే ఆ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. టైటిల్ స్క్రూటిని, టెక్నికల్ స్క్రూటిని పూర్తి చేసి సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దర ఖాస్తుదారుడి సెల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్లు పం పుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసిడింగ్స్ జారీ చేస్తారు. ఇలా హెచ్ఎండీఏకు వచ్చిన 1,76,036 దరఖాస్తుల్లో 1,00,322 క్లియర్ చేశా రు. 54 మంది దరఖాస్తుదారులకు పంపిన షార్ట్‌ఫాల్స్ పత్రాలను ఇంకా అప్లోడ్ చేయలేదు. 1,694 దరఖాస్తులు క్లియరెన్స్ ప్రక్రియలో ఉన్నా యి. 2,237 ఎన్వోసీలు లేని దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. 676 దరఖాస్తులను జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. రెండు వేల ఆఫ్‌లైన్ ఫైళ్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 61,122 దరఖాస్తులను ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్, వాటర్ బాడీ, మ్యాన్‌ఫాక్చరింగ్, సెంట్రల్ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్ ప్లాన్ రోడ్డు,ఓపెన్‌స్పేస్ ఆఫ్ లేఅవుట్,నది, వాగు, నాలా బఫర్ జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియర్ అయిన సమాచారం అందు కున్న 1,00,322 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగించినా... వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటోందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్ ప్రొసిడింగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తాజాగా ఇన్షియల్ పేమెంట్ చెల్లించని దరఖాస్తుదారులకు కూడా అవకాశం ఇవ్వడంతో మరో రూ.100 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు క్లియర్ అయిన దర ఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో రూ. 700 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.250 కోట్లు చెల్లించారు. -
మాటలేనా?
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని...ప్రాథమిక ఫీజు(ఇన్షియల్ పేమెంట్) చెల్లించలేకపోయిన దరఖాస్తుదారులకు ఇప్పటికీ లైన్ క్లియర్ కాలేదు. మరో ఐదు రోజుల్లో ఎల్ఆర్ఎస్ గడువు ముగియనుండగా ఇప్పటికీ దాదాపు 9 వేల మంది దరఖాస్తుదారుల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఫీజు చెల్లించలేక పోయిన వీరికి..మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇన్షియల్ పేమెంట్‌కు అవకాశం కల్పిస్తామని మౌఖికంగా చెప్పారు. కానీ అధికారికంగా ఈ దరఖాస్తుదారులకు ఇప్పటి వరకు ఎలాంటి క్లియరెన్స్ లభించలేదు. దీంతో వారంతా ఆందోళనకుగురవుతున్నారు. రెండు నెలల క్రితం హెచ్ఎండీఏ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఇన్షియల్ పేమెంట్ చేయని వారి గురించి చర్చించారు. ఆ సమయంలో వారికి అవకాశం కల్పిద్దామని మంత్రి కేటీఆర్ మౌఖికంగా చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా... చివరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ముగింపు గడువు సమీపిస్తున్నా అధికారికంగా ఉత్తర్వులు జారీకాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 15 వేల మంది ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ అయి ఫీజు చెల్లించాలంటూ ఎస్ఎంఎస్లు అందుకున్నవారు ఫీజులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. అలాంటిది ఫీజులు చెల్లిస్తామని చెబుతున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. వీరికి అవకాశం కల్పిస్తు హెచ్ఎండీనకు రూ.100 కోట్లు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. మా చేతిలో లేదు...ప్రభుత్వ నిర్ణయమే ఆన్లైన్ విధానంపై అవగాహన లేక...దళారులను నమ్ముకొని...స్వయం తప్పిదాలతో ఎల్ఆర్ఎస్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించలేకపోయామని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కు అయ్యే చార్జీ, నాలా ఫీజులను కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఒక్క అవకాశం ఇవ్వాలంటూ హెచ్ఎండీఏ అధికారులను కోరుతున్నారు. అప్పు చేసి కొన్నేళ్ల క్రితం నగర శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఇస్తే బ్యాంక్ రుణాలు తీసుకొని సొంతింటి వారమవుతామంటున్నారు. అయితే రూ.పది వేల రుసుం గల ‘ఇన్షియెల్ పేమెంట్’ చెల్లించకపోవడంతో వీరి దరఖాస్తుదారులను ప్రాసెస్ చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఒప్పుకోవడం లేదు. 2015 నవంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 151లో రూ.పది వేల ఇన్షియెల్ పేమెంట్ తప్పనిసరిగా కట్టాలంటూ పేర్కొన్నారని, ప్రభుత్వ స్థాయిలో మళ్లీ నిర్ణయం తీసుకుంటే తప్ప తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. అయినా ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశతో దాదాపు రెండేళ్ల నుంచి తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. పూర్వ కమిషనర్ చిరంజీవులును కలిసి వీరు గోడు వినిపించడంతో చివరకు చొరవ తీసుకొని దాదాపు తొమ్మిదివేల మంది దరఖాస్తుదారులు ఇన్షియెల్ పేమెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ...వీరికి అనుమతిస్తే హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ ఫీజు రూపంలో రూ.వంద కోట్లు వచ్చే అవకాశముందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు లేఖ రాశారు. ఇక ప్రభుత్వస్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇన్షియెల్ పేమెంట్ దరఖాస్తుదారుల ఎల్ఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగ అధికారులు చెబుతున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ముగింపు గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకొని న్యాయం చేయాలని దరఖాస్తుదారులు అంటున్నారు. కాగా, హెచ్ఎండీఏకు లక్షా 75 వేలకుపైగా దరఖాస్తులు వస్తే లక్షా రెండువేల దరఖాస్తులకు ఫైనల్ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. మరో పదివేల దరఖాస్తులు రెవెన్యూ, ఇరిగేషన్ నుంచి ఎన్వోసీలు రాక పెండింగ్‌లో ఉన్నాయి. మాస్టర్ ప్లాన్‌లో రోడ్డు, శిఖం, చెరువులు, సరైన పత్రాలు ఆప్‌లోడ్ చేయలేదనే వివిధ కారణాలతో 63 వేల దరఖాస్తులు వరకు తిరస్కరించారు. వీటిలోనే ఎల్ఆర్ఎస్ ఇన్షియల్ పేమెంట్ చెల్లించని తొమ్మిదివేల దరఖాస్తులు కూడా ఉన్నాయి. -
ఎల్ఆర్ఎస్కు మరో అవకాశం!
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకుని గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన వారికి శుభవార్త. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. గత నెలాఖరుతో ముగిసిపోయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గడువును మరో నెల రోజులు పొడిగించడంతో పాటు ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015, నవంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టి నిర్దేశిత ఫీజులతో సహా దరఖాస్తుల సమర్పణకు 2016, మార్చి వరకు సమయమిచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద 2.6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 వేలకు పైగా దరఖాస్తుదారులు గడువులోగా ఫీజులు చెల్లించలేకపోయారు. రెండేళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తే ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో హెచ్ఎండీఏతో పాటు ఇతర పురపాలికలకు మరింత ఆదాయం రానుందని భావిస్తోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు గత నెలాఖరుతో ముగిసింది. అప్పటికి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 40 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా గడువు పొడిగించనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. -
క్రమబద్ధీకరణపై ‘పన్ను’పోటు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అనుమతిలేని భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నుల పిడుగు పడింది. భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్ఎస్) దరఖాస్తుదారుల సమాచారాన్ని వినియోగిం చుకుని పురపాలికలు అనుమతి లేని కట్టడాలపై జరిమానాల పేరుతో ఆస్తి పన్నులను ఏకంగా 25 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచేశాయి. అలాగే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖా స్తుల సమాచారాన్ని వినియోగించుకుని ఆయా లేఅవుట్లు, ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌లను వడ్డించాయి. అసాధారణ రీతిలో ఆస్తి పన్నులు పెరిగిపోవడంతో బీఆర్ఎస్ దరఖాస్తుదారులు, కొత్తగా ఖాళీ స్థలం పన్నులు వడ్డించడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. పెంచిన ఆస్తి పన్నులను తగ్గించాలని కోరుతూ నేరుగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటు న్నారు. మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. చేతికి అందిన సమాచారం.. అనధికార భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో 3 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 1.6 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ కింద మరో 1.65 లక్షల దరఖాస్తులొచ్చాయి. అనధికార భవనాల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రెండేళ్లు గడిచినా ఈ కేసులో పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మరోవైపు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూపంలో చేతికి అందిన సమాచారం ఆధారంగా ఆయా అనధికార భవనాలపై జరిమానాలు, లే అవుట్లపై ఖాళీ స్థలాల పన్నులు విధించేందుకు పురపాలక శాఖ వినియోగించుకుంది. అనుమతి లేని/పూర్తిగా అక్రమ కట్టడాలపై జరిమానాలతో కూడిన ఆస్తి పన్నులు విధిస్తూ జారీ చేసే గులాబీ రంగు డిమాండ్ నోటీసులను బీఆర్ఎస్ దరఖాస్తుదారులకు పురపాలికలు జారీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి లభించే వరకు ఈ భవన యజమానులు జరిమానాలు చెల్లించక తప్పదని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గులాబీ రంగులో పెనాల్టీ నోటీసులు పూర్తిగా అనుమతి లేకుండా లేక అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల ప్రకారం 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులు పెంచి జరిమానాల రూపంలో వసూలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జరిమానా వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణ ప్లాన్‌లో అనుమతించిన ప్రకారమే అంతస్తులు నిర్మించినా, సెట్‌బ్యాక్ విషయంలో 10 శాతం లోపు ఉల్లంఘనలు ఉంటే 25 శాతం ఆస్తి పన్నును పెంచి జరిమానాగా వసూలు చేయాలి. అనుమతించిన సంఖ్యలోనే అంతస్తులు కలిగి ఉండి సెట్‌బ్యాక్ విషయంలో 10 శాతానికి మించి ఉల్లంఘనలుంటే 50 శాతం ఆస్తి పన్నులను పెంచి వసూలు చేయాలి. అనుమతించిన అంతస్తుల మీద అనుమతి లేకుండా అదనపు అంతస్తులు కడితే 75 శాతం ఆస్తి పన్ను పెంచాలి. పూర్తిగా అనుమతి లేని కట్టడంపై 100 శాతం ఆస్తి పన్ను వడ్డించాలి. జరిమానాలతో కూడిన ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను గులాబీ రంగులో భవన యజమానులకు అందించాలి. -
ఎల్ఆర్ఎస్కు ఇక నో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలో ఇక ఎల్ఆర్ఎస్ గడువు ముగిసినట్లే. ఇకపై గడువు పొడిగింపునకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసే పనిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అధికారులు నిమగ్నమయ్యారు. హెచ్ఎండీఏకు వచ్చిన 1,75,612 దరఖాస్తుల్లో లక్ష వరకు క్లియర్ చేయగా, 75,612 దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరించిన వాటిలో రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ఓసీలు తేవాలన్న 9 వేల దరఖాస్తులను అధికారులు తిరిగి పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయా విభాగ అధికారులతో సమావేశమై ఆ ప్లాట్ల క్రమబద్ధీకరణపై స్పష్టత తెచ్చేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18,500 మంది హెచ్ఎండీఏకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీరందరూ కడితే దాదాపు రూ.150 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో సరైన డాక్యుమెంట్లు లేని ప్లాట్లు, సరిగా అప్లోడ్ చేయక షార్ట్‌ఫాల్స్ అయినవి, ఇంకా వివిధ కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులను తిరిగి అప్పీల్ చేసుకునేందుకు ఇదే చివరిసారి కానుంది. అలాగే లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజు కట్టాలంటూ సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు సాధ్యమైనంత తొందరగా ఫీజు చెల్లించుకుంటే మంచింది. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగింపునకు అవకాశం ఇచ్చేది లేదని సంకేతాలు వెలువడుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు తమ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసే పనిలో హెచ్ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మూడు నెలల్లో మూడు సార్లు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు పొడిగింపునకు అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా ప్రభుత్వం మళ్లీ అవకాశం ఇస్తుందనుకుంటే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు చిక్కులు తప్పవు. హెచ్ఎండీఏకు వచ్చిన 1,75,612 దరఖాస్తుల్లో లక్ష వరకు క్లియర్ చేయగా, 75,612 దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరించిన వాటిలో రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ఓసీలు తేవాలన్న 9 వేల దరఖాస్తులను అధికారులు తిరిగి పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయా విభాగ అధికారులతో సమావేశమై ఆ ప్లాట్ల క్రమబద్ధీకరణపై స్పష్టత తెచ్చేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18,500 మంది హెచ్ఎండీఏకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీరందరూ కడితే దాదాపు రూ.150 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. పక్కా పారదర్శకంగా.. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశమిచ్చింది. మళ్లీ 2016 డిసెంబర్లో 20 శాతం అధిక రుసుంతో మరోసారి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ భూములు, సీలింగ్, శిఖం, మాస్టర్ ప్లాన్ రోడ్స్ తదితర స్థలాల్లో ఉన్నాయనే కారణాలతో తిరస్కరించిన 75,612 దరఖాస్తుల్లోని మరికొన్నింటిని మళ్లీ టెక్నికల్ స్క్రూటిని చేశారు. తిరస్కరించిన వాటిలో ఎక్కువగా మాస్టర్ ప్లాన్‌లో రోడ్లు, చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ప్లాట్లు ఉన్నాయని, మాస్టర్‌ప్లాన్‌లో సర్వే నంబర్లు లేనివి ఉన్నాయి. ‘మాస్టర్ ప్లాన్’ చొరవ.. హెచ్ఎండీఏలోని మాస్టర్ ప్లాన్ విభాగంలో లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్లాట్ల కియరెన్స్ దాదాపు పూర్తయింది. రెవెన్యూ స్కెచ్ లేకుండా ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులకు ఏమాత్రం ఇబ్బందుల్లేకుండా మాస్టర్ ప్లాన్ విభాగంలోని ప్రత్యేక బృందం ఆయా లే అవుట్ల వద్దకు వెళ్లి జియో కో ఆర్డినెట్స్ తెప్పించుకొని ఆయాప్లాట్లు మాస్టర్ ప్లాన్ రోడ్డులో పో తున్నాయా, చెరువులు, శిఖలు, కుంటల్లో ఉన్నా యా, బఫర్‌జోన్‌లో ఉన్నాయా, నాలాలో ఉ న్నా యా గుర్తించి లేనివాటికి ఎల్ఆర్ఎస్ సిబ్బంది సహాయంతో క్లియరెన్స్ అయ్యేలా చేశారు. -
మరో నాలుగు రోజులే..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. హెచ్ఎండీఏకు అందిన 1.75 లక్షలకుపైగా దరఖాస్తుల్లో దాదాపు 93వేల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసినా అందులో దాదాపు 21వేల మంది దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టలేదు. ఇప్పటికే పదేపదే వారి సెల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం (ఎస్ఎం ఎస్) పంపిస్తున్నా స్పందన కనబడటం లేదు. ఈ నెల 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టకపోతే ఆ దరఖాస్తులన్నీ తిరస్కరిస్తామని హెచ్ఎం డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ 21 వేల మందితో పాటు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పరిశీలనలో ఉన్న మరో 3 వేల దరఖాస్తులు క్లియరైతే దాదాపు రూ.150 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలో వచ్చి చేరుతాయని అంచనా. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రూ.650 కోట్లు, నాలాల ఫీజు రూపంలో రూ.150 కోట్లు హెచ్ఎండీఏ చేతికి అందాయి. ఎస్ఎంఎస్లు వెళ్లినా స్పందన లేదు.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ప్రక్రియలో టైటిల్ స్క్రూటినీ, టెక్నికల్ స్క్రూటినీ పూరయ్యాక అంతా సక్రమమని తేలితే క్లియరెన్స్ ఇస్తారు. ఎల్ఆర్ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సద రు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్లు పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. 93 వేలకు పైగా దరఖాస్తులను క్లియర్ చేస్తే దాదాపు 21 వేల మంది ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించాలంటూ ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు పంపినా చలనం ఉండట్లే దని అధికారులు వాపోతున్నారు. సెల్ నంబ ర్లు మారి ఉండొచ్చనే వాదన వినబడుతున్నా అది చూసుకోవడం వారి బాధ్యత అని చెబుతున్నారు. ఓపెన్ ప్లాట్లు క్రమబద్ధీకరణ కాక కార్యాలయం చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిందని, అయితే అన్నీ సక్రమంగా ఉండి ఫీజు సమాచారం అందుకున్నవారు ఇప్పటిౖకైనా నిర్లి ప్తత వీడి ఫైనల్ ప్రొíసీడింగ్స్ చేతిలో పడేలాగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, దాదాపు 79 వేల దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. -
ఎల్ఆర్ఎస్ పరుగు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)కు బుధవారమే చివరి గడువుగా ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. దరఖాస్తుదారులు భారీసంఖ్యలో జీహెచ్ఎంసీ జోనల్, హెచ్ఎండీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. ఫీజు చెల్లింపులకు మరికొన్ని రోజులు గడువు పొడిగించాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మార్చి 31 వరకు గడువు పొడిగించగా.. హెచ్ఎండీఏకు మరో రూ.150 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.30 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)కు బుధవారమే చివరి గడువుగా ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. దరఖాస్తుదారులు భారీసంఖ్యలో జీహెచ్ఎంసీ జోనల్, హెచ్ఎండీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. ఫీజు చెల్లింపులకు మరికొన్ని రోజులు గడువు పొడిగించాలంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిలో దాదాపు 8వేల మంది తిరిగి తమ దరఖాస్తులను పరిశీలించాలంటూ హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. గడువును దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ గత మూడు రోజులుగా జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నప్పటికీ, చివరి రోజు జోనల్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో దరఖాస్తులందిన ఈస్ట్, వెస్ట్‌జోన్ కార్యాలయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వెస్ట్‌జోన్ కార్యాలయానికి వచ్చిన వారిలో జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్చెరు, కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల కు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 440 దరఖాస్తుల్ని అధికారులు పరిష్కరించారు. దాదాపు రూ.4.40 కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయానికి ఎల్బీనగర్, కాప్రా, ఉప్పల్ సర్కిళ్ల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. గత మూడు రోజులుగా మేళా నిర్వహిస్తుండగా తొలి రెండు రోజుల్లో దాదాపు 700 ఫైళ్లు పరిష్కారం కాగా, బుధవారం ఒక్కరోజే 650 ఫైళ్లు పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ఆన్లైన్ ద్వారా చెల్లింపులకు అవకాశం లేకపోవడం..బ్యాంకు డీడీలు తెచ్చిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేస్తామనడంతో ఉదయం నుంచే సందడి మొదలైంది. బ్యాంకు వేళలు ముగిసిపోతున్నప్పటికీ కొందరికి తమ దరఖాస్తులు సవ్యంగా ఉన్నదీ లేనిదీ తెలియక, ఫీజులు ఎంత చెల్లించాలో తెలియక ఇబ్బంది పడ్డారు. చివరి రోజు కావడంతో రాత్రి పొద్దుపోయేంత వరకు అందుబాటులో ఉండేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మార్చి 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు సాయంత్రం తెలియడంతో దరఖాస్తుదారులు ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్ఎంసీకి అందిన మొత్తం 71,808 దరఖాస్తుల్లో దాదాపు 43 శాతం షార్ట్‌ఫాల్స్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యవర్తులను నమ్మి మోసపోయామని హెచ్ఎండీఏలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు వాపోయారు. గడువు పొడిగింపుతో హెచ్ఎండీఏకు మరో రూ.150 కోట్లు రానుండగా, జీహెచ్ఎంసీకి దాదాపు రూ.30 కోట్లు ఆదాయం రానుందని అంచనా. -
31 వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్ : లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి గడువును ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నవంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టగా, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో లక్షలాదిగా దరఖాస్తులొచ్చాయి. ఫిబ్రవరి 28లోగా ఈ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధిస్తూ గత జనవరి 8న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పెండింగ్ ఎల్ఆర్ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలికలు చర్యలు తీసుకుంటున్నాయి. దరఖాస్తుల్లో లోపించిన సమాచారంతో పాటు ఫీజు బకాయిలు చెల్లించాలని దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చాయి. దరఖాస్తుదారులు సైతం అదనపు సమాచారంతో పాటు ఫీజు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ఎల్ఆర్ఎస్తో రూ.850 కోట్లు!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లకు లేఅవుట్ల క్రమబద్ధీకరణతో ఏకంగా రూ.850 కోట్లకుపైగా వసూలవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియకు బుధవారం చివరిరోజు కావడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు కాసుల పంట పడింది. జీహెచ్ఎంసీకి ఇప్పటికే రూ.100 కోట్లురాగా, బుధవారం మరో రూ.30 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అటు హెచ్ఎండీఏకు రూ.600 కోట్ల ఆదాయం వచ్చిందని, అదనంగా నాలా ఫీజు కింద రూ.150 కోట్లు సమకూరవచ్చని అధికారులు వెల్లడించారు. ఫీజు చెల్లించకుంటే తిరస్కరించినట్లే.. ఎల్ఆర్ఎస్ కోసం బుధవారంలోగా ఫీజులు చెల్లించని దరఖాస్తులను తిరస్కరించినట్లేనని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం డీడీలు ఇచ్చేవారికి వెంటనే ప్రొసీడింగ్స్ కూడా జారీ చేస్తామని.. ఫీజులు చెల్లించని వారెవరైనా వెంటనే కట్టి దరఖాస్తులను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఎన్వోసీలు తెచ్చుకోలేక.. 2015 నవంబర్‌లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. అనంతరం గడువు పొడిగిస్తూ వచ్చింది. అయినా ఇప్పటికీ 25 శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. దరఖాస్తుదారులు రెవెన్యూ మ్యాపులు, వివిధ విభాగాల నుంచి ఎన్వోసీలు తెచ్చుకోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి (షార్ట్‌ఫాల్స్) నెలకొందని చెబుతున్నారు. అయితే రెవెన్యూ మ్యాపుల ఇబ్బంది లేకుండా.. ఏ సర్వే నంబర్లో ఏ రకమైన భూములెన్ని ఉన్నాయో తెలుపుతూ రెవెన్యూ అధికారులు ఇటీవల జీహెచ్ఎంసీకి సమాచారం ఇచ్చారని, దానితో ప్రభుత్వ భూముల్ని గుర్తిస్తున్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జీహెచ్ఎంసీలో షార్ట్‌ఫాల్స్.. ఎల్ఆర్ఎస్ కోసం జీహెచ్ఎంసీకి 71,793 దరఖాస్తులు రాగా.. 45 శాతం షార్ట్‌ఫాల్స్ (ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఎన్ఓసీలు, తదితర అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయకపోవడం) జాబితాలో చేరాయి. అర్హత లేకపోవడంతో 4,950 దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇక హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 1,74,406 దరఖాస్తులురాగా.. 91,600 దరఖాస్తులను పరిష్కరించారు. 82,006 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మాస్టర్ ప్లాన్‌లో రోడ్లు, చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లలో ఉన్నవి, సర్వే నంబర్లు లేనివి తిరస్కరణకు గురైన వాటిలో ఉన్నాయి. 800 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. తిరస్కరణకు గురైనవాటిలోనూ కొన్ని పునః పరిశీలనకు వచ్చాయి. -
దొంగను పట్టిచ్చిన.. ‘ఆన్లైన్’
సాక్షి, సిటీబ్యూరో: ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి నకిలీ ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని హెచ్ఎండీఏ ఆన్లైన్ వ్యవస్థ బట్టబయలు చేసింది. అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఆ ఉద్యోగి డబ్బు మరిగి ఈ అవినీతికి తెర తీశాడు. చివరకు దొంగ బయటపడ్డాడు. అసలేం జరిగిందంటే... సంగారెడ్డి కల్వకుంట్ల గ్రామం సర్వే నంబర్ 199లోని 272 గజాలస్థలాన్ని ఎల్ఆర్ఎస్ చేయాలంటూ వంటేర్ హేమలత 2016లో హెచ్ఎండీఏకు దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మరికొన్ని పత్రాలు సమర్పించాలని 114122 నెంబర్ కేటాయిస్తూ ఆన్లైన్లో షార్ట్‌ఫాల్ పంపారు. అయితే హేమలత వాటిని ఆప్‌లోడ్ చేయకపోవడంతో దరఖాస్తును తిరస్కరించారు. అక్కడితో ఆ కథ అలా ఆగిపోయింది. అయితే వారం క్రితం హత్నూర మండల్ బొరపాట్ల గ్రామానికి చెందిన ఎస్.శంకరయ్య.. హేమలతకు చెందని స్థలాన్ని పరిశీలించాలని హెచ్ఎండీఏ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాడు. శంకరయ్య ఎందుకు కోరాడంటే... 199లోని 272 గజాల స్థలాన్ని శంకరయ్య కొనుగోలు చేశాడు. అందుకే హెచ్ఎండీఏను సంప్రదించి ఆ స్థలం వ్యవహారం పరిశీలించాలని కోరాడు. అయితే 2016లోనే దరఖాస్తు తిరస్కరణకు గురైందని అధికారులు తేల్చేశారు. దీంతో శంకరయ్య ఖంగుతిని అధికారులకు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు విచారణకు ఆదేశించారు. ఇదీ జరిగింది.. వంటేర్ హేమలత ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న తరువాత 2016 మార్చిలో బీహెచ్ఈఎల్కు చెందిన కె.అంజనేయులు గౌడ్‌కు విక్రయించింది. తరువాత ఆయన ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించామని హెచ్ఎండీఏ నుంచి ఆంజనేయులుకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయంపై రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాజుల రాజేశంను సంప్రదించాడు. రూ.30 వేలు ఇవ్వడంతోపాటు రూ.59.278 డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాడు. తరువాత నకిలీ డ్రాఫ్ట్ అందజేశాడు. విషయం తెలియని అంజనేయులు గౌడ్ గత సెప్టెంబర్‌లో ఈ ప్లాట్‌ను శంకరయ్యకు విక్రయించాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పనే... శంకరయ్య హెచ్ఎండీఏ కార్యాలయాన్ని సంప్రదించడంతో రాజేశం బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రొసిడింగ్స్‌లో జేపీవో డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. దీంతో హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధికారులు రాజేశంను తీసుకొచ్చి విచారించగా హెచ్ఎండీఉఏలో జూనియర్ ప్లానింగ్ పర్సన్(ఔట్ సోర్సింగ్) ఉద్యోగి సైదులు డబ్బులు తీసుకొని నకిలీ ఎల్ఆర్ఎస్ ప్రోసిడింగ్స్ చేతికి అందించాడని తెలిపాడు. దీనిపై హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి బి.బీమ్‌రావు ఓయూ పోలీసు స్టేషన్ గురువారం ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏతో పాటు ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించే దిశగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే 040–27018115/6/7/8 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. -
చివరి అవకాశం
‘పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నింటినీ 15రోజుల్లో పరిశీలించి, అన్నీ సవ్యంగా ఉంటే ఫీజు చెల్లింపు నోటీసులు, తిరస్కరించిన వాటికి లేఖలు అందించాలి. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తిచేసి అనుమతి పత్రాలు మంజూరు చేయాలి. లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ – ఇటీవల హైదరాబాద్‌లో మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం గద్వాల : పట్టణాల్లో స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. గడువులోపు దరఖాస్తులు చేసి ఫీజు చెల్లించినా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు సగమైనా పూర్తి చేయలేదు. లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తామని అధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొదట 2015 అక్టోబరు నాటికి రిజిస్టరైన లే–అవుట్ లేని స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రెండోసారి 2016 డిసెంబర్31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ముచ్చటగా మూడోసారి పెద్దనోట్ల రద్దు తర్వాత అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి మళ్లీ అవకాశం కల్పించింది. తాజాగా ఫిబ్రవరి వరకు గడువు పెంచింది. ఇంతవరకు తిరస్కరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు లేఖలు, అనుమతించిన వారికి ఫీజు చెల్లింపు నోటీసులు వచ్చే నెల 5లోగా అందించాలని సూచించింది. అర్హులైన దరఖాస్తుదారులు 15రోజుల్లోగా మిగతా అపరాధ సొమ్ము చెల్లిస్తే అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. గట్టిగా నిలదీస్తే కొర్రీలు.. వాస్తవానికి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు సమయంలో రూ.పది వేలు ఫీజు చెల్లించారు. ఇందులో ఇండస్ట్రియల్, రిక్విజేషన్, రోడ్డు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నావారు లేకపోలేదు. దీంతో కొందరు దరఖాస్తుదారులను అధికారులు నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏమిటని గట్టిగా నిలదీస్తే అనేక కొర్రీలు పెడుతున్నారు. మరికొందరు దరఖాస్తుదారులకు మొత్తం ఫీజు చెల్లించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. భవన నిర్మాణాలు చేపట్టేవారికి కొందరు కౌన్సిలర్లు అండగా నిలుస్తున్నారు. పెద్ద మొత్తంలో క్రమబద్ధీకరణకు చెల్లించడం దండగ అని, తమకు ఎంతో కొంత ముట్టజెబితే వాటి జోలికి అధికారులు రాకుండా చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. ఎన్నో ప్రయోజనాలు.. ఎల్ఆర్ఎస్ ఉంటే బ్యాంకు రుణాలు ఇళ్లకేగాక స్థలాలపైనా తీసుకోవచ్చు. ఇల్లు నిర్మించుకోవాలన్నా క్రమబద్ధీకరించిన స్థలానికి సులువవుతుంది. నూతన నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వెంటనే వస్తాయి. స్థలాన్ని ఇతరులకు విక్రయించడం ఎంతో సులభం. స్థలం కబ్జాకు గురికాకుండా ఉంటుంది. ఈ అంశాలపై ప్రజలకు మున్సిపల్ అధికారులు ఎక్కువగా అవగాహన కల్పించడం లేదు. -
ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టకపోతే తిరస్కరణ!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసి.. క్లియరెన్స్ పొంది.. ఫీజు కట్టాలంటూ ఎస్ఎంఎస్లు అందుకున్నవారు డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఫీజు కట్టాలంటూ ఎస్ఎంఎస్ అందుకున్న 15 రోజుల్లో ఫీజు కట్టాల్సి ఉండగా అవేమీ పాటించడంలేదు. గడువు ముగిసినా ఫీజు కట్టని వారి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎండీఏకు వచ్చిన 1,75,464 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 77,319 మందికి ఫీజు కట్టాలంటూ ఎస్ఎంఎస్ పంపితే, 47వేల మంది మాత్రమే చెల్లించారు. మిగిలిన 30 వేల మంది ఫీజు కట్టే సమయం మించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు అవసరమైతే వారి ఎల్ఆర్ఎస్ను తిరస్కరించాలని యోచిస్తున్నారు. ఈ విషయమై హెచ్ఎండీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలంటూ దరఖాస్తుదారుల సెల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం పంపించాం. దాదాపు 77వేల మందిలో 40వేలపైచిలుకు మంది వరకు ఆన్లైన్ పద్ధతిలో ఫీజు చెల్లించారు. మిగతావారు ఇంతవరకు కట్టలేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు గడువు పొడిగించాం. మరో వారంలో వీరు ఫీజు కట్టకపోతే ఎల్ఆర్ఎస్ తిరస్కరిస్తామ’ని స్పష్టం చేశారు. షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ... ఎల్ఆర్ఎస్ లేఅవుట్ కాపీ, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీలు... ఇలా ఇతరత్రా డాక్యుమెంట్లు సమర్పించని వారికి చివరిసారిగా షార్ట్‌ఫాల్ నోటీసులు జారీ చేశారు. గత వారం నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. 15 రోజుల్లో సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోతే తిరస్కరిస్తామంటూ సెల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు. ఇలా 7,555 మందికి షార్ట్‌ఫాల్ నోటీసులు పంపినట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. షార్ట్‌ఫాల్‌కు అవకాశం ఇదే చివరిసారని, చేయని పక్షంలో తిరస్కరిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరో 12,298 వేల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. దీనికితోడు ఇప్పటికే వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన 68,035 మందికి అప్పీల్‌కు మరో అవకాశం కల్పించడంతో దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని తిరిగి పరీక్షించేందుకు నలుగురు తహసీల్దార్లు, నలుగురు టెక్నికల్ ఆఫీసర్లతో ఇప్పటికే కమిషనర్ టి.చిరంజీవులు నియమించిన బృందం పనిచేస్తోంది. వీటిలో 703 దరఖాస్తులను తిరస్కరించాయి. అయితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో తొలి వాయిదా చెల్లించనివారు 9,554 మంది ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్ అక్రమార్కులకు నోటీసులు
సాక్షి కథనంపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు స్పందన సాక్షి, హైదరాబాద్: తెల్లాపూర్‌లోని సర్వే నంబర్ 323 నుంచి 332, 336 నుంచి 340లోని హెచ్ఎండీఏకు చెందిన భూమి పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పొందిన వారికి నోటీసులు జారీ చేశామని సంస్థ కమిషనర్ టి.చిరంజీవులు మంగళవారం తెలిపారు. ‘ఎల్ఆర్ఎస్తో ఎసరు’ పేరుతో సాక్షిలో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘అక్రమంగా ఎల్ఆర్ఎస్ క్లియర్ పొందిన దాదాపు 30 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఇంకా మరెంత మందికి పొరపాటున ఎల్ఆర్ఎస్ క్లియర్ చేశామా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. నిజమని తేలితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడికి నోటీసులిస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాం’ అని చిరంజీవులు సాక్షికి తెలిపారు. -
ఇలా అయితే భవిష్యత్తు ఏంటి?: హైకోర్టు
హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేయడానికి అనుమతినివ్వాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును కోరింది. అక్రమకట్టడాలను ఇలా క్రమబద్ధీకరించుకుంటూ వెళ్తే భవిష్యత్తు ఏంటి అని ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు రేపే ఆఖరు
► మార్చి 1తో ముగియనున్న క్రమబద్ధీకరణ గడువు ► మళ్లీ పొడిగించేది లేదన్న ప్రభుత్వం ► రేపు అర్ధరాత్రి వెబ్సైట్ నిలిపివేత సాక్షి, హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండ్రోజులు మాత్రమే మిగిలాయి. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల గడువు మార్చి1తో ముగియనుంది. ఊహించిన రీతిలో భవనాలు, లే అవుట్ల యజమానుల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో ఇప్పటివరకు ప్రభుత్వం రెండు పర్యాయాలు ఈ పథకాల గడువు పొడిగించింది. అయినా, ఈ అవకాశాలను వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. మార్చి 1 తర్వాత మళ్లీ పొడిగింపు ఉండదని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు స్వయంగా ప్రకటన చేశారు. దీంతో అనుమతులు లేని/అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ కోసం యజమానులకు ఇంకో రోజు సమయం మిగిలి ఉంది. మార్చి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఆన్లైన్ దరఖాస్తుల వెబ్‌సైట్‌ను ప్రభుత్వం నిలిపేయనుంది. గడువు సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో చివరి రోజు సర్వర్‌పై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా పొడిగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల అమలును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పథకాల కింద దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలని, తుది తీర్పునకు లోబడి ఈ దరఖాస్తుల పరిష్కారంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతే దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. త్వరలో నూతన విధానం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల గడువు ముగిసిన తర్వాత అక్రమ భవనాలు, లే అవుట్లపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ లేఅవుట్లు, భవనాల యజమానులకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు నోటిసులు జారీ చేసే చర్యలు చేపడతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో కొత్తగా అక్రమ భవనాలు, లే అవుట్లు ఏర్పాటు కాకుండా ఎప్పటికప్పుడు నిరోధించేందుకు కట్టుదిట్టమైన మార్గదర్శకాలతో నూతన భవన నిర్మాణ నియమావళిని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.