మహా నిరీక్షణ | HMDA Negligence in LRS Final Proceedings | Sakshi
Sakshi News home page

మహా నిరీక్షణ

Published Mon, Feb 4 2019 11:42 AM | Last Updated on Mon, Feb 4 2019 11:42 AM

HMDA Negligence in LRS Final Proceedings - Sakshi

ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన అరుణ్‌ తన 200 గజాల ప్లాట్‌క్రమబద్ధీకరణ కోసం హెచ్‌ఎండీఏలోఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.అన్ని పత్రాలను సరిచూసుకున్న హెచ్‌ఎండీఏ సిబ్బంది ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజుచెల్లించాలని అతడి ఫోన్‌కు అక్టోబర్‌లో సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) పంపడంతో వెంటనే పూర్తి మొత్తం చెల్లించాడు. అయినా ఇప్పటివరకు అరుణ్‌ చేతికి ఎల్‌ఆర్‌ఎస్‌
ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ కాపీ అందలేదు.

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో ‘ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌’ హాట్‌టాపిక్‌గా మారింది. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయంటూ ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజులు కట్టించుకున్న ‘మహా’ ప్లానింగ్‌ అధికారులు.. ఇప్పుడూ ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్‌ కాపీలు జారీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి డబ్బులు చెల్లించిన వారంరోజుల్లోగా ‘ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌’ జారీ చేయాలి. కానీ అక్టోబర్‌ నెలాఖరుతో గడువు ముగియడంతో ఆన్‌లైన్‌ ఫైల్స్‌ ఓపెన్‌ కాకపోవడంతో జారీ చేసే అవకాశం లేకపోయింది. దీంతో దాదాపు 8 వేల మంది దరఖాస్తుదారుల ఫైనల్‌ ప్రొసీడింగ్‌ కాపీలు పెండింగ్‌లో ఉండిపోయాయి. గత నాలుగు నెలల నుంచి తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న దరఖాస్తుదారులు ఇంకెన్ని రోజులు నిరీక్షించాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్‌ నెలాఖరుతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఆన్‌లైన్‌ ఫైళ్లు తెరుచుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ కాపీ జారీ చేయవచ్చని వచ్చిన ప్రతి దరఖాస్తుదారుడికీ వివరించడం సిబ్బందికి కత్తిమీద సామే అవుతోంది. అయితే, ఇప్పటికే ఈ ఫైళ్లు ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి లేఖ రాశామని అధికారులు వివరణ ఇస్తున్నారు. 

ఎల్‌ఆర్‌ఎస్‌ పొడిగిస్తే ఎంతో మేలు
హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్లీ 2016 డిసెంబర్‌లో 20 శాతం అధిక రుసుంతో మరోసారి క్రమబద్ధీకరించుకునేందుకు అనుమతించారు. ఇలా పాతవి, కొత్తవి కలిపి మొత్తం దరఖాస్తులు 1,75,612కు చేరుకున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్‌ స్క్రూటినీ, టెక్నికల్‌ స్క్రూటినీ పూర్తయిన తర్వాత ‘సక్రమం’ అని తేలాక క్లియరెన్స్‌ ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపారు. అది చెల్లించగానే ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు లక్షా 75 వేలకు పైగా దరఖాస్తులు వస్తే లక్షా 2,500 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. దాదాపు 9 వేల దరఖాస్తులు ఎన్‌ఓసీల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 63,500 దరఖాస్తులను ఓపెన్‌ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌బాడీ, మ్యానుఫ్యాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, ఓపెన్‌ స్పేస్‌ ఆఫ్‌ లే అవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు.  

అనుమతిస్తే రూ.150 కోట్ల ఆదాయం
ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరైనట్టు సమాచారం అందుకున్న లక్షా 2,500 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగిస్తే హెచ్‌ఎండీకు దాదాపు రూ.120 నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు రూపంలో రూ.1000 కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించిన 8 వేల మంది దరఖాస్తుదారులకు ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ కాపీ అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అనుమతి రావాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సొంతిల్లు కట్టుకునేందుకు చేతికి అందివచ్చిన అవకాశం కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్తే దరఖాస్తుదారులకు కష్టాలు తప్పనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement