సాక్షి, సిటీబ్యూరో: అరుణ్ సాధారణ ఉద్యోగి. ఆదిభట్లలో తాను కొన్న ప్లాట్‌ను ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే.. అది మాస్టర్ ప్లాన్ రోడ్డు కింద ఉందంటూ దరఖాస్తు తిరస్కరించారు. అలాగే నెక్నాంపూర్‌లో వాటర్ బాడీస్ కింద మీ ప్లాట్ ఉందంటూ రాజేశ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తును, హయత్‌నగర్‌లో ఇండస్ట్రియల్ జోన్ కింద ప్లాట్ ఉందంటూ కిషన్ పెట్టిన దరఖాస్తును కూడా హెచ్‌ఎండీఏ అధికారులు తిరస్కరించారు. వీరివే కాదు.. అనేక కారణాలలో హెచ్‌ఎండీఏకు వచ్చిన దాదాపు లక్షా 75వేల దరఖాస్తుల్లో 77 వేల దరఖాస్తులను తిరస్కరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రారంభ చెల్లింపులు (ఇనీషియల్ పేమెంట్) కింద ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేసిన రూ.10 వేలను తిరిగి ఇచ్చే విషయంలో అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో అవసరాలకు ఉపయోగపడతాయని ఎంతో కష్టపడి ప్లాట్ కొనుగోలు చేశామని, ఇప్పుడు ఆ ప్లాట్ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డులో పోతుందంటూ తిరస్కరించారని వాపోతున్నారు. పైగా అప్పుగా తెచ్చి కట్టిన ప్రారంభ ఫీజును తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ క్లియరైన దరఖాస్తుదారుడు కట్టిన మొత్తం ఫీజులో ఈ ప్రారంభ ఫీజు రూ.10 వేలు మినహాయించారని అంటున్నారు. ఇప్పటికైనా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందిచకపోవడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆశలు ఆవిరి...
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి ఉపాధి కోసం వచ్చి వివిధ అవసరాల కోసం చాలామంది శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. అవన్నీ గ్రామ పంచాయతీ లే అవుట్లలోనివే. వీటిని లే అవుట్ రెగ్యులేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద క్రమబద్ధీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజు «రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ ప్లాట్లు మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఉన్నాయని, శిఖం, నాలా, చెరువులో వస్తున్నాయని, ఇండస్ట్రియల్ జోన్‌లో ఉన్నాయనే కారణాలతో దాదాపు 77 వేలకు పైగా దరఖాస్తులను హెచ్‌ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ‘ఎన్నో ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మాస్టర్ ప్లాన్‌లోని పలు నిషేధిత జోన్లలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్‌ను తప్పుల తడకగా తయారు చేయడం వల్ల ప్లాట్ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. అవి అమ్మినా తీసుకునేందుకు ఎవరూ రావడం లేదు. పోనీ ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన సమయంలో చెల్లించిన రూ.10 వేలు కూడా హెచ్‌ఎండీఏ ఇవ్వనంటోంది. తిరిగిచ్చే అంశం జీఓలో లేదని తిరిగిపంపుతున్నార’ని హెచ్‌ఎండీఏకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుడు లక్ష్మణ్ వాపోయాడు. తాము చెల్లించిన నగదు మొత్తం తిరిగివ్వకుండా ఆందోళనకు దిగుతామని దరఖాస్తులు తిరస్కరణదారులు హెచ్చరిస్తున్నారు.
జీఓ–151లో ఏముందంటే..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించవచ్చు. అదీకాకుంటే దీంతో పాటు మరో పది శాతం డబ్బులు కూడా చెల్లించవచ్చని జీఓ–151లో ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ 10 వేలు తిరిగి చెల్లించాలని ఎక్కడా ప్రస్తావించడలేదని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment