ఫీజు చెల్లించండి! | HMDA Sends mail For Fess Pay On LRS Appliacations | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లించండి!

Published Tue, Sep 18 2018 7:55 AM | Last Updated on Tue, Sep 18 2018 7:55 AM

HMDA Sends mail For Fess Pay On LRS Appliacations - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు దరఖాస్తు సమయంలో రూ.10వేల ఇన్షియల్‌ పేమెంట్‌ ఫీజు చెల్లించని 9,833 మంది దరఖాస్తుదారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఆ ఫీజు చెల్లించాలంటూ హెచ్‌ఎండీఏ దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్‌లతో పాటు ఈ–మెయిల్స్‌ పంపిస్తోంది. ఈ నెల ఒకటి నుంచే ఈ మేరకు సమాచారం పంపిస్తున్నా... ఆశించిన స్థాయిలో దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయానికి రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ ప్రక్రియ ముగుస్తుందనగా అందరూ ఒకేసారి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఒకానొక దశలో దరఖాస్తులు కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వస్తే ఇటు అధికారులు, అటు దరఖాస్తుదారులకు సౌలభ్యంగా ఉంటుందంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో సమర్పించిన పత్రాలన్నీ వెంట తీసుకురావాలని, వెరిఫికేషన్‌ కోసం ఒరిజినల్‌ సేల్‌డీడ్‌ను సమర్పించాలని సూచిస్తున్నారు.

ఈ పత్రాలు అవసరం...   
దరఖాస్తుదారుడి ఐడెంటింటీ ప్రూఫ్‌ ఒరిజినల్, జిరాక్స్‌ కాపీ (ఓటర్‌ ఐడీ, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు లేదా పాస్‌పోర్ట్‌)
ఒరిజినల్‌ సేల్‌డీడ్‌తో పాటు జిరాక్స్‌ ప్రతులు.  
యజమాని, సాక్షి సంతకాలతో ఇండిమినిటీ బాండ్‌ తెచ్చుకోవాలి. అవసరమైతే ఇండిమినిటీ బాండ్‌ ఫార్మాట్‌ హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ నుంచిడౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
యజమాని, ఆర్కిటెక్చర్‌ సంతకాలతో సైట్‌ లోకేషన్‌ ప్లాన్‌ ఉండేలా చూసుకోవాలి.  
లేఅవుట్‌ కాపీ, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్, ఈసీ (ఇన్‌కంబ్రెన్స్‌ సర్టిఫికెట్‌) కూడా ఉండాలి.  
ఏజీపీఏలో యాజమాన్య డాక్యుమెంట్‌ విత్‌ పొజిషన్‌లో ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రాసెస్‌కు అంగీకరిస్తారు.  
2015 అక్టోబర్‌ 28 కటాఫ్‌ డేట్‌ తర్వాత రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ ఉంటే లింక్‌ డాక్యుమెంట్లు అందజేయాలి.  
2016 డిసెంబర్‌ 31 కటాఫ్‌ డేట్‌కు ముందున్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్‌ చేస్తారు.  
పై డాక్యుమెంట్లతో హెచ్‌ఎండీఏ ఐటీసెల్‌కు వెళ్తే అన్నీ సరిచూసి, స్కాన్‌ చేసి రిజిస్టర్డ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌ నెంబర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఒరిజినల్‌ డాక్యుమెట్లు సమర్పించాల్సిన అవసరం లేదు.

ఇదీ ఎల్‌ఆర్‌ఎస్‌ పురోగతి...  
రూ.10వేల ఇన్షియల్‌ పేమెంట్‌ ఫీజు చెల్లించిన వెంటనే ఆ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొదలవుతుంది. టైటిల్‌ స్క్రూటిని, టెక్నికల్‌ స్క్రూటిని పూర్తి చేసి, సక్రమమని తేలితే అధికారులు క్లియ రెన్స్‌ ఇస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, నాలా ఫీజు చెల్లించాలంటూ సదరు దరఖాస్తుదారుడి సెల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపుతారు. అది చెల్లించగానే ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ జారీ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు వచ్చిన 1,76,036 దరఖాస్తుల్లో 1,00,322 క్లియర్‌ చేశారు. 54మంది దరఖాస్తుదారులకు పంపిన షార్ట్‌ఫాల్స్‌ పత్రాలను ఇంకా అప్‌లోడ్‌ చేయలేదు. 1,694 దరఖాస్తులు క్లియరెన్స్‌ ప్రక్రియలో ఉన్నాయి. 2,237 ఎన్‌వోసీలు లేని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 676 దరఖాస్తులను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు.

రెండువేల ఆఫ్‌లైన్‌ ఫైళ్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 61,122 దరఖాస్తులను ఓపెన్‌ స్పేస్, రిక్రియేషనల్, వాటర్‌ బాడీ, మ్యాన్‌ఫాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, ఓపెన్‌ స్పేస్‌ ఆఫ్‌ లేఅవుట్, నది, వాగు, నాలా బఫర్‌ జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు తదితర కారణాలతో తిరస్కరించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయిన సమాచారం అందుకున్న 1,00,322 దరఖాస్తుల్లో దాదాపు 18,500 మంది ఫీజు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగించినా.. వీరి సంఖ్య మాత్రం అలానే ఉంటోందని, ఈసారైనా తప్పక చెల్లించి ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా హెచ్‌ఎండీకు దాదాపు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలేసుకుంటున్నారు. అలాగే ఇన్షియల్‌ పేమెంట్‌ చెల్లించని దరఖాస్తుదారులకు కూడా అవకాశం ఇవ్వడంతో మరో రూ.100 కోట్ల మేర హెచ్‌ఎండీఏ ఖజానాలోకి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు క్లియర్‌ అయిన దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు రూపంలో రూ.700 కోట్లు, నాలా ఫీజు రూపంలో రూ.250 కోట్లు చెల్లించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement