సాక్షి,హైదరాబాద్: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తక్షణ రిజిస్ట్రేషన్/అనుమతి చేసుకునే దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై టీఎస్–బీపాస్ చట్టంలోని సెక్షన్ 10 కింద మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా, కూల్చివేతలు లేదా ఆస్తి జప్తు చేసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అరవింద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇటీవలే ప్రత్యేక మెమో జారీ చేశారు. టీఎస్–బీపాస్ కింద జారీ చేసే తక్షణ రిజిస్ట్రేషన్లు, తక్షణ అనుమతులను ‘తదుపరి తనిఖీ’ బృందాలతో పరిశీలించాలని ఆయన కోరారు. అనుమతించిన లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించిన లేఅవుట్లలో తక్షణ రిజిస్ట్రేషన్లు, అనుమతుల ద్వారా జరిపే ఇళ్ల నిర్మాణాలకు తదుపరి తనిఖీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు.
తక్షణ రిజిస్ట్రేషన్/అనుమతి దరఖాస్తులు వచ్చిన వెంటనే ఈ బృందాలు 3 రోజుల్లోగా అన్ని అంశాలను పరిశీలించి ఆ తర్వాతి 24 గంటల్లోగా సిఫారసులు తెలపాలన్నారు. మరోవైపు 2015లో పాత ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను కొత్త ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం ఈ నెల 30లోగా పరిష్కరించాలని అన్ని పురపాలికలు, హెచ్‌ఎండీఏ, అర్బన్ డెలప్‌మెంట్ అథారిటీలకు అరవింద్‌కుమార్ మంగళవారం ఆదేశాలిచ్చారు. (అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?)
Comments
Please login to add a commentAdd a comment