పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. గతంలో మాదిరి అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ
బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పునరుద్ధరణ
త్వరలో విడుదల కానున్న ఉత్తర్వులు
మున్సిపాలిటీలకు పెరగనున్న రాబడి
మండపేట : పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. గతంలో మాదిరి అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ (బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమేరకు కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)ను ఆదేశించినట్టు సమాచారం. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పునరుద్ధరణకు త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, అనధికార లే అవుట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, పరిసరాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది.
అనధికార లే అవుట్లలో ఇల్లు నిర్మించుకున్న వారు మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో పక్క అనధికార నిర్మాణాలు చేసిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయా వర్గాల వారికి ఊరట కల్పించడంతో పాటు, పురపాలక సంస్థలకు ఆదాయం సమకూర్చే దిశగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)ల ద్వారా భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చారు. తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం పలు దఫాలుగా దీనిని 2013 మే వరకు కొనసాగించి తర్వాత నిలిపివేసింది.
వీటి ద్వారా జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు భారీగా ఆదాయం సమకూరగా రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతి తదితర మౌలిక వసతుల కల్పనకు వినియోగించే వీలు కలిగింది. ప్రస్తుతం అదే తరహాలో అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏను సీఎం ఆదేశించినట్టు మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలో బీసీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చంటున్నాయి. కాగా గతంలో కోర్టు కేసుల్లో ఉన్న వాటిని మిన హాయించగా తాజా ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నారు.