
సందేహాల నివృత్తికి 180 0599 8838కి ఫోన్ చేయొచ్చు
హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి ఫీజు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ లభిస్తుందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుతో పాటు ప్రో–రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను కూడా చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందన్నారు. బుధవారం హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో బీఆర్‌కే భవన్‌లో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్‌టీపీ), ఆర్కిటెక్ట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ (Workshop) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్‌టీఎల్, చెరువులు, కుంటలు తదితర ప్రాంతాల్లో లేని ప్లాట్‌లకు ఆటోమేటిక్‌గా ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి లభిస్తుందని చెప్పారు. చెరువులు, నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరి అని చెప్పారు.
ఎల్‌ఆర్‌ఎస్ అర్హతలేని స్థలాలపై చెల్లించిన ఫీజులో 90 శాతం రీఫండ్ (Refund) అవుతుందన్నారు. 10 శాతం మాత్రం ప్రాసెసింగ్ కోసం తీసుకుంటామని చెప్పారు. స్థలాల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి త్వరలోనే ఎల్‌ఆర్‌ఎస్ (LRS 2020) జారీ ప్రక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కమిషనర్ వివరించారు.
చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌కు ఐదంచెల ‘చెక్‌లిస్ట్’
ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలాంటి సందేహాలు ఉన్నా హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ 18005998838 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌లు విద్యాధర్, రాజేంద్రప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment