
ఆకతాయిల పనిపడుతున్న షీ టీమ్స్
15,249 హాట్ స్పాట్లు గుర్తించి ప్రత్యేక నిఘా
703 మంది మైనర్లకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: వెకిలిచేష్టలతో అమ్మాయిలను వేధించే ఆకతాయిల భరతం పడుతున్నాయి షీ టీమ్స్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 331 షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొదటి త్రైమాసికంలో మొత్తం 2,586 మంది ఆకతాయిలను షీ టీమ్స్ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు మహిళా భద్రతా విభాగం అధికారులు ‘ఎక్స్’లో తెలిపారు. అదేవిధంగా 703 మంది మైనర్లకు కౌన్సెలింగ్ చేసినట్టు పేర్కొన్నారు.
మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలు ఎక్కువగా ఉంటున్న హాట్ స్పాట్స్‌పై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గత మూడు నెలల్లో ఇలాంటి 15,249 హాట్‌స్పాట్లను గుర్తించి షీ టీమ్స్ బృందాలతో నిఘా పెట్టినట్టు వివరించారు. అదేవిధంగా షీ టీమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేలా మొత్తం 3,080 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.
ఆకతాయిల వేధింపులపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ అధికారులు సూచించారు. బాధితులు వాట్సాప్ నంబర్ 8712656856లో ఫిర్యాదు చేయవచ్చని లేదా డయల్ 100కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఆకతాయిలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.