
26 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు
విచారణలో గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు
జోగడ వంశీకృష్ణపై పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు.
గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా ఎన్‌ఆర్‌ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు.
హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్‌ఆర్‌ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.