matrimonial
-
యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశాల్లో డైవర్స్ కేసు వేస్తే..!
నాకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలవుతోంది. నా భర్త అమెరికాలో ఉద్యోగి. పెళ్లి అయిన తర్వాత నేను కూడా అమెరికాకు వెళ్లాను. అమెరికాలోనే ఒక కొడుకు పుట్టాడు. తర్వాత మాకు మనస్పర్ధలు వచ్చాయి. నన్ను నానారకాల హింసలు పెట్టి అత్తింటి వాళ్లు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. అమెరికాలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. తప్పని పరిస్థితులలో తిరిగి భారతదేశానికి వచ్చేశాను. నా భర్త అమెరికాలో డైవర్స్ కేసు వేశారు అని నాకు నోటీసు వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కేసు వాదించే ఆర్థిక పరిస్థితులలో లేను. నాకు డైవర్స్ వద్దు. తగిన సలహా ఇవ్వగలరు. – సరళ, విజయవాడమీ పరిస్థితి నాకు అర్థం అయింది. మీరు అమెరికాకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పెళ్లి భారత దేశంలో జరిగింది అని చె΄్పారు. పెళ్లి తర్వాత కొంతకాలం అమెరికాలో ఉన్నారు కాబట్టి అమెరికాలో కూడా డైవర్స్ కేసు వేయవచ్చు అనేది సాధారణ చట్టం. కానీ ఆ డ్డైవర్స్ ఇండియాలో చెల్లాలి అంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీ కేసులో మీరు అమెరికా ΄పౌసత్వం తీసుకోలేదు అని అనుకుంటున్నాను. మీరు ఇరువురు భారతీయ ΄పౌరులు అయి ఉండి, భారతీయ చట్టాల ప్రకారం మీ వివాహం జరిగి ఉంటే, అదనంగా రిజిస్టర్ కూడా చేయబడి ఉంటే కనుక భారతదేశంలో తగిన చర్యలు తీసుకునే వీలు ఉంది. మీ దగ్గరలోని న్యాయవాదిని కలిసి ‘యాంటీ సూట్ ఇంజక్షన్’ వేయమని అడగండి. అయితే మీ కేసులో యాంటీ సూట్ ఇంజక్షన్ వేయవచ్చా లేదా అనేది కేసు పూర్వపరాలు చూసిన తర్వాత నిర్ణయించవలసి ఉంటుంది. ఆ కేసు ద్వారా, మీ భర్తపై భారతీయ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. అతను వేరే ఏ దేశంలో కూడా మీ వివాహానికి సంబంధించిన కేసులు వేయడానికి లేదు అని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే, తాత్కాలికమైన ఆదేశాలు లభించినప్పటికీ, శాశ్వతంగా మీరు కేవలం భారతదేశ కోర్టులో మాత్రమే కేసులు వేయాలి అని అన్నివేళలా కోర్టులు చెప్పకపోవచ్చు. అందుకే మీ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికి మీరు మీ భర్తని డైవర్స్ కేసు వేయకుండా ఆపడానికి, యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు వేయండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగకపోయినా..!) -
Supreme Court of India: ఇవేం బెయిల్ షరతులు!
న్యూఢిల్లీ: వైవాహిక విభేదాల కేసుల్లో ముందస్తు బెయిల్ షరతుల విషయంలో కోర్టులు అసాధ్యమైన షరతులు విధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. వరకట్న నిషేధ తదితర చట్టాల కింద ఆరోపణలెదుర్కొంటున్న ఓ వ్యక్తికి పట్నా హైకోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులపై ధర్మాసనం శుక్రవారం విస్మయం వెలిబుచ్చింది. దంపతులు కలిసుండేందుకు ఒప్పుకోవడంతో దిగువ కోర్టు వారిని ఉమ్మడి అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకునే షరతుపై పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు అంగీకరించింది. అయితే, ‘గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, ఆమె శారీరక, ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చుతానని హామీ ఇవ్వండి’ అని షరతు పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ షరతును తొలగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆచరణ సాధ్యం కాని షరతులను ఇవ్వొద్దని కోర్టులకు సూచించింది. గౌరవంగా జీవించే హక్కును గుర్తించాలని, విచారణ న్యాయబద్ధంగా సాగేలా చూడాలని కోరింది. -
వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. పెండింగ్ కేసులను తగ్గించే క్రమంలో వివాహ వివాదాలకు చెందిన బదిలీ, బెయిలు పిటిషన్లు చెరో పది చొప్పున అన్ని కోర్టులు విచారించాలని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయించామని సీజేఐ తెలిపారు. ‘‘ఫుల్ కోర్టు సమావేశంలో ప్రతి బెంచ్ రోజూ కుటుంబ వ్యవహారాలకు చెందిన పది బదిలీ పిటిషన్లు చేపట్టాలని నిర్ణయించాం. ఆ తర్వాత రోజూ పది బెయిలు సంబంధిత కేసులు.. శీతాకాల సెలవులకు ముందు పరిష్కరించాలని నిర్ణయించాం. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వివాహ వివాదాలకు సంబంధించి ప్రస్తుతం 3 వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 13 కోర్టులు రోజూ పది బదిలీ కేసులు తీసుకుంటే రోజుకు 130 కేసులు చొప్పున వారానికి సుమారు 650 కేసులు పరిష్కరించొచ్చని సీజేఐ ఉదాహరించారు. శీతాకాల సెలవులకు ముందుగా ఈ బదిలీ కేసులు కొలిక్కి వస్తాయని తెలిపారు. అన్ని కోర్టులూ బెయిలు, బదిలీ పిటిషన్లు విచారించిన తర్వాత సాధారణ కేసులు విచారిస్తాయన్నారు. న్యాయమూర్తులు అర్ధరాత్రి వరకూ దస్త్రాలు చూడాల్సి వస్తుండడంతో వారిపై భారం తగ్గించాలని, అనుబంధ జాబితా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. -
మాట్రి ‘మోసగాడు’ కేసులో ట్విస్ట్: నిందితురాలనుకుంటే బాధితురాలైంది!
సాక్షి హైదరాబాద్: సైబర్ నేరాలు చేసే నైజీరియన్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన యువతి నుంచి డబ్బు కాజేయడానికి బేగంపేట వాసుల వివరాలు ఇచ్చినట్లే... బోయిన్‌పల్లికి చెందిన యువతి నుంచి రూ.15 లక్షలు కాజేసేందుకు మైఖేల్ అనే నైజీరియన్ మాట్రి ‘మోసగాడు’ ఉత్తరప్రదేశ్ యువతిని వాడుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఆమ్స్టర్డ్యామ్లో నివసిస్తున్న డాక్టర్‌గా నగర యువతికి పరిచయమైన నైజీరియన్ మైఖేల్ గిబి ఛిడీ ఆమెకు మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటానని, ఆసుపత్రి నిర్మిస్తానంటూ ఆమెతో నమ్మబలికాడు. తన వస్తువులను పార్శిల్ చేస్తున్నానంటూ చెప్పి, కొరియర్ ఆఫీస్ నుంచి అన్నట్లు ఫోన్లు చేయించి వివిధ పన్నుల పేరుతో రూ.15,32,500 కాజేశాడు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ గంగాధర్ దర్యాప్తు చేశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో మైఖేల్ వాడిన ఫోన్ నంబర్, ఓ బ్యాంకు ఖాతా ఉత్తరప్రదేశ్‌లోని మోబినగర్‌కు చెందినవిగా గుర్తించారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓ నేరం కోసం వాడిన ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాలను మరోసారి వినియోగించరు. అప్పటికే అవి బ్లాక్, ఫ్రీజ్ కావడమో జరుగుందని లేదా తాము చిక్కే ప్రమాదం ఉందని ఈ జాగ్రత్త తీసుకుంటారు. బోయిన్పల్లి యువతిని మోసం చేయడానికి మైఖేల్ వాడినవి మోబినగర్లో పని చేస్తూ ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడికి పంపారు. ఘజియాబాద్‌కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోబినగర్ చేరుకున్న ఈ బృందం దాదాపు మూడు రోజుల పాటు మాటు వేసింది. ఆ ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వినియోగిస్తున్నది నిందితుడే అని భావించి అతడి కోసం గాలించారు. ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు నైజీరియన్లు భారతీయులనే తమ అనుచరులుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాలు వాడతారు. సహకరించినందుకు వీరికి కొంత కమీషన్ ఇస్తారు. మోబినగర్ యువతి వ్యవహారం కూడా ఇలాంటిదే అని భావించారు. ఆమెను విచారించిన నేపథ్యంలో అసలు విషయం తెలిసింది. సదరు యువతిని సైతం మైఖేల్ సోషల్‌మీడియా ద్వారా ట్రాప్ చేశాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు సంగ్రహించిన అతగాడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఢిల్లీలో ఉండే మైఖేల్ తరచు మోబినగర్‌కు వచ్చి ఆమెతో గడిపే వాడు. ఆ సమయంలోనే టార్గెట్ చేసిన వారికి ఆమె ఫోన్ వినియోగించి కాల్స్ చేసేవాడు. ట్రాప్ అయిన వారితో ఆమె ఖాతాలోనే డబ్బులు వేయించేవాడు. అనంతరం వాటిని డ్రా చేసుకుని ఉడాయించేవాడు. నగర యువతిని కూడా ఇలానే ట్రాప్ చేశాడు. ఈ విషయం చెప్పిన యూపీ యువతి మైఖేల్ ఆచూకీ చెప్పడంతో అధికారులు అతడిని పట్టుకోగలిగారు. -
హోటల్లో రహస్యంగా పెళ్లి.. కారులో బలవంతంగా ఎక్కించుకుని..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు.. మంచి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ సైట్లపై ఆధారపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక బిజినెస్‌గా మారింది. అయితే, కొందరు కేటుగాళ్లు సైట్లలో నకిలీ ఫ్రోఫైళ్లను సృష్టించి ఎదుటివారిని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా మనం వార్తల్లో చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెల్గాంకు కుంపాత్‌గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి.. మ్యాట్రిమోనియల్ వేదికగా ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఆమెతో రోజు చాట్ చేసేవాడు. ఆ నిందితుడు తాను.. ఒక ఆర్మీ ఆఫీసర్ అని చెప్పుకున్నాడు. నిందితుడి మాయమాటలు నమ్మిన సదరు యువతి.. అతని మాయలో పడిపోయింది. ఆ తర్వాత.. వీరు గత నవంబరు 18న బెంగళూరులోని ఒక ఆలయంలో కలిశారు. అప్పుడు ప్రశాంత్ పాటిల్ ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు. వీరిద్దరు స్థానికంగా ఉన్న ఒక లాడ్జీలో పెళ్లి చేసుకున్నారు. కాగా, వివాహం గురించి ఎవరికి చెప్పనని యువకుడు.. వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతిని కారులో ఎక్కించుకుని.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు యువతి ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ప్రశాంత్ పాటిల్ ఆన్సర్ చేయలేదు. దీంతో యువతి తాను.. మోసపోయినట్లు గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రశాంత్ పాటిల్‌పై 2018 నుంచి పూనా, లాతూర్, అహ్మద్ నగర్లలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుడు.. మ్యాట్రిమోనియల్ వేదికగా చాలా మంది యువతులను మోసం చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై పలుసెక్షన్ల కింద కేసులను నమోదుచేసిన పోలీసులు స్థానిక కోర్టులో హజరుపర్చారు. -
ఇంత లావుగా ఉన్నావ్ పిల్లల్నెప్పుడు కంటావ్! ఈ లోకంలో ఉండలేను..
కేరళ: వివాహం జరిగిన పది నెల్లకు అత్తవారింట్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలి తల్లి, సోదరుడు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగి ఇన్ని నెల్లవుతున్నా ఇంకా గర్భందాల్చలేదని తమ కూతురిని తరచూ భర్త, అత్తమామలు దుర్భాషలాడేవారని, లావుగా ఉందని వేధించేవారని మృతురాలి తల్లి ఆరోపించారు. బాడీ షేమింగ్ కారణంగానే తన సోదరి మృతి చెందిందని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తమ వద్దకు పంపించారని, ఆమెతోపాటు భర్తతో సహా అత్తింటివారెవ్వరూ రాలేదని బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. నవంబర్ 25 రాత్రి జరిగిన ఈ ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు మృతురాలి భర్త, అత్తమామలపై వచ్చిన ఆరోపణలను ఖండించారని కూడా ఒక అధికారి తెలిపారు. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం.. -
పెళ్లికొడుకు కదా అని ‘చెప్పినట్టు’ చేస్తే... అశ్లీల వీడియోలతో..
సౌజన్య (పేరు మార్చడమైనది)కు మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. విదేశాలలో ఉన్న పెళ్లికొడుకు స్వదేశానికి త్వరలో వస్తున్నానని చెప్పాడు. సౌజన్య చాలా సంతోషించింది. నెల రోజులుగా వాట్సప్ చాట్ల ద్వారా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆధునిక దుస్తుల్లో కనిపించాలని కోరాడు పెళ్లికొడుకు. నమ్మిన సౌజన్య అతను ‘చెప్పినట్టు’ చేసింది. దానిని రికార్డ్ చేసిన పెళ్లికొడుకు ఆ వీడియోను అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను తన ఆన్లైన్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశాడు. మోసపోయిన విషయం అర్ధమైన సౌజన్య ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ∙∙ కీర్తన (పేరు మార్చడమైనది) పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడీ సృష్టించబడినట్టు తెలిసింది. దాని ద్వారా తనను వేధిస్తున్నవారి ఆటకట్టించాలనుకుంది. కానీ, ఎలాగో తెలియలేదు. ∙∙ సుందర్ (పేరు మార్చడమైనది) ఏడాది క్రితం సేంద్రీయ ఆహార ఉత్పత్తుల సంస్థకు యజమాని అయ్యాడు. చిన్న సంస్థే అయినా ఇప్పుడిప్పుడే లాభాలు అందుతున్నాయి. తన సంస్థ ఉత్పత్తులు మంచివి కావని, తనకు నష్టం కలిగించే ప్రకటనలు ఆన్లైన్లో చూసి షాకయ్యాడు. ∙∙ ఈ డిజిటల్ కాలంలో అపరిచత వ్యక్తుల నుంచి రకరకాల మోసాలకు లోనయ్యేవారి శాతం రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా కాలాన్ని ఉపయోగించుకొని మరింతగా సైబర్ నేరాలు పెరిగాయి. ఈ నేరాలలో పిల్లలు, మహిళలు ఎక్కువశాతం మోసానికి గురవుతున్నారు. అదేవిధంగా రకరకాల యాప్‌లు వచ్చి, డబ్బు దోపిడీ కూడా జరుగుతోంది. మోసం జరగకుండానే ముందస్తు జాగ్రత్తపడటం ఒక ఎత్తయితే, మోసపోయామని తెలిసినా తమని తాము రక్షించుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఫిర్యాదు చేయడం ఎలా? మొబైల్ లేదా కెమెరా వాడకంతో పిల్లలను, స్త్రీలను వారి వ్యక్తిగత, అశ్లీల చిత్రాలు, వీడియోలను తీసి, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూపినా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా బాధితులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా, ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క డేటా, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా దొంగిలించినా, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను పొందడానికి, డబ్బు లేదా పరువును కోల్పోయేవిధంగా మోసపూరిత ప్రయత్నం చేసినా, నెట్‌వర్క్‌ను దోపిడీ చేసే హ్యాకింగ్ ప్రక్రియకు పూనుకున్నా.. ఇలా ఏ డిజిటల్ మోసానికైనా సరైన ముందు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం. ఆన్లైన్ మార్గాలలో ఆర్థిక నష్టం జరిగితే https://cyberpolice.nic.in లో ఫిర్యాదు చేయాలి. దీనినే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పై రెండు పోర్టల్స్‌కి 15526 హెల్ప్‌లైన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. దీనికి ఆర్బిఐ ఆమోదించిన అన్ని బ్యాంకులు అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అకౌంట్ల తక్షణ నగదు లావాదేవీలను నిలిపి వేసి, మీ డబ్బును సురక్షితం చేస్తాయి. ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మీ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అందులో.. (1) చైల్డ్ పోర్నోగ్రఫీ (2) పిల్లల లైంగిక వేధింపులు (3) అసభ్యకరమైనవి, లైంగికపరమైనవి (జీజీ) ఇతర సైబర్ నేరాలు (1) మొబైల్ నేరాలు (2) సోషల్ మీడియా నేరాలు (3) ఆన్ లైన్ ఆర్థిక మోసాలు (4) సైబర్ ట్రాఫికింగ్ (5) హ్యాకింగ్... కి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఫిర్యాదు చేసే ప్రక్రియ ఆఫ్‌లైన్ – ఆన్ లైన్ రెండు విధానాల్లో ఉంటుంది. సంఘటన ఏవిధంగా జరిగిందో తెలియజేయడానికి: (ఎ) కమ్యూనికేషన్ మోడ్ అంటే ఇంటర్నెట్, వాట్సాప్ .. ఏ విధానంలో అనేది తెలియజేయాలి. (బి) తేదీ – సమయం (సి) ప్లాట్‌ఫారమ్ (ఇంటర్నెట్, వాట్సాప్ మొదలైనవి) . (డి) ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్, పేమెంట్లు / బ్యాంక్ స్టేట్మెంట్ల స్క్రీన్షాట్లు. వేధింపులకు గురిచేసేవారి సంబంధిత స్క్రీన్ షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి జత చేయాలి. అనుమానితుల వివరాలు (అందుబాటులో ఉంటే): (ఎ) అనుమానితుని పేరు (బి) గుర్తింపు (మొబైల్, ఇమెయిల్) (సి) ప్రదేశం.. మొదలైనవి) ఫిర్యాదుదారుల వివరాలు: (ఎ) పూర్తి పేరు – సహాయక వివరాలు (తండ్రి, జీవిత భాగస్వామి, గార్డియన్ మొదలైనవి) (బి) ఇమెయిల్ / ఫోన్ నంబర్ (సి) చిరునామా – ఐడీ ప్రూఫ్ (ఆధార్ మొదలైనవి) ఫిర్యాదును దాఖలు చేయడానికి దశల వారీ ప్రక్రియ ద్వారా వివరంగా తెలియజేయాలి. సత్వర స్పందన కోసం సమీప సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్‌గా మోసం ఎలా జరిగినా పోలీసులు, పోర్టల్, హెల్స్‌లైన్.. ఆపద్భాంధువుల్లా ఉన్నారనే విషయాన్ని విస్మరించరాదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకొని పారిపోతున్న మోసగాడు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి(29) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ పోలీసులు నిందితుడు తిరుపతిలో తలదాచుకున్నాడని తెలుసుకొని అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్‌తో పాటు ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఇప్పటివరకు ఎంత మంది మహిళలను మోసం చేశాడు? ఎంత డబ్బులు కాజేశాడు వంటి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. నలుగురు పోలీసు సభ్యుల బృందం ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నట్లు తెలిసింది. చదవండి: మలక్‌పేట్ మెట్రోస్టేషన్ పైనుంచి దూకి.. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. వివిధ మ్యాట్రిమోని సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వితంతువు, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులతో ఉడాయించడం కిరణ్ ప్రత్యేకత. ఇదే విధంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను మోసం చేసి వారి నుంచి నగదు, డబ్బు తీసుకొని పారిపోయి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ మోసగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆగస్టు 22న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి పోలీసుల పెద్దగా పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’ని సంప్రదించింది. దీంతో సెప్టెంబర్ 9న ‘ఒంటరి మహిళలే టార్గెట్’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అయినా పోలీసుల విచారణ ముందుకు సాగకపోవడంతో అవమానం, ఒత్తిడి తట్టుకోలేక ఆ అభాగ్యరాలు సెప్టెంబర్ 19(ఆదివారం) ఆత్మహత్య చేసుకుంది. దీంతో ‘పోలీసు నిర్లక్ష్యమే చంపేసింది’ శీర్షికన సెపె్టంబర్ 23న ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. దీంతో పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించి నిందితుడిని పట్టుకుంది. -
పెరుగుతున్న ‘అరేంజ్డ్ మ్యారేజెస్’
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక ప్రపంచంలో కూడా భారత దేశంలో 90 శాతం ‘అరేంజ్డ్ మ్యారేజెస్ (తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు)’ జరుగుతుండగా, యావత్ ప్రపంచంలో సగానికన్నా ఎక్కువగానే అరేంజ్డ్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దక్షిణాసియాతోపాటు మధ్యప్రాచ్యంలో, కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో, జపాన్, చైనా లాంటి తూర్పు ఆసియా దేశాల్లో ఈ కుదుర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. షాదీ, జీవన్ సాథీ లాంటి ఆన్లైన్ వెడ్డింగ్ వెబ్సైట్ల కూడా కుదిర్చిన పెళ్లిళ్లు పెరగడానికి కారణం అవుతున్నాయి. మారుతున్న ప్రపంచంలో ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కూడా పెరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారుగానీ అందులో వాస్తవం లేదని లెక్కలు తెలియజేస్తున్నాయి. కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. వారి సంఖ్య రెండు శాతం కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న అమ్మాయి లేదా అబ్బాయి తమ తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా అన్న అంశాన్నే పరిగణలోకి తీసుకుంటున్నారు. తమ తల్లిదండ్రులకు లేదా కుటుంబ పెద్దలకు నచ్చే వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అలా ప్రేమించిన వారిని తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అనుమతితోనే ఎక్కువగా పెళ్ళి చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఈ ఆన్లైన్ ప్రేమ పెళ్లిళ్లు కూడా ఒక విధంగా కుదుర్చుకున్న పెళ్లిళ్లే అనవచ్చు. ఎక్కువ మంది తమ అభిరుచులకంటే తమ సామాజిక వర్గానికి లేదా ఆర్థిక వర్గానికి చెందిన వారా, కాదా, తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా ? లేదా తమ సంస్కృతిని గౌరవిస్తారా, లేదా? అన్న అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకొని ప్రేమించడం వల్లనే ఇలా జరుగుతుందని ప్రేమ పండితులు చెబుతున్నారు. కుదుర్చుకుని చేసుకున్న పెళ్లిళ్లు పెటాకులు కాకపోవడమే పెళ్లిళ్లకు ఆదరణ పెరగడానికి ఎక్కువ కారణం. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న అమెరికాలో విడాకుల సంఖ్య 40 శాతానికి పైగా ఉండగా, భారత దేశంలో కుదుర్చుకున్న పెళ్లిళ్లో విడాకుల సంఖ్య ఒక శాతం మాత్రమే. భారత్‌లో కూడా ప్రేమ పెళ్లిళ్లలోనే విడాకుల శాతం ఎక్కువగా ఉంటోంది. అది ఎంత శాతం అన్నదానికి అందుబాటులో లెక్కలు లేవు. అమెరికాలో తల్లిదండ్రులు పెళ్లిళ్లను కుదర్చడం కష్టం కనుక ఇంతకాలం అక్కడ కుదుర్చుకున్న పెళ్లిళ్లు ఎక్కువగా జరగలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఈహార్మనీ, ఓకేక్యూపిడ్, ది రైట్స్టఫ్ లాంటి ఆన్లైన్ పెళ్లి వెబ్సైట్లు అందుబాటులోకి రావడంతో కుదుర్చుకున్న పెళ్ళిళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు ‘అరేంజ్డ్’ అన్న పదాన్ని ఉపయోగించవుగానీ, అవన్నీ అరేంజ్డ్ పెళ్లిళ్లే. పెళ్లి కూతరు, పెళ్లి కొడుకు తరఫు వారు కలుసుకునేందుకు అవి ‘అరెంజ్’ చేస్తాయి. ఈహార్మని తమ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌లను నిర్వహించడం ద్వారా, ఓకేక్యూపిడ్ ప్రశ్నావళి ద్వారా, ది రైట్ స్టఫ్ అభ్యర్థుల ప్రొఫైళ్ల ఆధారంగా పెళ్లిళ్లను కుదుర్చుతున్నాయి. -
ఆన్ లైన్ పెళ్లి సంబంధాలపై డేగ కన్ను!
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తాకొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునేవారికి త్వరలో ముకుతాడు పడనుంది. ఇప్పటివరకు కేవలం వధవు లేదా వరుడి వివరాల్లో ఫోన్ నంబర్‌ను మాత్రమే తీసుకుని యూజర్లకు మెసేజ్ ద్వారా వివరాలను పంపుతున్న వెబ్సైట్లు.. ఇకపై ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి లేదా ఏదైనా ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తమ అకౌంట్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలు మారనున్నాయని ఓ అధికారి తెలిపారు. దీంతోపాటు మాట్రిమోనియల్ లో అకౌంట్‌ను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారనే ప్రశ్నకు కూడా వినియోగదారుడు సమాధానం రాయాల్సి ఉంటుందని, అప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుందని వివరించారు. గత కొద్దికాలంగా ఆన్ లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుని అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్స్ తో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాట్రిమోనియల్ వెబ్ సైట్లను నియంత్రించే పనిలో పడింది. మాట్రిమోనియల్ వెబ్ సైట్ ను నడిపే ప్రతి ఒక్కరూ.. వెబ్ సైట్ లో గ్రీవియన్స్ ఆఫీసర్ పేరుతో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని.. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు రాగానే స్పందించే మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనే సూచనలు వెళ్లినట్లు వివరించారు. 2014లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తొలిసారి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పెళ్లి కోసం ఆన్ లైన్ లో సమాచారాన్ని ఉంచుతున్న అమ్మాయిలను తప్పుడు ప్రొఫైళ్ల ద్వారా అబ్బాయిలు మోసగిస్తున్నారనే ఫిర్యాదులు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. భారత్ మ్యాట్రిమోనీ, జీవన్ శాంతి తదితర సంస్థల సీనియర్ ప్రతినిధులను పిలిపించి, తగిన భధ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పెళ్లి పేరుతో మోసపోయేవారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నట్లు ఆమె వివరించారు. తాజా నిబంధనలతో ప్రొఫైళ్లను తయారుచేసినప్పుడు ఐపీ అడ్రసును వెబ్ సైట్లు రికార్డు చేసుకోనున్నాయి. ఒక సంవత్సర కాలంలో అకౌంట్ ను ఎన్ని మార్లు ఎక్కడెక్కడి నుంచి ఉపయోగించారో కూడా ఈ రికార్డుల్లోకి రానుంది.