సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక ప్రపంచంలో కూడా భారత దేశంలో 90 శాతం ‘అరేంజ్డ్ మ్యారేజెస్ (తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు)’ జరుగుతుండగా, యావత్ ప్రపంచంలో సగానికన్నా ఎక్కువగానే అరేంజ్డ్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దక్షిణాసియాతోపాటు మధ్యప్రాచ్యంలో, కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో, జపాన్, చైనా లాంటి తూర్పు ఆసియా దేశాల్లో ఈ కుదుర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. షాదీ, జీవన్ సాథీ లాంటి ఆన్‌లైన్ వెడ్డింగ్ వెబ్‌సైట్ల కూడా కుదిర్చిన పెళ్లిళ్లు పెరగడానికి కారణం అవుతున్నాయి.
మారుతున్న ప్రపంచంలో ఆన్‌లైన్, సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కూడా పెరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారుగానీ అందులో వాస్తవం లేదని లెక్కలు తెలియజేస్తున్నాయి. కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. వారి సంఖ్య రెండు శాతం కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న అమ్మాయి లేదా అబ్బాయి తమ తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా అన్న అంశాన్నే పరిగణలోకి తీసుకుంటున్నారు. తమ తల్లిదండ్రులకు లేదా కుటుంబ పెద్దలకు నచ్చే వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అలా ప్రేమించిన వారిని తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అనుమతితోనే ఎక్కువగా పెళ్ళి చేసుకుంటున్నారు.
ఈ కారణంగా ఈ ఆన్‌లైన్ ప్రేమ పెళ్లిళ్లు కూడా ఒక విధంగా కుదుర్చుకున్న పెళ్లిళ్లే అనవచ్చు. ఎక్కువ మంది తమ అభిరుచులకంటే తమ సామాజిక వర్గానికి లేదా ఆర్థిక వర్గానికి చెందిన వారా, కాదా, తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా ? లేదా తమ సంస్కృతిని గౌరవిస్తారా, లేదా? అన్న అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకొని ప్రేమించడం వల్లనే ఇలా జరుగుతుందని ప్రేమ పండితులు చెబుతున్నారు.
కుదుర్చుకుని చేసుకున్న పెళ్లిళ్లు పెటాకులు కాకపోవడమే పెళ్లిళ్లకు ఆదరణ పెరగడానికి ఎక్కువ కారణం. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న అమెరికాలో విడాకుల సంఖ్య 40 శాతానికి పైగా ఉండగా, భారత దేశంలో కుదుర్చుకున్న పెళ్లిళ్లో విడాకుల సంఖ్య ఒక శాతం మాత్రమే. భారత్‌లో కూడా ప్రేమ పెళ్లిళ్లలోనే విడాకుల శాతం ఎక్కువగా ఉంటోంది. అది ఎంత శాతం అన్నదానికి అందుబాటులో లెక్కలు లేవు.
అమెరికాలో తల్లిదండ్రులు పెళ్లిళ్లను కుదర్చడం కష్టం కనుక ఇంతకాలం అక్కడ కుదుర్చుకున్న పెళ్లిళ్లు ఎక్కువగా జరగలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఈహార్మనీ, ఓకేక్యూపిడ్, ది రైట్‌స్టఫ్ లాంటి ఆన్‌లైన్ పెళ్లి వెబ్‌సైట్లు అందుబాటులోకి రావడంతో కుదుర్చుకున్న పెళ్ళిళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు ‘అరేంజ్డ్’ అన్న పదాన్ని ఉపయోగించవుగానీ, అవన్నీ అరేంజ్డ్ పెళ్లిళ్లే. పెళ్లి కూతరు, పెళ్లి కొడుకు తరఫు వారు కలుసుకునేందుకు అవి ‘అరెంజ్’ చేస్తాయి. ఈహార్మని తమ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌లను నిర్వహించడం ద్వారా, ఓకేక్యూపిడ్ ప్రశ్నావళి ద్వారా, ది రైట్ స్టఫ్ అభ్యర్థుల ప్రొఫైళ్ల ఆధారంగా పెళ్లిళ్లను కుదుర్చుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment