
న్యూఢిల్లీ: టారిఫ్‌లు (దిగుమతి సుంకాలు) ఏ దేశాన్ని కాపాడలేవని, ఎవరో చెప్పారని కాకుండా భారత్ తన ప్రయోజనాల కోసం సుంకాలు తగ్గించాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రపంచంతో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెరపడం ఐదు కీలక ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలన్నారు. టారిఫ్‌లు తగ్గించేందుకు వీలుగా భారత్ యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇతర ప్రముఖ ఆర్థిక వ్యవస్థలతో ముందుగా వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.
కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో నియంత్రణలను తొలగించడం ప్రపంచ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానానికి కీలకమన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఇక్కడి వచ్చి చూసి వేరే దేశాలకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న ‘చైనా ప్లస్ వన్’ విధానంతో ఇండోనేషియా, వియత్నాం, టర్కీ ఎక్కువగా లాభపడుతున్నట్టు తెలిపారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలకు మించి నియంత్రణల తొలగింపు, నైపుణ్యాభివృద్ది అన్నవి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు అవసరమన్నారు.
వివిధ రంగాల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగం చేసేందుకు నీతి ఆయోగ్ కృషి చేస్తున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. ఎల్రక్టానిక్స్ విడిభాగాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులు కేబినెట్ ఆమోదానికి వేచి ఉన్నట్టు్ట చెప్పారు. ఆటో విడిభాగాలు, కెమికల్స్, టెక్స్‌టైల్స్, పాదరక్షలను సైతం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు ప్రకటించారు. తాము రూపొందించిన జాతీయ తయారీ మిషన్‌ను మూడు నెలల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు విద్య, వ్యవసాయానికి సైతం ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment