arranged marriages
-
ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? గొంతు కోసే పరిస్థితి ఎందుకు?
కొన్ని పద్ధతులు మారాలేమో. నిశ్చయ తాంబూలాల సమయంలో పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?’ అని అడగాలేమో. వధువు, వరుడికి అక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది. శుభలేఖలు వేసే ముందైనా ‘ఈ పెళ్లి నిజంగానే నీకు ఇష్టం కదా’ అని మళ్లీ తప్పక అడగాలి. ఏమంటే పిల్లల మనసులు పెద్దలు ఊహించినట్టుగా లేవు. పెద్దలు తమ ఆకాంక్షలకు తగినట్టుగా ఉండమని కోరగలరేగాని బలవంతం చేయలేరు. ఇష్టం లేని పెళ్లి నిశ్చయం అయ్యిందని వరుడి గొంతు కోసే నిస్సహాయ స్థితికి వధువు చేరిందంటే ఆమె నోరు తెరిచి చెప్పేపరిస్థితి లేదనా? చెప్పినా వినే దిక్కు లేదనా?పెళ్లికి ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం చేసుకోక తప్పదు. ఒక అవగాహన. పెద్దలు కుదిర్చిన పెళ్లి’ అనే మాట మనకు సర్వసాధారణం. మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లికే ప్రథమ మర్యాద, గౌరవం, అంగీకారం. పెద్దలు కుదిర్చాక ఇక ఏ సమస్యా ఉండదు బంధువులకు, అయినవారికి, స్నేహితులకు, సమాజానికి. కాని ఆ కుదిర్చిన పెళ్లిలో వధువుకు వరుడో... వరుడికి వధువో నచ్చకపోతే? జీవితాంతం అది సమస్య కదా. దానిని మొదట ఇప్పుడు చర్చించాలి. తాజా సంఘటన: మెడ కోసిన వధువు అనకాపల్లిలో పుష్ప అనే అమ్మాయికి రామునాయుడు అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. మే 20న పెళ్లి. కాని అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు. దాంతో అబ్బాయి ప్రాణం తీస్తే ఈ పెళ్లి బాధ తప్పుతుందని వెర్రి ఆలోచన చేసింది. అబ్బాయిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి సర్ప్రైయిజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కళ్లకు తన చున్నీ కట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. కాని అబ్బాయి బతికాడు. అమ్మాయి తనను తాను ఏమైనా చేసుకునేదేమో తెలియదు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసి ఆ అమ్మాయి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని అనుకుంటోందని చెప్పారు. మరి తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పిందో లేదో తెలియాలి. వాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి ఇష్టమో లేదోనని అడిగారో లేదో తెలియదు. అనవసరంగా ఇంత ప్రమాదం వచ్చి పడింది. పెళ్లి ఎందుకు? అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించడానికి. ఫలానా అమ్మాయిని చూసొచ్చాం చేసుకో అంటే ముఖం కూడా చూడకుండా చేసుకున్న రోజులు ఉన్నాయి. నామమాత్రంగా పెళ్లి చూపుల్లో చూసుకుని చేసుకున్న రోజులు ఉన్నాయి. కాని ఇవాళ అలా లేదు. అమ్మాయి, అబ్బాయి చాలా విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. వారి భవిష్యత్తు గురించి వారికి ఏవో నిర్ణయాలు ఉంటాయి. లేదా ఇష్టాలు ఉంటాయి. లేదా ఏదైనా ప్రేమ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా కేవలం తెచ్చిన సంబంధం నచ్చకపోవచ్చు. ‘ఆ సంబంధానికి ఏమైంది... మంచి సంబంధం’ అని తల్లిదండ్రులు అబ్బాయినిగాని, అమ్మాయినిగాని ఒప్పించి, సర్దిపుచ్చి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, బలవంతం చేసి పెళ్లి చేయదలిస్తే, దాని నుంచి బయటకు పోలేము... పూర్తిగా చిక్కిపోయాము అని వధువుగాని, వరుడుగాని అనుకుంటే వారికి ఒక ఆప్షన్ కుటుంబం నుంచి సమాజం నుంచి ఏమైనా ఉందా? నిశ్చితార్థంలో పెద్దల సమక్షంలో... పెళ్లిలో నిశ్చితార్థం ప్రధానం. ఆ సమయంలో పెద్దలు ఉంటారు. తల్లిదండ్రుల పిల్లల మంచికేనని విశ్వసించి పిల్లల బాగుకోసమేనని ఆ నిశ్చితార్థం జరుపుతున్నా... వారికి గట్టి వ్యతిరేకత ఉంటే అది చెప్పుకునే వీలు నిశ్చితార్థానికి ముందు వధువుకు, వరుడికి ఇవ్వొచ్చేమో ఆలోచించాలి. పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా’ అని వధువును, వరుణ్ణి అడిగి వారి భావాలు చదివి, అంగీకారం తెలుసుకుని ముందుకుపోవడం లో తప్పు ఏముంది? తల్లిదండ్రులు పెడుతున్న ఇబ్బంది ఆ సందర్భంలో పెద్దలకు చెప్పుకునే చాన్స్ ఇవ్వొచ్చు కదా. భవిష్యత్తు ప్రమాదం నివారించిన వాళ్లం అవుతాము. లేదా శుభలేఖలు వేసే ముందు తల్లిదండ్రులే తమ అనుమానాలు పోయేలా ‘ఈ పెళ్లి నిజంగా నీకు ఇష్టమేనా?’ అని పిల్లల మేలు కాంక్షించి అడగాలి. వారి సంతోషం కోసమే కదా తల్లిదండ్రులు జీవించేది. వారి సంతోషాన్ని పూర్తిగా కాకపోయినా ఏదో ఒక మేర అంగీకారం వచ్చే సంబంధం కుదిరేవరకు ఆగడంలో మేలే తప్ప కీడు లేదు. గుసగుసలు వద్దు బంధువులకు, స్నేహితులకు అన్నీ తెలుస్తాయి. ఫలానా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నదని కచ్చితంగా తెలుస్తుంది. ఆ సందర్భంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు శత్రువులు కాదు. కాని ఇష్టాలను గౌరవించడం లేదంతే. ఈ విషయం తెలిసినప్పుడు బంధువులు, స్నేహితులు మనకెందుకులే అని ఊరుకోకూడదు. గుసగుసలు పోవద్దు. ఆ తల్లిదండ్రులకు లేదా పిల్లలకు ఏ మేరకు నచ్చచెప్పగలరో చూడాలి. కుదర్దు అని అమ్మాయి, అబ్బాయి గట్టిగా చెప్తే కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. పెళ్లి విషయంలో పిల్లలతో సంపూర్ణంగా చర్చించే సన్నిహితత్వం తల్లిదండ్రులకు ఉండాలి. అది ప్రధానం. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అలాగే అబ్బాయిలూ అమ్మాయిలూ మీరేం అనుకుంటున్నారో మనసు విప్పి తల్లిదండ్రులకు చెప్పండి. వివరించండి. లేదా ఒక తెల్లకాగితం మీద రాసి అందజేయండి. అంతేగాని నచ్చని పెళ్లి విషయంలో తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అందరూ అందమైన వైవాహిక జీవితం నిర్మించుకోవాలని కోరుకుందాం. పెళ్లిపీటల మీద అడగలేము... కానీ... చాలా సినిమాలలో పెళ్లి జరిగే ఉత్కంఠ సన్నివేశాలుంటాయి. అబ్బాయికో అమ్మాయికో పెళ్లి ఇష్టం ఉండదు. కాని ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పే ఆప్షన్ ఉండదు. నాటకీయంగా అరిచి చెప్పడమో, ఆత్మహత్య చేసుకోవడమో తప్ప. ఇదే పెళ్లి రిజిస్టార్ ఆఫీసులో జరగాలంటే ముందు నోటీసు పెడతారు, అభ్యంతరాలు తెలపమంటారు, తర్వాత సంతకాలు చేసే ముందు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. ఈ ఆప్షన్ వివాహంలో ఏదో ఒక స్థానంలో ఎందుకు ఉండకూడదు? కాలానికి తగిన ఒక చిన్న ప్రజాస్వామిక ఆప్షన్ ఇవ్వొచ్చా? -
అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి
సాక్షి, ఖమ్మం : ఉరిమే మేఘాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. మెరిసే మెరుపులు భయకంపితులను చేస్తాయి. ఉరుమూ, మెరుపుల కలయికలో కురిసే చినుకులు మాత్రం మేనుకు కొత్త హాయినిస్తాయి. తోడుగా నిలవాల్సిన సహచరి సాన్నిహిత్యం ఉంటే ఆ హాయి ఆనందాన్నిస్తుంది. కొత్త దంపతులకు ఈ రకమైన పరిసరాలు ఉత్తేజాన్నిస్తాయి. కానీ ఏం లాభం.. చూసుకోవడానికి కూడా వీలు లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే విపరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. నిజంకాకపోయి ఉంటే బాగుండేదన్న తలంపులు. పదే పదే గుర్తొచ్చే భాగస్వామి(ని). అయినా కుదరదంటే కుదరదంతే..అనే పెద్ద వాళ్ల ఆంక్షలు.. కాంక్షలున్న చోట ఆంక్షలు ఎలా నిలుస్తాయనే కుర్రకారు ఆలోచనలు. వెరసి ఆషాఢమాసం నవ దంపతులకు ఎడబాటు తప్పదు. ఈ నేపథ్యంలో నూతనజంటను ఆషాఢంలో విడిగా ఎందుకుంచాలంటే.. బంధం బలోపేతం.. ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు పెళ్లయిన కొత్త జంట మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో దంపతుల వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అంతగా ప్రాధాన్యత లేకుండేది. ఈ ఆషాఢ మాసం ఎడబాటు కారణంగా వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయాలు బోలెడు.. ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఎడబాటు భావనను దూరం చేస్తున్నాయి. సెల్ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సప్లు, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాలు ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. తమ విరహాగ్ని చల్లార్చు కునే పలు రకాల ప్రత్యామ్నాయాలకు కొదవేం లేదు. అభిప్రాయాలు, స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటూ కాలాన్ని సులువుగా గడిపేయొచ్చు. శాస్త్రీయ కోణంలోనూ... మంచిదే నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం ఏనాటి నుంచో వస్తోంది. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో ఆరునెలల పాటు అత్తవారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు స్తంభించిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండడం అంత మంచిది కాదని ఎందుకంటారంటే.. ఈ సమయంలో ఒక వేళ గర్భధారణ జరగడం తల్లి, బిడ్డలకు అంత క్షేమకరం కాదు. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా సమీప జలాశయాలతోపాటు పరిసరాల్లోని నీళ్లుకలుషితం అవుతాయి. కలుషిత నీటిని వినియోగించినా అనారోగ్యాలు ప్రబలే అవకాశాలున్నాయి. చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు విస్తరించే ప్రమాదం ఉంటుంది. చీడ, పీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవచనం. ఇపుడు గర్భధారణ జరిగితే ప్రసవ సమయం వచ్చే ఎండాకాలంలో ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే వేసవి సమయం జన్మించే శిశువు బాహ్య పరిసరాలు, ఉష్ణోగ్రతను భరించే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఒక్క ఆషాఢ మాసంలో దంపతులు వియోగం పాటిస్తే సంతానోత్పత్తి సమయాన్ని జూన్, జూలై వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కారణంగా సుఖ ప్రసవానికి అనుకూలంగా ఉంటుంది. శిశువు సైతం తన నూతన పరిసరాలకు సులువుగా అలవాటు పడతాడు. ఈ శాస్త్రీయ నేపథ్యంలో కొత్త జంటకు ఎడబాటును అనివార్యమని పెద్దలు నిర్ణయించారు. ఎడబాటు ఎందుకంటే..? కొత్త కోడలు తన అత్తను చూడకూడదు. అల్లుడు అత్త వారింటి గడప దాటకూడదు అనే నిబంధనలు మానవ సమాజంలో తరచూ వినపించేవే. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీలేవు. అయితే దీని వెనుక శాస్త్రీయత, సంప్రదాయం దాగి ఉంది. ప్రధానంగా మన దేశం వ్యవసాయంపైన ఆధారపడి ఉందని అందరికీ తెలిసిందే.. మృగశిరకార్తె నుంచి ప్రారంభమైన తొలకరి చినుకుల రాక.. క్రమంగా ఆషాఢ మాసంలో అడుగు పెట్టే సరికి పూర్తి వర్షాకాలంగా మారిపోతుంది. సాగు ప్రధానవృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. చినుకుల రాక కోసం ఎదురుచూస్తూ నల్లటి మేఘాలపై కొండంత ఆశతో దుక్కులు దున్నడం, నాట్లు వేయడం వంటి పనులు అనివార్యంగా జరపాల్సి ఉంటుంది. బడికి వెళ్లే పిల్లల్ని వదిలేస్తే పెద్దవాళ్లంతా వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉంటారు కాబట్టి కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. కాబట్టి కర్మభూమిగా కీర్తిగాంచిన దేశంలో చేసే వృత్తిని కాదని మిగిలినవేవీ చేయాలనుకోరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం వి«ధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నియమాన్ని అనుసరిస్తున్నారు. ఆషాఢం ‘పట్టి’ ఆషాఢమాసంలో పుట్టింటికి పంపించే కోడలికి గతంలో అత్తవారింటి నుంచి ఆషాఢపట్టి అని ఒక పెట్టెను ఇచ్చి పంపించేవారు. దీనిలో ఉత్తరాలకట్ట, పెన్ను, పచ్చీసులాంటి ఆటవస్తువులుండేవి. నెలరోజుల ఎడబాటు కాలంలో భర్తకు ఉత్తరాలు రాసేందుకు, భర్త జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండేందుకు, కాలక్షేపానికి పచ్చీసు ఉపయోగపడేది. ఈ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో మేఘ సందేశాలు, పావురాల సందేశాలు ఉండేవంటారు. ఆషాఢ మాసంలో ఎదురయ్యే ప్రేయసీప్రియుల విరహవేదన ప్రధాన కథావస్తువుగా మహాకవి కాళిదాసు మేఘసందేశం రచించారు. ఇప్పుడు సెల్ఫోన్లు వచ్చాక.. వాట్సప్.. వీడియోకాల్స్లో మాట్లాడుకుంటున్నారు. కొత్త కోడళ్లకు ప్రత్యేకం నాకు ఇటీవలే వివాహమైంది. ఆషాఢమాసంలో పెట్టుపోత విషయంలో అత్తారింటివారు, అమ్మనాన్నలు కొత్తగా కొత్త బట్టలు ఇవ్వడం ఆచారం. అందుకోసం ఇటీవల షాపింగ్ చేశాం. చాలా రకాల కొత్త చీరలు, డ్రెస్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు ఆకర్షించాయి. చాలా తక్కువ ధరకే అనుకున్న బట్టలు వచ్చాయి. – నవ్యశ్రీ, నూతన వధువు, ఖమ్మం -
పెరుగుతున్న ‘అరేంజ్డ్ మ్యారేజెస్’
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక ప్రపంచంలో కూడా భారత దేశంలో 90 శాతం ‘అరేంజ్డ్ మ్యారేజెస్ (తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు)’ జరుగుతుండగా, యావత్ ప్రపంచంలో సగానికన్నా ఎక్కువగానే అరేంజ్డ్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దక్షిణాసియాతోపాటు మధ్యప్రాచ్యంలో, కొన్ని ఆఫ్రికా ప్రాంతాల్లో, జపాన్, చైనా లాంటి తూర్పు ఆసియా దేశాల్లో ఈ కుదుర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. షాదీ, జీవన్ సాథీ లాంటి ఆన్లైన్ వెడ్డింగ్ వెబ్సైట్ల కూడా కుదిర్చిన పెళ్లిళ్లు పెరగడానికి కారణం అవుతున్నాయి. మారుతున్న ప్రపంచంలో ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం కూడా పెరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారుగానీ అందులో వాస్తవం లేదని లెక్కలు తెలియజేస్తున్నాయి. కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. వారి సంఖ్య రెండు శాతం కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న అమ్మాయి లేదా అబ్బాయి తమ తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా అన్న అంశాన్నే పరిగణలోకి తీసుకుంటున్నారు. తమ తల్లిదండ్రులకు లేదా కుటుంబ పెద్దలకు నచ్చే వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అలా ప్రేమించిన వారిని తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అనుమతితోనే ఎక్కువగా పెళ్ళి చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఈ ఆన్లైన్ ప్రేమ పెళ్లిళ్లు కూడా ఒక విధంగా కుదుర్చుకున్న పెళ్లిళ్లే అనవచ్చు. ఎక్కువ మంది తమ అభిరుచులకంటే తమ సామాజిక వర్గానికి లేదా ఆర్థిక వర్గానికి చెందిన వారా, కాదా, తల్లిదండ్రులకు నచ్చుతారా, లేదా ? లేదా తమ సంస్కృతిని గౌరవిస్తారా, లేదా? అన్న అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకొని ప్రేమించడం వల్లనే ఇలా జరుగుతుందని ప్రేమ పండితులు చెబుతున్నారు. కుదుర్చుకుని చేసుకున్న పెళ్లిళ్లు పెటాకులు కాకపోవడమే పెళ్లిళ్లకు ఆదరణ పెరగడానికి ఎక్కువ కారణం. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న అమెరికాలో విడాకుల సంఖ్య 40 శాతానికి పైగా ఉండగా, భారత దేశంలో కుదుర్చుకున్న పెళ్లిళ్లో విడాకుల సంఖ్య ఒక శాతం మాత్రమే. భారత్లో కూడా ప్రేమ పెళ్లిళ్లలోనే విడాకుల శాతం ఎక్కువగా ఉంటోంది. అది ఎంత శాతం అన్నదానికి అందుబాటులో లెక్కలు లేవు. అమెరికాలో తల్లిదండ్రులు పెళ్లిళ్లను కుదర్చడం కష్టం కనుక ఇంతకాలం అక్కడ కుదుర్చుకున్న పెళ్లిళ్లు ఎక్కువగా జరగలేదు. ఇప్పుడు అక్కడ కూడా ఈహార్మనీ, ఓకేక్యూపిడ్, ది రైట్స్టఫ్ లాంటి ఆన్లైన్ పెళ్లి వెబ్సైట్లు అందుబాటులోకి రావడంతో కుదుర్చుకున్న పెళ్ళిళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు ‘అరేంజ్డ్’ అన్న పదాన్ని ఉపయోగించవుగానీ, అవన్నీ అరేంజ్డ్ పెళ్లిళ్లే. పెళ్లి కూతరు, పెళ్లి కొడుకు తరఫు వారు కలుసుకునేందుకు అవి ‘అరెంజ్’ చేస్తాయి. ఈహార్మని తమ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్లను నిర్వహించడం ద్వారా, ఓకేక్యూపిడ్ ప్రశ్నావళి ద్వారా, ది రైట్ స్టఫ్ అభ్యర్థుల ప్రొఫైళ్ల ఆధారంగా పెళ్లిళ్లను కుదుర్చుతున్నాయి. -
పెద్దలు కుదిర్చిన పెళ్లికే మా ఓటు!
కోల్ కతా: పెళ్లికి పెద్దలు అవసరం ఉందంటున్నారు నేటి భారత యువత. ఆధునికతను అందిపుచ్చకున్నా, విదేశాలు చుట్టొచ్చినా, కాలంతో మారినా పెళ్లిళ్ల విషయంలో మాత్రం సంప్రదాయానికే సై అంటోంది. తాజాగా షాదీ డాట్ కమ్ నిర్వహించిన ఈ సర్వేలో పెళ్లిపై యువత అభిప్రాయాలను సేకరించారు. ప్రపంచీకరణ, సమాచార సాంకేతికత అందించిన సౌకర్యాలతో సావాసం చేస్తూ శరవేగంతో దూసుకుపోతున్నా వివాహం విషయంలో తాము పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకే ప్రాధాన్యాం ఇస్తామని యువత తేల్చి చెప్పింది. ఈ సర్వేలో 50 శాతానికి పైగా సాంప్రదాయ, పెద్దలు కుదిర్చిన సంబంధాలకు విలువ ఇస్తామని చెబుతుండగా, 31 శాతం యువత మాత్రం సరైన జోడీ కోసం ఆన్ లైన్ లో శోధిస్తామని తెలిపింది. ఇంకా 12 శాతం మంది మాత్రం కొత్త వారైనా ఇబ్బందులు ఏమీ ఉండవని స్పష్టం చేస్తుండగా, 6 శాతం మంది పని చేసే చోట పరిచయమైన వ్యక్తులను పెళ్లి చేసుకోవటానికి ఓటేసింది. ఈ సర్వే కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 25 నుంచి 35 ఏళ్ల లోపు 3,600 యువకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో 37 శాతం మంది తమ భాగస్వామికి అర్హతలతో సంబంధం లేదని తెలిపారు. మరో 30 శాతం మంది మాత్రం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు పెద్ద పీట వేస్తుండగా, 21 శాతం మంది అమ్మాయిలు మాత్రం తన భర్తకు వృత్తి అనేది తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు.