పెద్దలు కుదిర్చిన పెళ్లికే మా ఓటు!
కోల్ కతా: పెళ్లికి పెద్దలు అవసరం ఉందంటున్నారు నేటి భారత యువత. ఆధునికతను అందిపుచ్చకున్నా, విదేశాలు చుట్టొచ్చినా, కాలంతో మారినా పెళ్లిళ్ల విషయంలో మాత్రం సంప్రదాయానికే సై అంటోంది. తాజాగా షాదీ డాట్ కమ్ నిర్వహించిన ఈ సర్వేలో పెళ్లిపై యువత అభిప్రాయాలను సేకరించారు. ప్రపంచీకరణ, సమాచార సాంకేతికత అందించిన సౌకర్యాలతో సావాసం చేస్తూ శరవేగంతో దూసుకుపోతున్నా వివాహం విషయంలో తాము పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకే ప్రాధాన్యాం ఇస్తామని యువత తేల్చి చెప్పింది. ఈ సర్వేలో 50 శాతానికి పైగా సాంప్రదాయ, పెద్దలు కుదిర్చిన సంబంధాలకు విలువ ఇస్తామని చెబుతుండగా, 31 శాతం యువత మాత్రం సరైన జోడీ కోసం ఆన్ లైన్ లో శోధిస్తామని తెలిపింది. ఇంకా 12 శాతం మంది మాత్రం కొత్త వారైనా ఇబ్బందులు ఏమీ ఉండవని స్పష్టం చేస్తుండగా, 6 శాతం మంది పని చేసే చోట పరిచయమైన వ్యక్తులను పెళ్లి చేసుకోవటానికి ఓటేసింది.
ఈ సర్వే కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 25 నుంచి 35 ఏళ్ల లోపు 3,600 యువకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో 37 శాతం మంది తమ భాగస్వామికి అర్హతలతో సంబంధం లేదని తెలిపారు. మరో 30 శాతం మంది మాత్రం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు పెద్ద పీట వేస్తుండగా, 21 శాతం మంది అమ్మాయిలు మాత్రం తన భర్తకు వృత్తి అనేది తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు.