ఇలా అయితే మగపిల్లలకి పెళ్లి అవుద్దా..! | Salary Expectations For Grooms In Arranged Marriages | Sakshi
Sakshi News home page

పెళ్లి పాట్లు..!అంత ఈజీ కాదు మ్యాచ్‌ సెట్టవ్వడం..

Published Wed, Jan 8 2025 5:30 PM | Last Updated on Wed, Jan 8 2025 7:28 PM

 Salary Expectations For Grooms In Arranged Marriages

"పెళ్లి ఎప్పుడవ్వుతుంది బాబు..నీకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు".. అని పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది మగపిల్లలున్న తల్లిదండ్రులకు. విజ్ఞానం గొప్ప జ్ఞానం ఇవ్వాలే గానీ అతి తెలివి, అత్యాశని ఇవ్వకూడదు. ఆ విధంగా విద్యను ఆర్జించకూడదు కూడా. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వారి కోరికలకు అంతులేదు. వారి అంచనాలకు సరితూగలేకపోతున్నామనే వ్యధలో పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు చాలామంది. చెప్పాలంటే వివాహం ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈడు జోడు అన్న మాటకు తావులేకుండా పోయింది. 

ఇంతకుముందు కట్నలు ఇవ్వలేక లభోదిభోమనే ఆడపెళ్లివారే డిమాండ్‌ చేసే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఈ పరిణామం బాగుందనిపించినా..వాస్తవికతకు అద్దం పెట్టేలా సమంజసమైనా డిమాండ్‌లు ఉంటే బావుండు..ఇదేంటిది అని పారిపోయేలా ఉంది పరిస్థితి. అస్సలు మగవాళ్లకి పెళ్లి అవుద్దా?. మ్యాచ్‌ సెట్‌ అవుద్దా..? అనే సందిగ్ధ స్థితికి వచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే ఏ కుర్రాడికైనా పెళ్లి కుదిరిందంటే..అదృష్టవంతుడివిరా అనాల్సి వస్తోంది. అంతలా పెళ్లి కరువు తాండవిస్తోంది మగపిల్లలకి. ఎందుకిలా..? ఇది మంచి పరిణమామేనా అంటే..

ఒకప్పుడు పెళ్లిళ్లు ఇరువైపుల పెద్దలు ఈడు-జోడు, స్థాయిలు చూసుకుని చక్కగా కుదర్చుకునేవారు. ఈజీగా పిల్లలకు ముడిపెట్టేసేవారు. హైరానా పడేవారు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదమే భయానకం అనేలా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఒకప్పడు మా అబ్బాయి ఈ ఉద్యోగం ​చేస్తున్నాడు..కట్నం ఇంత అని డిమాండ్‌ చేసే నోళ్లు కాస్త తడబుడుతున్నాయి. అమ్మాయినిస్తే అదే పదివేలు అనే పిరిస్థితికి వచ్చేశారు.  

ఎందుకిలా అంటే..
పెరుగుతున్న టెక్నాలజీ మనకు విజ్ఞానం ఇస్తోందో లేదో చెప్పలేకపోతున్నా..బంధాలను కాలరాసుకునే అజ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే కడుపులో ఉంది ఆడపిల్ల ? మగపిల్ల అని ముందుగా తెలుసుకుని వాళ్లని భూమ్మీద పడనీయకుండా చేశాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అదే నేటి ఈ దుస్థితికి కారణం కూడా. అందువల్లే పిల్లనిచ్చేవాళ్లు దొరకడం లేదని చెప్పొచ్చు. 

అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పోటీ పడి మరీ చదువుకుంటున్నారు. వారికంటే మెరుగ్గా ఉండేస్థాయికి చేరుకుంటున్నారు. వారి కాళ్లపై వారు నిలబడి బతికే స్థాయిలో ఉంటున్నారు కూడా. ఇది మంచి శుభపరిణామమే కానీ..దీన్నే చూసుకుని ఆడిపిల్లలు తల్లిదండ్రులు అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే "గొప్ప" కాస్తా ఇగోగా మారిపోయింది. 

మా అమ్మాయి మీ అబ్బాయికి తక్కువ కాదు అనేస్థితికి వచ్చేసి.. అణుకువకు తిలోదాకాలు ఇచ్చి "అహాం" తలెకెక్కించుకుంటున్నారు. అంటే విద్యావంతులుగా మారుతున్నాప్పుడు తక్కువ ఎక్కువలకు చోటిస్తే..అది చివరకు ఏ స్థాయికి తీసుకొస్తుందో ఊహించలేం. ఇక్కడ సరిజోడికి తావివ్వకపోయినా..కనీసం ఒక్కటవ్వనున్న జంట ఇష్టాలకు ప్రాధాన్యత, వారి ఫైనాన్షియల్‌ స్థితి చూస్తే బాగుండు. 

కానీ అంతకు మించి అంటున్నారు ఆడిపిల్లల తల్లిదండ్రులు. జస్ట్‌ 25 నుంచి 30 ఏళ్లలోపు ఏ మగపిల్లవాడైనా..మహా అయితే రూ. 30-50 వేలు లేదా లక్షలోపు సంపాదించగలరు. ఎక్కడో మహా ఇంటిలిజెంట్స్‌ లక్షల్లో వేతనాలు అందుకోగలరు. దాన్ని ఆలోచింకుండా ఓ కారు, బంగ్లా, లక్షల్లో జీతాలు, అత్తమామలు పక్కన ఉండకూదు అనే అంచనాలు ఉంటే..పెళ్లి అనే పదం బరువైపోతుంది. 

చెప్పాలంటే ఈ అంచనాలను చేరుకోవడం అందరికీ సాద్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవనవిధానానికి ఇరువురు ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్నిబ్యాలెన్స్‌ చేయగలరా లేదా అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మన అమ్మాయిని మంచిగా చూసుకోగలడా, బాధ్యతయుతంగా ప్రవర్తించగలడా అన్నది పరీక్షించండి అంతే తప్ప ఇలా గొంతెమ్మ కోరికల లిస్ట్‌ ముందే పెడితే..ఏ వరుడి తల్లిదండ్రులు ముందుకు రాగలరు. 

ఈ కారణాలతోనే చాలామంది అబ్బాయిలకు పెళ్లి అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇంకొకటి కూడా ఉంది. పెళ్లితో బాధ్యతలు తెలుసుకుని సంసారాన్ని చక్కబెట్టే స్థాయికి వచ్చిన వాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు ఎరగండి. సర్దుకుపోవడం, అణుకువ, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడం వంటి విలువైన పదాలకు వాల్యు ఇవ్వండి అప్పుడూ పెళ్లికి అర్థం..పరమార్థం ఉంటుంది. 

ఇలా పిచ్చి పిచ్చి అంచనాలతో పెళ్లిళ్లు చేయడం..అవతలవాళ్లు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం...చివరికి ఒకరికొకరు మోసం పోయామని అరవడం..కోర్టుల చుట్టూ తిరగడం..

మన వివాహ వ్యవస్థ గొప్పది..అది వ్యాపారంగా మార్చుకోవద్దు. భవిష్యత్తులో హాయిగా ఉంచే ఓ గొప్ప ఇన్వెస్టెమంట్‌గా చూడొద్దు. జీవితం అనేది ఎంతో విలువైనది..ఏరోజు ఎవరంటారో తెలియని స్థితి..ఉన్నన్నిరోజులు సంతోషంగా హాయిగా ఉండేలా వర్తమానానికి విలువ ఇద్దాం. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట తెగ వైరల్‌ అయ్యి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా పోస్ట్‌లలో ఇదే ఏకరవు పెడుతున్నారు కాబట్టి పెద్దలు ఆలోచనా తీరు మార్చుకోండి..వయసు దాటక ముందే పిల్లలకు పెళ్లి చేసి హాయిగా ఉండండి. 

 

 

(చదవండి: సేద్యంలో మహిళా సైన్యం!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement