ఈ ఏడాది వారికే ఎక్కువ జీతాలు: సర్వేలో కీలక విషయాలు | 94 Percent Average Salary Hike in India 2025 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వారికే ఎక్కువ జీతాలు: సర్వేలో కీలక విషయాలు

Published Wed, Jan 15 2025 4:50 PM | Last Updated on Wed, Jan 15 2025 5:31 PM

94 Percent Average Salary Hike in India 2025

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ.. జీతాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఉద్యోగులకు సగటున 9.4 శాతం పెంపు (హైక్) ఉండే అవకాశం ఉంటుందని, HR కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.

2020లో ఉద్యోగుల వేతనాలు 8 శాతం పెరిగాయి. ఈ ఏడాది 9.4 శాతం పెరగనున్నట్లు అంచనా. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ వంటి విభిన్న పరిశ్రమలతో విస్తరించి ఉన్న భారతదేశంలోని 1,550 కంటే ఎక్కువ కంపెనీలను సర్వే చేసి.. జీతాల పెంపు గురించి మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే ప్రస్తావించింది.

ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల, ప్రభుత్వం నేతృత్వంలోని 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కారణంగా ఆటోమోటివ్ రంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో జీతాలు 8.8 శాతం నుంచి 10 శాతం వరకు పెరగవచ్చు. ఆ తరువాత స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగులకు జీతాలు జీతాలు 8 శాతం నుంచి 9.7 శాతం వరకు పెరగవచ్చు.

జీతాలను మాత్రమే కాకుండా.. ఈ ఏడాది 37 శాతం సంస్థలు విభిన్న రంగాలలో.. ఉద్యోగులను కూడా పెంచుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలలో నైపుణ్యం కలిగిన వారికే ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుమారు 11.9 శాతం ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ సంవత్సరం కొన్ని సంస్థలు ప్రతిభను ఆకర్షించడానికి, టర్నోవర్‌ను తగ్గించడానికి.. శ్రామికశక్తి డిమాండ్‌లను పరిష్కరించేందుకు కావలసిన ప్రయత్నాలను చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సంస్థలు పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఆ తరువాత కొంతమంది ఉద్యాగాలను పొందినప్పటికీ.. ఇప్పుడు కూడా కొన్ని దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది చాలామంది ఫ్రెషర్స్ ఉద్యోగాలను పొందనున్నారు.

టీసీఎస్‌లో 40వేల ఉద్యోగాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) 'మిలింద్ లక్కడ్' తెలిపారు. టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement