
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగంలో ఈ ఏడాది (2024–25) వేతన పెంపు మోస్తరుగానే ఉండొచ్చని పరిశ్రమకు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. సగటున 4–8.5 శాతం మధ్య పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యం, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతుండడం, నైపుణ్యాలకు డిమాండ్ తదితర పరిస్థితులను ఇందుకు నిదర్శంగా ప్రస్తావిస్తున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ డెవలప్‌మెంట్ తదితర కీలక నైపుణ్యాలున్న వారికి మరింత అధికంగా వేతన పెంపులు లభించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వేతన పెంపు విషయంలో ఐటీ కంపెనీలు అప్రమత్త ధోరణి అనుసరించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవిజ్ అభిప్రాయపడ్డారు.
‘ఐటీ కంపెనీల్లో వేతన పెంపు 4–8.5 శాతం మధ్య ఉండొచ్చు. క్రితం సంవత్సరాల కంటే తక్కువ. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు, విచక్షణారహిత వ్యయాల తగ్గింపు, వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పుతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఏప్రిల్–జూన్ మధ్య సాధారణంగా చేపట్టే వేతన పెంపును మరింత జాప్యం చేయొచ్చు’ అని వివరించారు. సంస్థలు వేతన పెంపునకు బదులు రిటెన్షన్ బోనస్ (కంపెనీతోనే కొనసాగితే), ఇ–సాప్‌లు, ప్రాజెక్ట్ ఆధారిత ఇన్సెంటివ్‌లు ఇవ్వొచ్చన్నారు.
5–8.5 శాతం..
ఈ ఏడాది ఐటీలో వేతనాల పెంపు 5–8.5 శాతం మధ్య ఉండొచ్చని రీడ్ అండ్ విల్లో సీఈవో జానూ మోతియాని అంచనా వేశారు. ‘రెండంకెల వేతన పెంపులు ఇప్పటికైతే గతమే. పరిశ్రమ వ్యాప్తంగా అప్రమత్త ధోరణి నెలకొంది. టీసీఎస్ 4–8 శాతం మధ్య వేతన పెంపును (ఏప్రిల్ నుంచి) ప్రకటించడం ద్వారా మిగిలిన పరిశ్రమ వ్యాప్తంగా ఇదే తరహా పెంపునకు బాటలు వేసింది’ అని వివరించారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ఇంకా తుది ప్రకటనలు చేయలేదని, అవి రక్షణాత్మక ధోరణితో అడుగులు వేస్తున్నట్టుందన్నారు. ఏఐ ఆధారిత సామర్థ్యాలకు డిమాండ్ పెరుగుతుండడం, క్లయింట్ డిమాండ్లలో మార్పులు ఐటీ కంపెనీల వేతన బడ్జెట్ కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టి
వలసలూ తగ్గాయ్..
ఐటీ రంగంలో వలసల రేటు (ఉద్యోగులు కంపెనీలను వీడడం) 2023లో 18.3 శాతం ఉంటే, 2024 చివరికి 17.7 శాతానికి తగ్గడం గమనించొచ్చు. వలసల రేటు నిదానించడంతో వారిని కాపాడుకునేందుకు రిటెన్షన్ బోనస్, దూకుడుగా పారితోషికాలు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి లేకపోవడాన్ని మోతియాని ప్రస్తావించారు. సగటు వేతన పెంపులు 6–10 శాతం మధ్య ఉండొచ్చని, ఏఐ తదితర డిమాండ్ నైపుణ్యాలు కలిగిన మధ్యస్థాయి నుంచి సీనియర్ ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించొచ్చని అడెకో ఇండియా అంచనా వేసింది. ‘ఫ్రెషర్లకు వేతన పెంపులు 2–4 శాతం మధ్య ఉండొచ్చు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 10–12 శాతం వరకు కూడా వేతనాలు పెరగొచ్చు. సీనియర్ లెవల్ నిపుణులు, ముఖ్యంగా కీలకమైన టెక్నికల్ విధులు, నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి 12–15 శాతం మధ్య వేతన పెంపు ఉండొచ్చు’ అని అడెకో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) ప్రకారం దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 7 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment