Automobile sector
-
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సన్‌రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్‌రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్‌కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్‌లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్‌యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్‌రూఫ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్‌రూఫ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్‌రూఫ్‌లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్‌రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్‌రూఫ్‌ల తయారీ కోసం తాజాగా జపాన్‌కు చెందిన ఐసిన్ కార్ప్‌తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్‌రూఫ్‌ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్‌యూవీల్లో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్‌రూఫ్‌లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్‌రూఫ్‌లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్‌లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్‌ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిస్సాన్‌లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించింది. అయితే, యుటిలిటీ వాహనాల ఉత్పత్తిని 33 శాతం పెంచింది. అక్టోబర్‌లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 1,06,190 యూనిట్ల నుంచి 89,174 యూనిట్లకు తగ్గినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. మరోవైపు, బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలతో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్‌కి సఫరా చేసే వాహనాల ఉత్పత్తిని 54,316 యూనిట్ల నుంచి 72,339 యూనిట్లకు పెంచినట్లు పేర్కొంది. మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్–ప్రెసో మొదలైన వాటి ఉత్పత్తి 14,073 యూనిట్ల నుంచి 12,787 యూనిట్లకు తగ్గింది. అటు బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్తో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్‌కి కూడా సరఫరా చేసే కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి 90,783 నుంచి 75,007 యూనిట్లకు తగ్గింది. -
కాంపాక్ట్ ఎస్‌యూవీలు.. టాప్‌గేర్‌లో అమ్మకాలు..
ఒకపక్క కార్ల కంపెనీలు బంపీ రైడ్‌తో సతమతమవుతున్నప్పటికీ... స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీలు) తగ్గేదేలే అంటున్నాయి. భారతీయులకు తొలి చాయిస్‌గా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా అమ్మకాల్లో పైచేయి సాధించిన హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంగా కాంప్టాక్ట్ ఎస్‌యూవీలు కేక పుట్టిస్తున్నాయి!! దేశంలో కారు ప్రియుల కొనుగోలు ట్రెండ్ శరవేగంగా మారిపోతోంది. 4 మీటర్ల లోపు పొడవైన హ్యాచ్బ్యాక్స్, సెడాన్ల (కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు) హవాకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఎస్‌యూవీలు రాజ్యమేలుతున్న కాలంలో కూడా అమ్మకాల్లో టాప్‌లేపిన ఈ సెగ్మెంట్‌ను తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఓవర్టేక్ చేశాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2024–25, ఏప్రిల్–సెప్టెంబర్)లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్‌యూవీలు దుమ్మురేపాయి. ఈ సెగ్మెంట్లో 6,71,674 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే తరుణంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల సేల్స్ 5,58,173 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ రెండు విభాగాల అమ్మకాలు రివర్స్ కావడం విశేషం. రివర్స్ గేర్...గతేడాది వరకు దేశంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల జోరుకు తిరుగేలేదు. అమ్మకాల్లో ఈ విభాగానికిదే టాప్ ర్యాంక్. నాలుగేళ్ల క్రితమైతే కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. ఐదేళ్లకు ముందు చూస్తే, కాంపాక్ట్ ఎస్యూవీ 1 అమ్ముడైతే కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు 3 హాట్ కేకుల్లా రోడ్డెక్కేవి. ఇదంతా గతం. దేశంలో నవతరం దూకుడు... ఆటోమొబైల్ రంగం ముఖచిత్రాన్ని మలుపుతిప్పుతోంది. మరోపక్క, ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటుల ధరల్లో లభిస్తుండటంతో గ్రామీణ కార్ లవర్స్ సైతం వీటికే సై అంటున్నారు. దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంటోందనేది నిపుణుల మాట. టాటా పంచ్, నెక్సాన్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టర్, కియా సోనెట్, మారుతీ బ్రెజా, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, సిట్రాన్ సీ3, ఎయిర్‌క్రాస్ వంటివి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. వీటిలో కొన్ని కార్లు నెలకు 10,000 అమ్మకాల మార్కును కూడా అధిగమిస్తుండటం విశేషం! ఇక కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే, మారుతీదే పూర్తి ఆధిపత్యం. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, డిజైర్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇతర కార్లలో టాటా టిగోర్, ఆ్రల్టోజ్, టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20 వంటివి అంతంతమాత్రంగానే అమ్ముడవుతుండటం గమనార్హం. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడల్స్ డౌన్... కారణాలేవైనప్పటికీ గత కొంతకాలంగా కాంపాక్ట్ పాసింజర్ కారు మోడల్స్ కనుమరుగవుతున్నాయి. ఫోర్డ్ మోటార్స్ 2022లో ఇండియా నుండి దుకాణం సర్దేయడంతో ఫిగో, ఫిగో యాస్పైర్, ఫ్రీస్టయిల్, ఫియస్టా వంటి బాగా పాపులర్ మోడల్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్డ్ నిర్ణయంతో హాట్ ఫేవరెట్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సైతం మార్కెట్‌కు దూరం కావడం గమనార్హం. హోండా సైతం జాజ్, బ్రియో వంటి హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలను అపేసింది. హోండా సిటీ సేల్స్ కూడా నేలచూపులు చూస్తున్నాయి. మరోపక్క, డాట్సన్ కూడా 2022లో గుడ్‌బై చెప్పడంతో గో, రెడీగో వెళ్లిపోయాయి. టయోటా లివా, ఫోక్స్‌వ్యాగన్ అమియో, పోలో సైతం సెలవు తీసుకున్నాయి. ఐదేళ్ల క్రితం దాదాపు 30 వరకు ప్యాసింజర్ కారు మోడల్స్ కస్టమర్లకు విభిన్న ఆప్షన్లతో కనువిందు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 15కు పడిపోవడం విశేషం. ఒకపక్క మోడల్స్ తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల కొనుగోలు ధోరణి మారుతుండం కూడా కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లకు గండికొడుతోంది!!ఆకట్టుకుంటున్న ఫీచర్లు... కాస్త ధరెక్కువున్నప్పటికీ, మరిన్ని ఫీచర్లు లభిస్తుండటంతో చాలా మంది కస్టమర్లు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే విశాలమైన స్పేస్, బలిష్టమైన రూపంతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవం వల్ల కూడా కస్టమర్లు వీటికి జై కొడుతున్నారని మారుతీ మాజీ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘ఎస్‌యూవీల సీటింగ్ పొజిషన్ ఎత్తు గా ఉండటం వల్ల కేబిన్ నుండి రోడ్డు వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మన దగ్గరు న్న గతుకుల రోడ్లపై డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది’ అని చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
భారత్‌లో ‘రిఫరెన్స్’ ఇంధనం ఉత్పత్తి షురూ..
న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్‌ను, హర్యానాలోని పానిపట్ యూనిట్లో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది. -
క్యూ1లో ఆటోమొబైల్ ఎగుమతులు డౌన్
ముంబై: భారత ఆటోమొబైల్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది. ► ఈ జూన్ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్–జూన్ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి. ► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. ► యుటిలిటీ వెహికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి. ► త్రీవీలర్ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి. ► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్ ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
మెకానిక్‌లు సాధికారత సాధించాలి
న్యూఢిల్లీ: మన దేశ అటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి మెకానిక్‌లు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి కోసం వారు సాధికారత సాధించాలని సూచించారు. ఆయన ఇటీవల ఢిల్లీ కరోల్ బాగ్‌లోని బైకర్స్ మార్కెట్లో మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం విదితమే. మెకానిక్‌లతో కలిసి ఓ బైక్‌ను ఆయన సరీ్వసు కూడా చేశారు. సంబంధిత వీడియోను రాహుల్ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. తనకు కేటీఎం 390 మోటార్ సైకిల్ ఉందని, దాన్ని ఉపయోగించడం లేదని, ఇంట్లోనే పార్క్ చేసి ఉంచానని ఈ వీడియోలో రాహుల్ చెప్పారు. మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని, అందుకే కేటీఎం 390ని ఇంటికే పరిమితం చేశానని వివరించారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ఓ మెకానిక్ ప్రశ్నించగా.. చూద్దాం అంటూ రాహుల్ బదులిచ్చారు. అటోమొబైల్ పురోగతి కోసం మెకానిక్‌లు వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, మెరుగైన వసతులు, ఉత్తమ అవకాశాలు పొందడానికి వారు అన్నివిధాలా అర్హులని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. భారతదేశ అసలైన అభివృద్ధి కారి్మకుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
భారత్‌లో రెనో–నిస్సాన్ రూ. 5,300 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో–నిస్సాన్ భారత్‌లో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయను న్నాయి. రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఆరు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అలాగే చెన్నైలోని తమ ప్లాంటును కూడా అప్‌గ్రేడ్ చేయనున్నాయి. నిస్సాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా ఈ విషయాలు తెలిపారు. రెనో ఇండియా కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని నోడల్ ఏజెన్సీ గైడెన్స్ బ్యూరో ఎండీ విష్ణు వేణుగోపాల్, గుప్తా ఇచ్చిపుచ్చుకున్నారు. రెనో–నిస్సాన్ అనేది ఫ్రాన్స్‌కి చెందిన రెనో, జపాన్‌కి చెందిన నిస్సాన్ కంపెనీల జాయింట్ వెంచర్. కొత్తగా వచ్చే వాహనాల్లో నాలుగు ఎస్‌యూవీలు ఉంటాయి. వీటిలో మొదటిది 2025 నాటికి మార్కెట్లోకి రానుందని గుప్తా చెప్పారు. దేశీయంగా ప్రవేశపెట్టే ఆరు వాహనాల్లో నిస్సాన్, రెనోవి చెరో మూడు వాహనాలు ఉంటాయి. తాజా పెట్టుబడులతో కొత్తగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని గుప్తా ఈ సందర్భంగా వివరించారు. పునర్వ్యవస్థీకరణ.. జాయింట్ వెంచర్లో సమాన వాటాదార్లుగా ఉండేలా రెండు సంస్థలు భారత్‌లో తమ తయారీ, ఆర్అండ్డీ విభాగాల్లో పెట్టుబడుల స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. దీని ప్రకారం జేవీలో నిస్సాన్ వాటా 70 శాతం నుంచి 51 శాతానికి తగ్గనుండగా రెనో వాటా 30 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. తమ చెన్నై తయారీ కేంద్రాన్ని 2045 నాటికల్లా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తో నడిచేలా తీర్చిదిద్దనున్నట్లు గుప్తా వివరించారు. భారత మార్కెట్‌కు రెనో, నిస్సాన్ కట్టుబడి ఉన్నాయని నిస్సాన్ రీజియన్ చైర్పర్సన్ (ఆఫ్రికా తదితర ప్రాంతాలు) గిలోమ్ తెలిపారు. -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
వాహన విక్రయాలు జూమ్
ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
‘బాష్’కు భారతీయత
సాక్షి, బెంగళూరు: భారత్‌కు బాష్ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆటోమొబైల్ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా గురువారం బాష్ బెంగళూరులో ‘స్పార్క్ నెక్ట్స్‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్ ఇంజినీరింగ్‌ల సమర్థ మేళవింపునకు బాష్ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. భారత్‌లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ డిజిటల్, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కృత్రిమ మేథతోపాటు అనేక అత్యాధునిక టెక్నాలజీలు కలిగిన ‘స్పార్క్ నెక్ట్స్’వంటి భవనాలు దేశంలో రేపటితరం ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశానికి అవసరమైన మరిన్ని ఉత్పత్తులు, టెక్నాలజీలను బాష్ తయారు చేయాలని, రానున్న25 ఏళ్ల కు లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. బెంగళూరు ప్రతిష్ట బాష్ ‘స్పార్క్ నెక్ట్స్’తో మరింత పెరిగిందని కర్ణాటక సీఎం బొమ్మై కొనియాడారు. సుస్థిరత... మా తారకమంత్రం: ఫెలీజ్ అల్చెర్ట్ ‘స్పార్క్ నెక్ట్స్‘ నిర్మాణానికి ఐదేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు బాష్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యురాలు ఫెలీజ్ ఆల్చెర్ట్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశామన్నారు. 76 ఎకరాల్లో మొత్తం 10 వేల మంది పని చేయగల ‘స్పార్క్ నెక్ట్స్‘లో ఏటా 5.8 కోట్ల లీటర్ల వాననీటి సంరక్షణ జరుగుతుందని చెప్పారు. వినియోగం తగ్గిందని వివరించారు. భారత్‌లో బాష్ పెట్టుబడులు మరిన్ని పెరగనున్నాయని, త్వరలో 25 కోట్ల యూరోలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. బాష్ కంపెనీ దశాబ్దాలుగా ఆత్మ నిర్భర్ భారత్ కోసం కృషి చేస్తోందని ఉత్పత్తుల డిజైనింగ్ మొదలు తయారీ వరకూ అన్నీ చేపట్టడం ద్వారా మేకిన్ ఇండియాకూ ఊతమిస్తున్నామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య తెలిపారు. -
ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం
ముంబై: డిమాండ్ స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థపరమైన అడ్డంకులు తొలగిపోతుండటం తదితర అంశాలు ఆటో విడిభాగాల సంస్థలకు ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక ప్రకటనలో ఈ అంచనాలు వెల్లడించింది. దీని ప్రకారం 31 ఆటో విడిభాగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 1,75,000 కోట్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. దేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం), రిప్లేస్మెంట్, ఎగుమతులు, కమోడిటీల ధరల పెరుగుదలను బదలాయించగలగడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లో బేస్‌తో పోలిస్తే వృద్ధి అధిక స్థాయిలో నమోదైందని, అయినప్పటికీ పరిశ్రమ ఆదాయాలు తమ అంచనాలు మించాయని ఇక్రా పేర్కొంది. ఊహించిన దాని కన్నా ఎగుమతులు మెరుగ్గా ఉండటం, కమోడిటీల ధరలు.. రవాణా వ్యయాల పెరుగుదల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కంపెనీలకు కలిసొచ్చిందని వివరించింది. తగ్గిన మార్జిన్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరిగినప్పటికీ ముడి వస్తువుల ఖర్చులు, రవాణా వ్యయాల భారాన్ని ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చ్) కంపెనీలు పూర్తి స్థాయిలో, సకాలంలో బదలాయించలేకపోయాయని ఇక్రా తెలిపింది. దీనితో లాభాల మార్జిన్లపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 31 ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ మార్జిన్లు గత ఆర్థిక సంవత్సరంలో అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని ఇక్రా తెలిపింది. సెమీకండక్టర్ కొరత సమస్యలు, ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ వ్యాపారాలపై భౌగోళికరాజకీయ పరిణామాల వంటి అంశాలు ఆదాయాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘30 కంపెనీల (ఒక పెద్ద ఆటో విడిభాగాల సరఫరా సంస్థ కాకుండా) నిర్వహణ మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది 10 బేసిస్ పాయింట్లు, మా అంచనాలతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువ‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు. సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, ధరల పెరుగుదల భయాల కారణంగా ఆటో యాన్సిలరీలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయని పేర్కొన్నారు. అంతక్రితం నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల దగ్గర లిక్విడిటీ (నగదు లభ్యత) మెరుగ్గా ఉండటం సానుకూలాంశమని వినుత తెలిపారు. పీఎల్ఐ స్కీముతో దన్ను.. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో మధ్యకాలికంగా ఆటో యాన్సిలరీల విభాగంలో పెట్టుబడులకు ఊతం లభించగలదని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కొత్తగా మరిన్ని పెట్టుబడులు రాగలవని వివరించింది. ఇక పరిశ్రమకు రుణ అవసరాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఆటో యాన్సిలరీల రుణాల భారం పరిస్థితి మెరుగ్గా ఉందనేందుకు సూచనగా చాలా మటుకు సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం .. ఆటో యాన్సిలరీలకు సానుకూలంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
ఆటుపోట్లలో ఆటో పరిశ్రమ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ సరఫరా వైపు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆటోమొబైల్ ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరా 4 శాతం తక్కువగా ఏప్రిల్‌లో నమోదైంది. పరిశ్రమకు సరఫరా వైపు సవాళ్లు నెలకొని ఉన్నట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. ఏప్రిల్‌లో దేశీయ హోల్‌సేల్ ప్యాసింజర్ హోల్‌సేల్ వాహన విక్రయాలు 2,51,581 యూనిట్లుగా ఉంటే, అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2,61,633 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ కార్ల విక్రయాలు గత నెలలో 1,12,857 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో ప్యాసింజర్ కార్ల విక్రయాలు 1,41,194 యూనిట్లుగా ఉండడం గమనించాలి. యుటిలిటీ వాహన హోల్‌సేల్ విక్రయాలు 1,27,213 యూనిట్లు, వ్యాన్ డిస్పాచ్‌లు 11,568 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల్లో వృద్ధి ప్యాసింజర్ వాహనాలకు భిన్నంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏప్రిల్‌లో పెరిగాయి. 15 శాతం అధికంగా 11,48,696 వాహనాలు ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు సరఫరా అయ్యాయి. 2021 ఏప్రిల్‌లో ఇవి 9,95,115 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఇందులో మోటారుసైకిళ్ల అమ్మకాలు 6,67,859 యూనిట్ల నుంచి 7,35,360 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల డిస్పాచ్‌లు 3,01,279 యూనిట్ల నుంచి 3,74,556 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 20,938 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో తిచక్ర వాహన అమ్మకాలు 13,856 యూనిట్లుగా ఉన్నాయి. 2017 కంటే తక్కువే.. ‘‘ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఇప్పటికీ 2017 ఏప్రిల్ నెల గణాంకాల కంటే తక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 2012 ఏప్రిల్ నెల కంటే తక్కువగా ఉన్నాయి’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. తిచక్ర వాహనాల విక్రయాలు సాధారణ స్థాయికి చేరుకోవాల్సి ఉందని, 2016 ఏప్రిల్‌లో నమోదైన గణాంకాల కంటే ఇంకా 50 శాతం తక్కువగా ఉన్నట్టు చెప్పారు. సరఫరా వైపు సమస్యలు ఉన్నా.. అధిగమించేందుకు శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల రెపో రేటు పెంపుతో రుణ రేట్లు పెరగనున్నాయని, డిమాండ్‌పై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని రాజేష్ మీనన్ తెలిపారు. చదవండి: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్! -
ఒకపక్క దిగ్గజాల ఏడుపు.. మరోపక్క ఎన్నడూ లేనంతగా కాసుల వర్షం!
Chip Shortage Still Record Level Business In 2021: చిప్ కొరత.. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు. మొత్తం గ్లోబల్ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య వల్లే ప్రొడక్టివిటీ బాగా తగ్గింది. పైగా టెస్లా లాంటి తోపు కంపెనీలు తాము కొత్త మోడల్స్‌ను తేలేకపోతున్నామంటూ ప్రకటనలు సైతం ఇచ్చుకుంటోంది. మరి అంత పెద్ద సమస్య.. ఊహకందని రేంజ్లో బిజినెస్ చేసిందంటే నమ్ముతారా?.. చిప్ కొరత(సెమీ కండక్లర్ల కొరత).. గత ఏడాది కాలంగా సెల్‌ఫోన్, ఆటోమొబైల్స్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పదం. దీనిని వంకగా చూపిస్తూనే వాహనాలు, మొబైల్స్ రేట్లు నేలకు దిగడం లేదు. పైగా పోను పోనూ మరింత పెంచుకుంటూ పోతున్నాయి కంపెనీలు. ఈ తరుణంలో కిందటి ఏడాది సెమీకండక్టర్ సెక్టార్ చేసిన బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 583.5 బిలియన్ డాలర్లు. అవును.. సెమీకండక్టర్ సెక్టార్లో ఒక ఏడాదిలో ఇన్నేళ్లలో ఈ రేంజ్లో భారీ బిజినెస్.. అదీ 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం ఇదే ఫస్ట్‌టైం. ఈ మేరకు సోమవారం వెలువడిన గార్ట్నర్ నివేదిక సెమీకండక్టర్ బిజినెస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ► 2018 నుంచి శాంసంగ్-ఇంటెల్ మధ్య చిప్ బిజినెస్‌లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో.. మూడేళ్ల తర్వాత శాంసంగ్ ఇంటెల్‌కు రాజేసి మొదటి పొజిషన్‌ను ఆక్రమించుకుంది. ఓవరాల్ మార్కెట్లో ఒక్కసారిగా 34.2 శాతం రెవెన్యూను శాంసంగ్ పెంచుకోవడం గమనార్హం. ► ఇంటెల్‌కు కేవలం 0.5 శాతం పెంచుకుని.. టాప్ 25 కంపెనీల్లో అతితక్కువ గ్రోత్ రేట్ సాధించిన కంపెనీగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ► 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ.. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ కొరత.. ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో వీటి కొరత స్పష్టంగా కనిపించింది. ► ఫలితంగా బలమైన డిమాండ్, లాజిస్టిక్స్, ముడిసరుకు ధరల కలయిక సెమీకండక్టర్ల సగటు అమ్మకపు ధరను (ASP) ఒక్కసారిగా పెంచేసిందని, చిప్ కొరత-స్ట్రాంగ్ డిమాండ్ 2021లో మొత్తం ఆదాయ వృద్ధికి దోహదపడిందని గార్ట్నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ నార్వుడ్ చెప్తున్నారు. ► రిమోట్ వర్కింగ్, లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలను తీర్చడానికి హైపర్‌స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా పెరిగిన సర్వర్ డిప్లాయ్‌మెంట్‌ల కారణంగా, అలాగే PCలు, అల్ట్రా మొబైల్స్ కోసం ఎండ్-మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల ‘మెమరీ’ మళ్లీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. ► 2020లో ఆదాయం కంటే 42.1 బిలియన్లు డాలర్లు పెరగ్గా.., ఇది 2021లో మొత్తం సెమీకండక్టర్ మొత్తం ఆదాయ వృద్ధిలో 33.8 శాతం కావడం కొసమెరుపు. ► మెమరీతో పాటు డ్రామ్(DRAM) కూడా 2021 ఆదాయం పెరగడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 40.4 శాతం రాబడి వృద్ధితో.. 2021లో 92.5 బిలియన్ డాలర్ల ఆదాయం తీసుకొచ్చింది. సర్వర్స్, పీసీల నుంచి బలమైన డిమాండ్ కారణంగా డ్రామ్ డబుల్ డిజిట్‌కు చేరుకోగలిగింది. ► 2021లో 555 మిలియన్ల యూనిట్ల 5జీ స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2020లో ఇది కేవలం 250 మిలియన్ యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ లెక్కన 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా సెమీకండక్టర్ రెవెన్యూ గణనీయంగా పెరగడానికి కారణమైంది. ► హవాయ్ మీద అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమైంది. చైనా యేతర కంపెనీలకు కాసుల పంట పండించింది. హువాయ్ చిప్ సబ్సిడరీ.. 2020లో 8.2 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. 2021లో కేవలం ఒక బిలియన్డాలర్ల బిజినెస్ చేయడం గమనార్హం. చదవండి: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
ఉత్పత్తి మొదలెట్టండి.. మినహాయింపులు తర్వాత చూద్దాం!
న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్‌లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్‌ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్‌వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్‌ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్‌పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
స్క్రాపేజ్ పాలసీతో కొత్త వాహనాలకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు వాహన స్క్రాపేజ్ పాలసీ కలిసొస్తుందని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛంధ వాహన స్క్రాపింగ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వెహికిల్స్‌కు 15 ఏళ్ల ఫిట్నెస్ టెస్ట్‌లను నిర్వహిస్తారు. భారీ వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్ నుంచి, ఇతర వాహనాలకు 2024 జూన్ నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనర్హమైన వాహనాలు తొలగిపోతాయని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరగడంతో పాటు వాహన పరిశ్రమ స్థిరపడుతుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. దీంతో పాటు కాలుష్యం, చమురు ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం, మెటల్ రీసైక్లింగ్, ముడి పదార్థాల వ్యయాలను తగ్గించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్క్రాపింగ్ పాలసీ విజయవంతం కావాలంటే మౌలిక వసతుల ఏర్పాటు, స్క్రాప్ విలువల మదింపుపై మరింత స్పష్టత, స్క్రాప్ సర్టిఫికెట్ సామర్థ్యం వంటివి కీలకమని అభిప్రాయపడ్డారు. 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి 15 ఏళ్ల కంటే పాత వాహనాలు 1.1 మిలియన్ యూనిట్లు ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. అయితే ఆయా వాహనాల వినియోగం, స్వభావాలను బట్టి వాస్తవిక స్క్రాపేజీ సంభావ్యత కొంత మేర తగ్గొచ్చని తెలిపింది. -
ఆటోమొబైల్ రంగానికి బడ్జెట్ జోష్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈసారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణహితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. (చదవండి: బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం) వాయు కాలుష్య నివారణకుగాను రూ.2,217 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. కాలం చెల్లిన వాహనాల తుక్కు పాలసీ కింద వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మలా పేర్కొన్నారు. త్వరలో తుక్కు విధానం రాబోతున్న నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీల జోష్ పెరిగింది. ఆటో రంగంలో పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండటంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది.