సన్‌రూఫ్‌.. సూపర్‌ క్రేజ్‌! | Sunroofs are the most in-demand feature on new cars in India | Sakshi
Sakshi News home page

సన్‌రూఫ్‌.. సూపర్‌ క్రేజ్‌!

Published Thu, Nov 14 2024 5:22 AM | Last Updated on Thu, Nov 14 2024 8:00 AM

Sunroofs are the most in-demand feature on new cars in India

కారు ప్రియులను ఆకట్టుకుంటున్న ఫీచర్‌

అన్ని మోడల్స్‌లోనూ కోరుకుంటున్న కస్టమర్లు

ఉత్పత్తి భారీగా పెంచుతున్న దిగ్గజ సంస్థలు

హై డిమాండ్‌తో పెట్టుబడులకు క్యూ...  

బీచ్‌ రోడ్డులోనో... ఫారెస్ట్‌ దారిలోనో కారులో అలా ఓ లాంగ్‌ డ్రైవ్‌కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్‌రూఫ్‌ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్‌ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్‌ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్‌కు నిదర్శనం!

దేశీ ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పుడు సన్‌/మూన్‌ రూఫ్‌ మాంచి ట్రెండింగ్‌లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్‌ ‘టాప్‌’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్‌ కంపెనీలు ఎస్‌యూవీలు, సెడాన్‌లతో పాటు హ్యాచ్‌బ్యాక్స్‌లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్‌ ‘రూఫ్‌’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. 

నెదర్లాండ్స్‌కు చెందిన ఇనాల్ఫా రూఫ్‌ సిస్టమ్స్‌ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్‌ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్‌రూఫ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్‌ వెంచర్‌ (ఐజీఎస్‌ఎస్‌) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఐజీఎస్‌ఎస్‌కు ఏటా 2 లక్షల సన్‌రూఫ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్‌రూఫ్‌లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్‌ సన్‌రూఫ్‌ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి  రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేస్తోంది. 

ట్రెండ్‌ రయ్‌ రయ్‌... 
దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్‌ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్‌కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్‌రూఫ్‌ల తయారీ కోసం తాజాగా జపాన్‌కు చెందిన ఐసిన్‌ కార్ప్‌తో సాంకేతిక లైసెన్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

ప్రపంచంలోని టాప్‌–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్‌ కార్ప్‌ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్‌ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్‌రూఫ్‌ల వాడకం ఓ రేంజ్‌లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్‌ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్‌ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్‌ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో  మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్‌ కనిపిస్తోందన్నారు.

స్టేటస్‌ సింబల్‌... 
ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్‌ సింబల్‌గా మారుతున్నాయి. ఇందులో సన్‌రూఫ్‌ కూడా ఒకటి. క్రూయిజ్‌ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్‌ప్లేలు, అధునాతన డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్‌ వేరే లెవెల్‌. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని  జాటో డైనమిక్స్‌ ప్రెసిడెంట్‌ రవి భాటియా పేర్కొన్నారు.

ప్రతి నాలుగు కార్లలో ఒకటి... 
జాటో డైనమిక్స్‌ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్‌ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్‌) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. 

ముఖ్యంగా ఎస్‌యూవీల్లో సన్‌రూఫ్‌ ఫీచర్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉంది.  ఈ ఏడాది జనవరి–ఆగస్ట్‌ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్‌ టెక్నాలజీతో సన్‌రూఫ్‌లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్‌రూఫ్‌లను ‘స్మార్ట్‌రూఫ్‌’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్‌ సన్‌రూఫ్‌లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్‌ ఫీలింగ్‌ను కూడా అందిస్తాయని  భాటియా చెబుతున్నారు. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement