సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు, చిన్న బైక్‌లకు డిమాండ్
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి.
ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు.
కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి.
దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు.
ఎన్నికల ఖర్చు రికార్డ్...
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్‌లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment