న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్‌ను, హర్యానాలోని పానిపట్ యూనిట్‌లో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్‌గా వ్యవహరిస్తారు.
ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment