petrol diesel
-
Nirmala Sitharaman: పెట్రో జీఎస్టీ ఎంతన్నది... రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి
న్యూఢిల్లీ: ప్లాట్‌ఫాం టికెట్లకు ఇకపై జీఎస్టీ ఉండబోదు. వాటితో పాటు రిటైరింగ్ రూములు, వెయిటింగ్ రూములు, క్లోక్ రూములు, ప్లాట్‌ఫాంలపై బ్యాటరీ వాహనాలు తదితర రైల్వే సేవలపై కూడా జీఎస్టీ తొలగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా ఈ సందర్భంగా నిర్మల చర్చలు జరిపారు. కేంద్రం ఇచ్చే 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల పథకం ప్రయోజనాలను రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశమని ఆమె పునరుద్ఘాటించారు. ‘‘అందుకు అంగీకరించాల్సింది ఇక రాష్ట్రాలే. అవి ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి పెట్రోల్, డీజిల్‌పై ఎంత శాతం జీఎస్టీ వేయాలో నిర్ణయించుకుని కౌన్సిల్‌కు తెలపాలి’’ అని భేటీ అనంతరం నిర్మల మీడియాతో అన్నారు. ‘‘ఇన్పుట్ క్రెడిట్ పన్నులో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయం జరిగింది. ఇన్వాయిసింగ్ తదితరాల్లో అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఇకపై దేశవ్యాప్తంగా బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తున్నాం. జీఎస్టీ చెల్లింపు తుది గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30కి పొడిగించాం. తద్వారా వర్తలకులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థలు, పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది’’ అని మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు... → అన్ని రకాల సోలార్ కుక్కర్లపై ఇకనుంచి 12 శాతం జీఎస్టీ → అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. జమ్మూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల పళ్ల వ్యాపారులకు ప్రయోజనం. → స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. → విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా బయట ఉండే విద్యార్థులకు నెలకు రూ.20 వేల దాకా దాకా జీఎస్టీ మినహాయింపు → స్టీల్, అల్యుమినియం, ఇనుప పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ. → జీఎస్టీ ఎగవేత తదితర ఉదంతాల్లో జరిమానాలపై వడ్డీ ఎత్తివేత. -
భారత్‌లో ‘రిఫరెన్స్’ ఇంధనం ఉత్పత్తి షురూ..
న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్‌ను, హర్యానాలోని పానిపట్ యూనిట్లో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్‌ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అప్..
వ్యవసాయానికి డిమాండ్ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్ కండిషనింగ్ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరిగాయని తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్ పెరుగుదల 6.7 శాతం. ► నెలవారీగా చూస్తే డీజిల్ డిమాండ్ ఏప్రిల్‌లో 7.16 మిలియన్ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్ టన్నులకు చేరింది. ► ఇక పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్ 16.5 శాతం పెరిగింది. ► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ విక్రయాలు 1.4 శాతం, డీజిల్ 10.2 శాతం తగ్గాయి. ► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్ కండిషనింగ్ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం. ► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం అక్టోబర్–డిసెంబర్ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది. ► కోవిడ్ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది. ► మే 2021తో పోల్చితే డీజిల్ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి. పరిశ్రమ మాట.. ప్రభుత్వ, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం. జెట్ ఫ్యూయల్‌కు డిమాండ్ ఏవియేషన్ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఫ్యూయెల్ డిమాండ్ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్ 0.7% తక్కువగానే ఉంది. వంట గ్యాస్ అమ్మకాలూ అప్ మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. ఎల్పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్ చూసి నా (2023 ఏప్రిల్) మేనెల్లో ఎల్పీజీ డిమాండ్ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్ 2.19 మిలియన్ టన్నులు. -
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్‌లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్‌లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చిలో భారత్‌లో ఇంధన డిమాండ్ పెరిగింది. నెల మొదటి అర్ధభాగంలో కనిపించిన మందగమనాన్ని అధిగమిస్తూ, నెల మొత్తంగా ఇంధన డిమాండ్ పెరిగినట్లు పరిశ్రమల ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగం నుండి బలమైన డిమాండ్, చలికాలం తర్వాత రవాణా పుంజుకోవడం వంటి కారణాలతో ఫిబ్రవరిలో ఇంధన అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్చి మొదటి అర్ధభాగంలో కాలానుగుణంగా మందగమనం మొదలైంది. అయితే నెల రెండవ సగ భాగంలో తిరిగి ఎకానమీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ వ్యవసాయ రంగ క్రియాశీలత మెరుగుపడ్డం మెరుగైన ఫలితానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► గత ఏడాది మార్చితో పోలిస్తే 2023 మార్చిలో పెట్రోలు విక్రయాలు 5.1 శాతం పెరిగి 2.65 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అమ్మకాలు నెలవారీగా 3.4 శాతం పెరిగాయి. ► డీజిల్ విషయంలో మార్చిలో వార్షిక డిమాండ్ 2.1 శాతం పెరిగి 6.81 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ పరిమాణం 6.67 మిలియన్ టన్నులు. నెలవారీగా చూస్తే, డిమాండ్ 4.5 శాతం పెరిగింది. ► ఒక్క జెట్ ఫ్యూయెల్ డిమాండ్ పరిశీలిస్తే, డిమాండ్ 25.7 శాతం పెరిగి 614000 టన్నులుగా నమోదయ్యింది. ► కాగా, కుకింగ్ గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు మార్చిలో వార్షికంగా 3 శాతం పడిపోయి 2.37 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే, డిమాండ్ 6.54 శాతం పడిపోయింది. ఫిబ్రవరి డిమాండ్ 2.54 మిలియన్ టన్నులు. -
మార్చిలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో క్షీణత
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం నెమ్మదించింది. ఫిబ్రవరిలో గరిష్ట స్థాయి అమ్మకాలు నమోదు కాగా, మార్చి మొదటి 15 రోజుల్లో డిమాండ్ తగ్గినట్టు విక్ర,య గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. వ్యవసాయ రంగం, రవాణా రంగాల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఫిబ్రవరిలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఈ సమయంలో డిమాండ్ తగ్గడం సహజంగా కనిపిస్తుంటుంది. పెట్రోల్ అమ్మకాలు క్రితం ఏడాది మార్చి 1–15 కాలంతో పోల్చినప్పుడు.. ఈ ఏడాది అదే కాలంలో 1.4 శాతం తగ్గి 1.22 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. నెలవారీగా ఫిబ్రవరి గణాంకాలో పోల్చి చూస్తే 0.5 శాతం తగ్గాయి. డీజిల్ అమ్మకాలు 3.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 3.54 మిలియన్ టన్నులతో పోలిస్తే 10.2 శాతం తగ్గాయి. నెలవారీగా చూస్తే ఈ డిమాండ్ 4.6 శాతం క్షీణించింది. ఫిబ్రవరి నెల మొదటి భాగంలో పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం, డీజిల్ అమ్మకాలు 25 శాతం చొప్పున పెరగడం గమనార్హం. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 19.2 శాతం పెరిగి మార్చి మొదటి 15 రోజుల్లో 2,94,900 టన్నులుగా ఉన్నాయి. 2021 మార్చి మొదటి 15 రోజులతో పోలిస్తే 35 శాతం అధికం కాగా, 2020 మార్చి 15 రోజులతో పోలిస్తే 8.2 శాతం తక్కువ కావడం గమనించొచ్చు. దేశీ ఎయిర్ ట్రాఫిక్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకోగా, విదేశీ ఎయిర్ ట్రాఫిక్ మాత్రం పలు దేశాల్లో ఆంక్షల కారణంగా ఇంకా పుంజుకోవాల్సి ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక వంటగ్యాస్ (ఎల్పీజీ) విక్రయాలు 9.7 శాతం తగ్గి 1.18 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
పెట్రో ప్రొడక్టులకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ క్యాలండర్ ఏడాది(2022)లో దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ కనిపించనున్నట్లు చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల(ఒపెక్) నెలవారీ నివేదిక పేర్కొంది. పెట్రోల్, డీజిల్ తదితరాల డిమాండులో 7.73 శాతం వృద్ధి కనిపించనున్నట్లు అంచనా వేసింది. వెరసి 2021లో నమోదైన రోజుకి 4.77 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ) నుంచి 5.14 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)కు డిమాండు పుంజుకోనున్నట్లు తెలియజేసింది. ఇది అంతర్జాతీయంగా రికార్డ్‌కాగా.. చైనా డిమాండుతో పోలిస్తే 1.23 శాతం, యూఎస్‌కంటే 3.39 శాతం, యూరప్కంటే 4.62 శాతం అధికమని నివేదిక తెలియజేసింది. అయితే 2023లో దేశీ డిమాండు 4.67 శాతం వృద్ధితో 5.38 శాతానికి చేరనున్నట్లు అంచనా వేసింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.86 శాతంతో పోలిస్తే తక్కువకావడం గమనార్హం! ప్రపంచంలోనే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకోవడంతోపాటు.. వినియోగిస్తున్న దేశాల జాబితాలో అమెరికా, చైనా తదుపరి ఇండియా మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధి అండ పటిష్ట వృద్ధి(7.1 శాతం)ని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టుల డిమాండుకు దన్నునివ్వనున్నట్లు ఒపెక్ నివేదిక పేర్కొంది. కా గా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో రుతుపవనాల కారణంగా చమురుకు డిమాండ్ మందగించే వీలున్నదని, అయినప్పటికీ తదుపరి పండుగల సీజన్‌తో ఊపందుకోనున్నట్లు వివరించింది. ఇటీవల పరిస్థితులు (ట్రెండ్) ఆధారంగా ఈ ఏడాది ద్వితీయార్థం డిమాండులో డీజిల్, జెట్ కిరోసిన్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. కోవిడ్–19 ప్రభావంతో వీటికి గత కొంతకాలంగా డిమాండు క్షీణించిన విషయం విదితమే. -
Sri Lanka economic crisis: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత
కొలంబో: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు. ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్ కంపెనీలు ఇష్టపడడం లేదు. నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు. చమురు కొరతతో గత నెలలో పట్టణ ప్రాంత స్కూళ్లు రెండు వారాలు మూతపడ్డాయి. -
పెట్రోల్ ‘ట్యాంక్’ ఖాళీ అవుతోంది!.. క్రూడాయిల్ లెక్కలివీ..
పెట్రోల్.. డీజిల్.. ఇవి లేనిదే బండి కదలదు.. మనుషుల బతుకూ కదలదు.. రేటు పెరిగిందంటే కలకలమే. పొద్దున ఇంటికొచ్చే పాల ప్యాకెట్ నుంచి విమాన ప్రయాణం దాకా అన్నీ ఖరీదవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికైతే బిల్లు గుండె గుభేలుమనిపిస్తుంటుంది. ఇటీవలే మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడం, కేంద్రం కాస్త తగ్గించాక ఉపశమనం ఫీలవడం అందరికీ తెలిసిందే. మరోవైపు ప్రపంచంలో చమురు నిక్షేపాలు అడుగంటుతూ ఆందోళన రేపుతున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్ ఎలా వస్తుంది? ఎక్కడ ఎక్కువగా నిల్వలున్నాయి? అసలు ధర ఎంత? మనకు చేరేది ఎంతకనే వివరాలు తెలుసుకుందాం.. లక్షల ఏళ్ల కింద సముద్రం అడుగున కూరుకుపోయిన జంతు, వృక్ష అవశేషాలు.. విపరీతమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ముడి చమురుగా మారాయి. శిలాజాల నుంచి వచ్చే ఇంధనం కాబట్టి శిలాజ ఇంధనమని పిలుస్తారు. కొన్నిచోట్ల నేచురల్ గ్యాస్ రూపంలోనూ ఉంటాయి. విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ముడి చమురు వనరులు తగ్గిపోతున్నాయి. ఇలాగే కొన సాగితే మరో 47 ఏళ్లలో భూమ్మీ ద పెట్రోలియం నిల్వలు ఖాళీ అయిపోతాయని అంచనా. వేల ఏళ్ల నుంచీ వినియోగం యూరప్, అమెరికా, మధ్యాసి యా, చైనా తదితర దేశాల్లో వేల ఏళ్ల కిందటి నుంచీ చమురు విని యోగం ఉంది. భూమి పొరల్లో పగుళ్ల నుంచి పైకి ఉబికి వచ్చే చమురును వివిధ అవసరాలకు వాడేవారు. 1850 సంవత్సరంలో ముడి చమురు నుంచి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలు, కందెన (లూబ్రికెంట్)ను వేరు చేసే పద్ధతులను కనిపెట్టడంతో.. వినియోగం పెరిగిపోయింది. కిరోసిన్, పె ట్రోల్‌తో నడిచే వాహనాలు వచ్చాయి. వీధి లైట్లు వెలిగించడం, పరిశ్రమల్లో వినియోగించడం మొదలైంది. తర్వాత అసలు పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మానవ మనుగడే ముందుకు కదలనంత గా మారిపోయింది. అంతర్జాతీయంగా ఏదైనా స మస్య ఏర్పడినా,దేశాల మధ్య యుద్ధం వచ్చినా చమురు ధరలకు రెక్కలు రావడం.. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైనే ఆధారపడిన ఇండియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రూడాయిల్ లెక్కలివీ.. ►ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన చమురు నిక్షేపాలు: 1,65,058 కోట్ల బ్యారెళ్లు ►వెనెజువెలా 18.2శాతం నిక్షేపాలతో టాప్‌లో ఉండగా.. సౌదీ (16.2%), కెనడా (10.4%), ఇరాన్ (9.5%), ఇరాక్ (8.7%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ►ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ఉత్పత్తి జరుగుతున్న దేశాలు: 127 ►మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో ఒక్క అమెరికా వాటా: 20.3% ►టాప్–10 దేశాలు వాడేస్తున్న క్రూడాయిల్: 60 శాతం ►ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 50 వేలకుపైగా చమురు బావులు ఉన్నా యి. అందులో 2–3 వేల బావుల్లోనే 95%పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ముడి చమురు ధరల లెక్క ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎడారులు, తీర ప్రాంతాల్లో, తీరానికి కాస్త దూరంగా సముద్రతలం దిగువన (డీప్ వాటర్) ముడి చమురు నిక్షేపాలను గుర్తించారు. ఇందులోనూ నేరుగా భారీగా ఉండే చమురు రిజర్వాయర్లు కొన్నికాగా.. రాతిపొరల మధ్య ఉండే (షేల్) నిక్షేపాలు మరికొన్ని. సౌదీ వంటి దేశాల్లో ఎడారుల్లో భారీ నిక్షేపాలు ఉన్నాయి. దానితో ఉత్పత్తి ధర తక్కువ. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, యూరప్ దేశాల్లో తీరప్రాంతాలకు కాస్త దూరంగా సముద్రతలం దిగువన నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీయడం కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇక షేల్ నిక్షేపాల నుంచి చమురు తీయడానికి మరింత వ్యయం అవుతుంది. ఉత్పత్తి ఖర్చు ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను బట్టి ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి. ►సగటున చూస్తే సౌదీలో ఒక్కో బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తికి కేవలం 3డాలర్లు (సుమారు రూ.230) ఖర్చయితే.. గల్ఫ్ దేశాలు, రష్యా, పలు ఆఫ్రికా దేశాల్లో సగటున 15డాలర్ల (రూ.1,160) వరకు, అమెరికా–యూరప్ దేశాల్లో 50–60 డాలర్ల (రూ. 3,800–రూ.4,600) వరకు ఖర్చవుతుంది. ►ప్రస్తుతం మార్కెట్లో బ్యారెల్ ధర సుమారు 113 డాలర్ల (రూ.8,773) వద్ద ఉంది. ►చమురును శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులకు వేర్వేరు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. ►క్రూడాయిల్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలు చాలా వరకు సొంతంగా వినియోగించుకుంటున్నాయి. అదే కేవలం ఎగుమతులను బట్టి చూస్తే.. ప్రపంచంలో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా, ఇరాక్, కెనడా, అమెరికా, నైజీరియా, కువైట్, బ్రెజిల్, కజకిస్థాన్, నార్వే ఉన్నాయి. దేశంలో సగానికిపైగా పన్నులే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ల రీటైల్ ధరల్లో సగానికిపైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే కావడం గమనార్హం. కేంద్ర పన్ను దేశవ్యాప్తంగా ఒకేలా ఉండగా, ఆయా రాష్ట్రాల్లో పన్నులు వేర్వేరుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా క్రూడాయిల్ ధరలను బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్‌ల మూల ధర సగటున సుమారు రూ.49–రూ.52 మాత్రమే. కానీ కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలిపి పెట్రోల్ ధర రూ.96 నుంచి రూ.112 మధ్య.. డీజిల్ ధర రూ.87 నుంచి రూ.99 మధ్య ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర, పన్నులు ►లీటర్ పెట్రోల్ మూల ధర: రూ.49.2 ►కేంద్ర పన్నులు: రూ.28 ►డీలర్ల కమీషన్: రూ.5.45 ►రాష్ట్ర పన్నులు: రూ.26.95 ►మొత్తంగా రీటైల్ ధర: రూ.109.7 ( మే 25 నుంచి జూన్ 3 వరకు సగటు ధరల ఆధారంగా లెక్కించారు. రవాణా వ్యయం, ఇతర అంశాల ఆధారంగా స్థానికంగా ధర మారుతుంది.) ఇండియా ఎక్కడ? ►ఇప్పటివరకు గుర్తించిన మొత్తం చమురు నిల్వలు: 472.9 కోట్ల బ్యారెళ్లు ►ప్రపంచ క్రూడాయిల్ నిల్వల్లో శాతం: 0.29 ►ఉత్పత్తిలో ర్యాంకు: 20 ►దేశంలో రోజువారీ ఉత్పత్తి: 10.16 లక్షల బ్యారెళ్లు ►రోజువారీ వినియోగం: 44.43 లక్షల బ్యారెళ్లు ►దిగుమతి చేసుకోకుండా ఇండియాలోని చమురు వనరులను మొత్తం వాడేస్తే.. కేవలం మూడేళ్లలో ఖాళీ అయిపోతాయని అంచనా. చరిత్ర ఇదీ ► ప్రపంచంలో మొదటగా చైనీయులు పెట్రోలియంను ఇంధనంగా ఉపయోగించారు. ► క్రీస్తుశకం 347వ సంవత్సరంలోనే చైనాలో చమురు బావులు తవ్వినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ►ప్రపంచంలో వాణిజ్యపరంగా 1837లో తొలి క్రూడాయిల్ రిఫైనరీని అజర్బైజాన్లో ప్రారంభించారు. అక్కడే 1846లో తొలి చమురు బావిని తవ్వారు. ►అమెరికాలో 1859లో తొలి అధునాతన ఆయిల్ బోర్వెల్ను తవ్వారు. ముడి చమురు నుంచి ఏమేం వస్తాయి? క్రూడాయిల్‌ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారె ల్ అంటే దాదాపు 159 లీటర్లు (42 గ్యాలన్లు). దీని నుంచి 73 లీటర్ల పెట్రోల్, 35 లీటర్ల వరకు డీజిల్, 15.5 లీటర్ల మేర జెట్ ఫ్యూయల్, ఒక లీటర్ కిరోసిన్ వస్తాయి. మరో 42 లీటర్ల మేర హెవీ ఫ్యూయల్ ఆయిల్స్, లూబ్రికెంట్స్, స్టిల్ గ్యాస్, ఆస్ఫాల్ట్, కోక్ వంటి ఇతర ఉత్పత్తులు వెలువడతాయి. ►ప్రస్తుతం మన కరెన్సీలో ఒక లీటర్ క్రూడాయిల్ ధర సుమారు రూ.78కాగా.. శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.49, డీజిల్ ధర రూ.52 వరకు ఉంటుంది. ►పెట్రోల్, డీజిల్ రెండూ నీళ్లలా పారదర్శకంగా ఉంటాయి. వాటిని సరిగా గుర్తించేందుకు రంగులు కలుపుతారు. ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌లో నీలం–ఆకుపచ్చ కలిసిన రంగును.. డీజిల్‌లో నారింజ రంగును కలుపుతాయి. హైపవర్, ప్రీమియం వంటి పెట్రోల్‌కు పసుపు రంగును కలుపుతుంటారు. ఖాళీ అయితే ఎలా? ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మన జీవితాన్ని ఊహించలేం. ఇంట్లో వంట చేసుకునే ఎల్పీజీ నుంచి.. బైకులు, కార్లు, బస్సులు, నౌకలు, విమానాలకు ఇంధనం దాకా.. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ వంటి ఎన్నో ఉత్పత్తులకు చమురే ఆధారం. మరి భూమిపై చమురు నిక్షేపాలన్నీ ఉన్నట్టుండి ఖాళీ అయితే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవడానికే భయం గొలుపుతుంది. అందుకే శా స్త్రవేత్తలు సౌర, పవన, ఇతర ప్రత్యా మ్నాయ విద్యుదుత్పత్తిపై, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టిపెట్టారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పెట్రోల్, డీజిల్ ‘కట్’కట
సాక్షి, నెట్వర్క్: భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు ఆయా బంకుల వాస్తవ కోటాకు కోత వేయడంతోపాటు క్రెడిట్ సదుపాయాన్ని రద్దుచేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులు వారంలో నాలుగు రోజులపాటు నో స్టాక్ బోర్డులు తగిలించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కొరత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకుల్లోనే తలెత్తుతుండటంతో ఆయా డీలర్లు లబోదిబోమంటున్నారు. క్రెడిట్ విధానం రద్దు చేయటంతో వారు నగదు చెల్లించి బుక్ చేసిన ట్యాంకర్లను సైతం నాలుగైదు రోజులు ఆలస్యంగా పంపుతున్నారు. అలాగే, వారి కోటాలో 50 నుంచి 75 శాతమే సరఫరా చేస్తుండటంతో డీలర్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. త్వరలో వ్యవసాయ, విద్యా సంవత్సరాలు ప్రారంభమవుతున్న సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సాధారణ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బంక్‌ల నిర్వహణ కష్టంగా మారుతోందని డీలర్లే స్వచ్ఛందంగా బంకులు బంద్ చేసుకుంటున్నారు. కోటాకు కోతలొద్దు గత వారం రోజులుగా రేషనింగ్ విధానంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే పలు బంకులు మూతపడే స్థాయికి చేరాయి. క్రెడిట్ విధానం లేదంటున్న కంపెనీలు నగదు చెల్లించిన వారికి సైతం పూర్తి కోటాను ఇవ్వడం లేదు. వెంటనే పూర్తి కోటా కేటాయించి, డీలర్ల కమీషన్ సైతం పెంచాలి. – అమరేందర్రెడ్ది, రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు, హైదరాబాద్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు వినియోగదారుల కోటాకు కత్తెర వేస్తున్నాయి. దీంతో సరిపడా స్టాక్ లేక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలి. – దినేష్‌రెడ్డి, డీలర్స్ అసోసియేషన్, నిజామాబాద్ సరిపడా సరఫరా లేదు గతంలో క్రెడిట్‌పై ఇండెంట్ పెట్టినా డిపోల నుంచి ఇంధన ట్యాంకర్లు పంపేవారు. ఇప్పుడు డబ్బులు కట్టినా పూర్తి కోటా ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో డీజిల్‌పై రూ.26, పెట్రోల్‌పై రూ.8 భారం పడుతోందని ఒక్కో సేల్స్ ఆఫీసర్ కోటా పరిధిలో సగానికి చేశారు. బల్క్ సరఫరా కూడా బంక్‌ల నుంచే జరుగుతుండటంతో మరింత కొరత ఏర్పడింది. – పొన్నాల వినయ్, డీలర్, బీపీసీఎల్, క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా -
రేట్లు రయ్ రయ్..దేశంలో కనుమరుగు కానున్న శిలాజ ఇంధనాల వినియోగం!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంధన ధరల వల్ల తమ వ్యయ శక్తి గణనీయంగా పడిపోతోందని ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ (శిలాజ) ఇంధన వనరుల వినియోగం నుంచి తమ దేశాలు వేగంగా వైదొలగడమే మంచిదని కోరుకుంటున్నారు. ఈ మేరకు డిమాండ్ చేస్తున్న ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్–ఇప్సోస్ మొత్తం 30 దేశాల్లో 22,534 మంది అభిప్రాయాలను స్వీకరించి ఈ నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 మధ్య జరిగిన సర్వేలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రతి పది మందిలో సగటున ఎనిమిది మంది వచ్చే ఐదేళ్లలో తమ దేశం శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ దేశానికి సంబంధించి సర్వేలో పాల్గొన్న వారి విషయంలో ఈ నిష్పత్తి దాదాపు 90 శాతం కంటే ఎక్కువగా ఉంది. ► 84 శాతం మంది తమ స్వంత దేశం స్థిరమైన ఇంధన వనరులకు మారాలని సూచించారు. ► ధరల పెరుగుదలకు తమ ప్రభుత్వాల వాతావరణ విధానాలే కారణమని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► రోజువారీ ఖర్చుల్లో ఏ విభాగం కొనుగోలు శక్తిని భారీగా దెబ్బతీస్తోందన్న అంశంపై సర్వే దృష్టి సారించింది. ఇంధనం, రవాణా, ఎయిర్ కండీషనింగ్, వంట, విద్యుత్ ఉపకరణాల వినియోగం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సగటున 30 దేశాలలో సగానికి పైగా వినియోగదారులు (55 శాతం) ఇంధన ధరల పెరుగుదల వల్లే తమ కొనుగోలు శక్తి గణనీయంగా ప్రభావితమవుతోందని తెలిపారు. అయితే దేశాల వారీగా ఈ శాతం విభిన్నంగా ఉంది. దక్షిణాఫ్రికా విషయంలో ఈ రేటు 77 శాతం ఉంటే, జపాన్, టర్కీ విషయంలో 69 శాతంగా ఉంది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో ఈ శాతం తక్కువ స్థాయి లో 37 శాతంగా ఉంది. భారత్‌కు సంబంధించి 63 శాతంగా నమోదయ్యింది. భారత్ రెస్పాండెంట్లలో 63 శాతం మంది తాము ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ► ఇంధన ధరల పెరుగుదలకు కారణాలు కూడా విభిన్నంగా ఉండడం గమనార్హం. ► చమురు, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత దీనికి కారణమని 28 శాతం మంది అభిప్రాయపడితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణాన్ని 25 శాతం మంది పేర్కొన్నారు. మరో 18 శాతం మంది పెరిగిన డిమాండ్, సరఫరాల సమస్య కారణమని పేర్కొన్నారు. 16 శాతం మంది తమకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. 13 శాతం మంది మాత్రమే తమ ప్రభుత్వాల వాతావరణ మార్పు విధానాలను నిందించారు. దేశాల వారీగా సర్వేలో పాల్గొన్న వారిలో ఈ శాతాన్ని పరిశీలిస్తే భారత్ 24 శాతంలో ఉండగా, జర్మనీ, పోలాండ్లలో వరుసగా 20 శాతం, 19 శాతాలుగా నమోదయ్యాయి. ► ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాతావరణ విధానాలే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ఏ దేశంలోనూ మెజారీటీ రెస్పాండెంట్లు పేర్కొనలేదు. భారత దేశంలో సర్వేలో పాల్గొన్నవారు ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం చమురు, గ్యాస్ మార్కెట్ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లేనని అభిప్రాయపడ్డారు. తరు వాతి స్థానంలో సరఫరాలు తగినంతగా లేకపోవడం, ప్రభుత్వాలు అనుసరిస్తునన వాతావరణ మార్పు విధానాలు దీనికి కారణంగా ఉన్నాయి. ► రాబోయే ఐదేళ్లలో శిలాజ ఇంధనాల నుండి మరింత వాతావరణ అనుకూలమైన–స్థిరమైన ఇంధన వనరులకు దేశాలు మారడం ఎంత ముఖ్యమన్న విషయంపై ప్రధాన ప్రశ్నను సంధించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సర్వే లో పాల్గొన్న వారిలో 84 శాతం మంది (సగటున ఐదుగురిలో నలుగురి కంటే ఎక్కువ మంది) ఇది తమకు ఎంతో కీలకమని చెప్పారు. ఈ విషయంలో రష్యాలో అతి తక్కువగా 72 శాతంతో ఉంది. అమెరికాలో ఈ రేటు 75 శాతం ఉండగా, భారత్ విషయంలో 89 శాతం. దక్షిణాఫ్రికా, పెరూలో 93 శాతం మంది దీనికి అనుకూలంగా వోటు వేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ► శిలాజ ఇంధనాల నుంచి దూరంగా జరగాలని భావిస్తున్న వారిలో పురుషుల కంటే (81%) మహిళలు (87%) అధికంగా ఉన్నారు. -
అగ్గిపుల్ల లేకుండా మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు
-
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే
లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్టీ పన్ను విధించింది. లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్ 30తో ముగిసే మెడికల్ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు. ► కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. ► బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ రేటు కోత. ► బయో–డీజిల్ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పరి్మట్ ఫీజు జీఎస్టీ నుంచి మినహాయింపు ► లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్టీ చెల్లింపు మినహాయింపు. ► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్టీ. ► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. -
Petrol Diesel: ధరలపై వామపక్షాలు భగ్గు
గన్‌ఫౌండ్రీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలపై కనికరం లేకుండా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ, సీపీఐ(ఎం), ఎస్‌యూసీఐ (సీ) తదితర వామపక్ష పార్టీల నాయకులు బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం మోసాల ప్రభుత్వమని, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కేరళ ప్రభుత్వం 12 శాతం పన్ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేసిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం నాడు పన్నులను తగ్గించారని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్‌యూసీఐ (సీ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి మాట్లాడుతూ.. 70 శాతం వరకు పన్నులను పెంచే అధికారం మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని, కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధాని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్ష, విప్లవకారులపై మోదీ ప్రభుత్వం నిర్భంద చట్టాలను ప్రయోగిస్తోందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, నగర కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రమ, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయగ్, ఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు స్టాలిన్, ఎస్‌యూసీఐ (సీ) పార్టీతో పాటు పలు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పెట్రో ధరలపై ‘ధర్మ్ సంకట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య. దీనికి ధరలు తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయ సమాధానం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. ‘వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ‘ధర్మ్ సంకట్’ పరిస్థితి. వినియోగదారులకు తుది ధర లేదా రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాలి’ అని నిర్మల వ్యాఖ్యానించారు. ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నిర్ణయిస్తాయ ని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని ఆమె పేర్కొన్నారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్ వంటి ఖర్చులను బట్టి ఓఎంసీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు. -
2030లోనే ఆ వాహనాల అమ్మకాలపై బ్యాన్!
లండన్: పదేళ్ల తర్వాత బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు ఇక కనుమరుగు కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2030 నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాల అమ్మకంపై నిషేధం విధించనున్నట్లు వచ్చే వారం బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం 2040 నుంచి వీటి అమ్మకాలపై నిషేధం విధించాలనుకుందట. అయితే గ్రీన్‌హౌజ్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు బోరిస్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా సమాచారం. దీంతో ప్రధాని నిషేధం గడువు కాలాన్ని తగ్గించినట్లు అక్కడి ఫైనాన్స్ టైమ్స్ మీడియా పేర్కొంది. పర్యావరణ విధానంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వాహనాల అమ్మకాల నిషేధాన్ని 2030కే అమలు చేయాలని నిర్ణయించినట్లు సదరు మీడియా పేర్కొంది. (చదవండి: బ్రిటన్ ప్రధాని నోటి వెంట రాముడు.. సీత) అయితే ఎలక్ట్రిక్, శిలాజ ఇంధన చోదక మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసే కొన్ని హైబ్రిడ్ కార్లకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, ఇంకా 2035 వరకు ఈ వాహనాలను విక్రయించవచ్చని స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త కార్ల అమ్మాకాల్లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు 73.6 శాతం ఉండగా ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కేవలం 5.5 శాతం మాత్రమే ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలలో వెల్లడైంది. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!) -
చమురు బంగారు బాతా?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర శీఘ్రగతిన పతనమవుతోంది. బ్యారెల్ 150 డాలర్ల వరకు ఎగబాకిన చమురు ధర ప్రస్తుతం 30 డాలర్ల దిగువకి దిగజారింది. 20 డాలర్లకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. చమురు అవసరాలలో 80 శాతం కోసం దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌కు ఇది శుభపరిణామం. కానీ, ముడి చమురు ధర తగ్గిన మేరకు కేంద్రం వినియోగదారునికి ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవటం విచారకరం. బ్యారెల్ చమురు ధర 150 డాలర్లున్ననాటికి, 30 డాలర్లుకు పడిపోయిన నేటికి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా తేడా లేదు. కారణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధత లేకుండా డ్యూటీలు, పన్నుల పేరుతో మోపుతున్న ఆర్థిక భారమే. గత 18 నెలలలో ముడి చమురు ధరలలో 23% తగ్గుదల ఉండగా... మన వినియోగదారులకు ధర 4% మాత్రమే తగ్గింది. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా పన్నులు వేయాలన్నది ప్రాథమిక పరిపాలనా సూత్రం. కానీ మన పన్నుల వ్యవస్థ ఆది నుంచి అస్తవ్యస్థంగానే ఉంది. ఇక, పెట్రో ఉత్పత్తులు వినియోగదారునికి చేరేలోపు అడుగడుగునా ఎన్నో రకాల డ్యూటీలు, పన్నులు, సెస్‌లు, సర్ చార్జీలు... కొన్ని కేంద్రానివి, మరికొన్ని రాష్ట్రాలవి. 2016 జనవరిలో అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్ (159 లీటర్లు) 30 డాలర్లు అనుకుందాం. మన కరెన్సీలో లీటర్ ముడి పెట్రోలు రూ.12.45 అవుతుంది. పన్నులు, సుంకాలు, ఖర్చులు కలుపుకుంటే చివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.59.04 (25% వ్యాట్‌తో) అవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో పెట్రో ఉత్పత్తులపై 34% వ్యాట్ విధిస్తున్నారు. దీంతో ధర రూ. 68కి చేరుతుంది. అంటే, ముడిపెట్రోలు ధర, శుద్ధి చేసిన పెట్రోలుగా వినియోగదారునికి చేరేసరికి సుమారు నాలుగున్నర రెట్లు పెరుగుతుంది. అలాగే డీజిల్ ధర కూడా నాలుగు రెట్లు పెరుగుతోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆరుసార్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచింది. కాబట్టే ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఆ మేరకు తగ్గలేదు. చమురు ధరల పతనం వల్ల దేశానికి సమకూరిన మిగులు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు. ఇక ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల గత ఏడాది సుమారు రూ. 80,000 కోట్లు అదనపు ఆదాయం లభించగా, 2016 పెంపు వల్ల మరో రూ. 3,700 కోట్లు సమకూరుతుంది. ఈ ప్రభుత్వ తీరుపై ఎన్ని విమర్శలు చెలరేగినా కేంద్రం లెక్క చేయడం లేదు. వ్యాట్ విధింపులో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి పొంతన కనపడదు. ఈ పన్నులుగాక ఎక్సైజ్ డ్యూటీ, సెస్, సర్ చార్జి లాంటివి కూడా వడ్డిస్తున్నారు. పైగా అదనపు సెస్ ఎంట్రీ టాక్స్, స్పెషల్ సెస్, స్వచ్ఛభారత్ సెస్ లాంటి పేర్లతో ఇష్టానుసారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేస్తున్నాయి. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా రాష్ట్రాలు వ్యాట్ విధిస్తాయి! పన్ను మీద పన్ను! సామాన్యుల నడ్డి విరవడానికి వెరవని రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులు ప్రయాణించే విమాన ఇంధనంపై నామమాత్రపు వ్యాట్‌ను విధిస్తోంది. రైతుల నుంచి సకల వృత్తుల సామాన్యులు వాడే డీజిల్‌పై వ్యాట్ పెంచుతున్నారు. దీంతో వారి ఇంధన, రవాణా వ్యయాలు పెరిగిపోతున్నాయి. కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే. మన దేశంలో డీజిల్ వినియోగం ఎక్కువ. చమురు ధరల పతనానికి అనుగుణంగా డీజిల్ ధరను తగ్గించి ఉంటే ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగేది. రైతు పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. దేశంలో 2010లో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. అంటే, అంతర్జాతీయ ధరల ఎగుడు దిగుడులకు అనుగుణంగా దేశంలో చమురు ధరలు పెరగడం లేదా తగ్గడం జరగాలి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తదుపరి 2007 నుంచే చమురు ఉత్పత్తులపై సబ్సిడీలు తగ్గుతూ వచ్చాయి. (2015) 2007-2014 మధ్య ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ. 3.10 లక్షల కోట్లు కాగా, అదే కాలంలో పన్నుల రూపేణా దానికి రూ. 6.21 లక్షల కోట్లు సమకూరింది. అంటే, చమురు రంగ సబ్సిడీలు మిథ్యే. పైగా వంట గ్యాస్‌పై సబ్సిడీలను కూడా వీలైనంత మేరకు తగ్గించేలా మోదీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం ఆచరణ రీత్యా నిజం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటి ధరలను నియంత్రిస్తున్నాయి. కాబట్టే చమురు ధరల పతనం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా పోగా, పన్నుల భారం పెరుగుతోంది. పెట్రోలియం ఉత్పత్తులను అవి బంగారు గుడ్లు పెట్టే బాతుగా పరిగణిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం ముడి చమురు ధరలు గరిష్టంగా పెరగగా ప్రతిపక్షాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించి, ప్రజలను ఆదుకోవాలని ఆందోళన సాగించాయి. అవే రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కి గతంలో కంటే భారీగా పన్నులను పెంచాయి. చమురు ధరల పతనం లబ్ధి ప్రజలకు అందకుండా చేస్తున్నాయి. అసలుకంటే వడ్డీ భారం అన్నట్లు పెట్రోల్, డీజిల్ వినియోగంలో చమురు ధరలకంటే పన్నుల భారం అధికంగా మారింది. పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను హేతుబద్ధీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్థిక, సామాజిక స్థితిగతులను, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చటం లక్ష్యంగానే పన్నుల విధింపు ఉండాలని కౌటిల్యుని నుంచి ఆడంస్మిత్ వరకు ఎందరో ఆర్థిక శాస్త్రవేత్తలు ఉద్ఘోషించారు. కానీ మనదేశంలో అందుకు విరుద్ధంగా... సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుస్తూ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అల్లకల్లోలం చేస్తూ హేతు విరుద్ధమైన పన్నుల విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. -డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు సెల్ : 99890 24579