వరంగల్‌లో స్టాక్ లేక మూత పడ్డ బంక్
సాక్షి, నెట్‌వర్క్: భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు ఆయా బంకుల వాస్తవ కోటాకు కోత వేయడంతోపాటు క్రెడిట్ సదుపాయాన్ని రద్దుచేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు బంకులు వారంలో నాలుగు రోజులపాటు నో స్టాక్ బోర్డులు తగిలించుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కొరత బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకుల్లోనే తలెత్తుతుండటంతో ఆయా డీలర్లు లబోదిబోమంటున్నారు.
క్రెడిట్ విధానం రద్దు చేయటంతో వారు నగదు చెల్లించి బుక్ చేసిన ట్యాంకర్లను సైతం నాలుగైదు రోజులు ఆలస్యంగా పంపుతున్నారు. అలాగే, వారి కోటాలో 50 నుంచి 75 శాతమే సరఫరా చేస్తుండటంతో డీలర్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. త్వరలో వ్యవసాయ, విద్యా సంవత్సరాలు ప్రారంభమవుతున్న సమయంలో డీజిల్, పెట్రోల్ కొరత సాధారణ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బంక్‌ల నిర్వహణ కష్టంగా మారుతోందని డీలర్లే స్వచ్ఛందంగా బంకులు బంద్ చేసుకుంటున్నారు.
కోటాకు కోతలొద్దు
గత వారం రోజులుగా రేషనింగ్ విధానంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే పలు బంకులు మూతపడే స్థాయికి చేరాయి. క్రెడిట్ విధానం లేదంటున్న కంపెనీలు నగదు చెల్లించిన వారికి సైతం పూర్తి కోటాను ఇవ్వడం లేదు. వెంటనే పూర్తి కోటా కేటాయించి, డీలర్ల కమీషన్ సైతం పెంచాలి.
– అమరేందర్‌రెడ్ది, రాష్ట్ర పెట్రోల్ డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు, హైదరాబాద్
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు వినియోగదారుల కోటాకు కత్తెర వేస్తున్నాయి. దీంతో సరిపడా స్టాక్ లేక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలి.
– దినేష్‌రెడ్డి, డీలర్స్ అసోసియేషన్, నిజామాబాద్
సరిపడా సరఫరా లేదు
గతంలో క్రెడిట్‌పై ఇండెంట్ పెట్టినా డిపోల నుంచి ఇంధన ట్యాంకర్లు పంపేవారు. ఇప్పుడు డబ్బులు కట్టినా పూర్తి కోటా ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ యుద్ధప్రభావంతో డీజిల్‌పై రూ.26, పెట్రోల్‌పై రూ.8 భారం పడుతోందని ఒక్కో సేల్స్ ఆఫీసర్ కోటా పరిధిలో సగానికి చేశారు. బల్క్ సరఫరా కూడా బంక్‌ల నుంచే జరుగుతుండటంతో మరింత కొరత ఏర్పడింది.
– పొన్నాల వినయ్, డీలర్, బీపీసీఎల్, క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment