సాక్షి,హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు.
అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్‌లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు, డ్రైవర్లకు పదిలక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష విదించేలా ఇటీవలే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపు ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్ల యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు.
ఇదీచదవండి.. చలాన్ల చెల్లింపుపై వాహనదారులకు పోలీసుల హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment