Fuel Taxes in India: Reason behind Petrol and Diesel Prices Hike and History Details in Telugu - Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ‘ట్యాంక్‌’ ఖాళీ అవుతోంది!.. క్రూడాయిల్‌ లెక్కలివీ.. 

Published Sun, Jun 5 2022 2:38 AM | Last Updated on Sun, Jun 5 2022 9:07 AM

Petrol Diesel Taxes More Than The Actual Price - Sakshi

పెట్రోల్‌.. డీజిల్‌.. ఇవి లేనిదే బండి కదలదు.. మనుషుల బతుకూ కదలదు..  రేటు పెరిగిందంటే కలకలమే. పొద్దున ఇంటికొచ్చే పాల ప్యాకెట్‌ నుంచి విమాన ప్రయాణం దాకా అన్నీ ఖరీదవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికైతే బిల్లు గుండె గుభేలుమనిపిస్తుంటుంది.

ఇటీవలే మన దేశంలో పెట్రోల్‌ ధరలు ఆకాశాన్ని తాకడం, కేంద్రం కాస్త తగ్గించాక ఉపశమనం ఫీలవడం అందరికీ తెలిసిందే. మరోవైపు ప్రపంచంలో చమురు నిక్షేపాలు అడుగంటుతూ ఆందోళన రేపుతున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్‌ ఎలా వస్తుంది? ఎక్కడ ఎక్కువగా నిల్వలున్నాయి? అసలు ధర ఎంత? మనకు చేరేది ఎంతకనే వివరాలు తెలుసుకుందాం..

లక్షల ఏళ్ల కింద సముద్రం అడుగున కూరుకుపోయిన జంతు, వృక్ష అవశేషాలు.. విపరీతమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ముడి చమురుగా మారాయి. శిలాజాల నుంచి వచ్చే ఇంధనం కాబట్టి శిలాజ ఇంధనమని పిలుస్తారు. కొన్నిచోట్ల నేచురల్‌ గ్యాస్‌ రూపంలోనూ ఉంటాయి. విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ముడి చమురు వనరులు తగ్గిపోతున్నాయి. ఇలాగే కొన సాగితే మరో 47 ఏళ్లలో భూమ్మీ ద పెట్రోలియం నిల్వలు ఖాళీ అయిపోతాయని అంచనా. 

వేల ఏళ్ల నుంచీ వినియోగం
యూరప్, అమెరికా, మధ్యాసి యా, చైనా తదితర దేశాల్లో వేల ఏళ్ల కిందటి నుంచీ చమురు విని యోగం ఉంది. భూమి పొరల్లో పగుళ్ల నుంచి పైకి ఉబికి వచ్చే చమురును వివిధ అవసరాలకు వాడేవారు. 1850 సంవత్సరంలో ముడి చమురు నుంచి కిరోసిన్, పెట్రోల్‌ వంటి ఇంధనాలు, కందెన (లూబ్రికెంట్‌)ను వేరు చేసే పద్ధతులను కనిపెట్టడంతో.. వినియోగం పెరిగిపోయింది.

కిరోసిన్, పె ట్రోల్‌తో నడిచే వాహనాలు వచ్చాయి. వీధి లైట్లు వెలిగించడం, పరిశ్రమల్లో వినియోగించడం మొదలైంది. తర్వాత అసలు పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మానవ మనుగడే ముందుకు కదలనంత గా మారిపోయింది. అంతర్జాతీయంగా ఏదైనా స మస్య ఏర్పడినా,దేశాల మధ్య యుద్ధం వచ్చినా చమురు ధరలకు రెక్కలు రావడం.. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైనే ఆధారపడిన ఇండియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

 క్రూడాయిల్‌ లెక్కలివీ.. 
ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన చమురు నిక్షేపాలు: 1,65,058 కోట్ల బ్యారెళ్లు 
వెనెజువెలా 18.2శాతం నిక్షేపాలతో టాప్‌లో ఉండగా.. సౌదీ (16.2%), కెనడా (10.4%), ఇరాన్‌ (9.5%), ఇరాక్‌ (8.7%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ ఉత్పత్తి జరుగుతున్న దేశాలు: 127 
మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో ఒక్క అమెరికా వాటా: 20.3% 
టాప్‌–10 దేశాలు వాడేస్తున్న క్రూడాయిల్‌: 60 శాతం 
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 50 వేలకుపైగా చమురు బావులు ఉన్నా యి. అందులో 2–3 వేల బావుల్లోనే 95%పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. 

 ముడి చమురు ధరల లెక్క ఇలా.. 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎడారులు, తీర ప్రాంతాల్లో, తీరానికి కాస్త దూరంగా సముద్రతలం దిగువన (డీప్‌ వాటర్‌) ముడి చమురు నిక్షేపాలను గుర్తించారు. ఇందులోనూ నేరుగా భారీగా ఉండే చమురు రిజర్వాయర్లు కొన్నికాగా.. రాతిపొరల మధ్య ఉండే (షేల్‌) నిక్షేపాలు మరికొన్ని. సౌదీ వంటి దేశాల్లో ఎడారుల్లో భారీ నిక్షేపాలు ఉన్నాయి. దానితో ఉత్పత్తి ధర తక్కువ.

ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, యూరప్‌ దేశాల్లో తీరప్రాంతాలకు కాస్త దూరంగా సముద్రతలం దిగువన నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీయడం కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇక షేల్‌ నిక్షేపాల నుంచి చమురు తీయడానికి మరింత వ్యయం అవుతుంది. ఉత్పత్తి ఖర్చు ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను బట్టి ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి.  

సగటున చూస్తే సౌదీలో ఒక్కో బ్యారెల్‌ ముడి చమురు ఉత్పత్తికి కేవలం 3డాలర్లు (సుమారు రూ.230) ఖర్చయితే.. గల్ఫ్‌ దేశాలు, రష్యా, పలు ఆఫ్రికా దేశాల్లో సగటున 15డాలర్ల (రూ.1,160) వరకు, అమెరికా–యూరప్‌ దేశాల్లో 50–60 డాలర్ల (రూ. 3,800–రూ.4,600) వరకు ఖర్చవుతుంది. 

ప్రస్తుతం మార్కెట్లో బ్యారెల్‌ ధర సుమారు 113 డాలర్ల (రూ.8,773) వద్ద ఉంది. 

చమురును శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులకు వేర్వేరు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. 

క్రూడాయిల్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలు చాలా వరకు సొంతంగా వినియోగించుకుంటున్నాయి. అదే కేవలం ఎగుమతులను బట్టి చూస్తే.. ప్రపంచంలో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా, ఇరాక్, కెనడా, అమెరికా, నైజీరియా, కువైట్, బ్రెజిల్, కజకిస్థాన్, నార్వే ఉన్నాయి. 

 దేశంలో సగానికిపైగా పన్నులే.. 
మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ల రీటైల్‌ ధరల్లో సగానికిపైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే కావడం గమనార్హం. కేంద్ర పన్ను దేశవ్యాప్తంగా ఒకేలా ఉండగా, ఆయా రాష్ట్రాల్లో పన్నులు వేర్వేరుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా క్రూడాయిల్‌ ధరలను బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్‌ల మూల ధర సగటున సుమారు రూ.49–రూ.52 మాత్రమే. కానీ కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలిపి పెట్రోల్‌ ధర రూ.96 నుంచి రూ.112 మధ్య.. డీజిల్‌ ధర రూ.87 నుంచి రూ.99 మధ్య ఉన్నాయి. 

 తెలంగాణలో పెట్రోల్‌ ధర, పన్నులు
లీటర్‌ పెట్రోల్‌ మూల ధర: రూ.49.2 
కేంద్ర పన్నులు: రూ.28 
డీలర్ల కమీషన్‌: రూ.5.45 
రాష్ట్ర పన్నులు: రూ.26.95 
మొత్తంగా రీటైల్‌ ధర: రూ.109.7 ( మే 25 నుంచి జూన్‌ 3 వరకు సగటు ధరల ఆధారంగా లెక్కించారు. రవాణా వ్యయం, ఇతర అంశాల ఆధారంగా స్థానికంగా ధర మారుతుంది.) 

 ఇండియా ఎక్కడ? 
ఇప్పటివరకు గుర్తించిన మొత్తం చమురు నిల్వలు: 472.9 కోట్ల బ్యారెళ్లు 
ప్రపంచ క్రూడాయిల్‌ నిల్వల్లో శాతం: 0.29 
ఉత్పత్తిలో ర్యాంకు: 20 
దేశంలో రోజువారీ ఉత్పత్తి: 10.16 లక్షల బ్యారెళ్లు 
రోజువారీ వినియోగం:  44.43 లక్షల బ్యారెళ్లు 
దిగుమతి చేసుకోకుండా ఇండియాలోని చమురు వనరులను మొత్తం వాడేస్తే.. కేవలం మూడేళ్లలో ఖాళీ అయిపోతాయని అంచనా.  

చరిత్ర ఇదీ
 ప్రపంచంలో మొదటగా చైనీయులు పెట్రోలియంను ఇంధనంగా ఉపయోగించారు. 
 క్రీస్తుశకం 347వ సంవత్సరంలోనే చైనాలో చమురు బావులు తవ్వినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. 
ప్రపంచంలో వాణిజ్యపరంగా 1837లో తొలి క్రూడాయిల్‌ రిఫైనరీని అజర్‌బైజాన్‌లో   ప్రారంభించారు. అక్కడే 1846లో తొలి చమురు బావిని తవ్వారు. 
అమెరికాలో 1859లో తొలి అధునాతన ఆయిల్‌ బోర్‌వెల్‌ను తవ్వారు. 

ముడి చమురు నుంచి ఏమేం వస్తాయి?
క్రూడాయిల్‌ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారె ల్‌ అంటే దాదాపు 159 లీటర్లు (42 గ్యాలన్లు). దీని నుంచి 73 లీటర్ల పెట్రోల్, 35 లీటర్ల వరకు డీజిల్, 15.5 లీటర్ల మేర జెట్‌ ఫ్యూయల్, ఒక లీటర్‌ కిరోసిన్‌ వస్తాయి. మరో 42 లీటర్ల మేర హెవీ ఫ్యూయల్‌ ఆయిల్స్, లూబ్రికెంట్స్, స్టిల్‌ గ్యాస్, ఆస్ఫాల్ట్, కోక్‌ వంటి ఇతర ఉత్పత్తులు వెలువడతాయి. 

ప్రస్తుతం మన కరెన్సీలో ఒక లీటర్‌ క్రూడాయిల్‌ ధర సుమారు రూ.78కాగా.. శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.49, డీజిల్‌ ధర రూ.52 వరకు ఉంటుంది. 

పెట్రోల్, డీజిల్‌ రెండూ నీళ్లలా పారదర్శకంగా ఉంటాయి. వాటిని సరిగా గుర్తించేందుకు రంగులు కలుపుతారు. ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌లో నీలం–ఆకుపచ్చ కలిసిన రంగును.. డీజిల్‌లో నారింజ రంగును కలుపుతాయి. హైపవర్, ప్రీమియం వంటి పెట్రోల్‌కు పసుపు రంగును కలుపుతుంటారు.

 ఖాళీ అయితే ఎలా? 
ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మన జీవితాన్ని ఊహించలేం. ఇంట్లో వంట చేసుకునే ఎల్పీజీ నుంచి.. బైకులు, కార్లు, బస్సులు, నౌకలు, విమానాలకు ఇంధనం దాకా.. కాస్మెటిక్స్, ప్లాస్టిక్‌ వంటి ఎన్నో ఉత్పత్తులకు చమురే ఆధారం. మరి భూమిపై చమురు నిక్షేపాలన్నీ ఉన్నట్టుండి ఖాళీ అయితే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవడానికే భయం గొలుపుతుంది. అందుకే శా స్త్రవేత్తలు సౌర, పవన, ఇతర ప్రత్యా మ్నాయ విద్యుదుత్పత్తిపై, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై దృష్టిపెట్టారు.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement