పన్ను రాబడులపైనే ఆశలు! | State government has proposed a budget based on tax revenue | Sakshi
Sakshi News home page

పన్ను రాబడులపైనే ఆశలు!

Published Thu, Mar 20 2025 4:45 AM | Last Updated on Thu, Mar 20 2025 4:45 AM

State government has proposed a budget based on tax revenue

రూ.1.75 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచన

సొంత పన్నులు రూ.1.45 లక్షల కోట్లు.. కేంద్ర పన్నుల్లో వాటా సుమారు రూ.30 వేల కోట్లు

ఈసారి రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ ఆదాయంపై ఫోకస్‌ – 2024–25లో ఆశాజనకంగానే పన్నుల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: పన్నుల ఆదాయమే ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌ను ప్రతిపాదించింది. మొత్తం రాబడుల్లో 58 శాతం పన్నుల రూపంలోనే అందుతాయని అంచనా వేసింది. పన్నుల రూపంలో మొత్తం రూ.1.75 లక్షల కోట్లు సమకూరుతాయని పేర్కొనగా.. అందులో రాష్ట్ర సొంత పన్నుల రాబడులే రూ.1.45 లక్షల కోట్ల మేర ఉంటాయని అంచనా వేసింది. 

ఈసారి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.51 వేల కోట్లు, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19 వేల కోట్లు, ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.27 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.37 వేల కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ.8,535 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.1,38,181.26 కోట్లు పన్నుల రాబడి ఉంటుందని గత బడ్జెట్‌లో వస్తుందని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో రూ.1,29,406.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. 

అంటే బడ్జెట్‌ అంచనాల కంటే తగ్గినది రూ.8 వేల కోట్లు మాత్రమేకావడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరం భారీగా పన్నుల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. 

రిజిస్ట్రేషన్ల శాఖపై ఆశలు..
వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,228 కోట్లు సమకూరుతాయని గత బడ్జెట్‌లో పేర్కొన్నా.. సవరించిన అంచనాల మేరకు ఇది రూ.14,692 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం ఈసారి రూ.19,087.26 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది. 

ఇది గత బడ్జెట్‌ ప్రతిపాదన కంటే రూ.1,000 కోట్లు, సవరించిన అంచనా కంటే రూ.5 వేల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. భూముల విలువల సవరణ తోపాటు రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటుందన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

పన్నేతర ఆదాయం ఎలా?
బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం అంచనాలు కూడా పెద్దగా తగ్గలేదు. ఈ పద్దు కింద 2024–25లో రూ.35వేల కోట్లు వస్తాయని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ.25,807 కోట్లు సమకూరుతోంది. అంటే రూ.10వేల కోట్లు తేడా ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పన్నేతర ఆదాయం అంచనాలను రూ.31,611.47 కోట్లుగా చూపింది. ఇందులో మైనింగ్‌ రాయల్టీ, సీవరేజీ ఫీజు, ఇసుక ద్వారా ఆదాయం కింద రూ.8 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. 

మరో రూ.21 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమకూర్చుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కూడా పెంచారు. 2024–25లో రూ.21,636.15 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరణలో రూ.19,836 కోట్లు వస్తున్నట్టు చూపెట్టారు. 

ఎక్సైజ్‌ ఆదాయమూ కీలకమే..
2024–25 సవరణ అంచనాల మేరకు ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరుతుండగా.. 2025–26లో రూ. 27,623.36 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. ఇది సుమారు రూ.2 వేల కోట్లు అదనం. ఈ ఏడాదిలో వైన్‌ (ఏ4) షాపులకు లైసెన్సు గడువు ముగియనుండటంతో.. టెండర్లు పిలవనున్నారు. వైన్‌షాపుల కోసం వచ్చే దరఖాస్తుల ఫీజు రూపంలో ఈ మొత్తం సమకూర్చు కోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు.

పట్టణాలకురూ. 17,677 కోట్లు
» నిర్వహణ వ్యయంరూ.7,639.57 కోట్లు 
»ప్రగతి పద్దు రూ. 8,796.73 కోట్లు 
»గతేడాది కంటే ప్రగతి పద్దు రూ.3 వేల కోట్లు అధికం 
»మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు
»2025–26 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదన 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌లో పురపాలక శాఖకు రూ.17,677 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు రూ.7,639.96 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి పనుల కోసం ప్రగతి పద్దు కింద రూ.8,796.73 కోట్లు ప్రతిపాదించింది. 2024–25 బడ్జెట్‌లో ఈ శాఖకు ప్రగతి పద్దు రూ.5,642.35 కోట్లు ఉండగా, ఈసారి రూ.3 వేల కోట్లు అదనంగా కేటాయించారు. 

ఇందులో పట్టణాభివృద్ధి కోసం రూ.2,957.58 కోట్లు, ప్రజారోగ్యం కోసం రూ.525.47 కోట్లు ప్రతిపాదించారు. గత సంవత్సరం సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.106.07 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తాజా బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,700 కోట్లు, వాటర్‌బోర్డుకు రూ.635 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.  

పేదింటికి కొంతే.. కావాల్సింది రూ.22,500 కోట్లు.. 
ఇచ్చింది రూ.12,571 కోట్లు 
సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 22,500 కోట్లు అవసరమన్నది గృహనిర్మాణ శాఖ లెక్కలు. కానీ, తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.12,571 కోట్లను ప్రతిపాదించింది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. గత బడ్జెట్‌లో రూ.7,740 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాదని ప్రభుత్వానికి స్పష్టత ఉంది. 

అయితే ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 72 వేల ఇళ్లకు సంబంధించి ముగ్గుపోసుకునే పనిని లబ్దిదారులు ప్రారంభించారు. ఈనెలాఖరుకు తొలివిడత రూ.లక్ష వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇప్పుడు నిధుల అవసరం చాలా ఉంది. దీంతో ప్రతిపాదించిన నిధులు, మంజూరు చేస్తున్న ఇళ్ల సంఖ్య ప్రకారం చూస్తే సరిపోదు. 

అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఆ ఇళ్లన్నీ పూర్తయ్యే పరిస్థితి ఉండదన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. రెండుమూడు విడతల నిధుల విడుదలతోనే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఈ కేటాయింపులు సరిపోతాయన్న అంచనాతో ఉన్నట్టు సమాచారం. ఇక, ఈ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిధులు ఇవ్వాల్సి ఉంది. అక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement