Telangana budget
-
కేటీఆర్ యువరాజు అనుకుంటున్నారా? భయపడేది లేదు: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నిరసన తెలియజేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ వ్యాప్తంగా చర్చ జరిగేందుకే నీతి ఆయోగ్ బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. టూరిజం మంత్రిగా ఉన్నా కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు.కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదని, పైసా ఇవ్వకుండా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.‘కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అయినా సహకారం లేదు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు.. కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదు. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా. మేడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారు. ఆయన హుకుంలకు, అల్టిమేటంకు బయపడేది లేదు. -
బడ్జెట్ పై తెలంగాణ నేతల రియాక్షన్
-
Telangana Budget: మాది సంకల్ప బలం
గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. మేం ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలివ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి హామీలను ప్రజల ముందుంచాం. అవి అలవికానివంటూ ప్రతిపక్షాలు పదేపదే విమర్శిస్తున్నాయి. కానీ సంకల్పబలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయతీలే పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవికాని హామీలంటూ లేవని తొలి అడుగుతోనే నిరూపించాం.– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తామిచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదలతో ఉన్నామని.. ఆ దిశగానే రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, అర్హులకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం, అర్హులకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి హామీలను ప్రభుత్వం ఏర్పడిన కొన్నిరోజుల్లోనే అమల్లోకి తెచ్చామని చెప్పారు. త్వరలోనే మిగతావీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను భట్టి విక్రమార్క గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ సుదీర్ఘంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించారు. భట్టి బడ్జెట్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మహాకవి దాశరథి వరి్ణంచిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషిస్తున్నాను. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. వామనావతారంలా పెరిగిన అప్పులు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దశాబ్దకాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు.. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న రూ.75,577 కోట్ల అప్పు.. 2023 డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లను ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా.. అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. ఓ వైపు అప్పులు, మరోవైపు పేరుకుపోయిన బిల్లులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతోపాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. బడ్జెట్ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో) అప్పులు తీరుస్తూ.. సంక్షేమం పాటిస్తూ.. రాష్ట్రానికి డిసెంబర్ నాటికి రూ.6,71,757 కోట్లు అప్పులు ఉన్నట్టు తేలింది. మా ప్రభుత్వం వచ్చాక రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా.. గత ప్రభుత్వం తాలూకు రూ.42,892 కోట్ల రుణాలు, వడ్డీలు చెల్లించాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే సమయంలో సంక్షేమాన్ని విస్మరించలేదు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశాం. మూలధన వ్యయానికి అదనంగా రూ.19,456 కోట్లు ఖర్చు చేశాం. గత దశాబ్దకాలంలో ఉద్యోగ నియామకాలు సరిగా జరగక నిరుద్యోగ యువత కలలు కల్లలయ్యాయి. అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణతో యువతకు ఉద్యోగాలు అందని పరిస్థితి ఏర్పడింది. దాన్ని సరిదిద్ది నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చే చర్యలను మా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశాం. జాతీయ వృద్ధిరేటుకన్నా వెనుకబడ్డాం.. 2023–24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి చెందితే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత ఏడాది జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు తక్కువ. 2023–24లో తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు ఖర్చుల కోసం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతూ వచ్చింది. కఠిన ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు.. 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,64,063 ఎక్కువ. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 అయితే.. వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241 మాత్రమే. అంటే జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని స్పష్టమవుతోంది..’’ అని భట్టి పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపులను వెల్లడించారు. అతి త్వరలో రూ.2లక్షల వరకు రుణమాఫీ ‘‘గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను అప్పుల్లోకి నెట్టిందే తప్ప నిజంగా ఎలాంటి మేలు చేయలేదు. మేం రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించాం. జూలై 18న రూ.లక్ష వరకు రుణమున్న 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో ఒకేసారి జమచేశాం. రూ.రెండు లక్షల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది.’’ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తాంబడ్జెట్ ప్రసంగంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాల వారీగా చేసిన నిధుల కేటాయింపులను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పలు అంశాలకు సంబంధించిన విధానాలను, చేపట్టబోయే చర్యలనూ తెలిపారు. ⇒ ‘రైతు భరోసా’ కింద అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది మా సంకల్పం. అందుకే ప్రజలతో చర్చించి ఎలా చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నాం. ⇒ భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపర్చడానికి వారికి ఏటా రూ.12,000 అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. ⇒ మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాము. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ⇒ సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి 33 రకాల వరిని గుర్తించి, వాటికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. ⇒ ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాల పురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. ⇒ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నాం. ఇంటి విస్తీర్ణం కనీసం 400 చదరపు అడుగులతో ఉంటుంది. ⇒ ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలను 20 ఎకరాల స్థలంలో ఒకేచోట నిర్మిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మహనీయుల మాటలను ఉటంకిస్తూ..భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పలువురు మహనీయుల మాటలను ఉటంకించారు. ‘‘సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండూ కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు. పునాది ఎంత బలంగా ఉంటే.. ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది’’ అన్న బీఆర్ అంబేడ్కర్ మాటలను గుర్తు చేశారు. వ్యవసాయానికి కేటాయింపులను వెల్లడిస్తున్న సమయంలో.. ‘‘ఏ పని అయినా ఆగవచ్చు.. కానీ వ్యవసాయం ఆగదు’’ అని జవహర్లాల్ నెహ్రూ చెప్పారని భట్టి పేర్కొన్నారు. ఇక ‘‘ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది’’ అని నెల్సన్ మండేలా చెప్పారని.. తాము ఇచ్చిన రుణమాఫీ హామీకి ఇది వర్తిస్తుందని భట్టి చెప్పారు. తాము రుణమాఫీ అమలుతో మండేలా మాటలను నిజం చేసి చూపామన్నారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న సమయంలో ‘‘ప్రజాస్వామ్యం అనేది బలవంతులకు, బలహీనులకు సమాన అవకాశాలు కల్పించేది’’ అని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు.అసెంబ్లీలో షేమ్ షేమ్.. ఫాల్స్ ఫాల్స్!ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా శాసనసభలో షేమ్ షేమ్.. ఫాల్స్ ఫాల్స్.. అన్న నినాదాలు హోరెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను భట్టి విక్రమార్క విమర్శిస్తున్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ‘షేమ్.. షేమ్..’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో భట్టి చెప్తున్న మాటలు ‘ఫాల్స్.. ఫాల్స్..’ అంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్రతిగా నినాదాలు చేశారు. -
‘పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్!‘..కేటీఆర్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..!వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..!డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..!విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతోఏమార్చిన డొల్ల బడ్జెట్..!రైతులకు…— KTR (@KTRBRS) July 25, 2024 అయితే ఈ బడ్జెట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..!గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని మండిపడ్డారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్లో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..రైతులకు కత్తిరింపులు. అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం.. మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు..నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..! మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు..ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా ..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్..! అంటూ ట్వీట్లో తెలిపారు. -
‘ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. అంకెల గారడీలా మారింది‘: హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆత్మ స్తుతి పర నిందలా మారింది. బడ్జెట్లో హామీల ప్రస్తావన లేదు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉంది. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదు. అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయింది. 2,500 మహిళలకు ఇస్తామని చెప్పింది. కోటి మంది అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. 8 నెలలుగా మహాలక్ష్మి కాస్త మహా నిరాశగా మారింది. ఆసరా పెన్షన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో చెప్పారు. 4వేల పెన్షన్ ఇప్పటిదాక ఇవ్వలేదు. ఊదర గొట్టి బడ్జెట్లో పెట్టలేదు. పేదల ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదు. విద్యా భరోసా కార్డు, స్కూటిలు ఇస్తామన్నారు బడ్జెట్లో దాని ఊసే లేదు. ఆటో కార్మికులు వృత్తి నమ్ముకొని ఆటో నడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పొట్ట కొట్టింది. చేనేత కార్మికుల ప్రస్తావన లేదు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?: బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్ర మోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా?.. 6 గ్యారంటీలు+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా? అంటూ సెటైర్లు వేశారు.గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అంటూ దుయ్యబట్టారు.రాష్ట్రంలో అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో బడ్జెట్ో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమన్నారు.‘సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా?. ఔను.. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోంది. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది?రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా?. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే?రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి. ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా?జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు అద్ధం పడుతుంది. కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేదు.. తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం శతాబ్దం జోక్. ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే.. 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు.ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం. బడ్జెట్లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు.. మీరిచ్చిన అమలుి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ లోనే తేలిందిబడ్జెట్లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు.. సీఎంసహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా... దీనికేం సమాధానం చెబుతారు? బడ్జెట్లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా? -
హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.. కేటాయింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను రూ. 2,91,159 కోట్లుగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 35,118 కోట్ల అప్పు తీసుకోగా , రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మెట్రో వాటర్ వర్స్ కోసం రూ. 3,385 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 3,065కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్ఎండీేఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్ రూ. 50 కోట్లు కేటాయించారు.ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని, అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టామని అన్నారు. -
కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనం: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలా?.. కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్‌బాబు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టారనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారాయన.. రాష్ట్ర బడ్జెట్ పెంచాలని అనుకున్నాం కానీ కేంద్రం నుంచి నిధులు రాలేదు.. సంక్షేమం, అభివృద్ధి సమభాగంలో బడ్జెట్ కేటాయింపులు జరిపామని మంత్రి అన్నారు.వ్యవసాయ రంగానికి న భూతో న భవిష్యత్ అనుకుంటున్నాం. హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించాం. హైదరాబాద్ ఎకో సిస్టం అభివృద్ధి కోసం 10వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం. భవిషత్ తరాలకు అవసరం అయ్యేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశాం.’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.వ్యవసాయనికి 23వేల కోట్లు గత ప్రభుత్వం పెడితే.. ఇప్పుడు 72వేల కోట్లు పెట్టాం. వట్టి మాటలు మేము చెప్పడం లేదు.. కేసీఆర్ చెప్పి వెళ్ళారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోంది అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టాం. మాకు ఒక విజన్ ఉంది.. 2004లో మహిళలను లక్షాధికారులను చేసి చూపాం. మేము అప్పులు తెచ్చి.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నం. జులై వరకు 35వేల కోట్లు అప్పు చేసి 42వేల కోట్ల వడ్డీలు కట్టాం. రాష్ట్రం పై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే నిన్న ఎందుకు రాలేదు?. కేంద్రం నుంచి పిలుపు రాగానే కేసీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడి పోయారు. తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని అడుగుతాం’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
బడ్జెట్‌పై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారుజ కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నాడని సీతక్క విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ మెప్పుకోసమే ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడమే అందుకు నిదర్శనమని అన్నారు.కాగా తెలంగాణ బడ్జెట్.. రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. తమ పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. -
తెలంగాణ బడ్జెట్‌పై కేసీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్.. ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నాం బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.మా పాలనలో ఎన్నో పథకాలు పెడితే.. వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు, మత్య్సకారులకు.. ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్.. ట్రాష్. బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ఆర్థిక మంత్రి మాట్లాడారే తప్ప.. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదో కథ చెప్పినట్లు.. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా.. ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాడ్డాక వీళ్లకు ఆరు మాసాల సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ బడ్జెట్ చూశాక ఒక పాలసీ లేకుండా ఉందని అన్నారు. రైతు భరోసా ప్రస్తావనే లేదు.. ఇది పూర్తిగా రైతు శత్రుత్వ ప్రభుత్వమని విమర్శించారు. భవిష్యత్తులో ఈ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చిచెండతామని అన్నారాయన. -
అప్పుల కుప్పగా తెలంగాణ
-
Musi Metro Project: ఈ భారం మోసేదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. దీంతో మొత్తం భారమంతా రాష్ట్రంపైనే పడనుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం కేంద్రం సుమారు రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించాలని రాష్ట్రం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు స్వయంగా కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో మూసీ భారాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించవలసిన వచి్చంది. ⇒ ఇక మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపైన డీపీఆర్‌లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టును కేంద్రానికి సమరి్పంచడంలో ఆలస్యం జరిగింది. బడ్జెట్ కంటే ముందే ఈ ప్రాజెక్టుపైన కేంద్రానికి డీపీఆర్‌ను సమరి్పంచి ఉంటే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మెట్రో రెండో దశను కూడా ప్రస్తుతానికి రాష్ట్ర నిధులతోనే ప్రారంభించవలసిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండు ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ⇒ సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్, మేడ్చల్ రూట్లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలను సైతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పనులకు శంకుస్థాపన చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సిటీ ప్రాజెక్టులే అత్యంత కీలకం కానున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. మూసీకి రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సర్వే పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిరి్మంచనున్న 70 కిలోమీటర్ల మెట్రో రెండో దశకు సుమారు రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం కానున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మెట్రో మొదటి దశను పీపీపీ పద్ధతిలో నిరి్మంచగా, రెండో దశ ప్రాజెక్టును మాత్రం ప్రభుత్వమే చేపట్టింది. ఇదీ రెండో దశ మెట్రో... ⇒ నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు అక్కడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో చేపట్టనున్నారు. ⇒ అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు రెండో దశలోనే పూర్తికావలసి ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ రూట్లోనే మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు మరో లైన్‌ను నిర్మించనున్నారు. ⇒ ఎయిర్పోర్ట్ కారిడార్, హయత్‌నగర్ కారిడార్లలో అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్లు, స్టేషన్లను ఖరారు చేశారు. ⇒ రెండో దశ డీపీఆర్‌ను సిస్టా కన్సల్టెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది. నిధులిస్తే పనులు ప్రారంభం... ⇒ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు సుమారు రూ.2232 కోట్ల అంచనాలతో 18.10 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ⇒ ఈ ప్రాజెక్టు కోసం వివిధ చోట్ల సుమారు 197 ఎకరాలకు పైగా భూములను సేకరించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందులో రక్షణ శాఖకు చెందిన భూములే 113 ఎకరాల వరకు ఉన్నాయి. ⇒ ఈ మార్గంలో తొలగించవలసిన కట్టడాలు, సేకరించాల్సిన భూములపైన కూడా క్షేత్రస్థాయి సర్వేలు పూర్తయ్యాయి. ⇒ ప్రభుత్వం నిధులను విడుదల చేసిన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ బడ్జెట్లో మురిపిస్తారా... ⇒ మూసీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సామాజిక, ఆరి్థక సర్వే కొనసాగుతోంది. ⇒ గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సుమారు 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయనున్నారు. ⇒ నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సుమారు 12,500 నిర్మాణాలను తొలగించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ⇒ ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. ⇒ అలాగే ఎస్టీపీలు, నదికి ఇరువైపులా రహదారులు, ఐటీ టవర్లు, మెట్రో రైలు వంటి భారీ నిర్మాణాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
బడ్జెట్ రూ.లక్ష కోట్ల నుంచి రూ.2.75 లక్షల కోట్లకు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మిగులు బడ్జెట్‌తో విడిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరానికి గాను అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర ఖజానా ప్రారంభ నిల్వ రూ.2,544 కోట్లుగా చూపెట్టారు. ఆ ఏడాది అసెంబ్లీ అనుమతి పొందిన మొత్తం బడ్జెట్ రూ.1.06 లక్షల కోట్లు. లక్ష కోట్ల నుంచి అంచెలంచెలుగా పెరిగిన తెలంగాణ బడ్జెట్ పరిమాణం ఇప్పుడు రూ.2.75 లక్షల కోట్లకు చేరుకుంది.అంటే బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపుగా మూడు రెట్లు పెరిగాయన్న మాట. ప్రతిపాదనల మాట అటుంచితే బడ్జెట్ ఖర్చులో కూడా ఏటేటా పెరుగుదల కనిపిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చు రూ.62,306 కోట్లు కాగా, ఆ తర్వాత వరుసగా రూ.97,922 కోట్లు, రూ.1.33 లక్షల కోట్లు.. ఇలా పెరుగుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.01 లక్షల కోట్లకు చేరింది. సొంత పన్ను ఆదాయమే కీలకం..ఏ రాష్ట్రమైనా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో, ముఖ్యంగా రాష్ట్ర సొంత ఆదాయాన్ని (ఎస్వోటీ) పెంచుకోవడంలో సఫలీకృతమైతే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టే. ఈ కోణంలో పదేళ్ల తెలంగాణ రాష్ట్రం సుస్థిరతను సాధించిందని, సొంత పన్నుల ఆదాయం భారీగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన రోజు 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల కోట్ల వరకు ఉన్న సొంత పన్నుల ఆదాయం ఇప్పుడు 2024–25 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనల్లో లక్ష కోట్లు దాటింది.అప్పుల కుప్పలేపదేళ్లలో తెలంగాణ అప్పుల మూటను కూడగట్టుకుంది. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రూ.72,658 కోట్ల అప్పులుండగా.. ఇప్పుడు బడ్జెట్ లెక్కల ప్రకారం రూ.5 లక్షల కోట్లు దాటాయి. నికర అప్పు, పూచీకత్తులతో కలిపితే రూ.7 లక్షల కోట్లు దాటుతోంది. తలసరి ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించిన రాష్ట్రం, తలసరి అప్పులోనూ అదే స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హం. అప్పులకు వడ్డీల చెల్లింపులకే రూ.22 వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాల్సి వస్తోంది. 2036 కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు రూ.86 వేల కోట్లు, వడ్డీ రూ.54 వేల కోట్లు కలిపి రూ.1.40 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే ఏటా రూ.12 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టు కోసం పదేళ్లలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేయగలగడం, రైతుబంధు లాంటి పథకాలను ప్రవేశపెట్టి సజావుగా అమలు చేస్తుండడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలుగానే చెప్పుకోవాలి. కానీ అప్పులు పెరిగినా ఆస్తుల కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదనే అపవాదు కూడా తెలంగాణకు ఉంది. 2014–15లో ఆస్తుల కల్పన కింద చేయాల్సిన మూలధన వ్యయం రూ.15వేల కోట్లు దాటితే, 2024–25లో అది రూ.29,669 కోట్లకు మాత్రమే చేరింది. ఇవి కేవలం ప్రతిపాదనలే కాగా, ఖర్చు అంతకంటే తక్కువే ఉండడం గమనార్హం. -
ఆరుకు.. ఊరుకు.. ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లు
ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.. అప్పులు, మిత్తీలతో తీవ్ర భారం ఇన్నాళ్లూ తెలంగాణను అబద్ధాలకు పర్యాయపదంగా మార్చారు. ఆ అబద్ధాలు వినడం అలవాటైన వారికి మా బడ్జెట్ కొత్తగా అనిపించవచ్చు. అప్పులు చేసిన రైతులు మిత్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. ఇరిగేషన్ శాఖ అప్పులు, మిత్తీలతో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. – సీఎం రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆరు ‘గ్యారంటీ’లకు.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ సర్కారు తమ తొలి బడ్జెట్‌ను తెచ్చింది. మొత్తంగా రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్ పద్దులో ఈ రెండింటికి కలిపి మూడో వంతు మేర నిధుల కేటాయింపు ఉండటం గమనార్హం. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు్ల, చేయూత, యువ వికాసం హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. గ్రామాల వికాసానికి తోడ్పడేలా రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన మేరకు భారీగా నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండింటితోపాటు సంక్షేమం, విద్యా రంగానికి గణనీయంగా ప్రతిపాదనలు చేసింది. అయితే కీలకమైన వ్యవసాయ శాఖతోపాటు వైద్యారోగ్య రంగానికి కోతపెట్టింది. అప్పుల సమీకరణ ఎక్కువే.. శనివారం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్ర మార్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గతబడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలకంటే ఏకంగా 50 శాతం ఎక్కువగా ఈసారి అప్పుల పద్దు చూపారు. 2023–24లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.40,615.68 కోట్లు రుణ సమీ కరణ చేయనున్నట్టు పేర్కొనగా, ఈసారి ఏకంగా రూ.59,625 కోట్లకు పెంచారు. ఇతర రుణాలు కూడా కలిపి గత బడ్జెట్లో రూ.55,277.698 కోట్లు చూపగా.. ఈసారి మొత్తంగా రూ.68,585.21 కోట్ల మేర రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం బడ్జెట్లో ఇది 25శాతం కావడం గమనార్హం. ఇక గతంలో చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీల చెల్లింపుకోసం తాజా బడ్జెట్లో రూ.35,868 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్లో 12శాతానికిపైనే. తగ్గిన రాష్ట్ర వృద్ధిరేటు రాష్ట్ర వృద్ధిరేటు 2022–23తో పోలిస్తే 14.7 శాతం నుంచి 2023–24లో 11.3 శాతానికి తగ్గిందని, వ్యవసాయ వృద్ధిరేటు మైనస్‌లో పడిపోయిందని ¿¶ట్టి వెల్లడించారు. అయితే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని, జూన్‌లో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో.. బడ్జెట్ పరిమాణం, శాఖల కేటాయింపుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పన్ను ఆదాయంపైనే ఆశలు ఈ సారి బడ్జెట్లో పన్నుల ఆదాయం అంచనా రూ.20 వేల కోట్లు పెరిగింది. రాష్ట్ర వృద్ధిరేటు నిలకడగా ఉన్న నేపథ్యంలో సొంత పన్ను రాబడుల అంచనాను రూ.1.38 లక్షల కోట్లుగా చూపారు. గత బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది రూ.7వేల కోట్లు ఎక్కువ. దీంతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్లు కలిపి ఈసారి రెవెన్యూ రాబడుల రూపంలో రూ.2,05,601.50 కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. గత బడ్జెట్లో రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566.97 కోట్లుకాగా.. తాజాగా సవరించిన అంచనాల్లో రూ.1,78,172.95 కోట్లుగానే ఉంది. అంటే గత బడ్జెట్ కంటే రూ.11వేల కోట్లు తక్కువగా.. సవరించిన అంచనాల కంటే రూ.27 వేలకోట్లు ఎక్కువగా రెవెన్యూ రాబడులను చూపారు. బడ్జెట్లో కొన్ని కీలక అంశాలివీ.. ► ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ► గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కాలేజీలు ► ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ గృహాలు ► త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం ► 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్‌పై త్వరలో మార్గదర్శకాలు ► మూసీ ప్రక్షాళనకు రూ.1,000 కోట్లు ► కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం కీలక కేటాయింపుల తీరు ఇదీ.. సంక్షేమ రంగాలకు గత బడ్జెట్లో రూ.33,416 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.45,149 కోట్లకు పెంచారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, కల్యాణలక్ష్మి కోసం ప్రత్యేక పద్దులు చూపలేదు. సంక్షేమశాఖలకు కేటాయించిన నిధుల్లోంచే వీటికి ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యాశాఖకు గత బడ్జెట్‌కన్నా ఒక శాతం అధికంగా రూ.21 వేల కోట్లు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి గతంలో కంటే రూ.7వేల కోట్లు తక్కువగా.. రూ.19,746 కోట్లే చూపారు. రైతుబంధు పథకం అమలును సమీక్షించే క్రమంలో నిధులు తగ్గాయి. వైద్యారోగ్య శాఖ పద్దులో గతంతో పోలిస్తే రూ.700 కోట్లు తగ్గాయి. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వీలుగా గృహనిర్మాణ శాఖ రూ.25వేల కోట్ల నిధులు కోరగా.. రూ.7,400 కోట్లు మాత్రమే కేటాయించారు. హౌజింగ్ శాఖ భూములు అమ్మి ఇళ్లు కట్టించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిపాదనలు, వాస్తవ ఖర్చుకు భారీ వ్యత్యాసం 2023–24 బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులు, చేసిన వాస్తవ ఖర్చులకు చాలా తేడా ఉందని కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ గణాంకాల్లో పేర్కొంది. గత ఏడాది బడ్జెట్ రూ.2,90,296 కోట్లుకాగా.. సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2,24,624.87 కోట్లకే పరిమితమైంది. ఆ మొత్తానికి రూ.50 వేల కోట్లు అదనంగా కలిపి.. తాజాగా రూ.2,75,890.69 కోట్లతో 2024–25 బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ► పన్ను రాబడుల విషయానికి వస్తే.. 2023–24లో రూ.1,31,028.65 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, రూ.13 వేల కోట్లు తక్కువగా రూ.1,18,195.10 కోట్లు మాత్రమే సమకూరుతున్నట్టు సవరణ బడ్జెట్లో అంచనా వేశారు. ► కేంద్ర పన్నుల్లో వాటా కింద గత బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.2 వేల కోట్లు ఎక్కువగా రూ.23,216.52 కోట్లు అందనున్నట్టు సవరణ బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే పన్నేతర ఆదాయం అంచనాల మేరకు రూ.22,808.31 కోట్లు సమకూరుతున్నట్టు వివరించారు. ► 2023–24 బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కేంద్రం నుంచి రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. సవరించిన అంచనాల్లో కేవలం రూ.13,953.02 కోట్లే అందుతున్నట్టు తేల్చారు. ► బహిరంగ మార్కెట్ రుణాలు ఆశించిన మేర సమకూరాయి. కేంద్రం నుంచి రూ.4,102 కోట్లు వస్తాయనుకుంటే, రూ.1,500 కోట్లే అందనున్నట్టు సవరించిన అంచనాలు చెప్తున్నాయి. సంక్షేమానికి రూ.45,149 కోట్లు తాజా బడ్జెట్లో శాఖల వారీగా కేటాయించిన ప్రభుత్వం సంక్షేమశాఖలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత కొన్నేళ్లుగా కేటాయింపులు అరకొరగా ఉండడంతో సతమతమవుతున్న సంక్షేమ శాఖలకు, అనుబంధ విభాగాలకు తాజా బడ్జెట్ కాస్త ఊరట ఇచ్చే విధంగా ఉందని ఆర్థిక నిపుణులు అన్నారు. సంక్షేమ శాఖలకు అనుబంధంగా ఉన్న ఆర్థిక సహకార సంస్థలకు కొత్త కార్యక్రమాలు చేపట్టేలా కేటాయింపులున్నాయి. గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ దఫా కేటాయింపులు భారీగా పెరిగాయి. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖలతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలకు 2024–25 సంవత్సరంలో రూ.45,149 కోట్లను తాజా బడ్జెట్లో కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ బడ్జెట్లో నాలుగు సంక్షేమ శాఖలకు గతేడాది కంటే రూ.11,733 కోట్లు అధికంగా కేటాయించారు. తాజాగా జరిపిన కేటాయింపుల్లో అత్యధికంగా ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించారు. గత కేటాయింపులతో పోలిస్తే ఈ దఫా గిరిజన సంక్షేమ శాఖకు అదనంగా రూ.9,048 కోట్లు కేటాయించడం గమనార్హం. 2023–24 వార్షిక బడ్జెట్లో దళితబంధు పథకం కింద రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం పైసా ఖర్చు చేయకపోగా.. ఈసారి బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్ కంటే రూ.1,771 కోట్లు అధికంగా కేటాయించారు. మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా గత బడ్జెట్ కంటే రూ.62 కోట్లు పెరిగాయి. విద్యకు రూ.21 వేల కోట్లు గత ఏడాది కన్నా 1.05 శాతం అదనం గత ఏడాదితో పోలిస్తే విద్యారంగానికి మధ్యంతర బడ్జెట్లో 1.05 శాతం నిధులు పెరిగాయి. గత ఏడాది మొత్తం బడ్జెట్లో ఈ రంగానికి రూ.16,092 కోట్లు (6.7శాతం) ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో రూ. 21,389 కోట్లు (7.5శాతం) కేటాయించారు. అయితే పాఠశాల విద్యలోనే ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పోలిస్తే రూ.13 వేల కోట్ల నుంచి రూ.17,931 కోట్లకు నిధులు పెంచారు. టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం వల్ల పెరిగిన వేతనాలు, పీఆర్సీ వల్ల పెరిగే జీతాలకే ఈ నిధులు సరిపోయే అవకాశముంది. గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మనబడి’ఊసే బడ్జెట్లో కనిపించలేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్, బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఉన్నతవిద్యకు రూ.2,959.10 కోట్లు, సాంకేతికవిద్యకు రూ. 487.64 కోట్లు కేటాయించారు. 65 ఐటీఐలను కొత్తగా తేబోతున్నట్టు చెప్పినా, ఇవి ప్రైవేట్ రంగంలోనే అని స్పష్టత ఇచ్చింది. నైపుణ్య వర్సిటీపె అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించింది. కల్యాణలక్ష్మికి కానరాని ప్రత్యేక పద్దు సంక్షేమ శాఖల నిధుల నుంచే ఖర్చు చేసే అవకాశం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ప్రత్యేక పద్దు తాజా బడ్జెట్లో కానరాలేదు. ఇదివరకు ఈ పథకాలకు ప్రత్యేకంగా పద్దులు కేటాయించగా, ఈసారి వాటి ఊసెత్తలేదు. ఈ పథకాలకు 2023–24, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ.3210 కోట్లు, రూ. 2,750 కోట్లు కేటాయించారు. సంక్షేమ శాఖల ద్వారానే ఈ పథకాలు అమలవుతున్నాయి. ఈసారి సంక్షేమశాఖలకు నిధులు పెంచడంతో ఈ రెండు పథకాల నిర్వహణను వాటికే అప్పగించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. కానీ, తాజా బడ్జెట్లో ఆ రెండు పథకాల ప్రస్తావన లేకపోగా, తులం బంగారం అంశాన్ని కూడా చేర్చలేదు. ఇందిరమ్మ ఇళ్లకు అప్పులే దిక్కా? రూ.20,000 కోట్లు కావాల్సి ఉండగా.. కేటాయించింది రూ.7,740 కోట్లే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు కావాల్సిన నిధుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. తాజా బడ్జెట్లో పేదల ఇళ్ల కోసం రూ.7740 కోట్లను ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే రూ.20 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. గృహనిర్మాణ శాఖ కూడా రూ.25 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖను కోరింది. కానీ నిధులు అతి తక్కువగా ప్రతిపాదించటం విశేషం. అందుకే కేటాయింపులు తగ్గించారా? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించకుండా, కేంద్రం ఇచ్చే సాయం, రుణాలతో చేపట్టనుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే హడ్కో నుంచి రూ.3 వేల కోట్లను రుణంగా తీసుకోవాలని గృహనిర్మాణ సంస్థ నిర్ణయించింది. పట్టణ ప్రగతి పక్కకే! పురపాలనకు రూ.11,692 కోట్లు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో తక్కువ కేటాయింపులే జరిగాయి. హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) మినహా రాష్ట్రంలోని 129 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, జీతభత్యాలు, నిర్వహణ వ్యయాల కింద ఈ మొత్తం కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో జరిపిన రూ. 11,372 కోట్ల కేటాయింపుల కన్నా ఈసారి రూ.320 కోట్లు మాత్రమే అధికం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఈసారి రూ.1,000 కోట్లు కేటాయించారు. కాగా గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాల ఊసు ఈసారి లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని ఎత్తివేసినట్టేనని పురపాలక వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
-
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు..
-
కాంగ్రెస్ శుభారంభం.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క
-
ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం
-
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2,75,891 కోట్ల ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ స్వరూపం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 స్వరూపం ఇలా ఉంది. మొత్తం రూ.2,75,891 కోట్లకు బడ్జెట్ సమర్పించగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉంది. కేటాయింపులు ఇలా.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్లో అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించింది. ఇక మిగిలిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించింది. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించి మంత్రి భట్టీ విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్ రూ.500 చొప్పున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
రేపే తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. అంతకు ముందు.. ఉదయం 9గం. ప్రాంతంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో.. ఎలాంటి ప్రతిపాదనలు ఉండవు. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇందులో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు ఉండవు. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ సాఫీగా సాగేందుకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడతారు. రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఖర్చుల కోసం తీసుకునే మొత్తం ఇది. -
బీసీ సంక్షేమ బడ్జెట్ పెంచాలి
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన రూ.6,229 కోట్లు ఏమాత్రం సరిపోవని, దాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది మంది విద్యార్థులు, యువకులతో కలిసి గురువారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖమంత్రి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్‌ల నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లు అయితే.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయిస్తే ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్లో కొత్త పథకాలేవీ లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్‌చార్జీల పెంపు ప్రస్తావనే లేదని, కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీకి బడ్జెట్ కేటాయింపుల్లేవని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తా మన్న హామీకి బడ్జెట్ లేదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదు: నిర్మలా సీతారామన్
-
సీఎం కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై నిర్మల.. కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. వివరాల ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. మాపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటీ అని ప్రశ్నించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కాగా, కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు పెట్టారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదా? అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదు. నోడేటా అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ సెటైర్లు వేశారు. ఇదే సమయంలో ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ సీరియస్ అయ్యారు. 2014లో తెలంగాణలో అప్పులు రూ.60వేల కోట్లు. ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నాము.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాము. రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇది రాజ్యాంగం లో పొందుపరిచిన నిబంధన.. దానినే మేము అమలు చేస్తున్నాం. అప్పులపై ఎవరో ఒకరు మానీటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పాను. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ.. అక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చాం. అందరినీ ఒకేలాగా చూస్తాం.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాం. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా? అంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలి. ఇది దేశం కోసం అంటూ హితవు పలికారు. -
ఎలక్షన్ టైమ్.. బడ్జెట్ లైన్, కేరాఫ్ ఊరు
సాక్షి, హైదరాబాద్: వ్యవ‘సాయమే’ ఎజెండా.. పల్లెల అభివృద్ధి, నిధుల వ్యయంలో స్వయం ప్రతిపత్తే ధ్యేయం.. ఎన్నికల ఏడాదిలో క్షేత్రస్థాయి కేటాయింపులకు ప్రాధాన్యం, పల్లె, పట్టణ ప్రగతుల నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే బదిలీ చేసేందుకు అవకాశం.. సంక్షేమ పథకాలు య«థాతథం.. విద్యుత్ సబ్సిడీలకు నిధుల పెంపు.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత.. మొత్తం మీద 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్లో ఈ రెండు శాఖలకు కలిపి ఏకంగా రూ.60 వేల కోట్ల వరకు కేటాయించింది. ఇక బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలైన రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలకు నిధులను ఆశించిన మేరకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధితో పాటు సొంత పన్నుల ఆదాయాన్ని ఆసరాగా చేసుకుని, కేంద్రంపై ఆశలు వదులుకోకుండానే, రుణాలను పెద్దగా పెంచకుండానే, ఆర్థికాభివృద్ధికి సూచిక అయిన మూలధన వ్యయానికి 40 శాతం మేరకు నిధులు పెంచింది. ఈ మేరకు బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే, సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద చూపెట్టడం ఈ బడ్జెట్లోనే హైలెట్‌గా చెప్పుకోవచ్చు. రహదారుల నిర్వహణ, మరమ్మతులకు నిధులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులకు అదనంగా మున్సిపాలిటీలకు రూ.2,500 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.2,000 కోట్లను ప్రతిపాదించింది. వీటితో పాటు ఆర్అండ్బీ శాఖకు (బీటీ రెన్యువల్స్) అదనంగా మరో రూ.2,500 కోట్లను ప్రతిపాదించింది. పల్లె ప్రగతి కింద రూ.3,360 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.1,474 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకే ఇవ్వనుంది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ నిధులు వెచ్చించామని, అయినా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదనే స్థానిక ప్రజాప్రతినిధుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను గ్రీన్‌చానల్ (ట్రెజరీ ఆంక్షలు లేకుండా) విధానంలో పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వెచి్చంచనున్నారు. గతంలో టీయూఎఫ్ఐడీసీ కింద మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.300 కోట్లను కూడా నేరుగా బడ్జెట్లోనే కేటాయించడం గమనార్హం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదించడం విశేషం. వ్యవసాయానికి ఊతం బడ్జెట్లో వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చూపెట్టింది. వ్యవసాయ, సహకార రంగాలకు ఈసారి రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతుబంధు కింద 2022–23లో రూ.14,800 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే రైతుబంధు పథకానికి రూ.275 కోట్లు ఎక్కువ చూపెట్టింది. తాజా బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూ.6,380 కోట్లు కేటాయించింది. రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసేందుకు రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేసినప్పటికీ రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించింది. రైతు బీమా కోసం రూ.123 కోట్లు, మత్స్యశాఖకు రూ.100 కోట్లు చూపెట్టిన ప్రభుత్వం.. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి, ఎన్సీడీసీ ఇచ్చే రూ.4,500 కోట్ల రుణం ద్వారానే గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పకనే చెప్పింది. సంక్షేమం యధాతథం బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలకు ఈసారి బడ్జెట్లో కూడా తగిన ప్రాధాన్యత లభించింది. కల్యాణలక్షి్మ, షాదీముబాకర్లకు రూ.3,210 కోట్లు (గత ఏడాది కంటే రూ.460 కోట్లు ఎక్కువగా) చూపెట్టింది. విద్యుత్ సబ్సిడీల (వ్యవసాయం, హెయిర్ సెలూన్లు, ఇస్త్రీ షాపులకు ఇచ్చే సబ్సిడీలు) రూపంలో గత బడ్జెట్ కంటే అధికంగా రూ.12 వేల కోట్లు, ఉచిత బియ్యం పంపిణీకి రూ.213 కోట్లు అదనంగా రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.919 కోట్లు ఎక్కువగా రూ.5,609 కోట్లు కేటాయించింది. కొత్తగా న్యూట్రిషన్ కిట్ల కోసం 33 జిల్లాలకు గాను రూ.200 కోట్లను ప్రతిపాదించింది. గత బడ్జెట్లో కేటాయించిన విధంగానే దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,500 మంది లబి్ధదారులను ఎంపిక చేసి ఈ నిధులను పంపిణీ చేయాలని ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు గత బడ్జెట్లో రూ.11,728 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు చూపెట్టింది. బడ్జెటేతర నిధుల నుంచి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు అదనంగా ‘సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు’ పథకానికి కూడా నిధులు కేటాయించింది. గృహా నిర్మాణ పథకానికి ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించగా, ఇందులో సొంత జాగాల ఇళ్లకు రూ.7,890 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల మంది లబి్ధదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సీఎం విచక్షణ మేరకు మరో 25 వేల మందిని ఎంపిక చేస్తారు. కొత్త తాయిలాలు పెద్దగా లేకపోగా.. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,016 ఇచ్చే పథకాన్ని ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రతిపాదించకపోవడం గమనార్హం. విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం బడ్జెట్లో నిధులు ఆశించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చూపెట్టారు. విద్యాశాఖకు రూ.19 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.12,161 కోట్లు ప్రతిపాదించారు. వీటితో పాటు పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, ప్రణాళిక శాఖకు రూ.11,495 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.22,260 కోట్లు చూపెట్టారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.31 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు రూ.1,000 కోట్లు, హరిత హారానికి రూ.932 కోట్లు, ఐఅండ్పీఆర్కు రూ.1,000 కోట్లు, ఎయిర్పోర్ట్–మెట్రో అనుసంధానానికి రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు రూ.400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేయడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు కేటాయించగా, అందులో కొత్త నియామకాలకు అవసరమయ్యే వేతనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణపై ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, సెర్ప్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణను కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అయితే వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రూ. 2.37 లక్షల కోట్ల మేర అంచనా సవరణ 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఏడాది మార్చి 6వ తేదీన రూ.2.56 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపి రూ.2,37,884.55 కోట్లుగా సవరించారు. అంటే ప్రతిపాదించిన మొత్తం కంటే రూ.19 కోట్ల వరకు లోటు తేలిందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు తీసుకోవడంలో ఎఫ్ఆర్బీఎం పేరుతో కేంద్రం విధించిన నిబంధనల వల్లే రూ.13 వేల కోట్లు నష్టపోయామని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.40 వేల కోట్లు ప్రతిపాదిస్తే చాలా తక్కువగా కేంద్రం ఇస్తోందని, పన్నుల్లో వాటా తగ్గిస్తోందని చెప్పిన ప్రభుత్వం.. సవరించిన అంచనాల్లో మాత్రం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నిధులను భారీగానే చూపెట్టడం గమనార్హం. పంచ సూత్రతోనే ఖజానాకు కిక్కు – రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.2.90 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌కు అనుగుణంగా ఖజానా నింపేందుకు ఐదు పద్దులు దోహద పడనున్నాయి. ఇందులో సొంత పన్ను ఆదాయ పద్దు కింద రూ.1.31 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కలిపి దాదాపు రూ.62,500 కోట్లు, రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు, పన్నేతర ఆదాయం కింద (భూముల అమ్మకాలతో కలిపి) రూ.22,808 కోట్లు, ఇతర రూపాల్లో మరో రూ.20 వేల కోట్లు సమకూర్చుకునేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. అన్నింటికీ నిధులు పెంచాం: ఆర్థికమంత్రి ఈసారి బడ్జెట్లో ఉన్న పథకాలకు నిధులు పెంచుతూనే కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఆర్థిక, ప్రణాళిక, గణాంక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. పలు పథకాలకు నిధుల కేటాయింపు క్రమాన్ని వివరించారు. 2023 సంవత్సరానికి గాను ఆర్థిక, సామాజిక సర్వేను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు చేరిందని, 2022–23లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15.6 శాతంగా నమోదయిందని వెల్లడించారు. కాగా ఉదయం 10:30 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలను చదవడం ప్రారంభించిన హరీశ్‌రావు 12:15 గంటలకు అంటే సుమారు 105 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. -
బడ్జెట్‌కు లభించని గవర్నర్ సిఫారసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ 2023–24 ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసులతో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఈ మేరకు ఆమె నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్‌భవన్‌లోనే ఉండిపోయాయి. తమిళిసై సోమవారం హైదరాబాద్‌కు రానున్నారని, ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వానికి తిరిగి పంపించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. విభేదాల నేపథ్యంలో.. రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్‌లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.