సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్‌లో ఈసారి విద్యాశాఖకు కేటాయింపులు పెరిగాయి. 2017–18 సంవత్సరంలో విద్యాశాఖకు ప్రభుత్వం రూ. 12,705.65.72 కోట్లు కేటాయించగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ. 13,278.19 కోట్లు కేటాయించింది.
గతేడాది సవరించిన బడ్జెట్ (రూ. 12,635.54 కోట్లు) ప్రకారం చూస్తే ఈసారి రూ. 642.65 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. అయితే వేతనాలు, డీఏ, ఇతర ఖర్చుల కిందే ఈ మొత్తాన్ని పెంచింది. వాస్తవానికి విద్యాశాఖకు దాదాపు రూ. 15 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో రూ. 13,278 కోట్ల మేరకే కేటాయింపులు చేసింది.
నిర్వహణ పద్దులోనే పెంపు
ఈసారి బడ్జెట్‌లో నిర్వహణ పద్దులోనే కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. ముఖ్యంగా వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఇతర భత్యాల కింద అధిక మొత్తం వెచ్చించాల్సి రావడంతో ఈ కేటాయింపులు జరిపింది. పాఠశాల విద్యలో గతేడాది నిర్వహణ పద్దు కింద రూ. 8,157 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని రూ. 8,685 కోట్లకు పెంచింది.
ఇక ప్రగతి పద్దులోనూ దాదాపు రూ. 103 కోట్లు పెంచింది. ఉన్నత విద్యలోనూ నిర్వహణ పద్దులో రూ. 100 కోట్లకుపైగా అధికంగా కేటాయింపులు జరిపిన ప్రభుత్వం... ప్రగతి పద్దులో గతేడాదికంటే ఈసారి రూ. 150 కోట్ల మేర కేటాయింపులను తగ్గించింది. సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దు కింద కేటాయింపులను కొంత పెంచగా ప్రగతి పద్దు కింద గతేడాది కేటాయించిన వి«ధంగానే ఈసారీ కేటాయింపులు జరిపింది.
‘సాంకేతిక విద్య’కు అంతంతే..
♦ అడిగింది రూ. 907 కోట్లు...కేటాయించింది రూ. 422 కోట్లే
♦ ప్రత్యేక అభివృద్ధికి రూ. 334 కోట్లు అడిగినా పైసా ఇవ్వని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యాశాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర నిధులనే కేటాయించింది. వేతనాలు, నిర్వహణకే కేటాయింపులు జరిపింది. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలకు ప్రగతి పద్దు కింద పైసా ఇవ్వలేదు. సాంకేతిక విద్య నిర్వహణ, అభివృద్ధికి నిర్వహణ పద్దు కింద రూ.627 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.280 కోట్లు కలిపి మొత్తంగా రూ. 907 కోట్లు కావాలని అడిగితే నిర్వహణ పద్దు కింద రూ.361 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.61 కోట్లు మొత్తంగా రూ. 422 కోట్లు మాత్రమే కేటాయించింది.
ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలు, అభివృద్ధి కోసం రూ. 334 కోట్లు కావాలని కోరినా పైసా ఇవ్వలేదు. వాటిల్లో పని చేసే సిబ్బంది వేతనాలు, నిర్వహణకు రూ.127.12 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని పాలిటెక్నిక్ కాలేజీల నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు కేటాయించింది.
ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు అడిగినా పైసా ఇవ్వనిది వీటికే...
విద్యా సంస్థ అడిగిన మొత్తం (రూ. కోట్లలో)
ఆర్‌జీయూకేటీ 90
జేఎన్‌టీయూ హైదరాబాద్ 30
జేఎన్‌టీయూ కాలేజీ సుల్తాన్‌పూర్ 87
జేఎన్‌టీయూ కాలేజీ కరీంనగర్ 51
జేఎన్‌టీయూ కాలేజీ మంథని 76
మొత్తం 334
ఫీజులకు రూ.2,903 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. 2017–18 సంవత్సరం బడ్జెట్‌లో రూ. 1,939.31 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు వెయ్యి కోట్లు ఎక్కువ కేటాయించింది.
దీంతో బకాయిలతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించే అవకాశం ఉంది. తాజా బడ్జెట్‌లో ఫీజులు, ఉపకారవేతనాల కోసం రూ. 2,903.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 2,020.21 కోట్లు, ఉపకార వేతనాల కోసం రూ. 882.85 కోట్లు కేటాయించింది.
కల్యాణ కానుకకు రూ.1,400 కోట్లు..
పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థిక సాయంపైనా సర్కారు ఉదారత చూపింది. బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.1,400 కోట్లు కేటాయించింది. దీంతో ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్ల లోపే ఉన్న బడ్జెట్ ఒక్కసారిగా పెరిగింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ సాయం చేయాలన్న లక్ష్యంతో ఈ మేరకు నిధులు పెంచింది. ఈ పథకాల కింద బీసీలకు రూ. 700 కోట్లు, ఎస్సీలకు రూ. 400 కోట్లు, ఎస్టీలకు రూ. 150 కోట్లు, మైనార్టీలకు రూ. 150 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment