
బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.4,305.48 కోట్లు
ఈ మొత్తం మహాలక్ష్మి పథకానికే సరి
రాయితీ బస్‌పాస్‌ల రీయింబర్స్‌మెంట్‌కు నిధులు నిల్
ఏటా దాదాపు రూ.400 కోట్ల వరకు ఈ భారం
ఇప్పటివరకు చెల్లిస్తూ వస్తున్న ప్రభుత్వం
ఇకపై ఈ భారం కూడా ఆర్టీసీ మోయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాయితీ బస్‌పాస్.. విద్యార్థులు, నాన్ గెజిటెట్ ఉద్యోగులు, వికలాంగులు, పాత్రికేయులు వంటి వారికి ఆర్టీసీ తక్కువ మొత్తానికి జారీచేసే కార్డు. కొంతమందికి ఉచితంగా కూడా ఇస్తోంది. ఈ బస్‌పాస్‌లు ఇకపై ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఈ పాస్‌ల ద్వారా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం వదిలించుకున్నట్టు కనిపిస్తోంది.
ఫలితంగా దాన్ని ఆర్టీసీ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద భారమే కాబోతోంది. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.4,305.48 కోట్లు కేటాయించింది. ఇందులో నేరుగా రూ.3,082.53 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ నుంచి రూ.852.09 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.370.86 కోట్లు ప్రతిపాదించింది. రాయితీ బస్‌పాస్‌లకు తిరిగి చెల్లించే (రీయింబర్స్‌మెంట్) మొత్తంపై ప్రస్తావనే లేదు.
అన్నింటికీ మహాలక్ష్మి నిధులే..
రీయింబర్స్‌మెంట్ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ వద్ద వాకబు చేస్తే, మహాలక్ష్మి పథకానికి కేటాయించిన నిధుల నుంచే వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని బట్టి నెలకు రూ.358 కోట్లు ఆర్టీసీకి అందుతున్నట్లు లెక్క. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం సగటున నెలకు రూ.350 కోట్లు ఉంటోంది.
అంటే ప్రభుత్వం ఇచ్చే మొత్తం దానికే సరిపోతుంది. కానీ, రాయితీ బస్‌పాస్‌ల ద్వారా ఏటా ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయం దాదాపు రూ.400 కోట్లు. గతంలో ఈ మొత్తం రూ.680 కోట్ల వరకు ఉండేది. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక వారికి బస్‌పాస్‌లు అవసరం లేకుండా పోయాయి. దీంతో ఆమేర తగ్గింది. గతంలో బస్‌పాస్‌ల రాయితీ మొత్తంతోపాటు కొత్త బస్సుల కొనుగోలుకు కొద్దిగా గ్రాంటు కూడా బడ్జెట్‌లో కేటాయించే పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆ గ్రాంటు కూడా మాయమైంది.
నిధులు పెరిగినా కష్టాలే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పోలిస్తే ప్రస్తుతం మూడు రెట్లు పెరిగాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన చివరి రెండు బడ్జెట్‌లలో రూ.1,500 కోట్ల చొప్పున కేటాయించింది. ఇప్పుడు నిధులు భారీగా పెరిగినా.. అదనంగా ఉపయోగపడే వీలు లేకుండా పోయింది. గతంలో ఆర్టీసీ 15 లక్షల వరకు రాయితీ బస్‌పాస్‌లు జారీ చేసేది. మహాలక్ష్మి పథకంతో వాటి సంఖ్య 10 లక్షలకు తగ్గినట్టు అంచనా. పాస్‌లు కొనేవారు బస్‌పాస్ ధరలో 40% చెల్లిస్తుండగా, ఆర్టీసీ 60 శాతం భరిస్తోంది.
ఇప్పుడు ఆ 60 శాతం ప్రభుత్వం నుంచి రాకపోతే ఆర్టీసీనే భరించాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.400 కోట్లు ఆర్టీసీకి అదనపు భారంగా మారబోతోంది. దీన్ని తప్పించుకోవాలంటే సంస్థ రాయితీ వాటాను తగ్గించటమో, క్రమంగా బస్‌పాస్‌లను ఉపసంహరించటమో చేయాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై ఇలా భారం మోపటం సరికాదని, బస్‌పాస్ రాయితీ ప్రభుత్వ మే భరించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment