కొత్త బస్సులు, బకాయిలకు నిధులు ఎలా?
ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.4,084 కోట్లు
పెదవి విరుస్తున్న కార్మిక నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న మాటలకు, బడ్జెట్‌లో చూపిన లెక్కలకు పొంతన కుదరటం లేదు. గురువారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీకి రూ.4,084.43 కోట్లను ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహాలక్ష్మి పథకానికి కేటాయిస్తున్నట్టుగానే చూపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ఊతం ఇవ్వటానికే బడ్జెట్ కేటాయింపులు పరిమితమైనట్టు కనిపిస్తోంది. కేటాయింపుల్లో నేరుగా మహాలక్ష్మి పథకానికి కేటాయింపులుగా రూ.3,082.53 కోట్లను చూపారు. ఇక ఎస్సీ సబ్‌ప్లాన్ కింద
రూ.631.04 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్
కింద రూ.370.86 కోట్లు చూపారు. వీటిని కూడా మహాలక్ష్మికి కేటాయింపులుగానే పేర్కొన్నారు. దీంతో బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఆ పథకానికే ఖర్చు చేస్తారన్నట్టుగా ఉంది.
బకాయిలకు ఏం చేస్తారు?
ఆర్టీసీ ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు, ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి దాదాపు రూ.1,800 కోట్ల వరకు బకాయి పడింది. ఆ బకాయిలు చెల్లించటం లేదన్న ఆగ్రహంతో ఇటీవల భవిష్యనిధి సంస్థ ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్‌పై స్టే పొందింది. ఆ స్టే గడువు తీరితే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైన విషయం తెలిసిందే. దీంతో బస్సులు సరిపోక కొత్తవి కొనాల్సి వస్తోంది.
అవసరమైనన్ని కొత్త బస్సులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వీటన్నింటికి చాలినన్ని నిధులు మాత్రం బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడంతో కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. రాయితీ పాస్‌లకు సంబంధించి రూ.950 కోట్లు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన వాటితో కలుపుకొని రూ.1,782 కోట్లపై స్పష్టత లేకపోవటం ఆందోళకరమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు ప్రతిపాదించింది. ఆ మొత్తానికి సంబంధించి రూ.వేయి కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినట్టు సమాచారం. వాటిని ఎలా సర్దుబాటు చేస్తారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
రోడ్లు బాగుపడేదెలా?
కొన్నేళ్లుగా రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ గాడి తప్పింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్ల నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొన్ని చోట్ల పనులు జరగటంతో కొత్త రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి చేపట్టాల్సిన రెన్యువల్స్‌ను గాలికొదిలేశారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తారన్న అంచనా ఏర్పడింది. కానీ దానిని తలకిందులు చేస్తూ రోడ్లకు అత్తెసరు నిధులే కేటాయించారు.
రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్ల నిర్వహణకు రూ.888 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.606 కోట్లు కేటాయించారు. ఇవి రోడ్లను బాగు చే యటం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ఎలా సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలని అంటున్నారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.1,525 కోట్లు కేటాయించారు. ఇవి భూసేకరణ పద్దు కిందకే ఖర్చు కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment