ఓటాన్ అకౌంట్‌లో రూ.53 వేల కోట్లు.. పూర్తి బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లే!
పింఛన్ల పెంపు, యువ వికాసం, మహిళలకు నెలకు రూ.2,500 ఊసే లేదు
ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లకు గాను రూ.7 వేల కోట్లే ప్రతిపాదన
చేయూతకు రూ.23 వేల కోట్లు కావాలి కానీ 14,861 కోట్లతోనే సరి
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సరిపడా నిధులు
13 అంశాల్లో 8 అంశాలకే కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలకు తగినట్టుగా వార్షిక బడ్జెట్ గణాంకాలు కనిపించడం లేదు. ఆరు గ్యారంటీల పేరుతో అమలు చేయాల్సిన 13 అంశాల్లో 8 అంశాలకు బడ్జెట్ కేటాయింపులు చూపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో 5 అంశాల గురించి ప్రస్తావించలేదు.
బడ్జెట్ కేటాయింపులు చేసిన 8 అంశాలకు కూడా ఏడాదికి సరిపోయే విధంగా నిధులు చూపెట్టలేదనే చర్చ ఆయా శాఖల్లో జరుగుతోంది. ఆరు గ్యారంటీల్లోని 8 అంశాలకు గాను రూ.47,166 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. దీనికి తోడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, 2024–25 వార్షిక పూర్తి బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి రూ.6 వేల కోట్ల కోత విధించింది.
కావాల్సిన దాని కంటే తక్కువగా..
ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతుబంధును రైతు భరోసాగా మార్చి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేసేందుకు గాను రూ.22,500 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఈ ఏడాది రూ.15,075 కోట్లు మాత్రమే కేటాయించారు. చేయూత పథకం కింద రాష్ట్రంలోని 43 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పెంచాలంటే రూ.23 వేల కోట్లు కావాలి. కానీ ఈ పథకం కింద రూ.14,861 కోట్లే చూపెట్టారు. ఇక రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో దాదాపు 28 లక్షల మంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, బీడీ కార్మికులుగా పెన్షన్లు పొందుతున్నారు.
వీరు కాకుండా మరో 1.3 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తే రూ.39,900 కోట్లు కావాలి. కానీ ఈ పథకాన్ని ఈసారి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది నిర్మిస్తామని చెప్పిన 4.5 లక్షల ఇళ్లకు (ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున) రూ.22,500 కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో రూ.7,740 కోట్లే కేటాయించారు. భూమి లేని వ్యవసాయ కార్మికులకు రైతు భరోసా కింద రూ.3,600 కోట్లు కావాల్సి ఉండగా, రూ.1,200 కోట్లు చూపెట్టారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినా గతంలో లాగానే రూ.1,065 కోట్లు కేటాయించారు. వాస్తవంగా దీని అమలుకు రూ.2,500 కోట్లు అవుతుందని అంచనా. మరోవైపు యువ వికాసం లాంటి హామీని కూడా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. మహాలక్ష్మి కింద అమలవుతున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఎల్‌పీజీ సిలిండర్లకు సబ్సిడీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌కు మాత్రం తగిన మేరకు నిధుల కేటాయింపు చూపెట్టారు.
ఒకే ఏడాది రెండోసారి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒకే సంవత్సరంలో రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును ఆర్థిక మంత్రి హోదాలో భట్టి సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి మళ్లీ గురువారం రెండోసారి అదేసంవత్సరానికి పూర్తి బడ్జెట్ పెట్టారు. ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 13వ సారి కావడం గమనార్హం. వరుసగా 11 సంవత్సరాలు రెగ్యులర్ బడ్జెట్‌తో పాటు రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టిన ఘనతదక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment