ఆషామాషీగా ఉండి వెళ్లడానికి రాలేదు | Deputy CM Bhatti comment in the reply given on the budget | Sakshi
Sakshi News home page

ఆషామాషీగా ఉండి వెళ్లడానికి రాలేదు

Published Sun, Jul 28 2024 4:53 AM | Last Updated on Sun, Jul 28 2024 7:39 AM

Deputy CM Bhatti comment in the reply given on the budget

ఈ ఐదేళ్లేకాదు.. మరో ఐదేళ్లు, తర్వాతి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపేది మేమే.. 

బడ్జెట్‌ పద్దుపై ఇచ్చి న సమాధానంలో డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: ఏదో ఐదేళ్లు ఆషామాషీగా ఉండి వెళ్లిపోవడానికి తాము అధికారంలోకి రాలేదని.. మరో ఐదేళ్లు, ఆ తర్వాత ఇంకో పదేళ్లు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపేది కాంగ్రెస్‌ పారీ్టయేనని ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందుకు తగినట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో అంకెల గారడీలు, భ్రమలేవీ లేవన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు కాంగ్రెస్‌ ఇచి్చన వాగ్దానాలు, ప్రజల ఆశలు తీర్చేలా, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందించామని తెలిపారు. 

కానీ బీఆర్‌ఎస్‌ పక్షాన మాట్లాడిన హరీశ్‌రావు చేసిన విమర్శలు, ఆరోపణలు సరికాదన్నారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలు కూడా కాలేదని.. ఎన్నికల కోడ్‌పోగా మిగిలిన నాలుగు నెలల్లోనే ఎన్నో పథకాలు అమల్లోకి తెచ్చామని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు శనివారం రాత్రి ఆయన సమాధానమిచ్చారు. భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘బడ్జెట్‌లో రైతుల కోసం రూ.72,659 కోట్లు ప్రతిపాదించడంలో తప్పేముంది? హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం రూ.10వేల కోట్లు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఏం చేయవచ్చో కూడా మర్చిపోయే పరిస్థితిని తీసుకువచి్చన బీఆర్‌ఎస్‌లా కాకుండా.. వారి నిధులు వారికే పెట్టాం. మహిళలకు లక్ష కోట్ల రుణాలిచ్చేందుకు అవసరమైన వడ్డీలు ప్రతిపాదించాం. 

నాలుగు నెలల కాలంలోనే 32,410 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. రూ.31 వేల కోట్లతో రుణమాఫీని సుసాధ్యం చేశాం. రైతు కూలీలకు ఈ ఏడాది నుంచే రైతు భరోసా ఇస్తాం. స్పష్టమైన విద్యుత్‌ పాలసీతో ముందుకొస్తాం. ఆరు గ్యారంటీల గురించి అనుక్షణం తపిస్తున్నాం. ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో ఇళ్లు లేని పేదల జాబితా తయారు చేసి ఇన్‌చార్జి మంత్రులకు ఇవ్వాలి. 

రైతు భరోసా ఎలా ఇవ్వాలన్న దానిపై ఆలోచన చేస్తున్నాం. హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డును 35 ఏళ్ల లీజుకు ఇచ్చి.. ఆ డబ్బు మొత్తాన్ని ఒకేసారి తీసుకొని బీఆర్‌ఎస్‌ పాలకులు దోపిడీ చేశారు. దానిపై విచారణ చేయిస్తాం. అవసరమైతే లీజును రద్దు చేస్తాం. బీఆర్‌ఎస్‌ పాలకులకు చాన్స్‌ దొరికితే హైటెక్‌ సిటీని కూడా అమ్మేసేవారు. 

బీఆర్‌ఎస్‌లా అయితే రూ.3.50 లక్షల కోట్ల బడ్జెట్‌ 
మేం బీఆర్‌ఎస్‌ మాదిరిగా అడ్డగోలుగా పెడితే ఈ బడ్జెట్‌ 3.50లక్షల కోట్లతో ఉండేది. కానీ అలా చేయకుండా రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించాం. ఎక్సైజ్‌ ఆదాయం కూడా గతం కంటే 5 శాతమే ఎక్కువగా ప్రతిపాదించాం. టానిక్‌ లాంటి అడ్డగోలు సంస్థలను కట్టడి చేసి ఆ మొత్తం రాబడతాం. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటాం. పన్ను రాబడులు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసు. 

హైదరాబాద్‌ అభివృద్ధి అంతా మాదే.. 
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చూడటానికి ఏదైనా కట్టారా? ఇక్కడి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కాంగ్రెస్‌ తీసుకువచి్చనవే. ఔటర్‌రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్‌తోపాటు ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ ఇళ్లను కాంగ్రెస్‌ నిర్మించింది. అందుకే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి, మంజీరాల నుంచి నీటిని తెచ్చింది కాంగ్రెస్‌ పారీ్టయే. అలా మేం తెచి్చన నీళ్లకు నల్లా తిప్పి.. ఆ నీళ్లు చల్లుకుని తామే తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ.650 కోట్లు బిల్లులు పెండింగ్‌ పెడితే మేం చెల్లిస్తున్నాం. 

అలాంటి ఆరోగ్యశ్రీ గురించి బీఆర్‌ఎస్‌ మాట్లాడితే జనం నవ్వుకుంటారు. పింఛన్లు కూడా రెండు నెలలు ఎగ్గొట్టిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. మేం పన్నులు వేయబోం. మేం పన్నుల భారం వేస్తే ప్రజలు.. వారిపైపు వస్తారని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టమైన నిర్ణయంతో ముందుకెళతున్నాం. మోసం గురించి బీఆర్‌ఎస్‌ మాట్లాడితే ఎట్లా? మోసం అంటే బీఆర్‌ఎస్, నమ్మకం అంటే కాంగ్రెస్‌ అని ఎవరిని అడిగినా చెప్తారు. 

ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు 
అర్థవంతంగా, కొద్దిగా ఖర్చుచేస్తే నీళ్లు పారే ప్రాజెక్టులు, ఇతర ప్రాధాన్యతలను నిర్ణయించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. కొన్ని వేల కోట్లతోనే లక్షల ఎకరాల్లో నీళ్లు పారిస్తాం. పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, అన్ని ప్రాజెక్టులు ఆన్‌ చేసే విధంగా చర్యలు చేపడతాం. సీతారామ ప్రాజెక్టు కింద రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్లు పారేవి. కానీ ఒక్క ఎకరానికి కూడా గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయింది. మా ప్రభుత్వం రూ.75 కోట్లతో చిన్న కాలువతో (రాజీవ్‌ కెనాల్‌) అతిత్వరలోనే 1.25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. దీనిని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.

ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లను కూడా పునరుద్ధరిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాల కోసం ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ఆలోచన చేస్తున్నాం. హైదరాబాద్‌ నగర అభివృద్ధి వేగవంతం చేస్తాం. పాతబస్తీ అనేది వారసత్వ సంపద, అక్కడి కట్టడాలను సంరక్షించి ప్రపంచానికి అద్భుతంగా అందిస్తాం. చారి్మనార్‌ పెడ్రస్టేషన్‌ ప్రోగ్రామ్‌ను కచి్చతంగా అమలు చేస్తాం. మూసీ రివర్‌ ఫ్రంట్‌ సుందరీకరణ ప్రాజెక్టును హైదరాబాద్‌కు వన్నె తెచ్చేలా తీర్చిదిద్దుతాం..’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.  

సభ్యుల సమ్మతితోనే రైతు భరోసా 
మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి స్పషీ్టకరణ 
సాక్షి, హైదరాబాద్‌: అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని శాసనసభ్యులతో చర్చించి వారి సమ్మతితోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సమ్మతితోనే ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పుంటే వేలెత్తి చూపాలని, తప్పకుండా సరిచేసుకుంటామన్నారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి బదులిచ్చారు. 

తాజా బడ్జెట్‌లో రైతాంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రైతు రుణమాఫీ కొనసాగుతోందన్నారు. విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఎం ఈ శాఖను ఆయన వద్దే అట్టిపెట్టుకున్నారని భట్టి వివరించారు. చేనేత పరిశ్రమను ఆదుకుంటామని, బతుకమ్మ చీరలతోనే కాకుండా హాస్టల్‌ విద్యార్థులకు దుప్పట్లు తదితరాలకు చేనేత పరిశ్రమను ఉపయోగించుకుంటామన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement