త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం
అదే సమయంలో రైతు భరోసాపై విధివిధానాల ప్రకటన
అందుకోసమే కేబినెట్ సబ్‌కమిటీ.. ఉమ్మడి జిల్లాల్లో భేటీలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవనభృతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం. ఆ హామీని అమలు చేసేందుకు ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. వ్యవసాయరంగాన్ని ఆదుకునేలా రైతుభరోసా ఉంటుంది’అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.
రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనపై ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రైతులు, రైతుసంఘాలు, కౌలురైతులు, డాక్టర్లు, న్యాయవాదులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, జర్నలిస్టుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
ఈ సమావేశానికి ఉపసంఘం సభ్యులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రైతుభరోసా పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి ఖమ్మం జిల్లా నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించింది.
సమయానుకూలంగా నిధులు
గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు నిధులను సమయానుకూలంగా విడుదల చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధుల ఆధారంగా త్వరలోనే పూర్తిస్థాయి బడ్జె ట్ ప్రవేశపెడతామన్నారు. ఉమ్మడిజిల్లాల్లో పర్యటించి రైతులు, ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
రైతులను ఆదుకోవాలన్నదే లక్ష్యం
నిజమైన రైతుకు భరోసా కలి్పంచాలని, రైతులను ఆదుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు రుణమాఫీ కూడా అమలు కాబోతోందన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం అందేలా గుంట భూమి ఉన్నవారికి కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, త్వరలో దీనిపై నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.
ఇంకా ఈ సమావేశంలో ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు ము జమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, రాందాస్‌నాయక్, జారె ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చ..
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రైతుభరోసాపై తుది నిర్ణయం వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో ఏ స్కీమ్ అమలు చేసినా నాటి ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించలేదని, నాలుగు గోడల మధ్యే చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సంపదను పంచే క్రమంలో రైతులు, పేదలు, దళిత, గిరిజనులకు ప్రతిపైసాకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం పయనిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment