సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్‌లో అప్పుల పద్దు అదిరిపోయింది. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువగా, మొత్తం రూ.62,012 కోట్లు రుణ సమీ కరణ జరగనుంది. గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదన గణాంకాలు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సేకరించనున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
ఇక గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీల చెల్లింపు కోసం రూ.30 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రుణం చెల్లింపుల కోసం రూ.13,117.60 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. మొత్తం రూ.62 వేల కోట్ల రుణ సమీకరణ చేస్తే,అందులో దాదాపు సగం అంటే రూ.30,846 కోట్లు గతంలో తీసుకున్న అప్పులకు గాను అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుందని కేటాయింపులు చెబుతున్నాయి. ఇవి పోగా మిగతా రూ.31,166 కోట్ల రుణాలను ఈ ఏడాది వినియోగించుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
పెరుగుతున్నఅప్పులు, చెల్లింపులు
ఏటేటా అప్పుల చిట్టా పెరిగిపోతుందని గత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడుల్లో రూ.44,060 కోట్లు రుణాల కింద వస్తే, 2023–24లో రూ.52,576 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.62 వేల కోట్లను అప్పుల పద్దు కింద ప్రతిపాదించడం గమనార్హం. అయితే తీసుకునే అప్పుల కంటేచెల్లింపులు ఎక్కువ చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరంఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూలై 24నాటికి రూ.35,118 కోట్లు అప్పుగాతీసుకుంటే.. గతంలో ఉన్న అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపుల కింద రూ.42,892 కోట్లు కట్టామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రూ.6,050 కోట్లు అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు నెలకు రూ.5,365 కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు.
హైదరాబాద్‌అభివృద్ధిపైప్రభుత్వానిదిస్పష్టమైన విజన్
నగర అభివృద్ధికికేటాయింపులపై మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన అనంతరం ఉత్తమ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ బడ్జెట్ హైదరాబాద్ వాసుల జీవన నాణ్యతను పెంపొందించడానికి, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా దాని స్థానాన్ని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ‘మెట్రో విస్తరణ ఓల్డ్ సిటీ–శంషాబాద్ విమానాశ్రయంతో సహా కీలక ప్రాంతాలను కలుపుతుంది. నాగోల్, ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్‌లను ఇంటర్ చేంజ్‌లుగా అభివృద్ధి చేయాలని, కనెక్టివిటీని మరింత పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
లండన్‌లోని థేమ్స్ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌గా మార్చడానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. హైడ్రా ఏర్పాటు దేశానికే ఆదర్శం’ అని ఉత్తమ్ తెలిపారు. నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు.
ఆరు గ్యారంటీలకు హామీపత్రం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలకు హామీపత్రంగా అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని బడ్జెట్‌కు రూపకల్పన చేశామన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని రూపొందించిన బడ్జెట్ ఇది.
ఆరు గ్యారంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవిక లెక్కల బడ్జెట్ ఇది. కేంద్ర వివక్ష.. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క, ఆయనబృందానికి నా అభినందనలు’ అని రేవంత్ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment