బడ్జెట్ మొత్తం వింటేనే కదాకేసీఆర్‌కు అర్థమయ్యేది
హడావుడిగా వచ్చారు.. వెళ్లిపోయారు.. హడావుడిగా మాట్లాడారు
అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా గాలి మాటలు మాట్లాడితే ఎలా?
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చీల్చి, ఏం చెండాడుతాడని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసలు బడ్జెట్ గురించి ఆయనకు ఏం అర్థమైందని నిలదీశారు. ‘హడావుడిగా అసెంబ్లీకి వచ్చారు. హడావుడిగా వెళ్లిపోయారు. వెళ్లిపోతూ హడావుడిగా మాట్లాడారు. అసలు బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వినకుండానే మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన పూర్తిగా వింటేనే కదా బడ్జెట్ గురించి అర్థమయ్యేది’ అని వ్యాఖ్యానించారు.
భట్టి గురువారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రతిపాదించిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. నిజంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై, బడ్జెట్‌పై కేసీఆర్‌కు ఆసక్తి ఉంటే కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చించినప్పుడు ఈ హడావుడి చేయాల్సిందని ఎద్దేవా చేశారు. ‘బడ్జెట్‌లో నిధులివ్వలేదంటూ అసెంబ్లీలో చర్చ పెట్టి తమ గురించి మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లి వారి గురించి మాట్లాడిరండి’ అని బీజేపీ వాళ్లు చెబితే కేసీఆర్ హడావుడిగా వచ్చి వెళ్లిపోయారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శత్రు ప్రభుత్వమని కేసీఆర్ అంటున్నారని, నభూతో నభవిష్యత్‌లాగా వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయిస్తే శత్రువులవుతారా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే వ్యవసాయానికి ఈ కేటాయింపులు ఎవరూ చేసి ఉండరని అన్నారు. ఇలాంటి బడ్జెట్ పెట్టిన తమను అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడటం సరైంది కాదని భట్టి వ్యాఖ్యానించారు. ఇష్టాగోష్టిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
రెండింటి మేలు కలయిక
ఈ ఏడాదికి ప్రతిపాదించిన రాష్ట్ర బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమాల మేలు కలయిక అని భట్టి వ్యాఖ్యానించారు. వ్యవసాయంతోపాటు నగరాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామని, హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా రాజధానిలో అన్ని సంస్థలను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించనున్నామన్నారు. అలాగని ఇతర జిల్లాలను నిర్లక్ష్యం చేయబోమని చెప్పారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా నియోజకవర్గ కేంద్రాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని, వారి నిధులను గత ప్రభుత్వం లాగా దారి మళ్లించబోమని స్పష్టం చేశారు. తాము రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు కూడా ఎద్దేవా చేశారని, కానీ రైతు రుణమాఫీ చేసి చూపించామని అన్నారు.
కోటీశ్వరులను చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలను లక్షాధికారులను చేస్తామని 2005లో తాము చెప్పినప్పుడు కూడా సాధ్యం కాదన్నారని చెప్పారు. కానీ రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలను లక్షాధికారులను చేశామని, ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ సామాన్యుడి హితంగా, పేదలకు అనుకూలంగా ఉందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి వెళ్లినందుకు సంతోషమని శ్రీధర్‌బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment