Mahalakshmi scheme
-
కొత్త బస్సులు సమకూర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు. మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా! మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి.. ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు. -
నేను డ్రైవరన్నను..!
ఖమ్మంమయూరిసెంటర్: మహాలక్ష్మి పథకం అమలుతో పలు సమయాల్లో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కొందరు నిర్దేశిత ప్రాంతాల్లో ఆపడం లేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అక్కడకక్కడా ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఈ డ్రైవర్ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికురాలి బిడ్డను లాలించి అభిమానం చూరగొన్నాడు. అంతేకాక అధికారుల నుంచి సన్మానం అందుకున్నాడు. వివరాలు.. ఇటీవల మణుగూరు నుండి హైదరాబాద్‌కు చంటి బిడ్డతో ఓ మహిళ బస్సులో వెళ్తోంది. ఆమె మార్గ మధ్యలోని ఓ బస్టాండ్‌లో వ్యక్తిగత అవసరాలపై దిగాల్సి రాగా వెంట ఎవరూ లేకపోవడంతో బిడ్డను ఎవరికి అప్పగించాలో తెలియక సందిగ్ధత ఎదుర్కొంది. చివరకు బస్సు డ్రైవర్ పి.మల్లయ్యను ఆశ్రయించగా ఆయన చంటి బిడ్డను ఎత్తుకుని ఆమె వెళ్లి వచ్చే వరకు లాలించాడు. ఈ విషయం తెలియడంతో ఆర్టీసీ ఆర్ఎం ఏ.సరిరామ్ సోమవారం మల్ల య్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భవాని ప్రసాద్, జీఎన్ పవిత్ర, పర్సనల్ ఆఫీసర్ ఎ.నారాయణ పాల్గొన్నారు. -
రూ.500 సిలిండర్‌కు అర్హులు 42.90 లక్షలేనా?
సాక్షి, హైదరాబాద్: రూ.500 లకే గ్యాస్ సిలిండర్ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 42,90,246 కుటుంబాలకే అందుతోంది. మొదటివిడత ప్రజాపాలనలో భాగంగా అన్ని జిల్లాల్లో కోటి ఐదు లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 89,21,269 దరఖాస్తులను కంప్యూటరైజ్ చేశారు. కానీ ఇందులో సగానికన్నా తక్కువ 42.90 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు అర్హులుగా ఎంపిక చేశారు.వీరికి గత ఏప్రిల్ నుంచి ఆగస్టు 15 వరకు 56,46,808 గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని భరించింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలకు రూ.168.17 కోట్లు చెల్లించింది. రేషన్‌కార్డు (ఆహారభద్రత కార్డు) ఉన్న ప్రతీ కుటుంబానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల్లో ఇచి్చన హామీని నెరవేర్చాలనే తొందరలో లబి్ధదారుల ఎంపికలో సరైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డు ఉన్నా... రాష్ట్రంలో భారత్, ఇండేన్, హెచ్పీలకు చెందిన కోటి 30 లక్షలకు పైగా గృహావసర (డొమెస్టిక్) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 33 జిల్లాల్లో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మినహా రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్న వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలే అని ప్రభుత్వం భావిస్తే మహాలక్ష్మి పథకం కనీసం 70 లక్షల కుటుంబాలకైనా వర్తించాలి.కానీ ప్రస్తుతం కేవలం 42.90 లక్షల కుటుంబాలకు మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్‌ను అందిస్తుండడాన్ని బట్టి మహాలక్ష్మి పథకానికి రేషన్‌కార్డుతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 500 సిలిండర్ పథకాన్ని వర్తింపజేయాలని రేషన్‌కార్డుదారులంతా కోరుతున్నారు. కాగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తే లబి్ధదారుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. -
Hyderabad: మగాళ్లూ.. బస్సెక్కరూ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణం బెంబేలెత్తిస్తోంది. సిటీ బస్సుల్లో పయనించేందుకు పురుష ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ‘మహాలక్ష్మి’ రాకతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళలతో కళకళలాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సిటీ బస్సుల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు బస్సుల్లో మూడొంతుల మగ ప్రయాణికులతో కనిపించే రద్దీ ఇప్పుడు మహిళలతో నిండుగా పరుగులు తీస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కానీ ప్రభుత్వం రీయింబర్స్ రూపంలో చెల్లిస్తుండడంతో ఆరీ్టసీకి నగదు రూపంలో వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే మగ ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న పంథాలో ముందుకు వెళ్తోంది. ప్రతి డిపోలో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయమే లక్ష్యంగా కండక్టర్లు, డ్రైవర్లను కార్యోన్ముఖులను చేస్తోంది. యాజమాన్యం ఒత్తిడి కారణంగా అదనపు ఆర్జన కోసం కండక్టర్లు, డ్రైవర్లు రూ.లక్ష లక్ష్యంగా’ మగప్రయాణికుల వేటలో పడ్డారు. ప్రధాన బస్టాపుల్లో బస్సుల కోసం ఎదురు చూసే మగ ప్రయాణికులను ‘బస్సెక్కండి ప్లీజ్’ అంటూ ఆహ్వానించడం ఆసక్తికరమైన పరిణామం. మూడొంతుల ప్రయాణికులు మహిళలే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో ప్రతిరోజూ సుమారు 2,800 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1,800కు పైగా ఉంటాయి. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాపారులు తదితర వర్గాలతో బస్సుల్లో రద్దీ ఉంటుంది. సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలోనూ బస్సులు కిక్కిరిసి ఉంటాయి. మరోవైపు మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సాధారణ ప్రయాణికుల సీట్లు సైతం వారితోనే నిండిపోతున్నాయి. చివరకు మొదటి ప్రవేశ ద్వారం ఫుట్‌బోర్డు సైతం మహిళలతో కిటకిటలాడుతోంది. – సిటీ బస్సుల్లో ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 22 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే ఉన్నట్లు అంచనా. కేవలం 7 లక్షల మంది మగవారు ఉన్నారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఉన్న ప్రయాణికుల లెక్కలు ఇప్పుడు పూర్తిగా తారుమారయ్యాయి. ‘కొన్నిసార్లు బస్సుల్లో నిల్చోవడం కూడా కష్టంగా ఉంటోంది. బస్సెక్కి దిగే వరకు సర్కస్ ఫీట్లు చేసినట్లవుతుంది.’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించడం కష్టంగా మారిందన్నారు. సొంత వాహనాల వినియోగం.. మరోవైపు ఆర్టీసీ అధికారుల అంచనాల మేరకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తర్వాత పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీతో మగవారు సొంత వాహనాల వినియోగం వైపు మళ్లారు. ద్విచక్ర వాహనాల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ‘జెంట్స్ స్పెషల్’ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. కానీ దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సీట్లపై ‘స్త్రీలకు మాత్రమే’ అని కనిపించే వాటి సంఖ్యను తగ్గించారు. పలు మార్గాల్లో మెట్రో లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.రూ.లక్ష లక్ష్యం ఎందుకంటే..‘మొదటి నుంచి సిటీ ఆరీ్టసీకి నష్టాలే. ఇప్పడు ‘మహాలక్ష్మి’ పథకానికి ప్రభుత్వమే నిధులను అందజేస్తోంది. రోజువారీ అవసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బందికి ప్రోత్సాహకాలు వంటివి అందజేసేందుకు నగదు అవసరం. అందుకే ప్రతి డిపోలో రోజుకు ఒక రూ.లక్ష అదనంగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా గతంలో ఉన్న విధంగా పురుష ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే టికెట్లపై ఆశించిన స్థాయిలో ఆదాయం లభించేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు చెప్పారు. కండక్టర్లు, డ్రైవర్లపై తీవ్ర ఒత్తిడి.. ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఉచిత ప్రయాణసదుపాయం అభినందనీయమే. కానీ ప్రయాణికుల రద్దీ వల్ల బస్సులు నడపడం కష్టంగా మారింది. ఈ సమయంలో మగ ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. – ఇ.వెంకన్న, ఆర్టీసీ కారి్మక సంఘాల జేఏసీ చైర్మన్ -
‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు డిపోలకు చేరాయి. త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయలేకపోతోంది. ఇప్పటివరకు రీయింబర్స్ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ. 610 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్టీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది.ఎక్స్‌ప్రెస్ కన్నా కాస్త ఎక్కువ టికెట్ ధరతో.. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచి్చపెట్టేవి ఎక్స్‌ప్రెస్ బస్సులే. అందుకే వాటి సంఖ్య మిగతావాటి కంటే చాలా ఎక్కువ. కానీ మహిళలకు పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది. డీలక్స్ కేటగిరీ బస్సులున్నా వాటికి ఆదరణ తక్కువే. అందుకే వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వాటిల్లో టికెట్ ధర 5–6 శాతం ఎక్కువగా, డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లలో వాటిని తిప్పాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణ వసతితో బస్సుల్లో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకటం కష్టంగా మారింది.దీంతో పురుషుల్లో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఇప్పుడు అలాంటి వారు ఈ బస్సులెక్కుతారని భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులెక్కే సూచనలున్నాయని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువ స్టాపులు ఉండటంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.ఆ సర్వీసు మళ్లీ పునరుద్ధరణగతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి. బస్సులు పాతబడిపోవటంతో వాటిని తొలగించారు. తర్వాత ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించబోతున్నారు. నగరంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంది. దీంతో టికెట్ ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులెక్కే వీలుంటుంది. వెరసి వీటి వల్ల ఆదాయం ఎక్కువే ఉంటుందని భావిస్తున్న సిటీ అధికారులు.. 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు. -
మహాలక్ష్మికే సరి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న మాటలకు, బడ్జెట్లో చూపిన లెక్కలకు పొంతన కుదరటం లేదు. గురువారం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్టీసీకి రూ.4,084.43 కోట్లను ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహాలక్ష్మి పథకానికి కేటాయిస్తున్నట్టుగానే చూపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ఊతం ఇవ్వటానికే బడ్జెట్ కేటాయింపులు పరిమితమైనట్టు కనిపిస్తోంది. కేటాయింపుల్లో నేరుగా మహాలక్ష్మి పథకానికి కేటాయింపులుగా రూ.3,082.53 కోట్లను చూపారు. ఇక ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.631.04 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.370.86 కోట్లు చూపారు. వీటిని కూడా మహాలక్ష్మికి కేటాయింపులుగానే పేర్కొన్నారు. దీంతో బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఆ పథకానికే ఖర్చు చేస్తారన్నట్టుగా ఉంది.బకాయిలకు ఏం చేస్తారు?ఆర్టీసీ ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు, ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి దాదాపు రూ.1,800 కోట్ల వరకు బకాయి పడింది. ఆ బకాయిలు చెల్లించటం లేదన్న ఆగ్రహంతో ఇటీవల భవిష్యనిధి సంస్థ ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్‌పై స్టే పొందింది. ఆ స్టే గడువు తీరితే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైన విషయం తెలిసిందే. దీంతో బస్సులు సరిపోక కొత్తవి కొనాల్సి వస్తోంది.అవసరమైనన్ని కొత్త బస్సులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వీటన్నింటికి చాలినన్ని నిధులు మాత్రం బడ్జెట్లో ప్రతిపాదించకపోవడంతో కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. రాయితీ పాస్‌లకు సంబంధించి రూ.950 కోట్లు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన వాటితో కలుపుకొని రూ.1,782 కోట్లపై స్పష్టత లేకపోవటం ఆందోళకరమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు ప్రతిపాదించింది. ఆ మొత్తానికి సంబంధించి రూ.వేయి కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినట్టు సమాచారం. వాటిని ఎలా సర్దుబాటు చేస్తారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.రోడ్లు బాగుపడేదెలా?కొన్నేళ్లుగా రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ గాడి తప్పింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్ల నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొన్ని చోట్ల పనులు జరగటంతో కొత్త రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి చేపట్టాల్సిన రెన్యువల్స్‌ను గాలికొదిలేశారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తారన్న అంచనా ఏర్పడింది. కానీ దానిని తలకిందులు చేస్తూ రోడ్లకు అత్తెసరు నిధులే కేటాయించారు.రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్ల నిర్వహణకు రూ.888 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.606 కోట్లు కేటాయించారు. ఇవి రోడ్లను బాగు చే యటం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ఎలా సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలని అంటున్నారు. ఇక రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.1,525 కోట్లు కేటాయించారు. ఇవి భూసేకరణ పద్దు కిందకే ఖర్చు కానున్నాయి. -
ఆర్టీసీలో 3,035 పోస్టులు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వివిధ స్థాయిల్లో 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ దాదాపు రెట్టింపైంది. దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడింది. ప్రస్తుత రద్దీకి 4 వేల కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే అన్ని బస్సులు కాకున్నా, దశలవారీగా 1,500 బస్సులు సమకూరనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కండక్టర్ల కొరత లేకున్నా, డ్రైవర్లకు కొరత ఉంది. కొత్త బస్సులు వచ్చే లోపే ఆ పోస్టుల భర్తీ అవసర మని ఆర్టీసీ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఓకే అనటంతో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2012లో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. నిజానికి భవిష్యత్తులో వచ్చే కొత్త బస్సుల దృష్ట్యా ఆర్టీసీలో 10 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 3,035 పోస్టుల భర్తీతోనే సరిపెట్టనున్నారు. సాలీనా రూ.15 కోట్ల వ్యయం కొత్త నియామకాల వల్ల జీతాల రూపంలో సాలీనా రూ.15 కోట్ల వ్యయం కానుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణలతో సంవత్సరానికి అంతకు మూడు రెట్ల మేర జీతాల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 200 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. సంవత్సరానికి దాదాపు 2,500 మంది రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందేవారి జీతం గరిష్టంగా ఉంటుంది. ఆ మొత్తంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చు. అంటే కొత్త నియామకాలతో ఆర్టీసీపై అదనంగా పడే భారం ఏమీ లేదని స్పష్టమవుతోంది. ముందే అదనపు డ్యూటీల భారం ఆర్టీసీలో 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవటంతో, రిటైర్మెంట్ల రూపంలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొరత మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోక, ఉన్నవారిపై అదనపు డ్యూటీల భారం మొదలైంది. వీక్లీ ఆఫ్‌లలో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాల్సి వస్తోంది. డ్రైవర్లు అలసి పోవడంతో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిక్రూట్‌మెంటుకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు గత ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని అందుబాటులోకి తేవటంతో సిబ్బందిపై భారం మరింత పెరిగింది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రతిపాదనలు పంపడమే కాకుండా తరచూ లిఖితపూర్వకంగా అభ్యరి్థస్తూ వచ్చారు. జనవరిలో ఆ ఫైలు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. దాదాపు నెల విరామం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అక్కడ కూడా కొంతకాలం పెండింగులో ఉన్న తర్వాత ఎట్టకేలకు అనుమతి లభించింది. తాజా భర్తీ ప్రక్రియలో కండక్టర్ పోస్టుల ఊసు లేదు. భవిష్యత్తులో డ్రైవర్లే కండక్టర్ విధులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతోనే డ్రైవర్ పోస్టుల భర్తీ జరగనుంది. టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం – త్వరలో 3,035 పోస్టుల భర్తీ – రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కరీంనగర్లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన ఏడు నెలల్లోనే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ వంద శాతం దాటిందని తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. -
గతుకుల రోడ్డుపై.. బతుకు బండి!
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట8 గంటల డ్యూటీ లేదు..డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.ప్రశ్నిస్తున్న అధికారులు..ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. -
Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!
అది బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే. దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! నిజం కాదు... తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ హెచ్ఎం మంజేశ్ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
విన్నపాలు వినవలె!
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఇవ్వటంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90 శాతాన్ని మించి పోయి పూర్వవైభవం కనిపిస్తోంది.. కానీ, అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావా ల్సిన మొత్తం విడుదల కాకపోవటంతో, పెరిగిన ఆక్యుపెన్సీ రేషియోకు తగ్గ ఆదాయం నమోదు కావటం లేదు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధి బకాయిలు ఏకంగా రూ.2 వేల కోట్లను దాటిపోయాయి.గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా, దాని అమలు ఆగిపోయింది. ఇప్పుడు ఉద్యోగులకు సకా లంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ అధికారుల విన్నపాల్లో ఆయన దేనికి సానుకూలత వ్యక్తం చేస్తారోనన్న చర్చ ఇప్పుడు సంస్థలో విస్తృతంగా సాగుతోంది. నేడు సమీక్ష లేకుంటే... వాస్తవానికి మంగళవారం రోజునే సమావేశం ఉంటుందని చెప్పగా, ఆ రోజున వాయిదా వేసి బుధవారం ఉంటుందంటూ సమాచారం అందింది. జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున, సీఎం ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉండకపోవచ్చునని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతు న్నారు. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.రాజకీయంగా అది కూడా ఆయన బిజీగా ఉండేందుకు కారణం కానుంది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత సమీక్ష ఉండే అవకాశం ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. బుధవారం సమీక్ష జరగని పక్షంలో, వచ్చే పది రోజుల్లో ఉంటుందని అంటున్నారు. దీంతో, ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఓ నివేదిక సిద్ధం చేస్తున్నారు.అధికారులు ఏం కోరనున్నారంటే ⇒ మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జారీ చేస్తున్న జీరో టికెట్ల ఆధారంగా ప్రతినెలా నిధులు రీయింబర్స్ చేయాలి. దాన్ని రూ.350 కోట్లకు పెంచాలి. ⇒ మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగినందున, 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలి. ⇒ ప్రతిపాదిత కొత్త బస్సుల సంఖ్య దామాషా ప్రకారం.. పది వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కనీసం నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలి. ⇒ గతేడాది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తంలో ఇంకా రూ.వేయి కోట్లు బకాయి ఉంది. దాన్ని వెంటనే విడుదల చేయాలి ⇒ఆర్టీసీ సహకార పరపతి సంఘం, భవిష్యనిధికి సంబంధించిన రూ.2 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. -
Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
న్యూఢిల్లీ: ప్రస్తుత కష్టకాలంలో మహిళలు పడుతున్న అవస్థలను కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందని, ఇదే పార్టీ గ్యారెంటీ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. ఈ మేరకు సోమవారం సోనియా ఒక వీడియో సందేశం ఇచ్చారు. ‘‘ ప్రియమైన సోదరీమణులారా.. మహిళలు దేశ స్వాతంత్రోద్యమం నుంచి నవభారత నిర్మాణం దాకా తమ వంతు అద్భుత తోడ్పాటునందించారు. అయితే మహిళలు ప్రస్తుతం ద్రవ్యోల్బణం మాటున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహిళల కష్టానికి సరైన న్యాయం దక్కేలా కాంగ్రెస్ విప్లవాత్మకమైన గ్యారెంటీని ఇస్తోంది. కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబంలోని మహిళకు ఏటా రూ.1లక్ష సాయం అందించనుంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో కర్ణాటక, తెలంగాణలో ప్రజల జీవితాలు మెరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాలలాగే కాంగ్రెస్ తాజాగా కొత్త పథకాన్ని ముందుకు తేనుంది. కష్టకాలంలో ఎల్లప్పుడూ కాంగ్రెస్ ఆపన్నహస్తం అందిస్తుంది’ అని ముగించారు. సోనియా సందేశాన్ని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీ ‘ఎక్స్’లో షేర్చేశారు. సోనియా సందేశంపై రాహుల్ స్పందించారు. ‘‘ పేద కుటుంబాల మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ ఒక్క ఓటు ఏటా మీ ఖాతాలో జమ అయ్యే రూ.1 లక్షతో సమానం. పెరిగిన ధరవరలు, నిరుద్యోగ కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్న పేద మహిళలకు మహాలక్ష్మీ పథకం గొప్ప చేయూత. అందుకే ఓటేయండి’ అని అన్నారు. -
మెట్రోను ముంచేసిన ‘మహాలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్ అండ్ టీ అధ్యక్షుడు, శాశ్వత డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజూ సుమారు 4.80 లక్షల మంది మెట్రో ప్రయాణికులు ఉన్న ట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత మహి ళా ప్రయాణికులు బాగా తగ్గారని వివరించారు. ప్రయాణికులు పెర గకపోవడం వల్ల వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లు ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నష్టాల వల్ల 2026 నాటికి హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలగాలని భావి స్తున్నట్లు ఆయన వెల్లడించారు.పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్ట్ ను నిర్మించడం తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థకు 64 ఏళ్ల పాటు మె ట్రోలో భాగస్వామ్యం ఉంటుంది. అయినప్పటికీ మహాలక్ష్మి పథకం వల్ల వస్తున్న నష్టాలను అధిగమించేందుకు మెట్రో నుంచి తప్పుకో వాలని భావించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. -
లాభాలొస్తున్నా.. ఫలితం సున్నా
2023 మార్చి నెలలో ఆర్టీసీకిరూ.528 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల రూపంలో వచ్చింది రూ.428 కోట్లు. ఆ నెలలో సంస్థకు అయిన మొత్తంఖర్చు రూ.605 కోట్లు. ఫలితంగా రూ.77 కోట్ల నష్టం నమోదైంది. 2024 మార్చి నెలలో సంస్థ నమోదు చేసుకున్న మొత్తం ఆదాయం 696 కోట్లు. ఇందులో టికెట్ల ద్వారా వచ్చింది రూ. 598 కోట్లు. మొత్తం వ్యయం రూ.552 కోట్లు. దీంతో రూ.144 కోట్ల ఆదాయం నమోదైంది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే అమలవుతున్నా ఆర్టీసీ జీరో టికెట్లు జారీ చేస్తోంది. అలా ప్రతినెలా జారీ అయ్యే మొత్తం జీరో టికెట్ల పూర్తి చార్జీని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. దీంతో దాన్ని ఆదాయంగానే భావిస్తోంది. ఫలితంగా నష్టాల ఆర్టీసీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చింది. నష్టం కనుమరుగై ఒకే నెలలో ఏకంగా రూ.144 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నట్టు తాజాగా లెక్కలు రూపొందించింది. మరి నిజంగా ఇది ఆర్టీసీ లాభాల ఫలితాలు అనుభవిస్తోందా..? వాస్తవం ఎలా ఉందంటే... మహాలక్ష్మి పథకం రీయింబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతినెలా ఆ మొత్తాన్ని విడుదల చేయటం లేదు. ఆ రూపంలో నిధులు ఇవ్వటం లేదు. మహిళల ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత జారీ అవుతున్న జీరో టికెట్ల మొత్తాన్ని పరిశీలిస్తే, సగటున ప్రతినెలా రూ.350 కోట్ల వరకు అవుతోంది. మార్చి నాటికి ప్రభుత్వం ఆ రూపంలో రూ.1400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు, ఆర్టీసీ ఇటీవల మరో కేసు విషయంలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. కానీ, వరుసగా గత మూడు నెలల్లో ప్రభుత్వం రూ.285 కోట్లు, రూ.285 కోట్లు, రూ.275 కోట్లు చొప్పున విడుదల చేసింది. కానీ వీటిని మహాలక్ష్మి రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వలేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలో పేరుకుపోయిన బకాయిలుగానే సంస్థ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన చివరి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1500 కేటాయిస్తూ ప్రతిపాదించింది. కానీ, ఆ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గత డిసెంబరు నుంచి కొత్త ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసింది. మార్చి నెలతో చెల్లించిన మొత్తంతో ఆ బడ్జెట్ కేటాయింపులు క్లియర్ అయ్యాయి. దీంతో వాటిని బడ్జెట్ చెల్లింపులుగానే సంస్థ భావిస్తోంది. అదే నిజమైతే, మహాలక్ష్మి పథకం రూపంలో సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు ఇవ్వనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలా రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం జరిగితే సంస్థ మళ్లీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది. లాభాలు ఉత్తిత్తి లెక్కలే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లాభాలకు సంబంధించి కాగితాలపై చూపిన ఉత్తుత్తి లెక్కలుగా తేలిపోతోంది. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో, ఆ లాభాల తాలూకు ఫలితాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆర్టీసీకి సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, కరువు భత్యం బకాయిలు పేరుకు పోయి ఉన్నాయి. 2013 వేతన సవరణకు సంబంధించి ఉన్న బకాయిల్లో బాండ్ల తాలూకు చెల్లింపులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి నెలలో రూ.280 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, వాటిల్లో కేవలం కొంతమంది డ్రైవర్లకు మాత్రమే రూ.80 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. -
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్‌ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
‘మహాలక్ష్మి పథకం’ అమలులో గ్రేటర్ ఆర్టీసీ టాప్‌గేర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహాలక్ష్మి పథకం టాప్ గేర్‌లో పరుగులు తీస్తోంది. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం విశేషం. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ప్రయాణికులు లేక సిటీ బస్సులు వెలవెలపోయాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరంలోని అన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గతంలో 4 లక్షల మందే.. ప్రతి రోజు సుమారు 10 లక్షల మందికి పైగా మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. గతంలో కేవలం 4 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకొనేవారు. వారిలో విద్యార్థినులే ఎక్కువ. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే మహిళలు ఎక్కువగా ఉండేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల మహిళలకు సిటీ బస్సు చేరువైంది. మెట్రో లగ్జరీ వంటి బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు సైతం ఉచిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల వైపు మళ్లారు. దీంతో ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఒక్కసారిగా ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. సాధారణంగా ఉదయం, సాయంత్రం మాత్రమే కనిపించే ప్రయాణికుల రద్దీ కొంతకాలంగా అన్ని వేళల్లోనూ ఉంది. ‘ఆటోలు, క్యాబ్‌లు వంటి వాహనాలను వినియోగించే మహిళలు కూడా సిటీ బస్సుల్లోకి మారారు. ఇప్పుడు బస్సుల సంఖ్య పెరిగితే తప్ప ప్రయాణికుల డిమాండ్‌ను చేరుకోలేని పరిస్థితి నెలకొంది’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికుల చొప్పున మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 90 రోజుల్లో సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గతంలో రోజుకు సుమారు 15 లక్షలు మాత్రమే ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 25 లక్షలు దాటింది. అందులో 10 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగడంతో సిటీ బస్సుల్లో సీట్ల కొరత పెద్దసవాల్‌గా మారింది. మహిళల కోసం కేటాయించిన సీట్లతో పాటు, ఇతర సీట్లను కూడా మహిళలే ఆక్రమించుకోవడంతో పురుషులు, వయోధికులకు ‘స్టాండింగ్ జర్నీ’ భారంగా మారింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఒకటి, రెండు రూట్లలో నాలుగైదు ట్రిప్పులు ప్రయోగాత్మకంగా నడిపారు. కానీ అంతగా స్పందన లేకపోవడంతో ‘జెంట్స్ స్పెషల్’ బస్సుల ప్రతిపాదనను విరమించుకొన్నారు. అరకొర బస్సులే... గతంలో రోజుకు రూ.కోటి నష్టంతో నడిచిన బస్సులు ఇప్పుడు లాభాల బాట పట్టాయి. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్న దృష్ట్యా నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీకి అవకాశం లభించింది. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ మహానగరం విస్తరణకు అనుగుణంగా సిటీ బస్సుల సేవలు విస్తరించుకోవడం లేదు. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా నగర శివార్ల నుంచే వివిధ రకాల పనులపైన మహిళలు, అన్ని వర్గాల ప్రయాణికులు నగరంలోకి రాకపోకలు సాగిస్తారు. కానీ నగర శివార్ల నుంచి తగినన్ని బస్సులు అందుబాటులో లేవు. సుమారు 2500 బస్సులు మాత్రమే సిటీలో తిరుగుతున్నాయి. మెట్రోలగ్జరీ, మెట్రో డీలక్స్ వంటి బస్సులను మినహాయిస్తే కనీసం 2000 బస్సులు కూడా అందుబాటులో లేవు. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న మహిళల్లో 70 శాతం మంది నగర శివార్ల నుంచే ప్రయాణం చేస్తున్నారు. బెంగళూర్ వంటి మెట్రో నగరాల్లో 6 వేలకు పైగా సిటీ బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ ఆర్టీసీ కూడా కనీసం రెండు రెట్లు విస్తరించవలసి ఉంది. -
తెలంగాణ: ‘మహాలక్ష్మి’, ‘గృహ జ్యోతి’ ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో అభయహస్తం గ్యారెంటీల అమలులో భాగంగా.. ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలను అమలు చేశామని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూటికి నూరు శాతం అన్ని హామీలను అమలు చేస్తామని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారాయన. అలాగే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి స్పష్టత ఇచ్చారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ఇస్తున్నామని, అలాగే మహాలక్ష్మీ పథకం కింద సబ్జిడీతో రూ.500 సిలిండర్ అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కోడ్ వల్లే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తుక్కుగుడలో సోనియా గాంధీ హామీ ఇచ్చారు. సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. రెండు పథకాలను చేవెళ్ళలో ప్రారంభించాలి అనుకున్నాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల అక్కడి నుంచి సెక్రటేరియట్ కు మార్చాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ కోడ్ కారణంగా రద్దు చేసుకున్నారు. కట్టెలపోయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ ను ఆనాడే తక్కువకు ఇందిరా గాంధీ ఇచ్చారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ దీపం పథకం తీసుకొచ్చింది. రూ.400 కేగ్యాస్ సిలిండర్ అందించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు సిలిండర్ రేటు పెరిగింది. మోదీ గ్యాస్ ధరలు పెంచితే కేసీఆర్ సబ్సీడీ ఇవ్వలేదు. .. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తాం. ఎవరు ఎలాంటి శాపాలు పెట్టినా...అపోహలు ప్రచారం చేసినా పథకాలు ఆగవు. సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం. ఆమె ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా పాలన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాం అని సీఎం రేవంత్ అన్నారు. ఉచిత విద్యుత్‌పై ఆ ప్రచారం నమ్మొద్దు: డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల స్కీమ్‌ను దేశం అంతా చూస్తోందని.. ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అమలుకాని ఆరు గ్యారెంటీల హామీ కాంగ్రెస్ ఇచ్చినట్లు BRS మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే విమర్శలు చేస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు జేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని అందరం పట్టుదలతో ఉన్నాం. అరకొర నిధులతో జీతాలు ఇస్తూనే, పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రారంభించిన గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలువబోతున్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమే ఇందిరమ్మ రాజ్యం అంటే. 200 యూనిట్లు అమలు అంటే కోతలు అని ప్రచారం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు రేపు మార్చి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా కరెంట్ ఇవ్వబోతున్నాం. అర్హత కలిగిన వారందరికీ ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ఇస్తాం. బీఆర్ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు అని భట్టి పిలుపు ఇచ్చారు. ఇతర మంత్రులు.. భవిష్యత్తులో తెల్లకార్డు ఉండి ఎల్పీజీ కనెక్షన్ ఉంటే.. మహాలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది బల్ధిదారులున్నారని.. లబ్ధిదారుల జాబితాలో ఇప్పుడు లేనివారిని త్వరలోనే చేరుస్తామని చెప్పారాయన. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొలువుదీరాక రెండు పథకాలు.. ఇప్పుడు మరో రెండింటిని ప్రారంభించామని.. నూటికి నూరు శాతం అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. -
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
గృహలక్ష్మీ: సిలిండర్‌కు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం(రూ.500కే గ్యాస్ సిలిండర్) కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో రీయింబర్స్ చేయనుంది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు అందజేస్తే, సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత.. ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి. అలాగే తెల్ల రేషన్‌కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీని ఆధారంగా లబ్ధిదారు లను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరు మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తించనుంది. కాగా రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.300లకు పైగా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురానున్నట్టు సమాచారం. -
TSRTC: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం. ‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిరోజే అవస్థలు రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు. ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. 👉: తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సులు హౌస్‌ఫుల్ (ఫొటోలు) -
ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ
సాక్షి, హైదరాబాద్: ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చి ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమో దైంది. సోమవారం ఈ రికార్డు నమోదైంది. ఈ అంశం గొప్పగా చెప్పుకోవడం కంటే, ప్రమాద ఘంటికలను మోగించడానికి సంకేతంగా భావించాల్సి రావటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ఆందోళన ఎందుకంటే..? ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అద్దె వాటితోపాటు మొత్తం 9,100 బస్సులున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఆ పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా సమకూరిన బస్సులు 150 మాత్రమే. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరింది. ఇందుకు 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. కానీ, అన్ని బస్సులు ఇప్పట్లో సమకూరే పరిస్థితి లేదు. దీంతో బస్సులపై విపరీతమైన భారం పడుతోంది. రెండు బస్సుల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సులో కిక్కిరిసిపోయి బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. అసలే 30 శాతం బస్సులు బాగా పాతబడి ఉన్నందున, ఈ ఓవర్ లోడ్‌తో ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న భయం ఆర్టీసీని వెంటాడుతోంది. ఇంతగా కిక్కిరిసిన బస్సులను సోమవారం అతి జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. అధికారులు అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులు నడపడం గమనార్హం. డ్రైవర్ల కొరత ప్రస్తుతం ఉన్న బస్సులను పరిగణనలోకి తీసుకుంటే 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. సోమవారం లాంటి రద్దీ ఉన్న సమయంలో అదనపు బస్సులు నడపాల్సి ఉంటుంది. అయితే, బస్సుల్లేక ఆ పనిచేయలేకపోతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా డ్రై వర్లు లేనందున వాటిని డిపోలకే పరిమితం చేయా ల్సి ఉంటుంది. కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నఫళంగా రిక్రూట్ చేసుకోవాలనీ ప్రతిపాదించారు. కానీ, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించలేదు. కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతినెలా రూ.300 చొప్పున రీయింబర్స్ చేసే అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇదిలాఉంటే, దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు కచి్చతంగా చాలినంత విశ్రాంతి అవసరం. కానీ, డ్రైవర్ల కొరత ఫలితంగా కొందరికి సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా డబుల్ డ్యూటీలు చేయించాల్సి వస్తోంది. ఇలా విశ్రాంతి లేని డ్రైవర్లు, డొక్కు బస్సులను కొనసాగి స్తున్న నేపథ్యంలో ఒకే రోజు 65 లక్షల మంది బ స్సుల్లో ప్రయాణించటం కలవరానికి గురిచేస్తోంది. -
ఆటోవాలాల పొట్టగొడతారా?
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశం శుక్రవారం శాసనసభలో అధికార కాంగ్రెస్– ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలకు కారణమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం ఉదయం చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం ప్రారంభించిన అనంతరం యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ ఇద్దరూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రసంగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరుణంలో బీఆర్ఎస్ పక్షాన పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. ప్రజా పాలన అంటూ ఘనంగా చెప్పుకొని చివరకు 30 మోసాలు, 60 అబద్ధాలు అన్నట్టుగా గవర్నర్ ప్రసంగం సాగిందని ఆయన విమర్శించారు. ప్రజాభవన్‌లో మంత్రుల జాడెక్కడ.. ఆరు నిమిషాలు కూడా లేని సీఎం ప్రజాభవన్‌లో స్వయంగా తానే విన్నపాలు వింటానని ముఖ్యమంత్రి పేర్కొన్నా ఇప్పటివరకు ఆరు నిమిషాలకు మించి ఉండలేకపోయారని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. మంత్రులు ఉంటామన్నా వారి జాడ కూడా లేదని, ఉన్నతాధికారులు వస్తారని చెప్పినా వారూ కనిపించటం లేదని, చివరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మాత్రమే విన్నపాలు నమోదు చేసుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల్లో డ్రాప్ బాక్సులు పెట్టి అభ్యర్థనలను వాటిల్లో వేయమనేలా ఉన్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ, ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చాలినన్ని బస్సులు లేకుండా మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదనీ, చాలినన్ని బస్సులు, ట్రిప్పులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పథకంతో ఆటోవాలాలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకుని, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణపథకాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే స్పష్టం చేయాలని ప్రశ్నించారు. పేద ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, దీనికి బడ్జెట్లో నిధులు ప్రతిపాదిస్తామని పునరుద్ఘాటించారు. తాము మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకించటం లేదని, బస్సుల సంఖ్య పెంచాలనీ, ఆటోడ్రైవర్లకు ప్రతినెలా రూ.10 వేలు చొప్పున సాయం అందించాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బెంజికార్లు దిగని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆటోడ్రైవర్లను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని, ఆర్టీసీ ఉద్యోగులను నాటి ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని గాలికొదిలేసిందని, ఇప్పుడేమో ఆటోడ్రైవర్లను ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. బెంజ్ కార్లు దిగని ఈ ఫ్యూడల్స్ ఇప్పుడు ఆటోల్లో ప్రయాణిస్తూ వారిని అవమానిస్తున్నారని విమర్శించారు. తమ బంధువైన రిటైర్డ్ ఆర్టీసీ ఈడీని ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు కొనసాగించి సంస్థను భ్రషు్టపట్టించిన చరిత్ర గత ప్రభుత్వానిదని ఆరోపించారు. పేద మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటాన్ని గత పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆటోడ్రైవర్లను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మరో మంత్రి సీతక్క విమర్శించారు. కవితపై ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆరోపణలు.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, యాదాద్రి అభివృద్ధి పేరిట యాడాను ఏర్పాటు చేసి వందల కోట్ల నిధులను దుర్వీనియోగం చేశారని, సగం నిధులు ఎమ్మెల్సీ కవిత, నాటి మంత్రి జగదీశ్‌రెడ్డికి ముట్టాయని ఆరోపించా రు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి వచ్చారు. వారిపై స్పీకర్ ఆగ్ర హం వ్యక్తం చేయటంతో తిరిగి తమ స్థానాల వద్దకు చేరుకున్నారు. సభలో లేని వారి గురించి సభ్యుడు మాట్లాడిన అభ్యంతరకర మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యుడు ప్రశాంతరెడ్డి కోరగా, పరిశీలించి నిర్ణ యం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. -
జీరో టికెట్ @10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని పదికోట్లమంది మహిళలు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. డిసెంబరు ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకోగా, అదే నెల తొమ్మిదే తేదీన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచి తంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని దీన్ని ఆ రోజు ప్రారంభించినట్టు స్వయంగా సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇది కూడా ఒకటి. రెండు కేటగిరీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ద్వారా, బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను గుర్తిస్తున్నారు. సోమవారం నాటికి జారీ అయిన జీరో టికెట్ల సంఖ్య 10 కోట్లను దాటింది. రూ.550 కోట్ల మేర ఆదా పది కోట్ల జీరో టికెట్ల రూపంలో మహిళా ప్రయాణికులకు రూ.550 కోట్ల మేర ఆదా అయినట్టు తెలిసింది. అంతమేర ఆదాయం ఆర్టీసీ కోల్పోయినందున, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య సగటున నిత్యం 10 లక్షల కంటే ఎక్కువ మేర పెరిగింది. కానీ, ఆ తాకిడిని తట్టుకునే సంఖ్యలో ఆర్టీసీ వద్ద బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. కొత్త బస్సులు కొంటున్నామని ఆర్టీసీ చెబుతున్నా, కొన్ని నామమాత్రంగానే వచ్చాయి. ఇప్పటికిప్పుడు కనీసం 4 వేల బస్సులు అవసరమన్న అభిప్రాయాన్ని ఆర్టీసీనే వ్యక్తం చేస్తోంది. కానీ, వాటిని కొనేందుకు అవసరమైన నిధులు సంస్థ వద్ద లేనందున, ప్రభుత్వమే సాయం చేయాల్సి ఉంది. సరిపోను బస్సులు లేక జనం పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నా, ఈ పథకం విజయవంతమైందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయోత్సవం తరహాలో ఓ కార్య క్రమం నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. 10 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్టు తేలగానే కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. బకాయిల చెల్లింపు ప్రకటనకు అవకాశం దీర్ఘకాలంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు. దీనిపై కార్మికుల నుంచి ఒత్తిడి వస్తోంది. రెండు వేతన సవరణలు, అంతకుముందు వేతన సవరణ తాలూకు బాండ్ల మొత్తం బకాయి ఉంది. సీసీఎస్, పీఫ్ బకాయిలూ ఉన్నాయి. దీంతో సమ్మక్క–సారలమ్మ జాతరలోపు ఏదో ఒక బకాయి చెల్లింపుపై ప్రకటన చేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. బాండ్ల మొత్తం, పీఎఫ్ బకాయిల చెల్లింపుపై ప్రకటన చేసే అవకాశముంది. ఉద్యోగులు వేతన సవరణపై ఒత్తిడి తెస్తున్నా, అది ఖజానాపై పెద్ద భారమే మోపేలా ఉన్నందున దాని విషయంలో ఆచితూచి నిర్ణయించాలని భావిస్తున్నారు. సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. రూ.1,040 కోట్లతో కొత్త బస్సులు గత ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ 1,050 బస్సులకు టెండర్లు పిలిచింది. అవి దశలవారీగా సమకూరాల్సి ఉంది. మరో వేయి ఎలక్ట్రిక్ బస్సులు కూడా రావాల్సి ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య వెంటనే పెంచాల్సి ఉన్న విషయాన్ని ఆర్టీసీ తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయి బడ్జెట్ పద్దులపై చర్చించారు. ఈ సందర్భంగా 2 వేల బస్సులు కొనేందుకు రూ.1,040 కోట్లు కేటాయించాలని కోరినట్టు తెలిసింది. దీనికి భట్టివిక్రమార్క సానుకూలంగా స్పందించారు. అయితే, ఆర్టీసీ అంతర్గత ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కసరత్తు చేయాలని, మెట్రో రైలు తరహాలో దీనిపై దృష్టి సారించాలని సూచించారు. -
కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. ‘మహాలక్ష్మి’పథకంతో ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తున్నా.. మరోవైపు ఇదే తీవ్ర ఆందోళనకూ కారణమవుతోంది. ఇప్పుడున్న ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు పాతబడ్డాయి. కొన్ని అయితే డొక్కుగా మారాయి. అలాంటి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి నడిస్తే ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు బస్సుల్లోని సీట్లలో చాలా వరకు మహిళలతో నిండిపోతుండటంతో.. పురుషులకు సీట్లు దొరక్క ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుతున్నారన్నదీ ఆందోళన రేపుతోంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ ఎన్ని బస్సులు కొందాం, ఏ కేటగిరీలో ఎన్ని ఉండాలన్న ప్రతిపాదనలు, సమావేశాలకే సర్కారు పరిమితం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అదనంగా 10లక్షల మంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ‘మహాలక్ష్మి’పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న దీన్ని పట్టాలెక్కించారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తోంది. బస్సుల్లో నిత్యం 10 లక్షల మందికిపైగా అదనంగా ప్రయాణిస్తున్నారు. గతంలో 66శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 90శాతం దాటింది. ప్రత్యేక రోజుల్లో 101 శాతానికీ చేరుతోంది. ఉచిత ప్రయాణానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్ చేసే నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.10 కోట్ల మేర పెరిగింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఏకంగా రూ.22.50 కోట్ల చొప్పున ఆదాయం నమోదైంది. అయితే పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ఇబ్బందులు వస్తున్నాయి. కర్ణాటకలో ఇదే తరహాలో పథకాన్ని ప్రారంభించినప్పుడు బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మన ఆర్టీసీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించినప్పుడు ఈ అంశం కూడా వారి దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన కొత్త బస్సులు సిద్ధం చేసుకుని పథకాన్ని ప్రారంభించి ఉండాల్సిందని.. అలా చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు వేల బస్సులు అవసరం ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ కేటగిరీలకు సంబంధించి 7,292 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్పేర్‌లో ఉంచే బస్సులను కూడా వాడేస్తున్నారు. ఇప్పుడున్న రద్దీని నియంత్రించాలంటే కనీసం నాలుగు వేల అదనపు బస్సులు అవసరమని అంచనా. ఇటీవల వచ్చిన కొత్త బస్సులు 50 మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో వెయ్యి బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. మరో వెయ్యి ఎలకిŠట్రక్ బస్సులు కొనేందుకు ఏర్పాట్లు చేసింది. అవి అందేందుకు కొన్ని నెలలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు అవసరం. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే, లేదా ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు తీసుకుంటేనే కొనుగోళ్లు సాధ్యం. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. -
మహాలక్ష్మి పథకానికి స్పష్టత ఇచ్చిన పరేషాన్! రెండుంటే చాలు..
మహబూబాబాద్: ప్రభుత్వం గ్యారంటీ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులను జత చేస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అయితే కొంతమంది ఆధార్, రేషన్‌కార్డుతో పాటు కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను కూడా జత చేసేందుకు మీసేవ, ఆధార్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఈ–కేవైసీ కోసం సైతం జనం క్యూ కడుతున్నారు. రెండుంటే చాలు.. ప్రభుత్వం ఐదు గ్యారంటీల (మహాక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు) అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని గత డిసెంబర్ 28న ప్రారంభించి.. ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెట్టింది. కాగా దరఖాస్తులకు ఆధార్, రేషన్‌కార్డుల జిరాక్స్‌లు జత చేస్తే సరిపోతుంది. అయితే ప్రజలు అన్ని పథకాల కోసం అన్ని రకాల సర్టిఫికెట్లు అవసరమని భావించి ఆయా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా పింఛన్, రైతుబంధు వచ్చిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని చెప్పినా ప్రజలు వినడం లేదు. మీసేవ కేంద్రాల వద్ద రద్దీ.. జిల్లాలో 98 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో చాలా మంది కులం, ఆదాయం, నివాసం, ఆహార భద్రత కార్డుల కోసం ఆయా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరిగింది. కాగా మహా లక్ష్మి పథకానికి ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు అడుగుతారని ప్రచారం జరగడంతో దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న ఆరు ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల కోసం ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు, బయో మెట్రిక్, పుట్టిన తేదీ, ఇతర మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద.. జిల్లాలో 13 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 2.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ–కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాయితీపై సిలిండర్ సరఫరా చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులుదీరుతున్నారు. ఈ–కేవైసీతో రాయితీ సిలిండర్‌కు సంబంధం లేదని అధికారులు చెబుతున్నా.. ప్రజలు వినడం లేదు. వసూళ్ల పర్వం.. జనాల తాకిడిని ఆసరాగా చేసుకొని ఆధార్, మీ సేవ, జిరాక్స్ సెంటర్లలో అధికంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే పలు గ్యాస్ ఏజెన్సీలు ఈ–కేవైసీకి రూ.200వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో.. -
ప్రజలు కోరిందే తీర్మానించాం!
సిరిసిల్ల: ప్రజాపాలన దరఖాస్తుల్లో పలు ఆప్షన్లను కోరారని వాటినే మున్సిపల్ ఎజెండాలో ఉంచి తీర్మానం చేశామని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంపై భేషజాలకు పోకుండా పలు అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్‌కోసం ప్రత్యేకంగా ఆప్షన్లు ఇవ్వాలని కోరామన్నారు. ఈవిషయాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. కానీ కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, విలీన గ్రామాలను జీపీలు చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్నికలకు ముందు బహిరంగ సభలో ప్రకటించారని పేర్కొన్నారు. రూ.వందల కోట్ల ఖర్చుతో బైపాస్‌రోడ్డు వేయించారని, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయించారని ఇవన్నీ విలీన గ్రామాల అభివృద్ధికి దోహదం చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. వస్త్ర పరిశ్రమలో నేతకార్మికులు, పద్మశాలీలను పూర్తిస్థాయిలో కేసీఆర్, కేటీఆర్ ఆదుకున్నారని, కేవలం రాజకీయ లబ్ధికోసం వారిని ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు. సమావేశంలో టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, సత్తార్, వేణు, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్