
ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు.
మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా!
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.
రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి..
ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment