RTC passengers
-
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇకపై
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. "ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. చదవండి సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు -
నో ఎక్స్ట్రా చార్జ్
ప్రొద్దుటూరు: ఆర్టీసీ ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే తమ టికెట్లు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా డబ్బు తిరిగి చెల్లిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ వ్యవహారం జిల్లాలోని అన్ని డిపోల్లో జరుగుతోంది. సాధారణంగా ఆర్టీసీ అధికారులు ఉన్న సర్వీసులకు మినహా కొత్తగా ఒక్క సర్వీసును ఏర్పాటు చేసినా ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేసే విధానాన్ని అనవాయితీగా పెట్టుకున్నారు. టికెట్లను బట్టి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతాలకు సైతం సూపర్ లగ్జరీ స్థానంలో డీలక్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ప్రొద్దుటూరు నుంచి రూ.300 టికెట్ ఉంటే స్పెషల్ సర్వీసు పేరుతో రూ.450 వసూలు చేస్తున్నారు. సీజన్, అన్ సీజన్ లేకపోయినా కొత్త సర్వీసు ఏర్పాటు చేస్తే ఈ విధంగా చార్జీలను వసూలు చేస్తుంటారు. అయితే ఇక నుంచి ప్రత్యేక సందర్భాలు (పండుగలు, ఉత్సవాలు) మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దని ఆర్టీసీ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డబ్బు చెల్లించిన ప్రయాణికులకు వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో సోమవారం రాత్రి నుంచే అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులకు సంబంధించిన అదనపు డబ్బును ప్రయాణికులకు తిరిగి చెల్లించడం మొదలైంది. ఆర్టీసీ అధికారులను ఈ విషయంపై న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇది కొత్త నిబంధన ఏమీ కాదని తొలి నుంచి ఉన్నదేనన్నారు. పండుగ వేళల్లో మినహా సాధారణ రోజుల్లో అదనపు చార్జీలు వసూలు చేయొద్దన్నారు. ఒక్క ప్రొద్దుటూరులోనే ఇప్పటికే 10 స్పెషల్ సర్వీసులకు సంబంధించిన సీట్లు రిజర్వ్ కావడం గమనార్హం. ఇలా జిల్లాలోని అన్ని డిపోల్లో స్పెషల్ సర్వీసులు ఏర్పాటు కాగా వారందరికి ఆర్టీసీ యాజమాన్యం డబ్బు తిరిగి చెల్లిస్తోంది. -
ఆర్టీసీ.. హతవిధీ.. నడుస్తున్న బస్సు నుంచి వేరుపడిన చక్రాలు
ద్విచక్రవాహనదారుడికి గాయాలు.. హైదరాబాద్‌లో ఘటన హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆర్టీసీ నగర బస్సుల్లో భద్రత గాల్లో దీపంలా తయారైంది. కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనడానికి నిదర్శనంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఫలక్‌నుమా డిపోకు చెందిన మినీ బస్సు కాటేదాన్ నుంచి చార్మినార్‌కు (రూట్ నంబర్ 178) వెళుతోంది. లాల్‌దర్వాజా సమీపంలోని మసీదు వద్దకు రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడమ వైపు రెండు చక్రాలు ఊడిపోవడంతో ఒకవైపు ఒరిగి పోయింది. ఒక్కసారిగా కుదుపునకు లోనైన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు నుంచి ఊడిపోయిన రెండు చక్రాల్లో ఒకటి.. అటుగా వెళుతున్న గౌలిపురాకు చెందిన ఎం.సత్యనారాయణ ద్విచక్రవాహనాన్ని బలంగా తాకడంతో ఆయన కింద పడిపోయారు. సత్యనారాయణ కాలికి బలమైన గాయం కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.