Hyderabad: TSRTC Announces Special Package To Srisailam Devotees - Sakshi
Sakshi News home page

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ.. ఇకపై

Published Wed, Jul 19 2023 1:52 PM | Last Updated on Wed, Jul 19 2023 2:31 PM

Hyderabad: Tsrtc Announces Special Package To Srisailam Devotees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.  రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శ‌నంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.


ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది.  

రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ పూర్తవగానే హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. 


"ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ tsrtconline.in లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలి. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి" అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ సూచించారు.

చదవండి  సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్‌.. హైకోర్టు నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement