ఆర్టీసీ.. హతవిధీ.. నడుస్తున్న బస్సు నుంచి వేరుపడిన చక్రాలు
ద్విచక్రవాహనదారుడికి గాయాలు.. హైదరాబాద్‌లో ఘటన
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆర్టీసీ నగర బస్సుల్లో భద్రత గాల్లో దీపంలా తయారైంది. కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనడానికి నిదర్శనంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఫలక్‌నుమా డిపోకు చెందిన మినీ బస్సు కాటేదాన్ నుంచి చార్మినార్‌కు (రూట్ నంబర్ 178) వెళుతోంది.
లాల్‌దర్వాజా సమీపంలోని మసీదు వద్దకు రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడమ వైపు రెండు చక్రాలు ఊడిపోవడంతో ఒకవైపు ఒరిగి పోయింది. ఒక్కసారిగా కుదుపునకు లోనైన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు నుంచి ఊడిపోయిన రెండు చక్రాల్లో ఒకటి.. అటుగా వెళుతున్న గౌలిపురాకు చెందిన ఎం.సత్యనారాయణ ద్విచక్రవాహనాన్ని బలంగా తాకడంతో ఆయన కింద పడిపోయారు. సత్యనారాయణ కాలికి బలమైన గాయం కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.