3,525 ప్రత్యేక బస్సులు 18 లక్షల మంది భక్తులు
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
- నిపుణులైన డ్రైవర్ల ఎంపిక
- శిక్షణ, అవగాహన సదస్సులతో సన్నద్ధం
- ట్రాఫిక్ జాం కాకుండా మేడారం దారిలో క్రేన్‌లు
- మరమ్మతులకు బృందాలు
- ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సంస్థ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు తెలిపారు. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరకు 3,525 ప్రత్యేక బస్సు లు నడుపనున్నామని, ఈ మేరకు కొత్త బస్సులు తీసుకొచ్చినట్లు వివరించారు. బస్సులను జాగ్రత్తగా నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను ఎంపిక చేయడంతో పాటు ప్రత్యేక శిక్ష ణ ఇచ్చామన్నారు.
జాతరపై అవగాహన సదస్సులు నిర్వహించి వారిని సన్నద్ధం చేసినట్లు వెల్లడించారు. భక్తులను క్షేమంగా గమ్యానికి చేరవేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సారి ఆర్టీసీ బస్సుల ద్వారా 18 లక్షల మంది భక్తులను చేరవేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామన్నారు. మేడారంలో 45 ఎకరాల సువిశాల స్థలంలో బస్‌స్టేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేశామని, ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు.
ప్రయాణికులను సత్వరంగా చేరవేసేందుకు వీలుగా టికెట్ ఇష్యూ మిషన్లను వినియోగిస్తున్నామన్నారు. కల్వర్టుల వద్ద బస్సులు నిలిచిపోకుండా ఉండేలా గార్డులను నియమించామన్నారు. బస్సులు మధ్యలో మరమ్మతుకు వస్తే బాగు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీరికి ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ జాం అయినపుడు వాహనాలను తొలగించేందుకు క్రేన్‌లను సైతం ఏర్పాటు చేశామన్నారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులకు ప్రతిపాదనలు
జిల్లాకు 199 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు కావాలని ప్రతిపాదనలు పంపినట్లు ఎం.సత్యనారాయణరావు వెల్లడించారు. వీటితోపాటు మరో బస్సు డిపో అవసరముందన్నారు. మొదటి విడతలో కరీంనగర్‌కు ఒక డిపోతోపాటు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులు మంజూరయ్యాయన్నారు. వరంగల్‌లో బస్సుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండో విడతలో ఒక డిపోతోపాటు 199 బస్సులు మంజూరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈడీలు ఎ.పురుషోత్తం, రవీందర్, వరంగల్ ఆర్‌ఎం ఈ.యాదగిరి, సెక్యూరిటీ, విజిలెన్స్ జేడీ వెంకట్రావు పాల్గొన్నారు.