
సాక్షి, మేడారం : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా గంటపాటు దర్శనాలు నిలిపివేయడంతో క్యూ లైన్లలో నిలబడ‍్డ భక్తులు నిరసనకు దిగారు.
ఇక మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.మరోవైపు మేడారం జాతరలో ప్రజలకు తమ వంతు సహాయం అందిస్తున్నాయి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఎల్జీ, కార్టేవాలు. కాగ్నిసెన్స్ మీడియా ద్వారా జాతరకు వచ్చే భక్తులకు మాస్కులు, తాగునీరు, ఉచితంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్‌లు ఏర్పాటు చేశాయి.
(వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు)