వరంగల్: 2024 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహాజాతరకు ఇంకా ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం 18 శాఖల ద్వారా ఏర్పాట్ల కోసం రూ.75కోట్ల నిధులు అవసరమని అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే జాతర సమీపిస్తున్నా.. నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఈ జాతరలో కూడా హడావుడి పనులతోనే నిర్వహించేలా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలోనే నిమగ్నం కావడంతో జాతర పనుల్లో జాప్యం తప్పేలా లేదు.
నిధులు సరిపోయేనా..?
మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వానికి రూ.75కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వతంగా నిర్మించిన కల్యాణ కట్ట షెడ్లు, రోడ్లు, విద్యుత్, గెస్ట్‌హౌజ్‌లు దెబ్బతిన్నాయి. జాతరకు రోడ్డు మార్గాలే చాలా అవసరం కానీ, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుండ్లవాగు బ్రిడ్జి దెబ్బతినడంతో నెలరోజుల పాటు తాడ్వాయి నుంచి మేడారం మీదుగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మళ్లించడంతో ఈ మార్గాన రోడ్లు మరింతగా ధ్వంసమయ్యాయి.
అధికారులు మాత్రం రూ.75కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. కానీ, జాతర ఏర్పాట్లు, ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన మరమ్మతుల పనులకు ఈ నిధులు ఏ మూలన సరిపోతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతర సమీపిస్తుండంతో అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుగా ఎన్నికల ఏర్పాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది.
జాతరకు ఆరు నెలలే గడువు..
మేడారం మహాజాతరకు ఇంకా ఆరునెలల సమయమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. నిధులు మంజూరు చేయడం, టెండర్ల ప్రక్రియ, టెక్నికల్ ఆర్డర్లు పొందడం లాంటి వాటికే నెలకు పైగా సమయం పడుతుంది. ముందస్తుగా నిధులు మంజూరైతేనే పనులు నాణ్యతగా చేసే అవకాశాలు ఉన్నాయి.
కానీ, ఇప్పటి వరకు జాతర నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జాతర వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే జాతరకు నిధులు అసలు మంజూరవుతాయా.. లేదా.. అనే అనుమానం కలుగకమానదు. జాతర నిధుల మంజూరు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలో నిమగ్నమయ్యారు.
నిధులు మంజూరు చేయాలి..
మేడారం జాతర నిధులను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. జాతరలో భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించి, సరిపడా నిధులు కేటాయించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – సిద్దబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment