నేటి నుంచే మహా జాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క– సారక్క జాతర బుధవారం మహావైభవంగా ప్రారంభమవుతోంది. ఆదివాసీ పూజా క్రతువుల మధ్య సారలమ్మ తల్లి మేడారంలో గద్దెపైకి చేరుకోనుంది. మరుసటి రోజున (గురువారం) సమ్మక్క గద్దెపైకి చేరనుంది. రెండు రోజుల పాటు వన దేవతల దర్శనం అనంతరం.. శనివారం తల్లుల వన ప్రవేశం జరగనుంది. జాతర కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు.
భక్త జన సంద్రం
మహా జాతర కోసం మంగళవారం సాయంత్రానికే లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. మేడారం, జంపన్నవాగు, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్ ప్రాంతా లు భక్తుల గుడారాలతో నిండిపోయా యి. మేడారం వెళ్లే దారుల న్నీ కిక్కిరిసిపోయాయి. జాతర కోసం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తం గా 52 కేంద్రాల నుంచి 2,490 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాల్లో భక్తులు వస్తున్నారు. దీంతో నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
యథావిధిగా పూజలు..
బుధవారం సాయంత్రం 5.18 గంటల నుంచి 8.42 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. షెడ్యూల్ ప్రకారం సారలమ్మ ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి మేడారానికి బయలుదేరాలి. అయితే గ్రహణం నేపథ్యంలో పూజా క్రతువు సమయంలో మార్పులు ఉం టాయనే ఊçహాగానాలు వచ్చాయి. అయితే ఆదివాసీ పూజా విధానాల్లో గ్రహణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోమని పూజారులు స్పష్టం చేశారు. అయితే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో పూజా క్రతువులను మాత్రం గ్రహణానికి ముందే పూర్తి చేస్తామని చెప్పారు.
జాతర ఇలా...
తొలిరోజు (బుధవారం) సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. అదేరోజు పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి మేడారం గద్దెలకు చేరుకుంటారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంటుంది. శుక్రవారం సమ్మక్క– సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై ఉంటారు. జాతర చివరి రోజు (శనివారం) సమ్మక్క తల్లి వన ప్రవేశం చేస్తుంది.
సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ ప్రాంతాలు ప్రయాణం కావడంతో జాతర ముగుస్తుంది. కాగా.. మహబూబా బాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు పడిగె రూపంలో మంగళవారమే మేడారం మహాజాతరకు బయల్దేరారు. పూజారులు గ్రామంలోని ఆలయంలో పెనుక వంశీయులు పూజలు చేసిన తర్వాత అటవీమార్గంలో కాలినడకన మేడారానికి బయల్దేరారు. మహాజాతరలో పగిడిద్ద రాజు సమ్మక్కను వివాహమాడతారు.
‘సాక్షి’ టీషర్ట్స్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ కర్ణన్
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో వలంటీర్ల కోసం ‘సాక్షి’యాజమాన్యం అందించిన టీషర్ట్స్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జేసీ అమయ్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు.
‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో జాతరలో వలంటీర్ల కోసం టీషర్ట్స్‌ను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సారలమ్మ ప్ర«ధాన పూజారి కాకసారయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన అరుణ్‌కుమార్ చేతుల మీదుగా గద్దెల ప్రాంగణంలో వలంటీర్లకు టీషర్ట్స్‌ను అందజేశారు.