M. Satyanarayana rao
-
ఘనంగా ఎమ్మెస్సార్ 85వ జన్మదిన వేడుకలు
బంజారాహిల్స్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు మెన్నమనేని సత్యనారాయణ రావు(ఎంఎస్ఆర్) 85వ జన్మదిన వేడుకలు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసంలో గురువారం ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మల్లు భట్టు విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ కె. రవీందర్రావు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు విచ్చేసి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 1930 జనవరి 14న కరీంనగర్ జిల్లా వెదిరె గ్రామంలో జన్మించిన ఎంఎస్ఆర్ ఏఐసీసీ జనరల్‌సెక్రటరీగా రెండుసార్లు, లోక్‌సభ సభ్యుడిగా మూడుసార్లు, పీసీసీ అధ్యక్షుడిగా, ఆర్టీసీ చైర్మన్‌గా పని చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు. ఎంఎస్ఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు. -
3,525 ప్రత్యేక బస్సులు 18 లక్షల మంది భక్తులు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు నిపుణులైన డ్రైవర్ల ఎంపిక శిక్షణ, అవగాహన సదస్సులతో సన్నద్ధం ట్రాఫిక్ జాం కాకుండా మేడారం దారిలో క్రేన్లు మరమ్మతులకు బృందాలు ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సంస్థ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు తెలిపారు. హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరకు 3,525 ప్రత్యేక బస్సు లు నడుపనున్నామని, ఈ మేరకు కొత్త బస్సులు తీసుకొచ్చినట్లు వివరించారు. బస్సులను జాగ్రత్తగా నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను ఎంపిక చేయడంతో పాటు ప్రత్యేక శిక్ష ణ ఇచ్చామన్నారు. జాతరపై అవగాహన సదస్సులు నిర్వహించి వారిని సన్నద్ధం చేసినట్లు వెల్లడించారు. భక్తులను క్షేమంగా గమ్యానికి చేరవేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సారి ఆర్టీసీ బస్సుల ద్వారా 18 లక్షల మంది భక్తులను చేరవేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామన్నారు. మేడారంలో 45 ఎకరాల సువిశాల స్థలంలో బస్‌స్టేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేశామని, ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. ప్రయాణికులను సత్వరంగా చేరవేసేందుకు వీలుగా టికెట్ ఇష్యూ మిషన్లను వినియోగిస్తున్నామన్నారు. కల్వర్టుల వద్ద బస్సులు నిలిచిపోకుండా ఉండేలా గార్డులను నియమించామన్నారు. బస్సులు మధ్యలో మరమ్మతుకు వస్తే బాగు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీరికి ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ జాం అయినపుడు వాహనాలను తొలగించేందుకు క్రేన్లను సైతం ఏర్పాటు చేశామన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు ప్రతిపాదనలు జిల్లాకు 199 జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు కావాలని ప్రతిపాదనలు పంపినట్లు ఎం.సత్యనారాయణరావు వెల్లడించారు. వీటితోపాటు మరో బస్సు డిపో అవసరముందన్నారు. మొదటి విడతలో కరీంనగర్‌కు ఒక డిపోతోపాటు జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు మంజూరయ్యాయన్నారు. వరంగల్‌లో బస్సుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండో విడతలో ఒక డిపోతోపాటు 199 బస్సులు మంజూరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈడీలు ఎ.పురుషోత్తం, రవీందర్, వరంగల్ ఆర్ఎం ఈ.యాదగిరి, సెక్యూరిటీ, విజిలెన్స్ జేడీ వెంకట్రావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ.. హతవిధీ.. నడుస్తున్న బస్సు నుంచి వేరుపడిన చక్రాలు
ద్విచక్రవాహనదారుడికి గాయాలు.. హైదరాబాద్‌లో ఘటన హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆర్టీసీ నగర బస్సుల్లో భద్రత గాల్లో దీపంలా తయారైంది. కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనడానికి నిదర్శనంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఫలక్‌నుమా డిపోకు చెందిన మినీ బస్సు కాటేదాన్ నుంచి చార్మినార్‌కు (రూట్ నంబర్ 178) వెళుతోంది. లాల్‌దర్వాజా సమీపంలోని మసీదు వద్దకు రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడమ వైపు రెండు చక్రాలు ఊడిపోవడంతో ఒకవైపు ఒరిగి పోయింది. ఒక్కసారిగా కుదుపునకు లోనైన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు నుంచి ఊడిపోయిన రెండు చక్రాల్లో ఒకటి.. అటుగా వెళుతున్న గౌలిపురాకు చెందిన ఎం.సత్యనారాయణ ద్విచక్రవాహనాన్ని బలంగా తాకడంతో ఆయన కింద పడిపోయారు. సత్యనారాయణ కాలికి బలమైన గాయం కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
‘తెలంగాణపై సోనియా వెనుకడుగు వేయరు’
వరంగల్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ వెనకడుగు వేయరని ఆర్టీసీ చైర్మన్, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం బస్ డిపోను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని, ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చిన రెండు ప్రాంతీయ పార్టీలు సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవోఎం ఎదుట నక్సలిజం సమస్యను పెట్టడం సమంజసం కాదన్నారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ నుంచి భద్రాచలాన్ని విడదీయలేరన్నారు. ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు 3,525 బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.