తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ వెనకడుగు వేయరని ఆర్టీసీ చైర్మన్, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు.
వరంగల్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ వెనకడుగు వేయరని ఆర్టీసీ చైర్మన్, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం బస్ డిపోను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని, ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చిన రెండు ప్రాంతీయ పార్టీలు సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవోఎం ఎదుట నక్సలిజం సమస్యను పెట్టడం సమంజసం కాదన్నారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ నుంచి భద్రాచలాన్ని విడదీయలేరన్నారు. ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు 3,525 బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.