గద్దెల వద్ద ప్రదక్షిణ చేస్తున్న పూజారులు
గుండాల: వన దేవత సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామం అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు సోమవారం మేడారం బయల్దేరాడు. గుండాల మండలంలోని యాపలగడ్డలో సోమవారం పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు, ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును గద్దెల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు, హిజ్రాలు నృత్యాలు చేశారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు ఊరేగింపుతో కాలిడనకన మేడారం బయల్దేరారు.
ఆదివాసీ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. మేడారం వెళ్లే భక్తులు సైతం యాపలగడ్డ వద్ద పగిడిద్దరాజును దర్శించుకుని వెళ్లారు. కాగా బుధవారం పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలకు వద్దకు చేర్చుతామని, దీంతో సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభమవుతుందని అర్రెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్, నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment